తోలు తిత్తి ఇది
తోలు తిత్తి ఇది
తూటులు తొమ్మిది
తుస్సుమన ఖాయం
జీవా తెలుసుకో
అపాయం! అపాయం!!
పదోది మరిచిపోయారు గురువా!
తోలు తిత్తి ఇది
తోలు తిత్తి ఇది
తూటులు తొమ్మిది
తుస్సుమన ఖాయం
జీవా తెలుసుకో
అపాయం! అపాయం!!
పదోది మరిచిపోయారు గురువా!
I chatter
I chatter, chatter as I flow
To join the brimming river
For, men may come and men may go
But I go on forever
Lord Tennyson.
The Brook says
I whisper, murmur, speak, talk, weep and cry, with people who have come across. They come to me with a purpose. Leave me after the purpose is served. I am lone and alone to move on to eternity.
చూడమని చేతికిస్తే సుక్కురారమని ఇంట్లో పెట్టుకుంది.
ఇదో నానుడి, పల్లెలలో చెప్పుకుంటాం.ఓ బుల్లి కత చెప్పుకుందాం.
అనగనగా ఒక పల్లె, అందులో ఒక పేదరాలు.జన్మలో బంగారపు ఆభరణం చేయించుకోలేదు. పెళ్ళప్పుడే మొగుడు మావిడాకు మడిచి పుస్తి కట్టేడు. ఆ తరవాత పసుపుకొమ్ము కట్టుకుంది. ఆవిడకో కోరిక, జీవితంలో, ఒక మంచి నగ చేయించుకోవాలని. చాలాకాలం తరవాత ఒక నగ చేయించేడు,పోరగా,పోరగా మొగుడు.ఇరుగు పొరుగులకి చూపించుకుంది. అంతా బాగుంది,బాగుందన్నారు, సంబరపడింది. పక్క వీధిలో ఉన్న దూరపు బంధువు, కలిగినది, ఒంటి నిండా ఆభరణాలతోనే ఉంటుందెప్పుడూ, ఆవిడ ఇంటి కెళ్ళి ఆ నగ చూపించింది, అదేమో సాయంత్రపు వేళ, అందులోనూ శుక్రవారం. ఆవిడ చూసింది. నగ బాగుందంది, బరువు, ఖర్చైన సొమ్ము వివరాలడిగింది, ఇటువంటిది నా దగ్గర లేదనీ చెప్పింది,నీకు అందంబాగా తెలుసని పొగిడింది. పిచ్చి, పేద ఇల్లాలు మొహం చింకి చేటంతయింది. ఇంకేంటి ఈ పేదరాలికి ఏనుగెక్కినంత సంబరమయింది. మా అత్తగారికి చూపిస్తాను, నేనూ చేయించుకుంటానంది. నగ పట్టుకుని లోపలికెళ్ళింది. ఎంతకీ బయటికి రాదు, నగ తెచ్చి ఇవ్వదు. చూసి చూసి పేదరాలు వదినా చీకటడుతోంది, నగ ఇస్తే ఇంటికెళతానూ అని కేకేసింది. చాలా సేపు కేకేసిన తరవాత ఆ ధనికురాలు బయటికొచ్చి. అదేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళిపోయావనుకున్నా, అంది. విస్తుపోయిన పేదరాలు నగ ఇస్తే వెళ్ళిపోతానంది. దానికా ధనికురాలు, ఈ వేళ సుక్కురారం కదా, అందులోనూ సాయంత్రంపడి చిన్న తల్లి ఇంటికొచ్చింది, ఎలా ఇస్తానూ, రేపొచ్చి పట్టుకెళ్ళు, అంది.ఏమనాలో తెలియని పేదరాలు ఏడుపుముఖంతో తిరిగొచ్చింది.
మర్నాడు ఉదయమే వెళ్ళింది, బారెడు పొద్దెక్కినా నిద్దరమంచం మీంచి లేవని మహాతల్లి నెమ్మదిగ లేచి ఆవలిస్తూ బయటికొచ్చి, రాత్రి మావారికి చూపించా, నాకూ చేయిస్తానన్నారు, నగ కంసాలికి చూపించి, మోడల్ కోసం, ఇస్తాలే అంది నిర్లక్షంగా. ఏమనాలో తెలియని పేద ఇల్లాలు విసవిసలాడుతూ ఇంటికొచ్చింది. విసవిసలాడుతున్న ఇల్లాలిని చూసిన మగడు ఏమైందని అడిగేడు. చెప్పకతప్పలేదామెకు. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది,గుడ్లనీరుగుక్కుకుంటూ.ఆమె బాధ చూచిన భర్త అనునయంగా, పిచ్చిదానా కలిగినవారితో వ్యవహారం ఇలాగే ఉంటుంది. జరిగిందేదో జరిగింది,తరవాతెళ్ళి తెచ్చుకో అని చెప్పడం తో ఊపిరిపీల్చుకుంది. తిడతాడనుకున్న మగడు సౌమ్యంగా మాటాడి అనునయించేటప్పటికి ఏడుపొచ్చి భర్తను చుట్టేసింది. మధ్యాహ్నం వెళ్ళింది. భోజనం చేస్తున్నానని గడపలో నుంచోబెట్టి, నెమ్మదిగా బయటికొచ్చి కంసాలి చూడడం అవలేదట, సాయంత్రంరా అని విసురుగా లోపలికెళ్ళుతూ,నగ తినేస్తామనుకుంటుందో ఏమో! అని గొణుక్కుంటూ లోపలికెళ్ళింది. విన్న పేదరాలు చేయగలది లేక తిరిగొచ్చింది. సాయంత్రం వెళితే నిలబెట్టి, నిలబెట్టి నగపట్టుకొచ్చి చేతికిచ్చింది. బతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి తిరిగొచ్చింది. మరెప్పుడూ ఇలాటి తప్పు చేయకూడదనుకుంటూ.
ఇదీ చూడమని చేతికిస్తే సుక్కురారం కత. జీవితం లో అప్పుడప్పుడు ఇటువంటి అనుభవాలందరికి జరుగుతూనే ఉంటాయి.
తక్షకస్య విషం
(ఆచార్య చాణక్య)
అగ్నిరాపః స్త్రియో మూర్ఖాః
సర్పా రాజకులీన చ
నిత్యం యత్నేన సేవ్యాని
సద్యః ప్రాణహరాణి షడ్
నిప్పు,నీరు,మూర్ఖులు,స్త్రీలు,పాములు,రాజబంధువులు ఈ ఆరుగురితో నిత్యం జాగరూకతతో ఉండాలి. లేదా తక్షణ ప్రాణహాని జరగచ్చు.
దూరస్థోఽపి న దూరస్థో
యో యస్య మనసి స్థితః
యో యస్య హృదయె నాస్తి
సమీపస్థోఽపి దూరతః
మనసుకు దగ్గరైనవారు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టే. మనసుకు దూరమైనవారు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే
దానేన పాణిర్న తు కంకణేన
స్నానేన శుద్ధిర్న తు చందనేన
మానేన తుష్ఠిర్న తు భోజనేన
జ్ఞానేన ముక్తిర్న తు ముండనేన
చేతులకి అలంకారం బంగారు గాజులు,మురుగులు,తోడాలు ధరించడం కాదు,దానమే అలంకారం.శుద్ది స్నానంతో అవుతుంది,చందనం ఒంటికి రాసుకోవడంతో కాదు. అర్హులకు భోజనం పెట్టడంతో తృప్తినివ్వదు, సన్మానమే తృప్తినిస్తుంది. జ్ఞానంతో ముక్తి కలుగుతుందికాని, తలగొరిగించుకున్నంతలో కాదు .(సన్యాసంతీసుకున్నంతలో ముక్తిరాదు.)
పరోక్షె కార్యహంతారం
ప్రత్యక్షె ప్రియవాదినం
వర్జయెత్తదృశం మిత్ర
విషకుంభ పయోముఖం.
ఎదుటగా పొగిడి, వెనక చెడ్డగా మాటాడి, పని చెడగొట్టే వారు(వెనక గోతులు తీసేవారు), పాల పైపూతగల విషపు కుండలాటి వారు. అటువంటి మిత్రునిలాటి వారిని వదిలేయాలి.
విద్యా మిత్రం ప్రవాసేషు
భార్య మిత్రం గృహేషు చ
వ్యాధిస్తయోషధీ మిత్రం
ధర్మో మిత్రం మృతస్య చ
పరాయి దేశంలో విద్య మిత్రుడు, ఇంటిలో భార్య మిత్రుడు (దేవుడిచ్చిన మిత్రుడు), వ్యాధితో బాధపడేవారికి మందు మిత్రుడు, చనిపోయినవారికి వారు చేసుకున్న ధర్మమే మిత్రుడు.
వృధా వృష్టి సముద్రెషు
వృధా తృపేషు భోజనం
వృధా దానం ధనాఢ్యెషు
వృధా దీపో దివాపి చ
సముద్రం మీద వర్షం వృధా, (అప్పటికే అక్కడ చాలా నీరుంది), కడుపు నిండినవానికి పెట్టే భోజనం వృధా ( పెట్టిన దానిని తిన లేడు)డబ్బున్నవాడికి దానం చేయడం వృధా, (అపాత్ర దానం)పగలు దీపం వెలిగించడం వృధా ( సూర్యుని వెలుగుండగా దీపమెందుకు? అది దర్పం వెళ్ళబోయడమే)
తక్షకస్య విషం దంతె
మక్షికాయస్తు మస్తకె
వృశ్చికస్య విషం పుఛ్ఛె
సర్వాంగె దుర్జనె విషమ్
పాముకి పంటిలో విషం, ఈగకు తలలో విషం,తేలుకు తోకలో విషం,దుర్జనునికి అన్ని అంగాల విషమే
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలదోకయనకయుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ
(ఆచార్య చాణక్య నీతి)
సుఖస్యాఽనంతరం దుఃఖం
దుఃఖస్యాఽనంతరం సుఖమ్
న నిత్యం లభతే దుఃఖం
న నిత్యం లభతే సుఖమ్
సుఖాల తరవాత దుఃఖాలు, దుఃఖాల తరవాత సుఖాలు కలుగుతూ ఉంటాయి.ఎప్పుడూ దుఃఖమే
స్థిరంగా ఉండిపోదు. అలాగే సుఖమూన్నూ స్థిరంగా ఉండిపోదు.
పుస్తకస్తా తు యా విద్యా
పరహస్త గతం ధనం
కార్యకాలే సముత్పన్నే
న సా విద్యా న తద్ధనం
పుస్తకంలో ఉన్న విజ్ఞానము, ఇతరులచేతిలోని మనధనము అక్కరకు రావు (సమయానికి, అవసరానికి ఆదుకోవు)
నృపస్య చిత్తం కృపణస్య విత్తం
మనోరథా దుర్జనమానవానా
స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం
దేవో న జానాతి కుతో మనుష్య
రాజు మనసు,లోభివాని సంపద,దుర్జనుని కోరిక,స్త్రీ చరిత్ర,మగవాని సంపాదన,
దేవునికైనా తెలియదు, మనుషులకా?
రాజుమనసులో మాట గుట్టు, లోభివాని సంపాదనంతా గుట్టు,దుర్జనుని కోరిక గుట్టు, స్త్రీల చరిత్ర అనగా వయసు వివరాలు గుట్టు,పురుషుని సంపాదన గుట్టు. వీరంతా తమ గుట్టు దేవుడికి కూడా తెలియనివ్వక దాచి ఉంచుతారు, మనుషులకెలా తెలుస్తుంది? అని కవి భావం.
అత్యాసన్నాః వినాశాయ
దూరస్థాః న ఫలప్రదాః
సేవ్యంతాం మధ్య భావేన
రాజా వహ్ని గురుస్త్రియః
రాజు,నిప్పు,గురుస్త్రీలు వీరిపట్ల అతి సన్నిహితంగా ఉంటే వినాశనమే, అలాగని దూరంగా ఉండి ఉపయోగం లేదు. అందుచేత మధ్యస్థ దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుని మాట.
గురు స్త్రియం అన్న చోట వేరువేరుగా కాక గురుస్త్రియం గా చెప్పుకోవాలని చెప్పేరు. అందుకు మార్పు," రాజు,అగ్ని, గురుస్త్రీలు వీరిపట్ల అతి చనువుతో ప్రవర్తించడం ప్రమాద హేతువు,వినాశకారి.
ఏమిజన్మంబు? ఏమి జీవనము?
ఏమిజన్మంబు? ఏమి జీవనము?
ఈ మాయకాయంబు? ఏమిజన్మంబేమి జీవనము?
పుట్టుకేంటి? పెరగడమేంటి? చావేంటి? మనిషికి మనిషిపుట్టడమేంటి? పండునుంచి పండు పుట్టడమేంటి? ఆడ, మగ తేడా ఏంటి?స్త్రీకే బిడ్డకలగడమేంటి? ఎందుకీ తేడా? ఆకలేంటి? అన్నమేంటి? అన్నం తింటే ఆకలి తీరడమేంటి?ఆలోచిస్తే ఇదంతా గందరగోళం. ప్రేమ అభిమానాలేంటి? ఎందుకు? అన్నీ కొచ్చన్లే. సమాధానాలు లేవు....
ఓరోజు సాయంత్రం ఆలోచన ఈ దారి పట్టింది.బయటికెళ్ళలేక లోపలుండలేని స్థితి. ఇంతలో మందస్మితవదనారవిందసుందరి,త్రిదశి, వచ్చి కూచుంది, ”తాతగారూ రేపు ఊరునుంచి వెళ్ళిపోతున్నానూ” అంటూ, బిక్కముఖంతో. అంతలోనే అసలీ కలవడమేమి?విడిపోవడమేమి? కారణం లేని కార్యం ఉండదంటారు కదా! అడిగింది.
ఈ ప్రశ్నకి సమాధానం భారతంలో భీష్ముడు చెప్పారు, పద్యం గుర్తులేదు, భావం చెబుతా! గాలిచేత ఎగరగొట్టబడ్డ మేఘాలు గుంపుగా చేరతాయి, అదేగాలిచేత చెదరగొట్టబడతాయికూడా! అలాగే మానవులు విధి(చాలా అర్ధాలున్నాయి, ఈ మాటకి)చేత కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఓ చిన్న కొచ్చను సమాధానం చెప్పూ అన్నా! తన బిక్కమొహం చూడలేక!!!
ఒక నాలుగొందల మీటర్ల వాకింగ్ ట్రాక్ మీద ఒకే చోటునుంచి ఇద్దరు గంటకు నాలుగు కి.మి ల వేగంతో ఒకే సమయంలో బయలుదేరి ఎదురెదురుగా నడుస్తున్నారు. వీరుకలుస్తారా? ఎప్పుడు ఎక్కడ?
అదేట్రాక్ మీద మరో ఇద్దరు కలిసి గంటకు నాలుగు కి.మి ల వేగంతో ఒకేవైపుకు నడుస్తున్నారు. వీరు కలిసినడుస్తారా? విడిపోతారా?
అదే ట్రాక్ మీద ఒకడు గంటకు నాలుగు కి.మి ల వేగంతో నడుస్తున్నాడు. మొదటివాడు నడక మొదలెట్టిన రెండు నిమిషాల తరవాత రెండవాడు అదే చోటునుంచి, అదే వేగంతో అదే వైపుకి నడకమొదలెట్టేడు. వీరిద్దరూ కలుస్తారా? ఎప్పుడు?ఎక్కడా?
ఈ కొచ్చన్లు విని మందస్మితవదనారవిందసుందరి మరింత బిక్కమొహంతో నేను లెక్కల్లో వీకూ అంది బెక్కుతూ!!!
ఆలస్యమైతే తిక్కమొగుడు వచ్చి ఎత్తుకుపోతాడు, అంది నవ్వుతూ. ఎక్కడున్నాడు? అడిగా బయట కార్ లో కూచుని ఉన్నాడు, అందుకే కంగారు. బై అంది చెయ్యి ఊపుతూ. నువ్వు ప్రేమించబడ్డ చోట సుఖంగా ఉంటావు. నువ్వు ప్రేమించినచోట సుఖంగా ఉండలేవన్నా!బై చెప్పుతాతా అంది,పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ. బై చెప్పను బై అనకు,వెళ్ళొస్తా అనాలి, అన్నా.మరికొంచంసేపు నిలిపి ఉంచడానికి. ఏం? అడిగింది.వెళ్ళొస్తా అన్నదానిలో మళ్ళీ కలుస్తామనే ఆశ ఉంది, బైలో లేదు, అన్నా! ”ఎల్పోయొస్తా” అంది నవ్వుతూ. నిజం ఇలా అనేవాళ్ళని చూసి నవ్వుతాం, నిజానికి ఇందులో ఎంత,మళ్ళీ కలుస్తామనే ఆశ ఉంది, అన్నా! ఇంకీ సారి వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళింది, ”వస్తానూ” అంటూ, చిత్రం కదూ!!!
నృపస్య చిత్తం
నృపస్య చిత్తం కృపణస్య విత్తం
మనోరథా దుర్జనమానవానా
స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం
దేవో న జానాతి కుతో మనుష్య
రాజు మనసు, లోభివాని సంపద,దుర్జనుని జేవితేఛ్చ,స్త్రీల చరిత్ర, పురుషుల సంపాదన, దేవునికే తెలియదు, మనుషులకా?
( దేవునికి కూడా తెలియనివ్వనంత గుట్టుగా ఉంచుతారు, ఇక మనుషులకెలా తెలుస్తుంది?)
రాజుమనసెపుడూ గుట్టే! అలాగే ఉండాలట. ఎవరినీ నమ్మడు, పెళ్ళాన్ని కూడా!! నమ్మేడో ఐపోయాడే!!!
లోభివాని సంపదెంత?అతనికే తెలీదు. తెలియనివ్వడు. అంతే!!!ఎక్కడ దాచాడో తెలియదెవరికి, తెలియనివ్వడు కూడా. నేడు రెండు వేల రూపాయల నోట్ల కట్టలు బయట పడుతున్నట్టు. ఏదీ? ఎక్కడా చప్పుడు లేదే!
దుర్జనుని జీవితాశయం ఏమై ఉండచ్చు...దేశం ఏమైపోయినా బాధలేదు, అంతే, జీవితాశయం గుట్టే
స్త్రీల చరిత్ర అంటే పుట్టు పూర్వోత్తరాలు, అంటే వయసు గుట్టు, అదీ సంగతి.
పురుషుని సంపాదన, జీతమో, గీతమో, ఏ సంపాదనా గుట్టే
వీటిని పైవారు దేవునికి కూడా తెలియనివ్వరు, మనుషులకెలా తెలియనిస్తారు???
శ్రీమాత్రేనమః
అరవైరెండు సంవత్సరాల కితం, ఇరవై సంవత్సరాల వయసులో, ఇదే రోజు యుగళజీవితానికి అనుమతించి, ఏభైఆరు సంవత్సరాలు అవిఛ్చినంగా కొనసాగింపజేసిన అమ్మకు వందనం.
ఐదు సంవత్సరాలుగా ఒంటరిజీవితాన్ని ప్రసాదించిన అమ్మకు వందనం.
వందనము రఘునందనా! భక్త చందనా!!సేతు బంధనా!!!రామా
వందనము రఘునందనా!!!!!
జీవితం వడ్డించిన విస్తరి కాదు!పూల పాన్పూకాదు!! జీవితం నల్లేరు మీద నడకా కాదు, పల్లేరులూ గుచ్చుకుంటాయి.
ఈ రోజు ఉదయం నడక ప్రారంభిస్తుండగా జిలేబి పద్యం రాలింది.
"తాతగారికి,
యుగళపు జీవన మధురిమ
ల గమనపు తొలకరి జల్లు లా తల్లి జతన్
జగమున మొదలైన దినము
న గ చింతనమదె మదిని మునకలిడ ప్రణతుల్"
పద్యంచూస్తూ అడుగులు ముందుకేస్తే రెండు కాళ్ళలోనూ పల్లేరుకాయలు గుచ్చుకున్నాయి. ఒక్కసారిగా కూలబడ్డా. అరికాళ్ళలో గుచ్చుకున్న పల్లేరులేరిపారేశా. లేచినిలబడ్డా!నడక సాగించా!ఆలోచనలో పడి అదేపనిగా నడుస్తుండగా ఒక మనవరాలెదురొచ్చి, తను నాముందుండి, తను వెనక్కి పరిగెడుతూ,ఏంటీ! ఎప్పుడూ లేనిదివేళ ఇంకా నడుస్తున్నారూ? అంటూ ఆపింది. ఆగాను ప్రకృతిలో పడ్డాను.అనుక్షణం నన్ను గమనించే అమ్మకు వందనం.
జీవితంలో కుప్పలా కూలబడిపోయిన సంఘటనలూ ఉన్నాయి,లేవలేమోననుకున్న ప్రతిసారి లేవగలవు, ముందడుగు వెయ్యి,చివరిదాకా నడవగలవు,నడవాలనే ధైర్యాన్ని, దృక్పధాన్నిచ్చిన ,అమ్మకు మరోసారి వందనం.
ఈ టపా రాసేందుకు అవకాశం కలగజేసిన జిలేబికి వందనం.ఈ మధ్య కాలంలో లేనిది, ఈ టపా రాసే అరగంటలోగా రెండుసార్లు కరంటు తీసేసి, మార్పులు,చేర్పులు,కూర్పులకు తోడిచ్చిన కరంటువారికి ప్రత్యేక వందనం.
మరొకసారి
వందనము రఘునందనా! సేతు బంధనా!! భక్తచందనా!! రామా!! వందనము రఘునందనా!!
శ్రీమాత్రేనమః
![]() |
ముక్కు,బొడ్డు జానకి అందుతాయా???
అమ్మా ఆకలేస్తోందే!
నిన్ననంతా జ్వరం పేలేసింది, లంఘనం చేసేవుగా. సీతారామయ్య తాతగారి దగ్గర కెళ్ళి ఆయన చేత చెయ్యి చూపించుకున్నావా?
వెళ్ళేను. చెయ్యి చూసేరు. ఆ తరవాత, ఒరే! ముందుకువంగి నీజానతో ముక్కుని,బొడ్డునీ అందుకో! ( జాన అంటే చిటికినవేలు చివరనుంచి బొటన వేలు చివరదాకా కొలత. ఇది తొమ్మిదంగుళాలే)
అన్నారు.
అందిందా?
లేదు.
మరేమన్నారు? ఈ వేళా,రేపూ లంఘనం చేసెయ్యీ అన్నారు.
ఇంకేం మరీ,తాతగారి మాటంటే సుప్రీం కోర్టు ఆర్డరే, అపీల్లేదు.అన్నం పెట్టను.
ఆకలేస్తోందే మరీ!
అక్కడ గ్లాసులో పాలెట్టేను తాగి పడుకో! ఎండనబడి గెంతకు, ఆగమ్మకాకిలా తిరక్కు, పుస్తకం తియ్యకు, పరుపుమీద పడుకోకు, నులకమంచం మీద బొంతేసుకు పడుకో!!! అమ్మమాటంటే మెజిస్ట్రేటు కోర్టు ఆర్డరైనా సుప్రీంకోర్టు కెళ్ళినా తిరుగులేదు. ఏమో సుప్రీం కోర్టులో మరోటి తగిలించచ్చు కూడా! అందుకే చచ్చినట్టు కుక్కినపేనులా అమ్మచెప్పినట్టి వినేసి పడుకోడమే మంచిదనిపించేది.
జానతో ముక్కును,బొడ్డునూ అందుకోవడం ఒక టెస్టు, జ్వరం తగ్గిందీ లేనిదీ చెప్పడానికి, ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అంతే! ఇప్పుడు బొడ్డూ, ముక్కూ జానకి అందవు,నూటికి తొంభై మందికి. ప్రయత్నంచద్దూ, వెన్ను నెప్పెడుతుంది. ఏం? మీ వెన్ను ముదిరిపోయింది, అది వంగదు. మనం నడ్డొంచి పనిచేసినదెప్పుడూ! కూచుని ఫోన్ గీకడం తప్పించి చేసే పనే లేదుకదా!!అందుకు అదంతే! అంతే!!
మొన్ననోరోజు ఉదయపు నడకలో ఒకతను నలతగా ఉన్నట్టనిపిస్తే ఏమని అడిగేరు. జ్వరమొచ్చింది, తగ్గిందో లేదోగాని నీరసంగా ఉందన్నాడు. అదేమయ్యా! అనారోగ్యంతో వ్యాయామం చేయకూడదు. ముందుకువంగి జానతో బొడ్డూ,ముక్కూ అందుకోమన్నా! ప్రయత్నం చేసేడు, అందలేదు. ఇక అక్కడున్నవాళ్ళంతా ప్రయత్నం చెయ్యడం మొదలెట్టేరు. ప్రయత్నించినవారెవరికి అందలేదు. కొంతమంది సిగ్గుపడి అందుకోలేదు. వాళ్ళలో ఇద్దరిని చూపించి మీకు అందుతుంది చూసుకోండి అన్నా! ఆ కుర్రాళ్ళిద్దరూ ప్రయత్నం చేసేరు, ముక్కు,బొడ్డూ జానకి అందేయి. ఇప్పుడు ఇదొక వ్యాయామమైపోయింది :)
అరటాకెళ్ళి ముల్లుమీద పడ్డా.....
అరటాకెళ్ళి ముల్లుమీద పడ్డా, ముల్లెళ్ళి అరటాకుమీద పడ్డా అరటాకుకే నష్టం !!! ఇదో పాతకాలపు నానుడి. ఆ కాలంలో ఆడపిల్లతో మగవాడు మాటాడితే ఆడపిల్ల బతుకు బండలైపోతుందనీ, పాడైపోతుందనీ, అలాగే ఆడపిల్ల చొరవ తీసుకుని మగాడితో మాటాడినా ఫలితం అలాగే ఉంటుందనీ చెప్పేవారు. ఆ తరవాత ఆడపిల్ల వీపు సాపు చేసేవారు. ఇదే లోకపు తీరు, నాడు.
కాని రోజులు మారాయి.
రోజులు మారాయా! లేదు!! అవే సంవత్సరాలు,అవే ఆయనాలు, అవే ఋతువులు, అవే మాసాలు, అవే పక్షాలు, అవే వారాలు, అవే గంటలు, నిమిషాలూన్ను. మరి మారిందేంటీ? మనిషి బుద్దులు మారాయి.
ఇప్పుడు మగాడు ఆడపిల్లతో మాటాడినా, ఆడపిల్ల మగాడి వెంటపడినా,వేధించినా,మాటాడినా, పగిలేది మగాడి వీపే. వాడే వయసువాడైనా, ఏమి మాటాడినా, లోకం వినదు. మగాడి వీపు పగలడం ఖాయం.
ఆడవారితో దూరంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది. తస్మాత్ జాగ్రత,జాగ్రత.
అని, అనిపించుకోడం అత్తగారూ నీకలవాటు.
ఇదొక నానుడి,తెనుగునాట బాగా చెప్పుకునీదిన్నూ!! అత్తగారంటే సాధించేదనీ,వేధించేదనీ,బాధించేదనీ.....
కొడుక్కి పెళ్ళిచేస్తే కోడలొస్తుంది,అప్పుడే అత్తరికమూ వస్తుంది. అత్తయ్యేటప్పటికి వయసూ మళ్ళుతూ ఉంటుంది, కోడలివి వచ్చేరోజులు అత్తవి పోయే రోజులూన్నూ. పాతరోజుల్లోలా అత్త అథారిటీ చెలాయిస్తానంటే కుదురుతుందా!!!! కుదరకపోవచ్చు. మరేం చేయ్యాలి? అదిగదా కొచ్చను? గౌరవం నిలబడాలంటే అత్త తగ్గి ఉండటం మంచిది కదా!!!!! కాదు పాతరోజుల్లో లా అథారిటీ చెలాయిస్తానంటే ఎలా? ఇప్పటిరోజుల్లో మాటంటే కోడలూరుకుంటుందా? ఒకమాటంటే తనూ మరోమాటంటుంది, అంతే! తమలపాకుతో నీ వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా, అని చేతలకి కూడా దిగచ్చు.
తెనుగింటి అత్త అంటే ఎలావుంటుందంటే ”సూరేకాంతా”న్నే చెప్పుకోవాలి.అత్తపాత్రలో అంతగా ఇమిడిపోయి నటనలో జీవించిన నటి మరొకరు నేటికిన్నీ లేరు,లేరు,లేరు.ఇంతటి దుష్టపాత్రల్ని పోషించినామె మనసువెన్ననీ, షూటింగ్ సమయంలో అందరికి తాను ఇంటి దగ్గర స్వయంగా చేసి తెచ్చిన తినుబండారాలు పంచిపెట్టేదని నేటికిన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అత్తని తలుచుకుంటే సూరేకాంతాన్ని తలుచుకోకపోవడం పాపం.అత్తరికం వెలగబోయడం వ్యక్తులకే కాదు దేశాలకీ వర్తిస్తుందిష.
పరోపదేశసమయే జనాః సర్వేఽపి పండితాః
తదనుష్ఠానసమయే మునయోరఽపి న పండితాః
ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో మాదే గొప్ప దేశమని డబ్బా కొట్టుకునే అమెరికా ఈ మధ్య ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది, ఏమనీ? మీ దేశంలో గుజరాత్ కోర్ట్ రాహుల్ గాంధీ పై ఇచ్చిన తీర్పును గమనిస్తున్నామూ, అని. ప్రజాస్వామ్యదేశమని చెప్పుకుంటూ ఇతరదేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడమేమీ? అడిగేరు కొందరు. ప్రజాస్వామ్యదేశాలలో జరిగేవాటిని గమనిస్తుంటాం! అంతేగాని అది ఆ దేశపు విషయాలలో జోక్యం కాదూ, అని సెలవిచ్చేరు. సరి! ఇలాటివి ఆ దేశానికి కొత్తకాదు, మొదటిసారికాదు. తెచ్చిపెట్టుకున్న అత్తరికం వెళ్ళబోయడం ఈ దేశపు అలవాటూ! ఇది కొత్తాకాదు. ఇలా జరుగుతున్నందుకు ఆ దేశాలూ గట్టిగా సమాధానాలూ చెప్పటంలేదు, కారణాలు తెలిసినవే! కోడలికి కూడా రోజొస్తుందికదా! అలాగే భారతదేశానికీ రోజొచ్చింది. మీదేశంలో మాజీ ప్రెసిడెంటును కోర్టులో అరెస్టు చేసిన విషయం గమనిస్తున్నామని చెప్పి బదులు తీర్చేసేరు. అంచేత అని అనిపించుకోవడం అత్తగారి లక్షణమనుకోవాలా?
ఎవరికంపు వారికింపు.
ఇదొక నానుడి.ఎవరు చేసినపని,చెప్పిన మాట వారికి సొంపుగానూ, ఇంపుగానూ కనపడతాయని దీని భావం.కాకి పిల్ల కాకికి ముద్దు ఇదీ ఒక నానుడే! కాకి తనపిల్లని ముద్దు చేయడంలో తభావతేముంది? కాని అదే కాకి పిల్లని మరొకరు ముద్దు చేస్తారా అన్నదే మాట. అలాగే ఎవరు చేసినపని,మాట ఎదుటివారికి కూడా నచ్చాలి.లోకంలో అందరికి అన్నీ నచ్చవు, కాని ఎక్కువమందికి నచ్చాలికదా! అలా నచ్చని దాన్నే ఇలా ఈ నానుడితో చెబుతారు.
ఈ విషయంమీద ఇదివరలో వాసన అని ఒక టపారాసిన గుర్తు.
ఇంతేకాదు నిజంగానే ఎవరి కంపు వారికి ఇంపుగానే ఉంటుంది. కారణం తమదైన వాసన తమకి తెలియదు, ఎదుటివారికి తప్పించి. సైన్స్ కూడా చెబుతున్నమాటిదే. ప్రతివ్యక్తి శరీరం నుంచి తమదైన ఫెరోమోన్స్ విడుదలవుతాయి. ఇవి చెమటతో బయటికొస్తాయి. ఎవరి ఫెరొమోన్ వాసన వారిదే! ఇద్దరి ఫెరొమోన్ ఒకలా ఉండదు, ఇద్దరి డి.ఎన్.ఎ ఒకలా ఉండనట్టు. ఈ ఫెరొమోన్ వాసన పక్కవారికి మాత్రమే తెలుస్తుంది, ఎవరిది వారికి తెలియదు. ఈ ఫెరొమోన్స్ వాసన చూసే కుక్కలు నేరస్థులని పట్టుకుంటాయి ఈ ఫెరొమోన్స్ వాసన కుక్కలు గుర్తించినంతగా ఇతరులు గుర్తించలేరు. మనం ఒక ప్రదేశంలో కొంతసేపుండి అక్కడనుంచి వెళ్ళిన తరవాత కూడా మన ఫెరోమోన్స్ వాసన అక్కడ ఉంటుంది. నేరస్థులు దీనిని తొలగించాలని చూసినా సున్నితమైన ముక్కుతో కుక్కపసికడుతుంది. ఈ పెరొమోన్స్ లో ఆడ మగ తేడాలున్నాయష! వామ్మో!!
ఇంతేకాదు కొంతమంది కొంతమంది ఫెరొమోన్స్ ఇష్టపడతారట. ఏడుస్తున్న చిన్న పిల్లల దగ్గర తల్లి దుస్తులు పడేస్తే ఏడుపు ఆపుతారట. ఆ దుస్తులనుంచి విడుదలైన ఫెరొమోన్స్ వాసన తల్లి దగ్గరుందన్న భావం బిడ్డకు కలగజేస్తుంది. బట్టలు ఉతికిన తరవాత కూడా ఈ ఫెరొమోన్స్ వాసన మిగిలే ఉంటుందిట. మరి భార్య భర్త ఒకరి ఫెరొమోన్స్ మరొకరు ఇష్టపడితే జీవితమే హాయిలేహలా! వారే విడదీయలేని జంట.ఇది బహు అరుదు.
ఇక కొంతమందిని అందరూ ఇష్టపడతారు, కొంతమందిని ఎవరూ ఇష్టపడరు. కొంతమందిని కొందరే ఇష్టపడతారు. కారణం! మాట. అదెలాగో చూదాం. తినే ఆహారాన్ని బట్టి మనసు, మనసు బట్టి మాట. అలాగే తినే ఆహారాన్నిబట్టి ఫెరొమోన్స్ విడుదలవుతాయి. అదేవాసన. స్త్రీ పురుష ఫెరొమోన్స్ ఆకర్షణకి తోడవుతాయిట. అంటే మొత్తం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.
చిన్న ఉదాహరణ. పచ్చి వెల్లుల్లి తినండి, మీ నుండి విడుదలయ్యే చెమటలో వెల్లుల్లి వాసన ఉంటుంది. ప్రయత్నించకండీ! ప్రమాదం!
ఇక తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది? వాటి రకాలు. సాత్విక,రాజస,తమో గుణాహారాల మూలంగా మూడు గుణాలు ఏర్పడతాయి.అవే సత్వ,రజస్, తమో గుణాలు. ఈ గుణాల మూలంగానే మనసు, దాన్నిబట్టి మాట అలాగే విడుదలయే ఫెరోమోన్స్ ఉంటాయి. అయ్యో! నన్నెవ్వరూ పట్టించుకోటం లేదని బాధవద్దు. సాత్విక ఆహారం తీసుకోవడం ప్రారభిస్తే మార్పువస్తుంది, దీనికి కాలం తీసుకుంటుంది, మార్పు ఒక్క రోజులో రాదుకదా! అసలు ఇష్టం అనేదొకటుందికదా! ఆహారం తీసుకోవడం లో, దాని మాటేమీ? సాత్విక,రాజస,తామసాహారాలలో ఏవి ఎక్కువ ఇష్టమో అది మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఏర్పడతాయి.
ఇంత పెద్ద విషయాన్ని మనవారు ''ఎవరికంపు వారికింపు'' అని చిన్న మాటలలో చెప్పేసేరు.
ఫలాహారమే మేలు(2023)
కొత్తపల్లికొబ్బరి మామిడిపళ్ళు.
వేసవి రావడం పళ్ళు రావడం, మార్కెట్ నిండా పళ్ళే! ఫలాహారమే చవగ్గా ఉన్నట్టుంది, ఇడ్లీ ,పెసరట్టు, ఉప్మాలకంటే.
పనసతొనలు మీడియం డజను ......30
ద్రాక్ష నలుపు/తెలుపు అరకేజి...... 50
ఆపిల్ కేజి ... .. 200
అరటిపళ్ళు అత్తం (24) పెద్దవి.... 100
దానిమ్మ మీడియం (12) కేజి .....200.ఒకటి 20
లంక దోసకాయ పెద్దది..... 60
కర్బూజా....30
పుచ్చకాయ మీడియం 1/6 వంతు ముక్క...... 10
సపోట కెజి మీడియం(24)........ 50
కమలా కేజి......... 200
బొబ్బాసికాయ మీడియం 1/6వంతు ముక్క......10
నేరేడు పళ్ళు 1/2 కేజి .....150
తాటిముంజలు12......60
జీడి మామిడి పళ్ళు 12.......50
వెలగపళ్ళు3........50
జామకాయలు కేజి.....50
కర్రపెండలం 1/2కేజి.......40
ఎండు ద్రాక్ష..కేజి (packed).......350
ఖర్జూరం 1/2 కేజి( Fresh fruit packed).....350
లేత కొబ్బరి నీళ్ళు,(పాకుడు). లీటరు....100
మామిడిపళ్ళు (కొత్తపల్లి కొబ్బరి)మీడియం..100...5000
రేగు సీజనయిపోయింది. తేగలు,బుర్ర గుంజు సీజనయిపోయింది.కమలా సీజన్ పూర్తికావస్తోంది.పంపర పనస,నారింజ మార్కెట్ కి రావటమే లేదు.అనాస సీజన్ మొదలుకాలేదు.
ఎన్ని రకాలపళ్ళు. మరేదేశం లోనూ ఇన్ని ఉంటాయా? ఉన్నాయా?
................
ఇడ్లీ (మీడియం) 4 ...30
పెసరట్టు ....30
ఉప్మా...20
పునర్విత్తం పునర్మిత్రం
పునర్భార్య పునర్మహి
ఏతత్సర్వం పునర్లభ్యం
న శరీరం పునః పునః
కోల్పోయిన విత్తం మరల సంపాదించచ్చు, విడిపోయిన మిత్రుడిని మళ్ళీ కలవచ్చు. భార్యపోతే మరొకరినీ సంపాదించుకోవచ్చు.భూమినికోల్పోతే మరలా సంపాదించచ్చు. కాని శరీరం ఒక సారిపోతే మళ్ళీ మళ్ళీ పొందలేం, తిరిగిరాదు.
ఇంతెందుకు అని, ఒక్క మాటలో చెప్పేసేరు. అదే ''శరీరమాద్యం ఖలు ధర్మసాధనం''.ఏం చెయ్యాలన్నా శరీరం ముఖ్యం,దాన్ని కాపాడుకో అన్నారు. నేనేంటి ఉక్కు ఉక్కు అన్నవాళ్ళు తుక్కు తుక్కు ఐపోయారు, కోవిడ్ దెబ్బకి . కొందరు చచ్చి బతికేరు. కోవిడ్ మళ్ళీ పుంజుకుంటోంది. ఒక సారొచ్చింది మళ్ళీ రాదనుకోవద్దు. వాక్సీన్ వేసుకున్నా జాగరత అవసరమే. దీనికి తోడు H3N2 Flu variant బలంగా వ్యాపిస్తోంది. ఇమ్యూనిటీ కొనుక్కుంటే దొరకదు, ఇమ్యూనిటీ పెంచుకునే చర్యలు తీసుకోండి. యోగా చేయండి, వయసుతో నిమిత్తంలేదు,దీనికి. నడవండి. ఇప్పుడు ఎండలు జోరుగా ఉన్నాయప్పుడే, 40,41,42 ఇలా వేడి పెరుగుతోంది.(Heat wave sweeping) వేడి 45 దాకా చేరచ్చంటున్నారు. వడదెబ్బ తగలచ్చు, ఎండలో తిరగద్దు. జాగర్తా!
పుట్టింది మొదలు గిట్టే దాకా మనతోడు మన శరీరమే, తల్లితండ్రి,భార్య,పిల్లలు,బంధువులు,మిత్రులు ఊపిరినిలబడితే ఎవరూ తోడుండరు.శరీరాన్ని కాపాడుకోవాలి.వయసు ముదిరితే చెయ్యీ కాలూ ఆడకపోతే హాస్పిటల్ లో పారేస్తారు, చాకిరీ ఎవరూ చెయ్యలేరు. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే,ఇక్కడే,ఇక్కడే పొంచిఉంది.జాగర్త. ఎల్లకాలం ఎవరూ ఉండరని మిట్ట వేదాంతం చెప్పద్దు, ఉన్నంతకాలం చెయ్యీ,కాలూ ఆడాలి మరచిపోవద్దు, జాగర్త..
భ్రమర,కీటన్యాయం.
భ్రమరం అంటే తుమ్మెద. కీటం అంటే పురుగు. ఏంటీ (సామెత)న్యాయం?
కీటకం భ్రమరానికి చిక్కుతుందనీ, ఆ తరవాత భ్రమరం కీటకం చుట్టూ తిరుగుతుందనీ, ఆ కీటకం భ్రమరమవుతుందనీ చెబుతారు, పెద్దలు. కీటకం ఎప్పటికి భ్రమరం కాలేదంటారు, కొందరు.పెద్దలు ఇదెందుకు చెప్పినట్టూ, ఇందులో ఏదో గూఢం ఉందా? చూదాం!
కీటకమనే మనసు భ్రమరమనే ద్వేషానికి చిక్కుతుంది.చిక్కిన మనసు చుట్టూ ద్వేషం తిరుగుతూ ఉంటుంది. ఎంతకాలం? కీటకం భ్రమరమేదాకా!అంటే మనసు ద్వేషంతో నిండిపోయేదాకా!
ఇది ఒక ద్వేషానికే చెప్పుకోనక్కర లేదు. పగ,ద్వేషం ఇలా అవలక్షణాలకే మనసు చిక్కుతుందనే పెద్దల మాట.భక్తికి చిక్కదా? బహు అరుదు. అలా భక్తి భ్రమరానికి మనసనే కీటకం చిక్కితే అదే అదృష్టం.
ఇది జిజ్ఞాసువు ప్రశ్న. దేవునిగురించి ఎవరికివారు తెలుసుకొవలసిందేగాని మరొకరు ఎఱుక పరచలేరన్నది నానమ్మిక.దీనిపై అంతులేని ప్రశ్నలు, అనంతమైన సమాధానాలూ ఉన్నట్టున్నాయి, నేడో రేపో కమే కూడా దీనిమీద సిద్ధాంతం రాసెయ్యచ్చు.
ఈ నెల రెండో తారీకు మొదలు రొంప,దగ్గు,జ్వరం నన్ను సిరి పీడించినట్టు పీడిస్తున్నాయి, వదలక. దీనికి తోడు నాలుగురోజులుగా వేడి దంచుతోంది, నలభై లెక్కన. నా కష్టాలు పరమాత్మకే ఎఱుక.ఇంతలోనూ కొంచం ఓపిక జేసుకుని..ఇది గిలికా...
పల్లెటురివాణ్ణి,చదువు లేనివాణ్ణి, మట్టిలో బతికే మనిషిని, మేధావినికాను.ఇది నా అనుకోలు, పెద్దలు మన్నించెయ్యండి,తప్పుల్ని.
ప్రశ్నలోనే ఇద్దరున్నట్టుకదా? ఇద్దరుంటే కదా ఒకరినొకరు పట్టుకోడం? ఎవరిని ఎవరు పట్టుకోవాలన్నది ప్రశ్న.
విషయంలో కెళదాం.
మార్జాలకిశోరన్యాయం, మర్కటకిశోర న్యాయమన్నవి రెండు సామెతలు, సంస్కృతంలో.
మొదటిదానిలో పిల్లి తన పిల్లను నోటకరచుకుపోతూ ఉంటుంది.పిల్లకి బాధ్యతలేదు. అంతా తల్లి చూసుకుంటుంది. రెండవది దీనికి విరుద్ధం. అందులో తల్లికోతి వీపును పిల్ల పట్టుకు ఉంటుంది.తల్లికేం బాధ్యతలేదు. పిల్లబాగోగులు పిల్ల చూసుకోవాలంతే!
ఈ రెంటినీ సమన్వయ పరచుకుంటే!ఎలా?
భాగవతం దగ్గరకెళదాం.ప్రహ్లాదోపాఖ్యానం లో ప్రహ్లాదుడు హరి నామాన్ని పట్టుకున్నాడు. ఎలా? పానీయంబులుద్రావుచున్,కుడుచుచున్,, హాస నిద్రాదులు జేయుచున్, అన్నీ చేస్తూ కూడా నామం పట్టుకున్నాడు.మర్కటకిశోర న్యాయంలా. కష్టాలొచ్చాయి, ఎంతదాకా పీకలదాకా,హిరణ్యకశిపుడు ఇలా ఏడ్చేదాకా
ముంచితి వార్ధులన్ గదలమొత్తితి .......జావడిదేమి చిత్రమో అనుకుని ఏడ్చేదాకా! ఎవరు పట్టుకున్నారు ప్రహ్లాదుని? హరి పట్టుకున్నాడు మార్జాలకిశోర న్యాయయంలో లా.
దీన్ని బట్టి తెలిసేదేమి? నువ్వు పట్టుకో! నిన్ను పట్టుకుంటా!!
కమే! కమే!! కమే!!!
ఎక్కడజూసినా కమే మాటే!
కమే ఏంజెయ్యగలదయ్యా? అడిగేడో జ్ఞిజ్ఞాసువు
ఏమైనా చెయ్యగలదన్నాడో మేధావి.
కొన్ని ఉజ్జోగాలే పోతాయన్నాడు మరొకడు.
అదేంజేయగలదు? ఏం ఉజ్జోగాలో పొతాయో చెప్పరాదే అడిగేడు మరో పెద్దమడిసి.
ఇనుకోండి.
లెక్కల్లో బొక్కలు సిటికలో కనిపేట్టస్తది. అక్కౌంటెంట్లు, ఆడిటర్ల పని కాళీ!
గ్రంధాలు, ఉద్గ్రంధాలు రాసేయగలదు, కవులు కళాకారులు పని ఖాళీ!
ఇలా జెప్పినియ్యి కొన్నే!సమస్యలు చిటికిలో విడదీసెయ్యగలదు.ఏమైనా చేసెయ్యగలదు, చెప్పేసేడు. ఇలా చాలా చాలా పనులు చేసెయ్యగలదు, చాలా ఉజ్జోగాలు హాంఫట్, బెదిరించేడు.
ఐతే చెయ్యలేనిదేం లేదంటావ్? అడిగేడు మరో అనుమానం పక్షి.
దానే అడిగేదాం అనేసేడు ఒక విజ్ఞాని.
ఉదాహరణ చెబుతా వినండి.
ఒక జడ్జీగారు తను ఇవ్వబోయే తీర్పు ఎలా ఉండాలో అని కమేని అడిగితే ఆయనేమని రాసేడో తీర్పు అలాగే చెప్పేసిందిట. అదిజూసి ఆయన నోరొదిలేసేడంట. ఆయనేజెపిండు, ఇటు సెయ్యద్దూ, ప్రమాదమూ అని.
మరో ముచ్చట. ఒకయనో ముచ్చటజెప్పిండంట, సేనాకాలం కితం. అది వివాదం అయ్యిందంట, నాడు. నేడు కమేని అడిగితే ఈన జెప్పిందే నిజమన్నదంట. ఆయనో డప్పేసుకుని జెప్పుకుంటాన్నాడు.
ఐతే కొన్ని కొచ్చన్లేదాం ఏటి జెప్పుద్దో!
2024 లో మోడీగారు ప్రధానిగా ఎన్నిక కాకపోతే ఏం జేసుకు బతగ్గలడు?
హిమాలయాల్లో టీ అమ్ముకుని ఐనా బతికెయ్యగలడని ఆన్సరు.
2024 లో రాహుల్ బాబా ప్రధానిగా ఎన్నిక కాలేకపోతే ఏ0 చేసిబతగ్గలడు?
ఏమీ చెయ్యలేడు. ఏమీ చెయ్యలేకపోయిన బతికెయ్యగలడు ఆన్సరు.
అమ్మాయి నీళ్ళడుతోంది ఏబిడ్డ?
Input డాటా ఇనకంప్లీట్, ఆన్సరు.
నువ్వు చెయ్యలేనిదేంటో చెప్పూ?
కొన్ని నిమిషాలే మౌనం. ఏమైందీ అని భయపడ్డారు, జనం. నోరిప్పింది కమే,
పిడక పజ్యాలు రాయలేను, ఆన్సరు.
ఇది చదివి నవ్వుకోండి. ఏవరికైనా బాధ కలిగితే బాధ్యత నాది కాదు కమేదేస్మీ!
So many errors, correct them yourself :)
రాముని రాజ్యం-భరతుని పట్టం-2
జయత్యతిబలోరామో
లక్ష్మణస్య మహాబలః
రాజా జయతి సుగ్రీవో
రాఘవేణాభిపాలితః
(జయ మంత్రం) హనుమ.
దశరథుని పార్ధివదేహానికి అగ్ని సంస్కారం చేసిన తరవాత,రాముని తల్లి కౌసల్యను దర్శించాడు,భరతుడు. తల్లీ! జరిగినదానిలోగాని, నా తల్లి కోరిన కోరికలలో గాని నా ప్రమేయం లేశమాత్రమున్నూ లేదు. ఏమాత్రం ప్రమేయమున్నా అనేక ఘోరమైన పాపాలు చేసినవాణ్ణి అవుతాను, అని ఒట్లు పెట్టుకున్నాడు. మనం అందరం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామనీ చెప్పాడు. ఆ తరవాత లక్ష్మణుని తల్లి సుమిత్రకు కూడా ఇలాగే చెప్పాడు. అందరం వెళ్ళి రాముని వెనక్కి తీసుకొద్దామని చెప్పేడు. ఆపై సభచేసి మంత్రి,పురోహిత, పౌర, జానపదులుండగా, ఈ రాజ్యం రామునిది, రాముడే పరిపాలనార్హుడు. నా తల్లి కోరినవరాలలో నా ప్రమేయం లేదు, అని ప్రకటించి, మనం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామని చెప్పేడు.
ఆ తరవాత అనుకున్నట్టు అందరూ అనగా, రాణివాసం, సైన్యం,మంత్రులు,పౌరులు,జానపదులు కదలిరాగా రాముని కోసం అడవులకు బయలుదేరారు. పట్టపుటేనుగు సిద్ధంగా ఉన్నా భరతుడు గుఱ్ఱం ఎక్కేడు. పట్టపుటేనుగు హౌదా ఖాళీగా ఉండగా బయలుదేరింది.
***
ఆలోచన
ఇంట గెలిచి రచ్చగెలవాలి, ఇదొక నానుడి, తెనుగునాట. ఇది రామాయణం లో భరతుడు చేసినదానిని బట్టే ,ఈ నానుడి పుట్టిందని నా నమ్మిక. తాను రాజ్యం రామునిదే అని నమ్మేడు, అదే చెప్పేడు, ఆచరణలో చూపాడు. అది అమలుకు, ముందు ఇంటిలో వారిని ఒప్పించగలగాలి, జరిగినదానిలో తనప్రమేయం లేదని.. అందుకు ముందుగా రాముని తల్లి కౌసల్యను కలిసాడు,ఎన్ని ఒట్లు పెట్టుకున్నాడో, నేనైతే ఒట్లు పెట్టుకున్నాడని తేల్చేసేను. ఆనాటికి ఘోరపాపాలేవైతే ఉన్నాయో అవన్నీ తాను చేసినవాడినౌతానని చెప్పేడు. చివరికి మనం వెళ్ళి రాముని తీసుకొద్దామని చెప్పి పెదతల్లికి నమ్మకం కలగజేసేడు. రామునికి బహిఃప్రాణం లక్ష్మణుడు, అలాగే తన బహిఃప్రాణం శత్రుఘ్నుడు, లక్ష్మణ, శత్రుఘ్నులు కవలపిల్లలు, సుమిత్ర కొడుకులు. అటువంటి సుమిత్ర దగ్గర ఏడ్చేడు, తనగోడు వినిపించేడు, కౌసల్య దగ్గర పెట్టుకున్నన్ని ఒట్లూ పెట్టుకున్నాడు, మనం రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నాం, అనీ చెప్పేడు. నిజానికి ఇంత చెప్పక్కరలేదు, ఈ పెదతల్లికి, కాని చెప్పేడు. తన బహిఃప్రాణమైన తమ్ముడు, శత్రుఘ్నునికి తనేమిటో తెలుసు, తన తమ్ముని ద్వారా సుమిత్రకీ తెలిసి ఉండే సావకాశాలే మెండు. కాని అలాగని ఉపేక్ష చేయలేదు.కౌసల్య దగ్గర చెప్పినదంతా ఇక్కడా చెప్పేడు, పెదతల్లికి నమ్మకం కలగజేసేడు. ఆపై పౌరులు,జానపదులకూ తెలిసేందుకుగాను సభచేసి ప్రకటించాడు. తాను చెప్పడమే కాదు, అది నిజమనిపించేందుకుగాను, పట్టపుటేనుగు బయలుదేరినా దానిని ఖాళీగానే ఉంచి, తాను గుఱ్ఱం మీద మాత్రమే బయలుదేరాడు. ఎందుకిలా చేసాడు? రాజుమాత్రమే పట్టపుటేనుగు ఎక్కేందుకు అర్హుడు, తాను రాజుకాదని ప్రజలకి తెలియజేసేందుకే అలా చేసేడు. మరి పట్టపుటేనుగెందుకు ఖాళీగా? తిరిగి వచ్చేటపుడు రాముని కోసం. సైన్యమెందుకు? రాణివాసానికి రక్షణ. అంతేకాదు రాజు ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు, సైన్యం కూడా ఉండాలి. తిరిగొచ్చేటపుడు రాముడు రాజు గనక సైన్యం కూడా ఉండాలి. ఇక మంత్రులు ఎందుకు? మంత్రులందరూ బుద్ధి కుశలురై ఉంటారు, అనుకోని అవాంతరాలలో ఆలోచనకి అవసరపడతారు. ఇక పౌరులు,జానపదులు ఎందుకు? పౌరులు,జానపదులూ నీ తిరిగిరాక కోరుతున్నారని రామునికి తెలియజేసేందుకు, ముఖ్యులు కూడా ఉండేందుకు. ఇన్ని ముందు జాగరతలూ తీసుకున్నాడు, భరతుడు, రాముని తిరిగి రమ్మని చెప్పడానికి. అంతేకాదు తన ప్రయత్నలోపం ఉండకూడదనీ, తన ఆంతర్యం అందరికీ తెలియాలనీ ఇన్ని పనులు చేసేడు. భరతుడు బుద్ధిశాలి.
ఇలా ఇంట నమ్మకం కలగజేసి,వారి మనసులు గెలిచాడు, ఇదే ఇంట గెలవడం. ఇక రచ్చ ఎలాగెలిచాడో తదుపరి చూదాం.
తరువాయి...
రాముని రాజ్యం-భరతుని పట్టం-1
రామం దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజం
అయోధ్యా అటవీం విద్ధి
గఛ్ఛ తాత యధా సుఖం
సుమిత్రా దేవి
రాజ్యం రామునిదే, నాకీ రాజ్యం వద్దు, అన్నవాడు భరతుడు, ఇది నిజం కూడా, కాని ఈ నిజాన్ని నమ్మించడానికి భరతుడు పడ్డపాట్లు తెలుసుకోవలసినవే! ''రామునిరాజ్యం-భరతుని పట్టం'' అన్నదానిని ''రామరాజ్యం-భరతుని పట్నం'' అని కూడా అంటుంటారు. నిజానికి, రాముని రాజుగా పట్టాభిషేకం చేసినది భరతుడే!!!
***
ఋషులు,మునులు, పౌరులు,జానపదుల అనుమతితో రామునికి యువరాజ పట్టాభిషేకానికి తలపెట్టేడు, దశరథుడు. సంగతి తెలిసిన కైక చాలా ఆనందించింది. కాని మంథర, దశరథుడు కైకకిచ్చిన వరాలను గుర్తుచేసి, వాటిని కోరి, ''నీకుమారునికి పట్టాభిషేకం చేయించుకో'' అని బోధచేసింది. ఆ మాట తలకెక్కిన కైక
వరాలు కోరింది. రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి, భరతునికి పట్టాభిషేకం చేయాలి. సీతారామ,లక్ష్మణలు నార చీరలుగట్టి అరణ్యవాసానికి వెళ్ళారు, దశరథుడు కైకకిచ్చిన వరాలు అమలు చేయడానికి. రాముని విడచి ఉండలేని దశరథుడు అసువులుబాసాడు. రామలక్ష్మణులు అడవులకు పోయారు, భరత శత్రుఘ్నులు, భరతుని మేనమామ ఇంట ఉన్నారు. దశరథునికి నలుగురు కొడుకులున్నా, చనిపోయేనాటికి ఒక్కరూ దగ్గరలేకపోవడంతో, అంత్యక్రియలు జరుపడానికి, తైలద్రోణిలో వేసి ఉంచారు.
వశిష్టులు ఇలా కబురు పెట్టారు, భరత,శత్రుఘ్నులకు,"రాజకుమారులు అత్యవసరంగా అయోధ్యలో నెరవేర్చవలసిన కార్యం ఉన్నందున, సత్వరం రావలసింది". కబురందుకున్న భరతుడు మేనమామ,తాతగార్ల అనుమతితో అయోధ్యకు బయలుదేరాడు.
అయోధ్య చేరిన భరతునికి పట్టణం వెలవెల బోతూ కనపడింది. తిన్నగా తల్లి దగ్గరకు చేరాడు. తండ్రి మరణవార్త తెలిసింది, దానితో సీతారామలక్ష్మణులు అడవులకెళ్ళేరు, వనవాసానికనీ తెలిసింది. పెద్దవార్త తల్లి చెప్పింది, దశరథుని తాను వరాలు కోరినట్టూ, వాటి అమలుకుగాను రాముడు పదునాలుగేళ్ళు వనవాసం వెళ్ళినట్టు, భరతుని పట్టాభిషేకం చేసుకోమని చెప్పింది. విన్న భరతుడు హతాశుడయ్యాడు. తల్లిని తూలనాడాడు, చివరగా తానెప్పుడైనా నవ్వులాటకైనా రాజ్యపాలన చేయాలని అన్నానా! అని కూడా అడిగాడు. పట్టాభిషేకం చేసుకోమన్న మంత్రి, పురోహిత,పౌరులకు తామందరం రామునివద్దకు వెళుతున్నామనీ, రాముని వెనక్కు తీసుకొచ్చి పట్టాభిషేకం జరిపిద్దామనీ చెప్పాడు.
****
అవగాహన:
తన ప్రమేయం లేకనే తనపట్ల నష్టం జరిగిపోయింది. విచలుతుడై తల్లిని తూలనాడినా, నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.
తండ్రి మరణం, నష్టం పూడ్చుకోలేనిది, తండ్రి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేయడం తప్ప.
తన రాజ్య పట్టాభిషేకం, తన ప్రమేయం లేకనే తల్లి నిర్ణయించడం. తన ప్రమేయం ఆ నిర్ణయంలో లేకపోయినా, అపార్ధం చేసుకునేవాళ్ళు. పెదతల్లులు, అన్న,వదిన,తమ్ముడు, మిగిలినవారు, బంధుకోటి,ప్రజలు. మొదట నష్ట నివారణ చర్యగా మంత్రులకు రాముని దగ్గరకు వెళుతున్నాం, వెనక్కి తీసుకురావడానికి, సిద్ధం చేయమని చెప్పడం.తండ్రికి అంత్య క్రియలు చేయడం.
ఇంకా కలిగిన నష్టాలను భరతుడు ఎలా అధిగమించాడో తరవాత చూదాం.
****
ఆలోచన.
నాటి కాలానికే పార్థివ శరీరాలని పాడవకుండా ఉంచే ప్రక్రియలున్నాయని తెలుస్తోంది.
భరతునికి కబురుపంపినది వశిష్ఠులు, ఇదేమి? గురువులు కబురుపంపండం అనే ఆలోచనే రాలేదెవరికి. అయోధ్యలో జరిగినదేమో భరతునికిగాని అతని మేనమామ,తాతగార్లకూ తెలియదు. కబురు పంపినవిధం విచారణీయం.
భరతుడు తల్లిదగ్గరకు రాగానే తెలిసినవి పిడుగులాటి వార్తలు.తండ్రి మరణం, అన్నదమ్ములు,
వదిన అడవులపాలవడం, రాజ్యభారం వహించమని తల్లి చెప్పడం (తన ఇష్టానికి వ్యతిరేకంగా)ఒక్కసారిగా సంయమనం కోల్పోయేలా చేసాయి భరతుని. ఇంతటికి కారణం తల్లి అని గుర్తించి, తల్లిని తూలనాడేడు.
జరిగినదానికి విచారించిన భరతుడు కర్తవ్యాన్ని గుర్తించి, తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మంత్రులకు తాము రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నామని, బాటలు ఏర్పాటు చూడమని,సైన్యాన్ని సిద్ధం చేయమని, పట్టపుటేనుగును సిద్ధం చేయమని,తాను రాజ్యభారం వహించటం లేదని, రాముడే రాజ్యాధికారని చెప్పడం జరిగింది, మంత్రులు,పురోహితులు, పౌరజానపదులూ, పట్టాభిషేకం చేసుకోమని చెబుతున్నా.కొద్ది రోజులకితమే ఈ పౌరులే రాముని వెంబడించి అడవులకీ వస్తామన్నావారు. (Public memory short lived, అంటే ఇదేనేమో.)
******
(విషయం పెద్దది. ఒక టపాలో రాయడం నా వల్ల కాలేదు. అందుకు భాగాలు చేయక తప్పలేదు, మన్నించాలి. మొదలుపెట్టి చాలాకాలంగా పూర్తి చేయక వదలివేసినది. నేటికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఈ భాగాన్ని పూర్తి చేయగలిగాను. మిగిలినది పూర్తి చేయాలని కోరిక, ఆపై అమ్మదయ.)
(విషయ సంగ్రహణ: వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం నుంచి. ప్రచురణ:గీతా ప్రెస్)
శ్రీ మాత్రేనమః
నమః శంభవే చ మయోభవే చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ చ శివతరాయ చ
***
తిట్టినవారికి,దీవించినవారికి;
శత్రువులకు,మిత్రులకు;
అనామకులకు,అనామకంగా చరిస్తున్న నామకులకు
పెద్దలకు,పెద్దమనసున్నవారికి;
అభిమానులకు,వీరాభిమానులకు
ఎల్లరకు
శోభకృతు
నామ సంవత్సర
ఉగాది శుభకామనలు.
పిన్నలకు దీవెనలు, ఉగాది శుభకామనలు.
శతంజీవ శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి
శతమేన మేన శతాత్మానంభవతి శతమనంతం భవతి
శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాహుః మరుతయేనా వర్ధయంతి.
దీర్ఘాయుష్మాన్భవ
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ.
ఓం శాంతి శాంతి శాంతిః
సర్వేజనాః సుఖినో భవన్తు.
శోభకృత్ శోభను కలగజేస్తుంది. ఈ రోజు మార్చి 22 ప్రత్యేకమైనరోజే! రోజూ సూర్యుని ఉదయమే గమనిస్తే ఈ రోజు మార్చ్ 21/22 భూమద్యరేఖమీద ఉంటాడు. రాత్రి పగలు సమానంగా ఉండే రోజు.
***