Saturday, 20 September 2025

వదరుబోతులమాట .......

వదరుబోతులమాట ........

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ 
దారిద్ర్య   మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
Courtesy: Owner


శేషప్ప కవిగారి నృసింహ శతకంలో ఈ పద్యం చదువుతుంటే వచ్చారు మా సుబ్బరాజు,సత్తిబాబు. సుబ్బరాజు కూచుంటూ, కూసోవో అని సత్తిబాబు చెయ్యి పట్టుకులాగి కూచో బెట్టి,ఏదీ మళ్ళీ చదవoడి ఆ పద్యం, అన్నాడు సుబ్బరాజు,పద్యం విని,  

వదరుబోతుల మాట వాసికెక్కె,ఇదేంటో చెప్పవో అన్నాడు సత్తిబాబుని. .

తిండిబోతు,తిరుగుబోతు,తాగుబోతు అంటే తెలుసు మరి ఈ వదరుబోతు ఎవరయ్యా! అడిగాడు మా సుబ్బరాజు.   

 తాగున్+పోతు,తిరుగున్+పోతు,వదరుబోతు అన్నది రెండు మాటల కలయిక. వదరున్+పోతు. ద్రుతము మీది సరళాలు పరుషాలవుతాయని మా తెనుగు మాస్టారు చె ప్పారు. అదే వదరున్+పోతు, కాస్తా వదరుబోతు  అయింది,ఇలాగే సోమరిపోతు వగైరా అన్నాడు సత్తిబాబు.  

ఇదేదో పిల్లి అంటే మార్జాలం లా చెబుతావే కసిరాడు సుబ్బరాజు.

వదరు  అంటే పనికిమాలిన మాటలు మాటాడటం,నోటికొచ్చినది మాటాడటం,ఆలోచన లేకమాటాడ టం చెప్పుకోవచ్చు. ఇక పోతు అన్నది మగ,మేటి అర్ధాలు చెబుతారు.  వ్యర్ధంగా మాటాడటంలో,నోటికొచ్చినది,ఆలోచనలేనిది మాటాడ్టం లో మేటి అని చెప్పుకోవచ్చు. 

 నేటి కాలానికి ఉదాహరణ చెప్పవో! అడిగాడు సుబ్బరాజు 

ఓ! అదా, తూర్పు తెల్లారింది మొదలు భూకంపం తెప్పిస్తా, ఆటం బాంబు లేస్తా, హైడ్రోజన్ బాంబు లేస్తా అంటూంటే ప్రజలు నోరెళ్ళ బెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అన్నీ నెంబుకుపోయిన దీపావళి సామానులా తుస్,తుస్ మంటూంటే జనం పిట్టల దొరలా ఉన్నాడని నవ్వుకుంటూన్నారయ్యా!

రాజ్యాంగబద్ధం గా ఎన్నికైన ప్రభుత్వాన్ని Gen-Z ఉద్యమం ద్వారా 'ఓట్ చోర్ గద్దీ ఛోడ్' ఉద్యమంద్వారా దించేయడం రాజ్యాంగబద్ధం అవుతుందా? వారి వెనక ఉండే మీరు రాజ్యాంగాన్ని ఎలా రక్షిస్తారుటా? ఎలా?  నీకు దమ్ముంటే నీయమ్మ చేసినట్టు అనగా ఒక్క ఓట్ తో వాజపాయీ గారిని దించేసినట్టు మోడీని కూడా దించెయ్యి, నువ్వురా మొగోనివీ అనుకుంటాం.ఏదీ ప్రయత్నించు చూదాం. 

ఇక మీవోడే ఒకప్పుడు తప్పుడు మాటలు మాటాడితే పదవిపీకి పొమ్మనారు,మీరే. మళ్ళీ మీరే ఇచ్చేరనుకో! ఆయనే శాం పిట్రోడా! మొన్నీ మధ్య, పాక్ వెళితే, స్వంతింటికి వెళ్ళినట్టుందన్నాడట. అవునుగా 75 సంవత్సరాల కితందాకా అంతా ఒక దేశం మనుషులే ఆ తరవాత మేము విడిపోతామని విడిపోయి,రక్తపుటేరులు పారించి నాటినుంచీ భారత్ మా శత్రు దేశం అని చెప్పుకుంటున్న దేశం స్వంతింట్లో ఉన్నట్టుందంటే దీన్నేమనాలి? చెప్పవోయ్!   

కూడా ఉండే మీరన్నా కొంచం చెప్పండయా! అంటూ తువ్వాలు దులుపుకుని భుజమ్మీదేసుకుని ఎలబారిపోయాడు సత్తిబాబు. 

మాట పలుకు లేక కొయ్యబారిపోయాడు సుబ్బరాజు. 

గబగబా లోపలికి పరిగెట్టేను,నేను.       

***

  శేషప్పకవిగారు వందల సంవత్సరాలకితమే అప్రయోజకులు,శుంఠలు, వదరుబోతులు పుడతారని ఊహించిన,దీర్ఘదర్శి. వివరంగా చెప్పేరు. ఈ ఒక్క పద్యం, పూర్తిగా నేటికీ అర్ధం కాలేదు 🤣 

No comments:

Post a Comment