28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

వీరణము లేని పెండ్లి


కారణము లేని నగవును,

బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో

బూరణము లేని బూరెయు,

వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ

ప్రపంచంలో కారణం లేని నవ్వు, బేరణము అనగా కంచుకము అనగా రైక లేని స్త్రీ, ఫూరణము లేని బూరె, వీరణము లేని పెళ్ళి వృధా అని కవి గారి భావం

కారణము లేని నగవు ఉండదు. పాపం ద్రౌపది మీద, అకారణంగా నవ్వి ఒక పెద్ద యుద్ధానికి నాంది పలికిందనే అభాండం వేసేసింది, లోకం. కాని నిజానికి ద్రౌపది నవ్వు యుద్ధానికి కారణం కానే కాదు. దుర్యోధనుడు తన తండ్రితో ఏకాంతంలో చెప్పుకున్నమాట. తండ్రీ  పాండవులకు మయుడు నిర్మించి ఇచ్చిన భవన సోయగాలు చూస్తుండగా జరిగినదిది. 

నిర్మల స్ఫటిక శిలా నిర్మితంబై……………………….జలబుద్ధింజేసి బరిధానోత్కరణంబు సేసి విమలశిలాతలబుద్ధి నుదకపూర్ణంబున వాపి సొచ్చి కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుంజూచి వృకోదరుండు నగియె. దానినంతయు నెఱింగి ధర్మరాజచోదితులైన కింకరులు నాకు పరిధానంబు దెచ్చి యిచ్చిరి మఱియు……..యనేక సహస్ర విలాసినీపరివృతయయి యున్న ద్రౌపది నగియె నంత నకుల సహదేవులు పఱతెంచి యిదె వాకిలి ఇట వచ్చునది యని నన్నుం దోడ్కొనిపోయిరట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యంబయి యున్నయది.” సభా .ఆశా2….140

''స్పటిశిలామయమైన ప్రదేశంలో నీరుందనుకుని పంచె ఎగగట్టేను, మరోచోట మామూలు ప్రదేశమని కాలేస్తే నీటితో పంచె తడిసింది, అది చూచి భీముడు నవ్వేడు. అంతా తెలిసిన ధర్మరాజు సేవకులతో పొడిబట్టలు పంపేడు. తరవాత అనేకవేల చెలికత్తెలతో ఉన్న ద్రౌపది నవ్వింది అని చెప్పుకున్నాడు''.

నిజానికి దుర్యోధనుని బాధించినది భీముని నవ్వే. సందర్భంగా నవ్వినవారంతా సహజంగా వచ్చిన నవ్వును ఆపుకోలేకపోయినవారే! ఇక కారణం లేని నవ్వు నవ్వేవారు ఇద్దరేఒకరు పిచ్చివారు, రెండవవారు యోగులు.వారి నవ్వుకు కారణం మనకు తెలియదు,వారు చెప్పరు. మనం ఇద్దరికోవకీ చెందం, అందుకు కారణం లేని నవ్వు లేదనీ  కవిగారినమ్మకంకాని నేటి కాలానికి వెకిలి నవ్వులే కనపడుతున్నాయి. వికటాట్ట హాసం దీనికి కొంచం తక్కువ అట్టహాసం దానికంటే తక్కువది హాసం. తరవాతది oదహాసం చివరిది స్మితం. ఎంత తేడా! కారణం లేని నవ్వు లేదు ఉండదు అన్నది కవి హృదయం.


బేరణము లేని లేమ. బేరణము అనగా కంచుకము. అనగా నేటి బ్రా అనొచ్చుననుకుంటా. బహుశః నేటి బ్రా పదం ఆనాటి బేరణం నుంచి పుట్టిందే కావచ్చు. నాటి కంచుకము కూడా నేటి బ్రాలాగే ఒక గుడ్డ ముక్క రెండు స్థనాలని కప్పి ఉంచేది, ఇది భారతీయ, రోమన్ తదితర సంస్కృతులలో  చిత్రాలలో కనపడుతుంది. అందమైన స్త్రీకి బేరణము లేకపోవడం కవిగారికి నచ్చలేదు. నేటి కాలంలో టూ పీస్ లు కట్టుకున్నవారే జాతి చిహ్నాలుగా గుర్తింపబడుతున్నరోజులు. రోజులిలా మారతాయని కవిగారూహించి ఉండరు.  బేరణము లేని స్త్రీ ఉండదయ్యా అని కవి భావం.


వీరణము లేని పెళ్ళి. పెళ్ళంటే పందిళ్ళు, సందిళ్ళు,సందళ్ళు,తాళాలు, తలంబ్రాలూ. మూడే ముళ్ళు ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్ళూ అని ఒక సినిమా కవిగారి మాట. ఎవరిమాటైనా నిజం నిజమేకదా!

ఐతే పెళ్ళికి రెండు ముఖ్యం. ఒకటి కాగడా,రెండవది వీరణం.మరో ముఖ్యమైనది మామిడాకు తోరణంవీరణం అనేది ఒక వాద్యం. దీనిని ఎక్కువగా శివాలయాలలో ఉపయోగిస్తారు. వీరణం వాయిస్తే నరాలు ఉప్పొంగుతాయి. ఒక ఆవేశం ఆవహిస్తుంది. ఒకప్పుడు రణానికి సిద్ధమయ్యే సందర్భంలో  వీరణం వాయించేవారుకారణము,వీరణము,రణము,మరణము చూడండి అన్ని దగ్గర దగ్గరగా పోలిన మాటలే. మరి పెళ్ళికి వీరణం ఎందుకూ? పెళ్ళి అనే రణం లోకి దూకుతున్న ఇద్దరు స్త్రీ పురుషులు ఆవేశం కోసం వాయించేదనుకుంటా :) వీర శైవులు వాద్యాన్ని వాడుతున్నట్టే ఉంది. ఆంధ్రలో వీరభద్రుడిని కొలిచే ఆచారం ఉంది,అన్ని కులాలవారూ. వీరభద్రుని సంబరంలో వీరణం తప్పనిసరిగా ఉంటుంది. వీరణం వింటారా? లింక్ లో వినండి.


https://youtu.be/fLBfmWEGnu8


పూరణము లేని బూరె...బూరె కి పెళ్ళికి లింకూ. పెళ్ళి కాని ఆడపిల్ల కనపడితే ''బూరిముక్కెప్పుడు పెట్టిస్తావ్'' అని అడగడం మామూలు. బూరిముక్కెట్టడమంటే పెళ్ళి కావడం. నీ పెళ్ళెప్పుడూ అని తిన్నగా అడగక ఇలా డొంక తిరుగుడుగా అంటే అన్యాపదేశంగా అడుగుతారనమాట. ఇప్పుడీ ముచ్చట్లూ లేవు లెండి.వాళ్ళ పెళ్ళెప్పుడో వాళ్ళకే తెలీదూ.ఆవేశం రావాలిగా. వీరణం మోగాలిగా. బూరి ముక్కనడం అలవాటూ. బూరి అన్నది ఒక విలక్షణమైన పిండివంట.శనగపప్పు ఉడకబెట్టి రుబ్బి మెత్తగాచేసి దానిలో కోరిన బెల్లం కలిపి ఉండలుగా చేస్తారు. ఇలా శనగపప్పు ఉడికించిన పిండి,బెల్లం, యాలకు పొడి కలిపిన దానినే పూర్ణం అంటారు. వాటిని తోపు పిండిలో ముంచి ( దీనికి మైదా వాడతారు) నూనెలో వేయిస్తే....తినడం మజా. బూరి తినడానికో ప్రోటోకోల్. అలా తింటేనే బాగుంటుంది. బూరికి చిల్లు పెట్టాలి,దాని నిండా కరిగిన నెయ్యి పొయ్యాలి, పక్కకి కారినా ఫరవాలేదూ. అలా నేతిలో ములిగిన బూరి ముక్కని తుంచుకుని తింటే నా రాజా....ఏమని చెప్పుదుమరింతటి బూరిలో అత్యవసరమైన పూరణం లేకపోతే? అసలది బూరి అవుతుందా...వ్యర్ధం,వ్యర్ధం,వ్యర్ధం......

చివరిగా కవిగారి మాటేంటంటే కారణం లేని నవ్వు, బ్రాలేని స్త్రీ, పూరణం లేని బూరె, వీరణం లేని పెళ్ళి ఉండవంటారు.


మొన్నో చిత్రం చూశానూ! అమ్మాయికి అబ్బాయికి వివాహానికి తాంబూలాలు కార్యక్రమం, ఒక ఫోన్ లో వాట్సాప్ లో అమ్మాయి,అమెరికా నుంచీ, మరొక , మరో పీటమీద ఫోన్లో అబ్బాయి వాటాప్ లో ఉండగా తాంబూలాల కార్యక్రమం నడిచింది. అమ్మాయి  కనపడుతున్న ఫోన్ మీద ఆమెకు బట్టలు పెట్టేరు, మెడలో వేసినట్టు. అల్లాగే అబ్బాయికి చేసేరు. మరి పెళ్ళి కూడా ఇలాగే చేసుకుంటే కాపరమెక్కడా అని బుగ్గలు నొక్కుకుంటున్నారు, చూసినవారు.  

కవిగారికి నమోన్నమః

26, ఫిబ్రవరి 2020, బుధవారం

కుమ్మీసినారు బావూ

నారాయణమూర్తి బావూ!నారాయణమూర్తి బావూ!!

ఛస్!  ఏంటీ కేకలు గొడవా మా ఇంటి దగ్గరా? ఏవడ్రా వీడు ? గంజి కావిడి వేసి మోసుకొచ్చేరూ?

బుగతా! తవరిగారి మనవడేనండి!

అయ్యో! చిట్టితండ్రీ నారదా!నిన్ను కొట్టడానికి వాళ్ళకి చేతులెలా వచ్చాయి. చిన్నపిళ్ళాణ్ణి చేసి కొడతారా?ఆ కట్లేంటీ? వాతలేంటి నాయనా? 

ఏటి బాబూ ఈన సిన్నపిల్లోడా? పెల్లి లేక ఇలా ఐపోనాడుగాని, ఈనకి పెల్లి సేసుంటే ఈన మనవలకి పెళ్ళొయసొచ్చుండేది గందూ!

ఆ గొడవిప్పుడెందుకుగాని, మా బాబుని కొట్టినోళ్ళెవరో చెప్పండి.

ఊరి సెంటర్లో ఎవురో ఇద్దరు అరుసుకుంటన్నారు,సక్కీ పడిపోనారో, తగ్గిపోతాన్నారో, మద్దెలో ఈ బాబు ఏలెట్టేసుకున్నోడు.గొడవ రేపెట్టేసినోడు.మరీ బాబేటో అనీసినాడు. ఒకుడేమో ఏటోస్! అంటన్నావని కడిగీసినాడు. మరేటి సెప్పమన్నవుబావు.సూసిన కళ్ళ సెబుతన్నాగాని నారాయనమూర్తీ తండ్రీ సుట్టుతా ఉన్నోళ్ళు కుమ్మీసినారు బావూ.ఈ బావు ఇదిమరలో సేయించిన దొమ్మీలాగైపోనాది.


 ఓరి పల్లకోండ్రా అంటే ఒక్కుడూ ఇన్లేదుబావు, నారాయనమూర్తి బావు బొట్టిడురా అన్జెప్పినా!

డాక్టేరు కాడికి మోసుకుపోనాం. ఇదుగో డాట్టరు బిల్లు బావు. 

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

విజయానికి అందరూ చుట్టాలే


Hero of the Day.
Umdurti Ramesh who finished 100 kilometers marathon in hours 20 minutes.
is a member of the
G.B.R.Walkers Club. Anaparti.

Ramesh with the Sri.T.Upendra Reddy Founder president of our G.B.R.Walkers Club. Anaparti


Ramesh with Dr.S.Suryanarayana Reddy MLA (left side) and Sri.T.Adi Reddy (aka) Kondababu Secretary& Correspondent G.B.R Educational Institutions. Anaparti.

24, ఫిబ్రవరి 2020, సోమవారం

పాటపాడుమా కృష్ణా



నారాయణ!నారాయణ!!
తెల్లారకుండా వచ్చి కూచున్నావేం నారదా! రాత్రి నిద్రట్టలేదా?
తాతా! తెలుగు గురించి చెప్పవూ?
ఏంటీ! నిన్నొక్కరోజు ఉపవాసంతో పైత్యం చేసిందా? మీ మామ్మని అల్లపు రసం తియ్యమన్నా!
అదేంకాదు తాతా! నిఝంగానే తెలుగురించి చెప్పు.
అవున్లే అరవపాటీ దగ్గర సాంబారు నీళ్ళు తాగుతున్నావు, నీకు తెనుగు గురించి చెప్పాలిసిందే! తెలుగు కాదు తెనుగు అనాలి. తెలిసెనా?

ముందు తెలిసెనా ప్రభూ!
ఈ మందిరమిటులుంచేనా!
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో, కాస్త

ముందు తెలిసెనా!! ప్రభూ



పాటపాడుమా కృష్ణా...
పలుకు తేనెలొలుకునటుల
మాటలాడుమా ముకుంద
మనసు మురియగా...

పాటపాడుమా.......

తెనుగు ఇలా ఉంటుంది.


సమయమాసన్నమైనది.
సమయమా సన్నమైనది.

స్వస్తి
మాటల మరాఠి.

23, ఫిబ్రవరి 2020, ఆదివారం

పరభాగ్యోపజీవి

“ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశంకితః
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః”

ఇది నారాయణ పండితుని హితోపదేశం, మిత్రలాభం లోని శ్లోకం. ఒకరిని చూచి ఈర్ష్య పడేవాడు, అత్యాశాపరుడు, సంతృప్తి లేనివాడు, కోపస్వభావం కలవాడు, నిత్యశంకితుడు, ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవాడు – ఈ ఆరుగురు నిత్య దుఃఖితులని ఈ శ్లోకం చెప్తోంది.




ఈర్ష్యాళువు,జుగుప్సావంతుడు,క్రోధనుడు,నిత్య శంకితుడు,నిస్సంతోషి, పరభాగ్యోపజీవి అనువారరుగురు దుఃఖ భాగులు అన్నారు చిన్నయసూరి.

మానవులతో పుట్టి పెరిగేవి కామ,క్రోధ,మోహ,లోభ, మద, మాత్సర్యాలు.వీటినే అంతఃశ్శత్రువులూ అంటారు, ముద్దుగా. వీరు అందరిలోనూ ఉంటారు, నాలో లేరన్నవారిని అసలు నమ్మద్దు. వీరిలో ఏ ఒకరో ప్రకోపించడం మూలంగానే ఆ పై ఆరుగురూ తయారవుతారుట.  ప్రతివారి జీవితంలోనూ వీరు తారసపడుతూనే ఉంటారు.కొంతమందిని గుర్తిస్తాం, కొంత మందిని గుర్తించి ఉపేక్షిస్తాం, అంటే చూసీ చూడనట్టు నటిస్తాం. ఇదీ ఒక గొప్ప కళ కదా!. కొంతమందిని గుర్తించలేం కూడా.  
జీవితం లో అందరిని చూశానుగాని ఈ పరభాగ్యోపజీవిని చూడలే. అంటే ఉదాహరణ దొరకలేదు. పరభాగ్యోపజీవి ఎలా ఉంటాడూ తెలియలేదు. 

ఇతరుల సొత్తును వారికి తెలియకుండా వారి అనుమతి లేక అనుభవించేవాడు,దొంగ.  దత్తత వచ్చినవాడు పెంచుకున్నవారు ఇష్టపడి ఇచ్చిన దానిని అనుభవిస్తాడు. మరి పరభాగ్యోపజీవికి నిర్వచనం దొరకలేదు. జీవితంకదా అనుభవాలతో అన్నీ తెలిసొస్తాయి, కాలం తో.

బ్లాగులు మొదలు పెట్టిన కాలంలో ఎక్కడెక్కడ మంచి టపాలుంటే సేకరించుకుని దాచుకునేవారు కొందరు. ఆ తరవాత కాలంలో వారు మళ్ళీ ఆ టపా ముఖం చూసి ఉంటారనుకోను. వీరిది ఆశ, మంచి మంచివన్నీ వీరి దగ్గర ఉండాలని కోరిక. ఇది మొదటి తరం. కాలం గడిచింది.

ఇక రెండవ తరంలో ఎక్కడెక్కడి మంచి మంచి టపాలు తస్కరించుకుని అదే సేకరించుకుని, రాసిన వేరు వగైరా కనపడనీయక తమవిగా ప్రచురించుకునే వారు. వీరితో ఎన్ని వన్నెలో చిన్నెలో, అడిగితే కోపాలూ....లేదూ వీడి బ్లాగులో కామెంట్లు పెట్టిన వాళ్ళని శిక్షిస్తాను అనే స్థాయికి పిచ్చి లేచిన సoదర్భాలూ......ఎన్నని చెప్పేది, వీరినీ చూశా.... 

వీరిది అసూయ, కీర్తి కాంక్ష. వారి బ్లాగులో వారు రాసినదానిని మూచూసేవారు లేక, పలకరించేవారు లేక పడేది నరక యాతన. పాపం, ఈ కీర్తి కాంక్షను అణుచుకునేందుకు ఈ పని చేసేవారు. కాలం ఆగదుగా.. 

ఇక వాట్సాప్ కాలం. వాట్సాప్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ ఎవరో స్టూడెంట్ ఎవరో తెలీదు. సర్వం జగన్నాధం. బాగున్న టపాలను పట్టుకుపోయి, ముక్కలు చెక్కలూ చేసి బాగున్నవాటిని వాట్సాప్ లో పెట్టడం. ఎవరు పెట్టేరు? తెలీదు. ఇలా నా టపాలు చాలానే నాకు తిరిగొచ్చాయి. ఇలా పెట్టే వారికి కీర్తి కాంక్షగాని, కనకం కాంక్షగాని లేనిదే! బాగున్నది పది మందికి చేరాలి అంతే! వీరిది మూడో తరం.... ఈ తరమూ చెల్లిపోయేకాలం దగ్గర పడినట్టే! 

ఇప్పుడు నడుస్తున్నది దృశ్య,శ్రవణ యుగం. నాలుగో యుగం,తరం. ఈ తరంవారికి కీర్తి, కనకాల కాంక్ష. బాగున్నవాటిని సేకరించడం, అనగా తస్కరించడం. దానికి ఆడియో వీడియో జతచేయడం. ఒక యు ట్యూబ్ ఛానల్లో ప్రచురించడం.  ఈ ఛానల్ ని ప్రోత్సాహకుల సంఖ్య,వీక్షణాల సంఖ్యతో కనకం చేరుతుంది. వీరిది కీర్తి,కనకాల అపేక్ష. అసలు బంగారమెవరిదీ? ఎవరిదో! వీరు సేకరించుకొచ్చి దానికి కొత్త తొడుగుతొడిగి మార్కెట్ లో పెట్టి డబ్బు సంపాదించుకోవడం చేస్తున్న పని కదా! సొమ్మొకరిది సోకొకరిది! ఇతరుల సొమ్మును దర్జాగా తెచ్చేసుకుని వాడెసుకోడం. . వీరిని నిర్మొహమాటంగా పరభాగ్యోపజీవి  అనచ్చు కదా!

ఇటువంటివారి గురించిన చర్చలో ఒక తల్లి బ్లాగర్లనుద్దేసించి చెప్పిన హితవచనాలు.

''ఒక్కమాట చెప్పనా...ఇటువంటి తప్పులు జరగడానికి కారణం మీ బ్లాగర్స్ ఉదాసీనతే. చిన్న చిన్న తప్పులను పట్టుకొని మీలో మీరే పొట్లాడుకుంటారు గానీ, ఇటువంటి పెద్ద పెద్ద తప్పులను పట్టించుకోరు ప్రశ్నించరు''. ''మీలో మీకు ఐక్యమత్యముండదు.మీరంతా ఉత్తమోత్తమ ఉదాసీనులు. దీనికి మీరంతా మంచితనమని పేరు పెట్టుకుంటారు మీరంతా ఇలా ఉండబట్టే అలాంటి తస్కరులు తయారౌతున్నారు.'' '' మీలో సంఘటితశక్తి రానంతవరకు అలాంటివారు ఉండనే ఉంటారు. తప్పు మీదే మీదే మీదే ...."








22, డిసెంబర్ 2019, ఆదివారం

కనులు తెరచినా నీవాయె కనులు మూసినా నీవాయె

భారతిగారి టపాలు చూసిన తరవాత కలిగిన ఆలోచన

ఒక్కటే 
పరబ్రహ్మమొక్కటే
సగుణం, నిర్గుణం కూడా
ఈ చరాచర జగత్తంతా బ్రహ్మమే
చరాచర జగత్తంతనీ పరబ్రహ్మంగా చూడగలిగితే?
 కామ,క్రోధ,మోహ,లోభ,మద, మాత్సర్యాలు లయం కాకనే
అలా చూడలేకనే బాధంతా!
బ్రహ్మము ఒక్కటే ఐనపుడు ఇన్ని రూపాలేల?
 లోకో భిన్న రుచిః 
పుఱ్ఱెకో బుద్ధి జిహ్వకో రుచి కదా 
ఎవరికిష్టమైన రూపు వారు ధ్యానించచ్చు.
ఎలా?
పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్... ప్రహ్లాదుని మాట.  
కాని ఈ నిలకడ కనపడటం లేదు
కాలంతో 
కనులు తెరచినా నీవాయె కనులు మూసినా నీవాయె అనే తత్త్వం అర్ధమైనపుడు
అంతా పరబ్రహ్మమే!

”నేను” సాధిస్తున్నాను ఒట్టి మాట.
నాచే తెలుసుకోబడుతున్నాడు డొల్లమాట.
పంచేంద్రియాలే ఇంకా రాజ్యమేలుతున్నపుడు


”నేను” ఇంకా చమురున్న పెంకు..అది పూర్తిగా కాలేదాకా...ఇంతే!