Friday 9 December 2016

బంగారం

బంగారం చలామణీ....

మొన్న మా వెంకటేశం కనబడ్డాడు. అబ్బో! బాగ ఎదిగిపోయాడు, ఉపన్యాసాలూ ఇస్తున్నాట్ట. ఖాళీ గా ఉన్నా కదా, ఏదేనా ఒక విషయం మీద ఉపన్యాసం ఇమ్మంటేనో అనుకుని ”ఏం వాయ్! వేంకటేశం ఏంటి సంగతులు” అన్నా! దానికోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు ఇలా చెప్పేడు.

మా గురువుగారెప్పుడో The eleven causes for the degeneration of India లో చెప్పేరు ”భారద్దేశంలో ఆర్ధిక సంస్కరణలేవీ పని చెయ్యవూ" అని, మీరెవరూ వినరు. మేథావులనీ దేశం ఎప్పుడు గుర్తించింది గనక...

బంగారం తో అనుబంధం, కోరిక భారతీయులకు ఈనాటిదా? పురాణ కాలం నాటిది కదూ? భారతీయ మహిళకీ బంగారానికి విడతీయలేని అనుబంధం. చిన్నమెత్తు బంగారం కూడా లేని భారతీయ మహిళ కనపడితేనే విచిత్రం.

ఇదెందుగ్గాని, నేడు బంగారమే మళ్ళీ అక్కరకొచ్చింది కదా! చలామణీ కి. బంగారాన్ని నాణేలుగా వేయడం ఈ నాటి అలవాటేం కాదు. ఇప్పుడైతే అరగ్రాము,గ్రాము,రెండు గ్రాములు,మూడు గ్రాములు, ఐదు గ్రాములు, పదిగ్రాముల నాణేలు బాగా దొరుకుతున్నాయి, చలామణీలో ఉన్నాయి. ఇదెందుకో తెలుసా? ఒకప్పుడు పచ్చనోటు చేతిలో పడితేగాని పనయ్యేది కాదు, కాలం మారి అది ఎర్రనోటు స్థాయికి పెరిగింది. ఇప్పుడేమో ఎర్రనోటు చిత్తుకాయితమైపోయింది. ”ఇరుసున కందెనబెట్టక పరమేశుని బండియైన బారదు సుమతీ” అన్న మాట ఉన్నదే! ఎప్పటికి చెక్కుచెదరని దుందిగదా! ఇప్పుడక్కరకొచ్చింది పసిడి. అరగ్రాము పదేనువందలు, అమ్మేవాడు చిల్లర ఇబ్బందిలేకుండా రెండు వేల నోటు తీసుకుంటున్నాడు, చూశావా ఎంత సౌకర్యమో! దీన్నిలాగే పట్టుకుపోతే! పనెంత క్షణాల మీదైపోలా! ఇప్పుడు పుచ్చుకునేవాడిదే కావాలంటున్నాడు, ఎందుకో తెలుసా! ఎ.సి.బి వాళ్ళ భయంలేదు, దాచుకోడానికి పేంటుకు దొంగజేబులు కూడా కుట్టించేసేరు, కొత్తగా, లేదా డెస్క్ లో కాయితాలో పారేస్తే పరమేశ్వరుడు కూడా పట్టుకోలేడు. విలువా పెరిగింది కదూ అద్దిరబన్న! బాగుందోయ్ బాగుంది.


నువ్వేదో నల్లధనం వగైరా అంటున్నవుగాని దానికి ఓ మంచిపేరుందిగదా! అదే ”సమాంతర ఆర్దిక వ్యవస్థ” ఇప్పుడిందులో చెల్లుబాటూ, చెల్లింపులూ అంతా బంగారమే, దీనికీ హవాలా పుట్టేసింది.
''మనదేశంలో ఆర్ధిక సంస్కరణలా? చాల్లేవోయ్!మనవాళ్ళంతా మేథావులోయ్'' అంటూ వెళిపోయాడు, మా వెంకటేశం

3 comments:

  1. హహహహ్... బాగుంది మాస్టారు వెంకటేషం గారి ధోరణి.

    ReplyDelete
  2. హహహహ్... బాగుంది మాస్టారు వెంకటేషం గారి ధోరణి.

    ReplyDelete
    Replies

    1. Ennelaగారు,

      మా వేంకటేశం పెద్దాడై పోయాడండి, గురువును మించిన శిష్యుడయ్యాడు :)
      ధన్యవాదాలు.

      Delete