నేటి అంతర్జాతీయ రాజకీయాలు.
(నిన్నటి తరువాయి)
ఈ నవెర్రో అనే అమెరికావాసి, ట్రంప్ గారు, అరెరె! తప్పుజేసి రెండు దేశాలని వ్యాపారంలో చైనాకి వదులుకున్నానే అనుకుంటున్నా, మెత్తబడినా, ఈయన ఇంకామాటల ఈటెలు విసురుతూనే వున్నారు. రెండు దేశాల సంబంధాలూ పూర్తిగా బెడిసికొట్టేలాగా. పాపం ఆయనకు ఇంత చిత్త విభ్రమం కలగడానికి కారణం భారత్ ఆయనతో సమానంగా వాక్కలహంలో దిగకపోవడం. ఆయన మాత్రం కలహంలో పల్లెటూరి స్త్రీలా రెచ్చిపోతూనే ఉన్నారు.
ఇక రెండో పక్క చూదాం. ముగ్గురు ఆసియావాసులు,బలమైన దేశాలు ఒకటైతే తన ఉనికికే ప్రమాదమన్నది అమెరికా బాధ,అర్ధం చేసుకోవచ్చు. కాని రష్యా,భారత్,చైనాలు ఒకమాటమీదకొస్తే చాలా ప్రమాదం, అందుకుగాను మిత్ర భేదం కొసం అమెరికా ప్రయత్నించడం సర్వ సహజం. భారత్,చైనా సంబంధాలు అంత సవ్యం లేకపోవడం కారణం. మొన్నటి బంధం, ప్రస్తుతం ఒక ఇబ్బందిని గట్టెకేందుకు చైనా,భారత్ లు తీసుకున్న నిర్ణయం. ఇది ఇతర రంగాలకు కూడా పాకి మిత్రత్వం చొరబడితే, రష్యా,చైనా,భారత్ లని మించగల శక్తి భూమి మీద లేదు.కాని ఇది సాధ్యమా అన్నదే కొచ్చను.
నేపాల్ లో ఖాట్మండూ మేయర్ ని అమెరికా రాయబారి కలసిన తరవాత,దేశంలో అవినీతి పేరిట యువత అల్లర్లు,సోషల్ మీడియా బేన్,కొద్ది సేపటికే బేన్ రద్దు,వామపక్ష ప్రధాని శర్మఓలి రాజీనామా,తదుపరి, సుప్రీం కోర్ట్,పార్లమెంటును తగలబెట్టిన యువత, ముఖ్యుల ఇళ్ళను తగలబెట్టిన యువత,మొత్తం మీద 19 మంది మరణం. అర్ధమవుతోందా! నిద్రపోకండి. అనూహ్యంగా శాంతికోసం సైన్యం విజ్ఞప్తి.
అమెరికన్ డీప్ స్టేట్ తనపని మొదలెట్టింది. తరవాత కత వెండి తెరపై చూడచ్చు. భారత్ బహు పరాక్! అందోళనలు లేవదీసేవారిని ఒకకంట కనిపెట్టండి.
చౌయన్ లై -నెహ్రూ లు కలసి హిందీ చీనీ భాయ్,భాయ్ అని హోరెత్తించి,పంచశీలని ఊదరగొట్టి, భారత్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్రగలది చైనా. నేటికిన్ని సరిహద్దులు కొన్ని చోట్ల నిర్వచింపబడలేదు. పాక్ తను ఆక్రమించిన కాశ్మీర్ లో కొంత భాగం చైనా కి ధారదత్తం చేసింది, 1962 లో జరిగిన యుద్ధం లో కొంత భాగం ఆక్రమించుకుంది. నెహ్రూ గారు ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవదని శలవిచ్చారు,నాటి పార్లమెంటులో. నిన్నమొన్న సరిహద్దులలో ఆక్రమణ దానిపై సైనిక చర్య జరిగింది.
ఆనాటి నుంచి యుద్ధం లేదంటారు గాని నిత్య కలహం తప్పలేదు.పంచ శీలలో మొదటిది, మరో దేశం ఆక్రమించకూడదు,రెండు, అంతర్గత వ్యావహారాలలో జోక్యం కూడదు. కాని ఈ రెండు శీలలే మొదట ఊడిపోయాయి. పాపం నెహ్రూగారు ఈ బెంగతోనే కాలం చేసేరు. ఇందిరా గాంధీ అధికారంలో కొచ్చిన తరవాత భారత్ లో వీరి అనుచరులు చర్యలకు పట్టపగ్గాలే లేకపోయాయి. నేటికీ సాయుధంగా ప్రభుత్వంపైన దాడి చేసేవారు కొందరు కొనసాగుతూనే ఉన్నారు. అంతేనా మరో రకం అర్బన్ నక్సల్స్ కోర్టులలో కూడా కొనసాగాలని చూస్తున్నారు,నక్సల్ అభిమానులు రాజకీయపదవులకూ ఎగబాకాలనుకుంటున్నారు. ఈ దేశంతో స్నేహం కొనసాగేనా? అనుమానమే! ఇది అవసర స్నేహం కావచ్చు. నమ్మదగిన స్నేహం కాదేమో!!
ఈ దేశం తమదేశం నుంచి కారకోరం ద్వారా రోడ్డు నిర్మించి గిల్గిట్ చేరింది. అక్కడనుంచి ఆరోడ్డును గ్వాదర్ రేవుకు చేర్చి దాని ద్వారా యూరప్,ఇతరదేశాలతో వ్యాపారం చేయాలని చైనా ఊహ,అంతేకాదు అరేబియా సముద్రం ప్రాంతాలపై ఆధిపత్యం సాగించాలని కోరిక . ఐతే ఈ రోడ్డు బలూచిస్థాన్ ద్వారా గ్వాదర్ చేరాలి. స్వతంత్ర పిపాసులైన బలూచ్ లు దానిని అడ్డుకుంటున్నారు. జరిగేలా లేదు. ఈ రోడ్డు పని చైనా ప్రస్థుతం ఆపేసింది. చైనా ఎప్పుడూ పాక్ తో కలసి భారత్ నాశనం కోరుకున్నదే,మొన్న జరిగిన దానితో సహా!ఎప్పుడూ భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు సహాయం అందించినదే! ఈ దేశానికున్న మరో కోరిక చైనా నుంచి భూటాన్ ప్రాంతం ద్వారా చిన్నదైన చికెన్ నెక్ ప్రాంతాన్ని ఆక్రమించి బంగ్లాదేశ్ ద్వారా చిటకాంగ్ చేరి వ్యాపారానికి ఉపయోగించుకోవాలని కోరిక. ఇదే పాపం బంగ్లా దేశపు యూనిస్ చైనాకి చెప్పింది. ఇదే చైనా ప్లాన్,బంగ్లా ప్లాన్, ఇప్పుడు పాక్ కూడా దీనికి వంత పాడుతోంది. షర్జీల్ ఇమాం చెప్పిన పథకం ఇదే! అసోం ముఖ్యమంత్రి ఒక చికెన్ నెక్ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే రెండు చికెన్ నెక్ లున్నాయి,మీకు. దాంతో మీరు ఖతం,ఒళ్ళు జాగర్తపెట్టుకోండని హెచ్చరిక చేసేరు. బంగాళాఖాతం ప్రాంతాన్ని తన నౌకా బలం ద్వారా అధికారం చేయాల నీ కోరిక.
ఈ సందర్భంగా ఒక కత,భారతం నుంచి, చిన్నదిగా చెబుతున్నాను.భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. ఈ కత నేటి రాజకీయాలకి సరిపోతుందా ఆలోచించండి.
అడవిలో ఒక చెట్టుకింద బొరియలో ఒక ఎలక నివాసం. ఆ చెట్టుపైన ఒక పిల్లి నివాసం, మరో కొమ్మన గుడ్లగూబ నివాసం. రోజులు గడుపుతుండగా ఒక రోజు వేటగాడు తన కుక్కలతో వచ్చి,పిల్లికోసం ఒక వల పన్ని పోయాడు. వేటకి వెళ్ళిన పిల్లి వస్తూ వలలో చిక్కుకుంది. చిక్కులు తొలగించుకోవాలనుకున్నకొద్దీ ఎక్కువ అవుతున్నాయి. అరుస్తోంది,సహాయం కోసం. ఈ లోగా ఎలుక బయటకుపోయినది తిరిగొస్తూ పిల్లిని వలలో చూసింది. పిల్లి ఎలుకను పిలిచి చాలాకాలంగా మనం పక్కపక్కల ఉంటున్నాం. ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను. వలకొరికి నన్ను రక్షించు, ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటానని మాటిచ్చింది. ఎలుక ఆలోచించి పిల్లిని నమ్మచ్చా! ఇప్పుడు ఆపదలో ఉంది కనక ఇలా అంటోంది,ఆపద గడిస్తే మీద పడదా! అని ఆలోచిస్తుంటే పిల్లి ఎలక ఆలోచన పసికట్టి అటువంటి అనుమానాలు పెట్టుకోకని బతిమాలుతూ ఉంది. చెట్టు మీద గుడ్లగూబ ఇది చూస్తూ వీళ్ళిద్దరూ స్నేహితులైపోతున్నారా? ఎలకని ఎప్పటికైనా మింగుదామనుకున్న నాది కలేనా,చూదాం అనుకుంటూ ఉండగా, ఎలుక వలకొరకుతాననీ చెప్పలేదు,కొరకననీ చెప్పలేదు, వలచుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తోంది. పిల్లికి గాభరా పెరిగిపోయింది, వేటగాడు వస్తున్నాడు, కుక్కల అరుపులు వినపడుతున్నాయి, వలకొరుకు, నన్ను రక్షించు అని తొందరపెట్టింది. వేటగాడు కనుచూపు మేర కనపడగానే ఎలుక వల కొరకడం మొదలెట్టింది. కొద్దిదూరంలో వేటగాడుండగా వల పూర్తిగా కొరికేసింది, పిల్లి బతికేను జీవుడా అనుకుంటూ చెట్టెక్కేసింది, ఎలుక బొరియలొకి పారిపోయింది. జరుగుతున్నది చూస్తున్న గూబ నిరాశపడిపోయింది.
అంటే నమ్మదగిన మిత్రుడు రష్యా,అమెరికా,చైనా ఇద్దరూ ఒకలాటివారే. ఇద్దరూ స్వార్థపరులే ఆక్రమ ణదారులే. వ్యాపారంతో ఆక్రమణ చేయాలని అమెరికా,భూభాగం ఆక్రమించాలని చైనా పన్నాగాలు. భారత్ కి ఎప్పటికీ అలీనవిధానమే మంచిది. యూరప్ తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదరబోతోందని చాలామంది చంకలు గుద్దుకుంటున్నారు. ఎవరిమీదా అతిగా ఆధారపడకూడదు. అరాచక చర్యలన్నిటికీ మూలం యూరప్,ఎవరినీ నమ్మద్దు. వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే! పేకాట పేకాటే పెద్దన్న పెద్దన్నే! అదీ సంగతి
శలవు.