తీర్థానికి వెళ్ళొచ్చా!
తీర్ధoలోకి వెళ్ళె ముందు ఒక చిన్న మాట.
మళ్ళీ సంవత్సరమేమో మనమేమో అని ఒకసారి తీర్థం చూసిరావాలనుకున్నా
ఈ ఊరువచ్చింది మొదలు తీర్ధం చూస్తూనే ఉన్నా. భోగినాడు ఉదయమే అమ్మను దర్శించడం ఆనవాయితీ,కాని తీర్ధానికి వెళ్ళాలంటే దీపాలు పెట్టేకానే వెళ్ళాలి,అందుకు సంక్రాంతి రోజు సాయంత్రం వెళ్ళడానికి ముందుగా కోడలమ్మాయికి చెప్పేను. అబ్బాయికి చెప్పినట్టుంది, ఎప్పుడు వెళదాం తీర్థానికని అడిగాడు. సంక్రాంతిరోజు రాత్రి 6 దాటాకా అనడంతో నా తీర్థానికి ప్రయాణం నిశ్చయమయింది. నా చిన్నకొడుకు ఇప్పుడు నువ్వు తీర్థానికి వెళ్ళకపోతే నష్టమేం లేదు,జనంలో నడవలేవని విసుక్కోలేదు. బండి మీద తీసుకెళ్ళి తీసుకొస్తా,భయము లేదని చెప్పి ఒప్పించాడు.
ఎక్కడికి ఒకడినే వెళ్ళే సాహసం చెయ్యడం మానేసి చాలాకాలమయింది,పిల్లలతోడు అవసరమూ అయింది. బయలుదేరాలంటే ముందు కోడలమ్మాయి స్వెట్టరు తొడికి మంకీ కేప్ పెట్టి కర్ర చేతికిచ్చి తయారుచేసి బండెక్కించింది. బండి ఎక్కడ పెట్టాలో వగైరా చెప్పబోతుంటే నేను చెబుతారండి అనేసేడు. నాకేమో, వాడు చిన్నపిల్లాడిలా కనపడతాడు. వాడేమో ఏభైదాటి లోకం చూస్తున్నవాడు. అన్నీ తెలుసని వాడనుకుంటే చిన్నపిల్లాడు ఏమీ తెలియనివాడని నేననుకుంటా ఇక్కడొస్తుంది తేడా కాలం మారిందన్న విషయం మరచిపోతుంటా,పిల్లల దగ్గర.
అలా తీర్ధాని చేరి దూరంగా భద్రంగా ఉండే చోట బండి పెట్టేకా నా కర్రతో నా నడక తీర్థంలోకి మొదలయింది. జనం,ఒకటే జనం. అదేమో 100 అడుగులరోడ్డు రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి-కాకినాడ కాలగట్టు రోడ్డు దాకా ఒక కిలో మీటర్ పొడుగు, దానిలో ఈ తీర్థం. ఎల్.ఇ.డి దీపాలతో తీర్థం వెలిగిపోతోంది. లోపలికి అడుగెట్టగానే గుండెలవిసేలా డి.జె సౌండు, గుండెలు పట్టేసినట్టయింది. గబగబా ఆ ప్రదేశం నుంచి కదలిపోయా,ముందుకు.,జనంలో.
అమ్మగారబ్బాయి.
గ్రామ దేవత వీరుళ్ళమ్మ
కత్తి చేతితో దొరికిందట,మ్మఅందుకు వీరులమ్మ
( వీరుల తల్లి) అని నామకరణం చేసేరు. ఆ తరవాత అదికాస్తా వీరుళ్ళమ్మ ఐపోయింది. ఇది ఒకప్పటి ఫోటో,నేడు గుడి చాలా అభివృద్ధి చేసేరు. అమ్మను మొన్న భోగిరోజు ఉదయమే దర్శించి వచ్చా..
మా (స్లోగన్)నినాదం అందరూ బాగుండాలి,అందులో మనముండాలి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే.
ఈ సారి గాజు సామాను కొట్లు,పింగాణీ సామాను కొట్లు ఎక్కువ వచ్చాయి.
తీర్థంలో అడుగెట్టగానే ఛాట్ మసాలా వాసన గుప్పున కొట్టింది. తీర్థంలో పానీ పూరి,ఇతర తినుబండారాల కొట్లే ఎక్కువ కనపడ్డాయి. అక్కడే జనం ఉన్నారు.
జైశ్రీరాం జండాలు బాగానే అమ్ముడుపోతున్నాయి.ఒకటి కొన్నా!
బతికి ఉన్న త్రాచునే మెడలో వేయించుకుందో అమ్మాయి. ఫోటో తీసేలోపు తీసేసింది. నీ ధైర్యానికి మెచ్చే, అని చెప్పేను. భర్త అనుకుంటా ఆ తరవాత ఆముదం తాగినవాడిలా మొహం పెట్టి పామును మెడలో వేయించుకున్నాడు,తాను భయపదటం లేదని. నేను ఆ అమ్మాయిని ప్రశంస చేస్తుంటే జనం మూగేసేరు,చుట్టూ. ఈ సందర్భంగా ఒక శ్లోకం గుర్తొచ్చింది.
స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.
మగవాడితో పోలిస్తే స్త్రీలు ఆహారం రెట్టింపు తీసుకుంటారు, తెలివి నాలుగురెట్లు, ఆరు రెట్లు సాహసం, కామం ఎనిమిదిరెట్లు ఉంటుందని చెబుతున్నారు పెద్దలు.
పచ్చబొట్టు వేసేవాళ్ళు ఇద్దరు కనపడ్డారుగాని,వేయించుకునేవాళ్ళే కనపడలేదు. కిందటి సారి ఇల్లాలితో వచ్చినపుడు జరిగిన సంభాషణ గుర్తొచ్చి మనసు చేదు తిన్నట్టయింది
వాచీల కొట్టు. ఇంకా వాచీ పెట్టుకునేవాళ్ళు ఉన్నారా అనుకున్నా ఏదైనా 150, కొంటున్నారు. రెండు కొట్లు కనపడ్డాయి.
కాలవగట్టు రోడ్డు,మైన్రోడ్డు కలిసేదగ్గర వెలసిన రాజరాజేశ్వరీ దేవి. వీరుళ్ళమ్మ,రాజరాజేశ్వరీ దేవిల ఆలయాల మధ్య ఈ తీర్థం. ఇద్దరమ్మల కాపు.
మెత్తటి రాయి (సోప్ స్టోన్) తో తయారు చేసిన పిల్లల ఆటవస్తువులు,రుబురోళ్ళు,వగైరా
జీళ్ళు,ఖర్జూరం కొట్లు తక్కువగానే ఉన్నాయి,రెండో మూడో కనపడ్డాయి.
జనంలో నడవడమే కష్టమయింది. ఎక్కువ ఫోటో లు తీయలేకపోయా.మొత్తానికి స్త్రీల అలంకరణ సామాను,పిల్లల ఆటబొమ్మల కొట్లు ఎక్కువ. జయింట్ వీల్ ఉన్నవైపు పోలేదు. ఇక్కడికే నీరసమొచ్చింది. దేవి సెంటర్ లో గుడి పక్క క్రీనీడలో నిలిచాడొక ఎస్.ఐ గారు,నీరసం మొహాన కొట్టినట్టు కనపడుతూనే ఉంది. భోజనం చేసేరా? అడిగా, లేదు, అన్నాడు. అయ్యో! అని, కేరేజి తెప్పించుకోవచ్చుగా ఇంటినుంచి అన్నా! భోజనం చేయడం కుదరదండి, ఈ మూడు రోజులూ ఇంతే,టిఫిన్ తోనే కాలం గడపాలన్నాడు. దగ్గరేం లేకపోయింది,తినడానికి ఇవ్వడానికి. పాపం! పోలీస్ జీవితం ఇంతేనా అనిపించింది.









ఒకప్పుడు తీర్థంలో మాత్రమే కనిపించే కొన్ని రకాల బొమ్మలు, వస్తువులు, ఆటలు, ఇప్పుడు ప్రతీ షాప్ లోనూ కనపడడంతో తీర్థాలకి ఆదరణ తగ్గుతుందేమో అని నా అనుమానం... ఏది ఏమైనా తీర్థం చూడాలన్న మీ కోరిక తీరడం వెనుక మీ కోడలమ్మాయి సహకారం తప్పక ఉంది.
ReplyDelete