Sunday 23 February 2020

పరభాగ్యోపజీవి

“ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశంకితః
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః”

ఇది నారాయణ పండితుని హితోపదేశం, మిత్రలాభం లోని శ్లోకం. ఒకరిని చూచి ఈర్ష్య పడేవాడు, అత్యాశాపరుడు, సంతృప్తి లేనివాడు, కోపస్వభావం కలవాడు, నిత్యశంకితుడు, ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవాడు – ఈ ఆరుగురు నిత్య దుఃఖితులని ఈ శ్లోకం చెప్తోంది.




ఈర్ష్యాళువు,జుగుప్సావంతుడు,క్రోధనుడు,నిత్య శంకితుడు,నిస్సంతోషి, పరభాగ్యోపజీవి అనువారరుగురు దుఃఖ భాగులు అన్నారు చిన్నయసూరి.

మానవులతో పుట్టి పెరిగేవి కామ,క్రోధ,మోహ,లోభ, మద, మాత్సర్యాలు.వీటినే అంతఃశ్శత్రువులూ అంటారు, ముద్దుగా. వీరు అందరిలోనూ ఉంటారు, నాలో లేరన్నవారిని అసలు నమ్మద్దు. వీరిలో ఏ ఒకరో ప్రకోపించడం మూలంగానే ఆ పై ఆరుగురూ తయారవుతారుట.  ప్రతివారి జీవితంలోనూ వీరు తారసపడుతూనే ఉంటారు.కొంతమందిని గుర్తిస్తాం, కొంత మందిని గుర్తించి ఉపేక్షిస్తాం, అంటే చూసీ చూడనట్టు నటిస్తాం. ఇదీ ఒక గొప్ప కళ కదా!. కొంతమందిని గుర్తించలేం కూడా.  
జీవితం లో అందరిని చూశానుగాని ఈ పరభాగ్యోపజీవిని చూడలే. అంటే ఉదాహరణ దొరకలేదు. పరభాగ్యోపజీవి ఎలా ఉంటాడూ తెలియలేదు. 

ఇతరుల సొత్తును వారికి తెలియకుండా వారి అనుమతి లేక అనుభవించేవాడు,దొంగ.  దత్తత వచ్చినవాడు పెంచుకున్నవారు ఇష్టపడి ఇచ్చిన దానిని అనుభవిస్తాడు. మరి పరభాగ్యోపజీవికి నిర్వచనం దొరకలేదు. జీవితంకదా అనుభవాలతో అన్నీ తెలిసొస్తాయి, కాలం తో.

బ్లాగులు మొదలు పెట్టిన కాలంలో ఎక్కడెక్కడ మంచి టపాలుంటే సేకరించుకుని దాచుకునేవారు కొందరు. ఆ తరవాత కాలంలో వారు మళ్ళీ ఆ టపా ముఖం చూసి ఉంటారనుకోను. వీరిది ఆశ, మంచి మంచివన్నీ వీరి దగ్గర ఉండాలని కోరిక. ఇది మొదటి తరం. కాలం గడిచింది.

ఇక రెండవ తరంలో ఎక్కడెక్కడి మంచి మంచి టపాలు తస్కరించుకుని అదే సేకరించుకుని, రాసిన వేరు వగైరా కనపడనీయక తమవిగా ప్రచురించుకునే వారు. వీరితో ఎన్ని వన్నెలో చిన్నెలో, అడిగితే కోపాలూ....లేదూ వీడి బ్లాగులో కామెంట్లు పెట్టిన వాళ్ళని శిక్షిస్తాను అనే స్థాయికి పిచ్చి లేచిన సoదర్భాలూ......ఎన్నని చెప్పేది, వీరినీ చూశా.... 

వీరిది అసూయ, కీర్తి కాంక్ష. వారి బ్లాగులో వారు రాసినదానిని మూచూసేవారు లేక, పలకరించేవారు లేక పడేది నరక యాతన. పాపం, ఈ కీర్తి కాంక్షను అణుచుకునేందుకు ఈ పని చేసేవారు. కాలం ఆగదుగా.. 

ఇక వాట్సాప్ కాలం. వాట్సాప్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ ఎవరో స్టూడెంట్ ఎవరో తెలీదు. సర్వం జగన్నాధం. బాగున్న టపాలను పట్టుకుపోయి, ముక్కలు చెక్కలూ చేసి బాగున్నవాటిని వాట్సాప్ లో పెట్టడం. ఎవరు పెట్టేరు? తెలీదు. ఇలా నా టపాలు చాలానే నాకు తిరిగొచ్చాయి. ఇలా పెట్టే వారికి కీర్తి కాంక్షగాని, కనకం కాంక్షగాని లేనిదే! బాగున్నది పది మందికి చేరాలి అంతే! వీరిది మూడో తరం.... ఈ తరమూ చెల్లిపోయేకాలం దగ్గర పడినట్టే! 

ఇప్పుడు నడుస్తున్నది దృశ్య,శ్రవణ యుగం. నాలుగో యుగం,తరం. ఈ తరంవారికి కీర్తి, కనకాల కాంక్ష. బాగున్నవాటిని సేకరించడం, అనగా తస్కరించడం. దానికి ఆడియో వీడియో జతచేయడం. ఒక యు ట్యూబ్ ఛానల్లో ప్రచురించడం.  ఈ ఛానల్ ని ప్రోత్సాహకుల సంఖ్య,వీక్షణాల సంఖ్యతో కనకం చేరుతుంది. వీరిది కీర్తి,కనకాల అపేక్ష. అసలు బంగారమెవరిదీ? ఎవరిదో! వీరు సేకరించుకొచ్చి దానికి కొత్త తొడుగుతొడిగి మార్కెట్ లో పెట్టి డబ్బు సంపాదించుకోవడం చేస్తున్న పని కదా! సొమ్మొకరిది సోకొకరిది! ఇతరుల సొమ్మును దర్జాగా తెచ్చేసుకుని వాడెసుకోడం. . వీరిని నిర్మొహమాటంగా పరభాగ్యోపజీవి  అనచ్చు కదా!

ఇటువంటివారి గురించిన చర్చలో ఒక తల్లి బ్లాగర్లనుద్దేసించి చెప్పిన హితవచనాలు.

''ఒక్కమాట చెప్పనా...ఇటువంటి తప్పులు జరగడానికి కారణం మీ బ్లాగర్స్ ఉదాసీనతే. చిన్న చిన్న తప్పులను పట్టుకొని మీలో మీరే పొట్లాడుకుంటారు గానీ, ఇటువంటి పెద్ద పెద్ద తప్పులను పట్టించుకోరు ప్రశ్నించరు''. ''మీలో మీకు ఐక్యమత్యముండదు.మీరంతా ఉత్తమోత్తమ ఉదాసీనులు. దీనికి మీరంతా మంచితనమని పేరు పెట్టుకుంటారు మీరంతా ఇలా ఉండబట్టే అలాంటి తస్కరులు తయారౌతున్నారు.'' '' మీలో సంఘటితశక్తి రానంతవరకు అలాంటివారు ఉండనే ఉంటారు. తప్పు మీదే మీదే మీదే ...."








32 comments:



  1. ఇలా నా టపాలు చాలానే నాకు తిరిగొచ్చాయి :)

    You are blessed :)

    ReplyDelete
  2. పరభాగ్యోపజీవి...
    చాల చక్కగా చెప్పారు 🙏

    పద్మగారు సరైన సూచన ఇచ్చారు కానీ ఈ ఐక్యత వస్తుందంటారా?

    ReplyDelete
    Replies
    1. తల్లీ భారతి,
      పరభాగ్యోప జీవుల సంఖ్య పెరుగుతోందమ్మా! అదే ఇబ్బందికరం. చేయగలది కనపడటం లేదు,విచారించటం తప్ప.

      మనం తెలుగువాళ్ళం. విశ్వామిత్ర శపిత సంతతి వాళ్ళం, దుర్యోధన చక్రవర్తికి అనుగు చెలికాళ్ళం. ఆరంభ శూరులం, ఆవేశ పరులం. ఇదీ మన డి.ఎన్.ఎ.

      ఇక ఐకమత్యమా? అదో ఎండమావి. మన నిండా ఉన్నది అసూయ,ఈర్ష్య,ద్వేషం. పక్క వాడు పచ్చగా ఉంటే చూసి ఓర్చలేనితనం మెండుగా ఉన్నవాళ్ళం.

      ఇక బ్లాగరం అంటే మిగతావారికంటే మేధావులమని గొప్ప.వద్దు ఇంక చెప్పమనద్దు.ఇందులో ఉన్నంత బురద ఉంది, మొత్తం బురదేననను.ఐకమత్యం సుదూర స్వప్నం..నిరాశావాదిని కాదు, ఆశావాదినే... కాని ఐకమత్యం చూస్తానన్న నమ్మకం మాత్రం లేదు..

      కాని

      ఇటువంటి చిన్నారుల ఆవేశం చూసినపుడు మాత్రం కొద్దిగా ఆశ పొటమరిస్తూ ఉంటుంది, అంతే
      నమస్కారం.

      Delete
  3. తెలుగుబ్లాగులు మంచి వసాహిత్యవిజ్ఞాన భాండారాల్లాగా వర్ధిల్లాలని ఆశించిన వాడిని నేను.

    ఇంకా ఆ పిచ్చి ఆశ చావక ప్రాకులాడుతున్న వాడినే.

    రోజురోజుకూ తెలుగుబ్లాగులోకం అధఃపాతాళానికి చేరటానికి ప్రాకులాడుతుంటే నిస్సహాయంగా చూస్తున్న వాడిని కూడా.

    ప్రస్తుతం తెలుగు బ్లాగులోకంలో నిర్లక్ష్యంతో వ్రాసేవారూ, రాజకీయకాలక్షేపరాయుళ్ళూ, అజ్ఞానులూ, అజ్ఞాతలూ, అసమంజసులూ రాజ్యం చేస్తున్నారు.

    ఇంకా ఏదో విలువలూ చట్టుబండలూ అంటూ ప్రాకులాడే వారు అక్కడక్కడా ఉన్నా వారి గొణుగుళ్ళు వినేవాళ్ళు ఎవరూ ఉన్నట్లు లేరు.

    తెలుగుబ్లాగుల్లో వచ్చే ఐక్యత అల్లా ఒక్కటే. దృక్కోణం విషయంలో - దాదాపు అందరూ వీటిని కాలక్షేపం వేదికల్లాగా చూస్తున్నారు.

    ఐనా ఆశాజీవులూ, మీరు జిందాబాద్‍.

    ReplyDelete
    Replies
    1. శ్యామలరావు గారు,
      మీకు చెప్పగలిగినంతవాడినికాను.
      అడుసు తొక్కనేల? కాలు కదుగనేల?

      Delete
    2. కం. అడు సెందుకు త్రొక్కితినా?
      అడుగంటని ఆశవలన. అపు డేమాయెన్?
      కడముట్టె నది అనామకు
      లడుగడుగున పిచ్చిమాట లాడుట వలనన్!

      ఇంక చాలు చాలు అని చెప్పి, కాళ్ళు శుభ్రంగా కడుగుకొని హాయిగా కూర్చున్నాను.

      Delete


    3. అంతా రాములోరి యిచ్ఛ!


      నారాయణ
      జిలేబి

      Delete
    4. కాళ్ళు కడిగేసుకున్నారు కదా! మళ్ళీ చెప్పులేసుకోకండి. ఆయ్!

      Delete


    5. అబ్బే ఇలా ఎన్ని సార్లవలే ? ఎప్పటికప్పుడు పవర్ ఫ్రెష్ వారు :)


      జిలేబి

      Delete

    6. మళ్ళీ చెప్పులేసుకున్నా పర్లేదండి!ఆయ్ అవి బయటే వదిలేస్తారీసారి ఆయ్! తెలిషిందాండీ

      Delete
    7. ఈ అనవసరపు గోలకు దూరంగా జరిగిన తరువాత హయిగా ఉందండీ శర్మ గారూ. చూడండి, కాకతాళీయమో కాదో ఈరోజున భగవత్కృప వలన ఇప్పటికి ఐదు కీర్తనలు వచ్చాయి రాములవారి గురించి. ఈ ఆనందం చాలు నాకు. బ్లాగులోకం అంతా బురదగుంటలే అనను కాని సదరులోకం సంచరించి వస్తే మాత్రం కాళ్ళకు బురద అంటకుండా ఉండటం కష్టం కాబట్టి వీలైనంత జాగ్రత వహించక తప్పదు. ఉంటానండి, మరొక రామకీర్తన వచ్చేలాగు ఉంది ....

      Delete
    8. అన్నట్లు జిలేబీ గారూ, మీరన్నది నిజం. ఇప్పటికి బోలెడు సార్లయింది. ఈ మడి ఎన్నాళ్ళో చూదాం అని మీరనటం సబబే.

      మాలికలో చూసాను "రమణ రాజు గారి వ్యాఖ్య చదివేక శ్యామలీయం మాష్టారు గారికి కొంత ఊరట కలిగి యుండును" అన్నారు మీరు. వారేమన్నారో మరి. పోనీయండి. ఆయన బ్లాగులను చదవటం ఇక నాకు వీలుపడదండి. ఊరట వారి వ్యాఖ్యతో సంబంధం లేకుండానే కలిగింది లెండి.

      Delete

    9. Try a Sneak preview of his apologies :)



      జిలేబి

      Delete
    10. జిలేబీ గారూ,

      ఎందుకండీ?

      కం. ఎందుకు వచ్చిన బాదర
      బందీ లికపైన వారి బ్లాగుల రచనా
      సౌందర్యంబుల గనుటయు?
      వందనములు చేసి విడచి వచ్చితినికదా!

      Delete


    11. మీ ఆత్మీయ వ్యాఖ్య చాలా ఆనందం కలిగించింది.
      మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. __/\__

      Delete
    12. మీకు కొంటెతనం ఓ పాలు ఎక్కువే “జిలేబి” గారూ. (nmraobandi blog comment ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు)

      Delete


    13. అవునండోయ్. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడే చూ”షా”ను 🙂.
      ఈ రోజెంతటి సుదినం!


      జిలేబి

      Delete
    14. వేరే చోట నేనే చేసిన కామెంటుని తీసుకెచ్చి నా మీదే ప్రయోగించారా? కొంటెతనం unlimited. Also you are incorrigible.

      Delete

    15. ఆహా! చూషారా? పుల్ల పెట్టే బుద్ధి. ఈ రోజెంత ’షు”దినం’

      Delete

    16. విన్నకోటవారు,
      you are incorrigible.మీరింకా ఈ మాటనలేదేమా అని చూష్తున్నా! :)

      Delete
    17. // “ చూష్తున్నా “ //
      🙂. మనకి కూడా సినిమా “ష” అలవాటైపోయేట్లుంది 😳
      —————-
      //“ మీరింకా ఈ మాటనలేదేమా అని చూష్తున్నా! :)”//
      🙂🙏 శర్మ గారు.

      Delete
    18. షహవాసా దోషం సార్

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. శ్యామలీయంగారు.
    వదిలేశారుగా! అమ్మయ్య!!
    మీరు చేయాల్సిన పనుల బాకీలు చెబుతున్నా.
    లలితాసహస్రం పూర్తి చెయ్యాలి.
    అక్షరమాలా శివ స్తోత్రానికి లఘు టీక రాసి ప్రచురిస్తానని మొన్ననే మాటిచ్చారు.
    రామకీర్తనలు వెయ్యి పూర్తి చెయ్యాలి.
    మరింకేం బాకీలున్నాయో గుర్తు లేదు.ఇన్ని పనులున్నాయి, ఆరోగ్యపు ఇబ్బందులున్నాయి, ఇన్నుండగా ఈ పిల్లసమేరీలెందుకండీ? ఇలా అన్నానని ఏమనుకోవద్దు, కోపించద్దు. మన్నించండి.

    ReplyDelete
    Replies


    1. విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె
      శిష్టాత్ములన్ :)

      జిలేబి

      Delete
    2. సమస్యా పూరణం

      ఎటుల విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె
      శిష్టాత్ములన్ :)
      jaalraa
      Zilebi

      Delete

    3. మీ కోరిక యేల కాదనాలె :) నారదా కొంత ఘృతం‌ తీసుకొని రమ్మా :)



      ఇలలో వున్నవి జాలువార మరియెన్నెన్నో కతల్ శ్యామలీ
      యులవర్ణాంకము వేగమందుకొనగా నుర్రూతలూగింపగా
      తళుకుల్లీనెడు మాటలన్ విసురుచున్ తాతాజి,కష్టేఫలీ
      విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్!


      జిలేబి

      Delete
  6. అంతర్జాల రత్నాకరము
    ...............

    కలువబుధసమూహంబుల
    కలుగునుతెలివించుకంచుకదిలితినిటులన్
    నిలువన్ దారముసుమమా
    లలనడుమన్ వాసనబ్బు లాలస చెలగన్

    విజ్ఞానముసాగరమౌ
    ప్రజ్ఞావంతులకుదొరకు పగడాల్ రత్నా
    లజ్ఞానులువినయముగన
    నుజ్ఞంబడయంగవచ్చునుత్తమఫలముల్

    కాదుభయంకరముజలధి
    మోదప్రదమెరుగవిధముమునుగకదిరుగన్
    హృదయోల్లాసమునిచ్చును
    కుదురుగవిభవంబులిచ్చు కూరిమిపొంగన్
    గాదిరాజు మధుసూదన రాజు
    సుజ్ఞా

    ReplyDelete
    Replies
    1. క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు,
      తమ భావం అర్ధం చేసుకోలేకపోయాను,మన్నించండి.

      Delete
  7. బ్లాగర్లలో కొందరు లాభార్జన కోసం.మరికొందరు కీర్తియందనురక్తితోనూ..మరికొందరు కాలక్షేపం కొరకు..అరుదుగా జీవన్ముక్తియే లక్ష్యంగా చరించే వారూ ఉంటారని నా ఉద్దేశ్యం.
    డబ్బుకోసం చరించే వారు ..తమహక్కులకోసం పోరాడుకోవాలి ఫలానా టపా మా స్వీయరచన అని నిరూపించుకోవాలి.కీర్తీకోసం పరితపించేవారూ..ఫలానా సత్యాన్ని తొలుతనేనే గుర్తించాను.ఆ ఘనత నాకే దక్కాలని పోరాడుకోవాలి నిరూపించుకోవాలి.ఇక టైంపాస్ కోసం చరించే వారికి బఠాణీలూ కారప్పూసలూ ఇలాంటి వాదాలలో ఛలోక్తులూ అవసరమే..ఇక తెలుగుతల్లికీ భారతీ మతల్లికీ సేవచేయటం..ఉద్ధరించటం ఈ బ్లాగులలో
    సులభంకాదు.కాని కొందరు పరిపూర్ణపండితులు దానిని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ విశ్వవిఖ్యాతిని పొందారు.
    ఉదాహరణకు కంది శంకరయ్యవారు.
    ఇక పండితులము అనుకుని తూలిసీతెలియని విషయాలను
    వ్రాస్తున్నవారు ఎందరో వున్నారు. వారి వలన తెలుగుపరిశోధకులకు కొంచెం అసౌకర్యం కలుగుతుంది.
    సంస్కరించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలవారిదే!
    ఇక మోక్షంఆధ్యాత్మికం విషయాలకి వస్తే..ఎవరికి తెలిసిన వాటిని వారు నమ్మకం కొద్దీ ప్రచురించుకోవచ్చును.ఎందుకంటే..అవి వేదాలనుంచో..
    ఉపనిషత్తులనుంచో..ఎవరో జగద్గురువు ల నుండి శక్త్యానుసారం గ్రహించినవై యుంటాయి.
    నావి అనుకోవటం భ్రమ.జ్ఞానులు ఈ వివాదాలకు దూరంగా ఉంటారు.
    ఆధ్యాత్మిక ప్రచురణను విశ్లేషించుకోవటం మోక్షమార్గాన్వేషి చేసే తపస్సు.
    ఫలితం అతని పరిపక్వతమీద ఆధారపడియుంటుంది.
    మరి ఈ బ్లాగులన్నీ అంతర్జాలం లో వుంటాయి.
    అంతర్జాలం రత్నాకరమే మరి.
    అయితే ఈ అంతర్జాలరత్నాకరం..పరమాత్మునిలా ఆద్యంతములులేనిది..
    శర్మవారూ ఇందులో తప్పులుంటే మన్నించండి.

    ReplyDelete