Friday 28 February 2020

వీరణము లేని పెండ్లి


కారణము లేని నగవును,

బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో

బూరణము లేని బూరెయు,

వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ

ప్రపంచంలో కారణం లేని నవ్వు, బేరణము అనగా కంచుకము అనగా రైక లేని స్త్రీ, ఫూరణము లేని బూరె, వీరణము లేని పెళ్ళి వృధా అని కవి గారి భావం

కారణము లేని నగవు ఉండదు. పాపం ద్రౌపది మీద, అకారణంగా నవ్వి ఒక పెద్ద యుద్ధానికి నాంది పలికిందనే అభాండం వేసేసింది, లోకం. కాని నిజానికి ద్రౌపది నవ్వు యుద్ధానికి కారణం కానే కాదు. దుర్యోధనుడు తన తండ్రితో ఏకాంతంలో చెప్పుకున్నమాట. తండ్రీ  పాండవులకు మయుడు నిర్మించి ఇచ్చిన భవన సోయగాలు చూస్తుండగా జరిగినదిది. 

నిర్మల స్ఫటిక శిలా నిర్మితంబై……………………….జలబుద్ధింజేసి బరిధానోత్కరణంబు సేసి విమలశిలాతలబుద్ధి నుదకపూర్ణంబున వాపి సొచ్చి కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుంజూచి వృకోదరుండు నగియె. దానినంతయు నెఱింగి ధర్మరాజచోదితులైన కింకరులు నాకు పరిధానంబు దెచ్చి యిచ్చిరి మఱియు……..యనేక సహస్ర విలాసినీపరివృతయయి యున్న ద్రౌపది నగియె నంత నకుల సహదేవులు పఱతెంచి యిదె వాకిలి ఇట వచ్చునది యని నన్నుం దోడ్కొనిపోయిరట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యంబయి యున్నయది.” సభా .ఆశా2….140

''స్పటిశిలామయమైన ప్రదేశంలో నీరుందనుకుని పంచె ఎగగట్టేను, మరోచోట మామూలు ప్రదేశమని కాలేస్తే నీటితో పంచె తడిసింది, అది చూచి భీముడు నవ్వేడు. అంతా తెలిసిన ధర్మరాజు సేవకులతో పొడిబట్టలు పంపేడు. తరవాత అనేకవేల చెలికత్తెలతో ఉన్న ద్రౌపది నవ్వింది అని చెప్పుకున్నాడు''.

నిజానికి దుర్యోధనుని బాధించినది భీముని నవ్వే. సందర్భంగా నవ్వినవారంతా సహజంగా వచ్చిన నవ్వును ఆపుకోలేకపోయినవారే! ఇక కారణం లేని నవ్వు నవ్వేవారు ఇద్దరేఒకరు పిచ్చివారు, రెండవవారు యోగులు.వారి నవ్వుకు కారణం మనకు తెలియదు,వారు చెప్పరు. మనం ఇద్దరికోవకీ చెందం, అందుకు కారణం లేని నవ్వు లేదనీ  కవిగారినమ్మకంకాని నేటి కాలానికి వెకిలి నవ్వులే కనపడుతున్నాయి. వికటాట్ట హాసం దీనికి కొంచం తక్కువ అట్టహాసం దానికంటే తక్కువది హాసం. తరవాతది oదహాసం చివరిది స్మితం. ఎంత తేడా! కారణం లేని నవ్వు లేదు ఉండదు అన్నది కవి హృదయం.


బేరణము లేని లేమ. బేరణము అనగా కంచుకము. అనగా నేటి బ్రా అనొచ్చుననుకుంటా. బహుశః నేటి బ్రా పదం ఆనాటి బేరణం నుంచి పుట్టిందే కావచ్చు. నాటి కంచుకము కూడా నేటి బ్రాలాగే ఒక గుడ్డ ముక్క రెండు స్థనాలని కప్పి ఉంచేది, ఇది భారతీయ, రోమన్ తదితర సంస్కృతులలో  చిత్రాలలో కనపడుతుంది. అందమైన స్త్రీకి బేరణము లేకపోవడం కవిగారికి నచ్చలేదు. నేటి కాలంలో టూ పీస్ లు కట్టుకున్నవారే జాతి చిహ్నాలుగా గుర్తింపబడుతున్నరోజులు. రోజులిలా మారతాయని కవిగారూహించి ఉండరు.  బేరణము లేని స్త్రీ ఉండదయ్యా అని కవి భావం.


వీరణము లేని పెళ్ళి. పెళ్ళంటే పందిళ్ళు, సందిళ్ళు,సందళ్ళు,తాళాలు, తలంబ్రాలూ. మూడే ముళ్ళు ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్ళూ అని ఒక సినిమా కవిగారి మాట. ఎవరిమాటైనా నిజం నిజమేకదా!

ఐతే పెళ్ళికి రెండు ముఖ్యం. ఒకటి కాగడా,రెండవది వీరణం.మరో ముఖ్యమైనది మామిడాకు తోరణంవీరణం అనేది ఒక వాద్యం. దీనిని ఎక్కువగా శివాలయాలలో ఉపయోగిస్తారు. వీరణం వాయిస్తే నరాలు ఉప్పొంగుతాయి. ఒక ఆవేశం ఆవహిస్తుంది. ఒకప్పుడు రణానికి సిద్ధమయ్యే సందర్భంలో  వీరణం వాయించేవారుకారణము,వీరణము,రణము,మరణము చూడండి అన్ని దగ్గర దగ్గరగా పోలిన మాటలే. మరి పెళ్ళికి వీరణం ఎందుకూ? పెళ్ళి అనే రణం లోకి దూకుతున్న ఇద్దరు స్త్రీ పురుషులు ఆవేశం కోసం వాయించేదనుకుంటా :) వీర శైవులు వాద్యాన్ని వాడుతున్నట్టే ఉంది. ఆంధ్రలో వీరభద్రుడిని కొలిచే ఆచారం ఉంది,అన్ని కులాలవారూ. వీరభద్రుని సంబరంలో వీరణం తప్పనిసరిగా ఉంటుంది. వీరణం వింటారా? లింక్ లో వినండి.


https://youtu.be/fLBfmWEGnu8


పూరణము లేని బూరె...బూరె కి పెళ్ళికి లింకూ. పెళ్ళి కాని ఆడపిల్ల కనపడితే ''బూరిముక్కెప్పుడు పెట్టిస్తావ్'' అని అడగడం మామూలు. బూరిముక్కెట్టడమంటే పెళ్ళి కావడం. నీ పెళ్ళెప్పుడూ అని తిన్నగా అడగక ఇలా డొంక తిరుగుడుగా అంటే అన్యాపదేశంగా అడుగుతారనమాట. ఇప్పుడీ ముచ్చట్లూ లేవు లెండి.వాళ్ళ పెళ్ళెప్పుడో వాళ్ళకే తెలీదూ.ఆవేశం రావాలిగా. వీరణం మోగాలిగా. బూరి ముక్కనడం అలవాటూ. బూరి అన్నది ఒక విలక్షణమైన పిండివంట.శనగపప్పు ఉడకబెట్టి రుబ్బి మెత్తగాచేసి దానిలో కోరిన బెల్లం కలిపి ఉండలుగా చేస్తారు. ఇలా శనగపప్పు ఉడికించిన పిండి,బెల్లం, యాలకు పొడి కలిపిన దానినే పూర్ణం అంటారు. వాటిని తోపు పిండిలో ముంచి ( దీనికి మైదా వాడతారు) నూనెలో వేయిస్తే....తినడం మజా. బూరి తినడానికో ప్రోటోకోల్. అలా తింటేనే బాగుంటుంది. బూరికి చిల్లు పెట్టాలి,దాని నిండా కరిగిన నెయ్యి పొయ్యాలి, పక్కకి కారినా ఫరవాలేదూ. అలా నేతిలో ములిగిన బూరి ముక్కని తుంచుకుని తింటే నా రాజా....ఏమని చెప్పుదుమరింతటి బూరిలో అత్యవసరమైన పూరణం లేకపోతే? అసలది బూరి అవుతుందా...వ్యర్ధం,వ్యర్ధం,వ్యర్ధం......

చివరిగా కవిగారి మాటేంటంటే కారణం లేని నవ్వు, బ్రాలేని స్త్రీ, పూరణం లేని బూరె, వీరణం లేని పెళ్ళి ఉండవంటారు.


మొన్నో చిత్రం చూశానూ! అమ్మాయికి అబ్బాయికి వివాహానికి తాంబూలాలు కార్యక్రమం, ఒక ఫోన్ లో వాట్సాప్ లో అమ్మాయి,అమెరికా నుంచీ, మరొక , మరో పీటమీద ఫోన్లో అబ్బాయి వాటాప్ లో ఉండగా తాంబూలాల కార్యక్రమం నడిచింది. అమ్మాయి  కనపడుతున్న ఫోన్ మీద ఆమెకు బట్టలు పెట్టేరు, మెడలో వేసినట్టు. అల్లాగే అబ్బాయికి చేసేరు. మరి పెళ్ళి కూడా ఇలాగే చేసుకుంటే కాపరమెక్కడా అని బుగ్గలు నొక్కుకుంటున్నారు, చూసినవారు.  

కవిగారికి నమోన్నమః

1 comment:

  1. https://www.youtube.com/watch?v=Mq8LnO-RRaE
    veeranam ante idi kabosu sir,

    ReplyDelete