అంతర్జాతీయ రాజకీయాలు
అంతర్జాతీయ రాజకీయాలు ఇంత వేగంగా జరుగుతుండడం ఇదే మొదటి సారేమో అనిపిస్తుంది.
ట్రంపుగారు రెండో సారి గద్దెనెక్కేకా అరు నెలల్లో ప్రపంచ రాజకీయాలనే ఒక కొలిక్కి తెచ్చేసినట్టుంది. ముఖ్యంగా కనపడుతున్నది, ఆసియాలోని పెద్ద దేశాలూ బలమైన దేశాలని ఒకతాటికి తెచ్చినట్టుంది. భారత్ చైనాల మధ్య సంబంధాలు తెగిపోలేదు,చెడిపోలేదుగాని గొప్పగా మాత్రం లేవు, చైనా ప్రెసిడెంట్ గత నవంబర్ డిసెంబర్ నెలల్లో భారత్ రాష్ట్రపతికి ఒక ఉత్తరం రాయడంతో మెరుగుపడటంకి ఊపందుకుంది. భారత్ రష్యా సంబంధాలు ఒకప్పుడు కింది స్థాయికి చేరిపోయాయనుకున్నపుడు కూడా చెడ్డమాటలు వినపడలేదు. అంతే కాదు ఎప్పుడూ భారత్ రష్యాని అంతర్జాతీయంగా వెనకేసుకునే వచ్చింది. నిజానికి ఈ పని ఒకప్పుడు రష్యా భారత్ కు చేసింది. రష్యా భారత్ సంబంధాలు యూక్రైన్ రష్యాల మధ్య యుద్ధంతో మరింత మెరుగు చూపాయి. మొన్న చైనాలో జరిగిన SCO తో భారత్-చైనా, భారత్ రష్యా సంబంధాలు మెరుగునపడ్డాయి. వీటితో పాటు మరికొన్ని దేశాలూ అన గా బ్రెజిల్, S. ఆఫ్రికా పాకిస్థాన్,టర్కీ,అజర్బైజాన్, మరికొన్ని దేశాలు కలవడం అమెరికాకి వెర్రెక్కించింది. కారణం, ఈ మూడు దేశాలూ,వీరితో మరికొన్ని దేశాలూ తమ వ్యాపారాన్ని రూపాయలలో చేసుకుంటున్నాయి,డాలర్ తో కాక. ఇది డాలర్ కి పెద్ద విఘాతం కల్పించేదే! అందుకే అమెరికా భారత్ మీద విషం చిమ్ముతోంది. ఇంకా చిమ్ముతానంటోంది. టాక్సులు పెంచడమే కాక ఇతర చర్యలూ తీసుకుంటాము,మా మాట వినకపోతే అని మొహమాటం లేకుండానే చెబుతున్నారు. భారత్ దేనికీ అతిగా స్పందించకపోవడం అమెరికాకి మరింత వెర్రెక్కించింది.
సోషల్ మీడియాలో కూడా అమెరికా వ్యతిరేకంగా మాటాడినవాళ్ళకి వీసాలు ఇవ్వమనీ చెబుతున్నారు,ఇదేమో! !
ఇదే మరే దేశమైనా ఐతే మీ దేశంలో Freedom of speech లేదు అని చెబుతారు. ఇదేమీ? ఇంతేనా ఈ దేశం లో లింగ వివక్ష, వర్ణ వివక్ష లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారుండచ్చంటారు, అదే నోటితో మొన్న దేశంలో బొట్టు పెట్టుకున్న స్త్రీ, దేశపౌరురాలు అటార్నీ ఐతే ఎంతంత మాటలు మాటాడేరు? వివేక్ రామసామి పోటీ చేసినప్పుడు ఏం మాటాడేరు? వాన్స్ భార్యకి , భారతీయ మూలాలుంటే ఏం మాటాడేరు? కమలాహేరిస్ కి భారత మూలాలున్నందుకు ఏం మాటాడేరు మేమంతా కళ్ళు మూసుకునిలేము,కళ్ళు మూసుకుపోయీ లేము. మొన్న నీ మధ్య పీటర్ నవార్రో మాటాడినమాటలెంత గొప్పగా ఉన్నాయి? మరొక మహానుభావుడు భారత్ టుకడే టుకడే గేంగ్ లీడర్లా మాటాడేడు కదా! మరో పెద్దమనిషి మీ ఎకానమీని పాడుచేసేస్తామని చెప్పలేదా! ట్రంప్ మహా శయులే మీది,రష్యాది చచ్చిన ఎకానమీ అనలేదూ? అమెరికా తరవాత కాలంలో భారత్ తో వ్యాపారం చేసినా వ్యవహారం చేసినా,ఇప్పుడు జరిగినవి మరచిపోతారా? ఇదివరలో కూడా భారత్ ఆపద సమయాల్లో శత్రువుతో కూడినదికాదా,ఈ అమెరికా?
ప్రపంచంలో ఏదేశంతోనూ భారత్ కి వైరం లేదు. కాని భారత్ మా శత్రుదేశమని ప్రకటించుకున్న పాక్ కి కూడా మొన్న సింధుజలాల ఒప్పందం నిలుపుదల చేసినా, వరద రాబోతోంది, నీరు కిందకి జాగ్రత్తగా వదులుతున్నాము, ఇప్పటికే మీ దేశం వరదల్లో ఉన్నదని చెప్పి, కబురు చేసింది భారత్, చెప్పవలసిన అవసరం లేకపోయినా,మానవతా దృష్టితో చెప్పింది.
ఆ దేశం ఘోషయాత్రలో దెబ్బలుతిని, ధర్మారాజుచేత విడిపింపబడి, మంచిమాటలు చెప్పించుకుని యుద్ధానికి దూరంగా పోయి గుడారం వేసుకుని ఉన్నవాడి దగ్గరకి, యుద్ధం నుంచి పారిపోయిన కర్ణుడు ఓదారుస్తూ, పాండవులు నీ దేశపౌరులు రాజు కష్టంలో ఉన్నపుడు రక్షించడం వారి విధి,ఎందు తెగ బాధ పడిపోతావంటాడు, అలా వాళ్ళు కాఫిర్లు, వాళ్ళు మేము కష్టంలో ఉంటే చెప్పాల్సిందే, లేకపోతే సింధునదిలో నీటికి బదులు భారతీయుల రక్తం పారుతుందనీ అనగలరు. అటువంటివారితో భారత్ కు వ్యతిరేకంగా ఎన్ని సార్లు అమెరికా అనుకూలంగా ప్రవర్తించలేదు. ఇలా చెప్పుకుంటూపోతే ఇదో పెద్దగాథ. ఏదీ మరచిపోము.
అన్ని దేశాలకంటే చాలా తక్కువ పన్నులతో తప్పించుకున్న సింగపూర్ ప్రధాని మాటాడుతు, ఏమన్నారు, ఇప్పుడు తప్పించుకున్నా,ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేం,కనక మనం మన ఉత్పత్తులకు వేరు,వేరు దేశాలని వెతుక్కోవడం మంచిదని కదా! అంటే పిచ్చివాడి చేతిలో రాయిలా ఉన్నది వ్యవహారం అన్న మాట కాదా? చాలా చిన్నదేశం బుర్కినాఫాసో, బహుశః చాలామందికి పేరుకూడా తెలియకపోవచ్చు,ఆ దేశ ప్రెసిదెంట్ మాట పశ్చిమదేశాలు దేనికైనా లెక్చర్లిస్తాయి,వారు మాత్రం ఆచరించరు. అందరినీ నీచంగా చూస్తారు. అదే ఆసియా దేశాలలో భారత్ వారు మాత్రం విషయాన్ని వివరిస్తారు,సమానదృష్టితో చూస్తారు,సాయం చేస్తారని చెప్పలేదూ! చాలా దేశాలు ఎదురు చెప్పలేక తలవంచుకున్నాయి, అలా మేము చెప్పిన మాట వేద వాక్యం విని తీరాలి,అన్న దానికి బ్రెజిల్ ఎదిరిస్తే 50% పన్నులెయ్యలేదా? జపానుకు 15% సుంకాలు వేసిందెందుకు? ఆ దేశపు మిగులంతా అమెరికాలో పెట్టుబడి పెట్టడమనే షరతు కదా! వచ్చిన లాభంలో కూడా వాటాకావలన్నారుగా! MAGA (make amerikaa great again) ఎలా అవుతుంది? అంటే మరొకరు చెడి అమెరికాను గొప్ప చేయాలా? ఏడూళ్ళు చెడితేగాని ఏడిద కాలేదని మా దగ్గర చిన్న నానుడి చెబుతారు.
సశేషం......
No comments:
Post a Comment