Thursday, 22 January 2026

రోగం రొష్టు-సంసారం గుట్టు

 రోగం రొష్టు-సంసారం గుట్టు


ఇదొక నానుడి,నాటికాలందే కాదు నేటికాలందీనూ!

 రోగం రొష్టు

ఏం? ఎందుకూ కదా కొచ్చను. నాటికాలంలో వైద్య సహాయం తక్కువ,కావల్సినవారందరికి కబుర్లు చేసి మరీ చెప్పుకునేవారు,ఉత్తరాలూ రాసుకునేవారు. మీ అల్లుడికి జ్వరం ఎంతకీ తగ్గటం లేదు,వైద్యం దారి వైద్యందే జ్వరందారి జ్వరందేలాగా ఉందీ అని, అటునించి  ఈ మాత్రలువాడి చూడు అని మనిషిచేత పంపడమో,ఉత్తరం రాయడమో చేసేవారు. ఇందుకోసం రోగం రొస్టు. నాటి రోజుల్లో జబ్బులు కూడా చెప్పుకునేవే ఉండేవి.   నేడు డాక్టర్ దగ్గరకెళితే చాంతాడంత టెస్టులు రాసి చేయించుకురా అని పంపితే అవి పూర్తయ్యేటప్పటికే వారం పడుతుందిలా ఉంది. ఇక వైద్యం సంగతి చెప్పేదేలేదు. మరెవరితోనైనా చెప్పుకుంటే, ఆయన దగ్గరకెందుకెళ్ళేరు, ఈయన  దగ్గరకెళ్ళలేకపోయారా? ఇలా సలహాలిస్తే వెళ్ళిన ప్రతి డాక్టరూ టెస్టులు రాస్తే,చేయించేమని చెప్పినా మళ్ళీ చేయించాల్సిందేనంటే చద్దికంటే ఊరగాయి ఎక్కువైన చందమైపోయింది,నేటి వైద్యం. అబ్బే! అమెరికా తీసుకెళ్ళలేకపోయారా? అమెరికాలో వాళ్ళు వైద్యం గొప్పగా చేసినా అక్కడివాళ్ళు ఎందుకు చస్తున్నట్టు? ఇదికదా కొచ్చను. అంచేత నేడు రోగం గుట్టైయింది. ఇప్పుడు చెప్పుకునే రోగాలూ రావటం లేదేమో!  ఇక దేశంలో కూడా సెకండ్ ఒపీనియన్ వైద్య శాలలు వెలిసాయి.వీరు వైద్యం చెయ్యరు. టెస్టులు చేసి అన్నీ  రోగ నిర్ణయంచేసి చెబుతారు.పాత వైద్యం తాలూకు రికార్డ్ ఇవ్వక్కరలేదు.  టెస్టులలో తేడా పాడా ఉండదనీ,రోగనిర్ణయం కచ్చితాంగా చేస్తామనీ చెప్పుకుంటారు.పంపించేస్తారు. ఆ తరవాత రోగి ఇష్టం.   


ఇక సంసారం గుట్టు. 

సంసారంలో అనేక ఇబ్బందులుంటాయి. పెళ్ళాం గయ్యాళి కావచ్చు,లేదా మేదకురాలు కావచ్చు. అలాగే మొగుడున్నూ! పిల్లలు చెప్పినమాట  వినకపోవచ్చు. ఈడొచ్చిన పిల్ల ప్రేమలో పడచ్చు. ఇలా ఉంటాయి. లేదా డబ్బు ఇబ్బందులూ,రాబడి తక్కువా,ఇలా అనేకం.   బయట చెప్పుకునేవా?  అమ్మా! మా ఆయన ఎందుకూ పనికిరాడే, అందుకూ పనికిరాడే  అని పాటికేళ్ళు సంసారం చేసినామె తల్లితొ చెప్పుకుంటే,తల్లి మాత్రం ఏం చేయగలదు? చులకన కావడం తప్పించి. అందుకే పెద్దలు


ఆయుర్విత్తం గృహఛ్ఛిద్రం 

మంత్రమౌషధ సంగమౌ 

దానమానావమానశ్చ

నవగోప్యా మనీషిభిః 


వయసు,సాంసారంలోని ఇబ్బందులు,మంత్ర,తీసుకునే మందు,స్త్రీ పురుష సంగమం,దానం,మానం,అవమానం ఈ తొమ్మిదీ గుట్టురా బాబూ అన్నారు. ఆపై మీచిత్తం.  ఇప్పుడంతా పబ్లీకున చెప్పుకునేవే అంటారా?అంతా ట్రాన్స్పరెన్సీ అంటారా? తమ చిత్తం.    

No comments:

Post a Comment