నా నోట్లో నీ వేలు పెట్టు..
నా నోట్లో నీ వేలు పెట్టు, నీ కంటిలో నా వేలు పెడతా!
ఇదే కొన్ని గొప్ప దేశాల మాట.
నా నోట్లో నీ వేలు పెట్టు..
నా నోట్లో నీ వేలు పెట్టు, నీ కంటిలో నా వేలు పెడతా!
ఇదే కొన్ని గొప్ప దేశాల మాట.
చిత్రం: చిరంజీవులు (1956)
పొరుగింటి పుల్లకూర......
తెనుగు భాషా దినోత్సవ శుభకామనలు.
తెనుగు భాషా దినోత్సవ శుభకామనలు అని సందేశం పంపిందో మనవరాలు తెనుగుపంతులమ్మ. మొన్ననో సారి మాటల్లో గురువుగారు అనడం మొదలెట్టింది,తాతా అనేమాట మోటనుకుందో....ఏం వరస మార్చావన్నా! పెద్ద స్థానం ఇచ్చేనంది,తెలివైనది కదూ,అందుకు.
గురు శబ్దస్యంధకారస్య,రుశబ్దతన్నిరోధకః. ఇదీ గురు శబ్దానికి అర్ధం. గురువు లెక్కడ. నేటి కాలంలో గురువులు లేరు,అంతా టీచర్లే నువ్వు ఏంచేస్తావంటే తెనుగు టీచర్ని అంటున్నారు. కలగలుపైనా పొరుగింటి పుల్లకూర కలుపుకుంటున్నారు.
మొన్న ఒకసారి లోక్ సభలో చర్చలో ఒక ప్రశ్నకు తక్షణం స్పందిoచి, శ్రీ రామ్మోహన్ నాయుడు సమాధానమిస్తూ నేను తెనుగువాడిని, తెనుగు మాటాడగలను,అరవం,మలయాలం,హిందీ మాటాడ్తా! ఏది,నువ్వు తెనుగు మాటాడగలవా? అడిగేటప్పటికి ఆ నాయకుడే కాదు,మొత్తం లోక్ సభ నిశ్శబ్దమైపోయింది. అదీ తెనుగు భాష శక్తి,తెనుగువాడి శక్తి.
నేటి కాలంలో ముద్దొస్తే కిస్స్ పెడుతున్నారు తెనుగువారు. ఇక రాసేటప్పుడు అపశబ్దాలకి లోటే లేదు. ఆపై, ఒత్తులు పొల్లులు పోయాయి,ఇది సెల్ఫోన్ సౌడభ్యం! చిన్న ఆశ తెనుగులో రాయాలనే కోరికతో చేస్తున్నపొరబాటు, ఎంత చెప్పుకుని ఏమి ఉపయోగం. ఇద్దరు తెనుగువాళ్ళు కలిస్తే ఇంగ్లీషులో మాటాడుకుంటున్నారు,మరి తెనుగెక్కడ? వాడుకభాషలో ఇంగ్లీష్ మాటలేక మాటాడలేకపోతున్నారు,తెనుగు పంతుళ్ళూ,పంతులమ్మలూ కూడా!
ఇదేమి పుల్లకూరని మొదలెట్టి ఇలా చెండాడుతున్నవనకండి. మనసులో బాధ (అదే బాద) చెప్పుకుంటున్నానంతే! పుల్లకూర అంటే గోంగూర అని కూడా కొన్ని చోట్ల వాడుక.
పొరుగింటి పుల్లకూర రుచి అనేది ఒక తెనుగు నానుడి.
నిజమే పక్కింటి కూర పుల్లగా రుచిగానే ఉంటుంది. నిత్యం దాన్నే వాడితే అనారోగ్యం చేస్తుంది. అందుచేత పక్కింటి పుల్లకూర అవసరం మటుకు వాడుకోవాలి, భాషతో సహా. కష్టం వచ్చిన ప్రతి సారి అమెరికాను నిషేధించు,చైనాను నిషేధించు అనడం కాదు. జీవితం లో దేనినీ నిషేధించకు,నిషేధించలేవు, ఇదీ సత్యం. ఎంత అవసరమో అంత వాడుకో నీదగ్గర దొరికే వస్తువులని అమ్మీజాన్ లోనూ,జొమొటో లోను ఎందుకు తెప్పించుకోవాలి? నీదైనదాన్ని వదులుకోడమేం? తనది పాలుకిచ్చి తను కూలికి వెళితే బాగోదు. బద్ధకం,కావలసినవాటిని జాబితా రాసుకుని, బజారుకి సంచీ కూడా పట్టుకుపోయి,ఒక్కొకటే కొనుక్కుని రావచ్చు, ఒక శలవురోజు. అబ్బే కాలు కదలదు,బిళ్ళలేసుకుని కూచో! అంటే ఆనందం. ఇందులోనూ మనదైన వైద్యం గచ్చాకు,పుచ్చాకు వైద్యం అంటే వెగటు. నిజం చెప్పాలంటే గచ్చ,పుచ్చ గొప్ప మందులు తెలుసా! తెలుసుకో! బిళ్ళలు చాలు అనుకుoటే మన బతుకింతే. అందుకే రక్త పోటు 120/80 ని 115/70 గా మార్చేసారు,అమెరికా వారు. ఇప్పుడందరూ రక్తపోటు బాధితులే, వేసుకోండి బిళ్ళలు. పొరుగింటి పుల్లకూర రుచి మహాత్మ్యం.
అందరినీ మారు అంటున్నవు, నువ్వు మారచ్చుగా అడగచ్చు. నిజం,మారాలనే ఉంది,మారలేను కారణం జీవిత చరమాంకానికొచ్చేసేను,నేడో,రేపో. ఇప్పుడున్న బాధలు చాలు,మారి కొత్త బాధలు తెచ్చుకోలేను.
గిడుగువారిని మొదటగా తలుచుకోకపోవడం నా తప్పే
కీలెరిగి ......
కూర్చోగలిగితే పడుకోవద్దు.
నిలబడగలిగితే కూచోవద్దు.
నడవగలిగితే నిలబడవద్దు.
పరుగు పెట్టగలిగితే నడవద్దు.
మాటడటం చేతకానప్పుడు మౌనంగా ఉండటమే మంచిది.
నిలబడితే కలబడుతుంది,కలబడితే నిలబడుతుంది లోకం.
అందుచేత ఎప్పుడూ కలబడ్డానికి సిద్ధంగా ఉండు.
ఆబోతులు దెబ్బలాడుకుంటే లేగదూడల కళ్ళు విరుగుతాయి.
యూక్రైన్ కి అనుభవం అయిందనుకుంటా.
కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డునాకడం అందంగా ఉండదు.
కీలెరిగి వాత పెట్టాలి.
నీలాపనింద.
అందరికి వినాయక చవితి శుభకామనలు
నింద,అపనింద,నీలాపనింద.
ఈ నీలాపనింద నాటికాలంలో శ్రీకృష్ణునికే తప్పలేదు, సత్రాజితుని చంపి శ్యమంతకమణిని దొంగిలించేడని. నేడు భారత్ రష్యానుంచి ఆయిల్ కొంటూ యూక్రైన్ యుద్ధానికి ప్రోది చేస్తోందని అమెరికా ఆపాదించడం,దానికోసం తమ దేశానికి భారత్ నుంచి దిగుమతి అయ్యే సరుకులపై సుంకాలు పెంచుకున్నారు. సుంకాలు ఎవరిమీద వేస్తున్నారు? మీ ప్రజలమీదే! ఆ సుంకం ఎవరికి చేరుతుంది? మీకే! ఇదెలా ఉందంటే అత్తమీద కోపమొచ్చి కూతురు ముడ్డి కుంపట్లో పెట్టుకున్న కోడలు తరహాలో ఉంది. దీని వల్ల ఏమవుతుంది,భారత్ నుంచి దిగుమతి అయిన వస్తువుల రేట్లు పెరుగుతాయి, మీవాళ్ళే కొనడం మానేస్తారు,రేట్లు పెరిగినందుకు ఇబ్బంది పడతారు. మాకూ కొంత నష్టం, కొత్త వినియోగదారులు దొరికే దాకా ఎగుమతులు తగ్గుతాయి. మరో మాట, మనం ఎదుటివాళ్ళను కోపంలో కొడితే అవతలవాడికి ఎంత దెబ్బ తగిలిందో అంత దెబ్బ మన చేతికీ తగులుతుంది.
కోపమున బుద్ధి కొంచమై యుండును. కొనుక్కునేవాడు రూపాయ తక్కువధర ఉన్నచోట కొనుక్కుంటాడు,అమ్ముకునేవాడు రూపాయి ఎక్కువ వచ్చేచోట అమ్ముకుంటాడు, ఇది సార్వజనీన సత్యం.
పెద్దవాళ్ళం అనిపించుకోవాలంటే కోపం తగ్గించుకోవాలి. ఎవరి మీదనో నీలాపనిందవేసి,వారిని ఇబ్బంది పెడుతున్నామనుకుని ఇబ్బంది పడటం తెలివైనవారి పనికాదు.
పదియు, నైదు, నైదు, పదునైదు.....
చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు. అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి.
దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే వాయసరాజు ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి వాయసరాజు ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే
1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడాదు.
2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.
3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.
4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.
5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో రాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.
6.వాయసరాజు బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా వాయస రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.
7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.
వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.
జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము.
ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.
అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.
కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.
పెళ్ళి భోజనాలు - వడియాలు
పెళ్ళిలో భోజనాలంటే ఒక యజ్ఞం లా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. ఐదు రోజుల పెళ్ళిలో చెప్పేదే ముంది, పూట పూటా సంబరమే. పెద్ద పెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువా లో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగు పక్కల వేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరి వేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకు గాని, తాటాకు చాపలు గాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు. సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది. పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా, ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండి వంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్య కూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవింద నామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభ మయ్యేది, తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచ కట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించే వారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు. వడ్డన సామానుల పేర్లే మరిచి పోతున్నారు ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడే పాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి, పప్పండి, పప్పండి అని వడిగా అంటు కదిలే వాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి, నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబ గబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడి అన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్న మండి తో ప్రారంభించి, మీ కన్న మండి, మీ కన్న మండి, మీ కన్న మండి అంటూ సాగిపోయేవారు. మీకు + అన్న మండి = మీ కన్న మండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆట పట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు, ఒరేయ్ సుబ్బన్నా, ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాత గారికి పడుచు పెళ్ళాం కావాలంటు న్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చిన తరవాత ఇదేమిటి ఇవి తెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలు కావలన్నారని అనేవాడు, యువకుడు. అప్పుడు తాతగారు ఒర్నీ, వడియాలంటె పడుచు పెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలు కావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా, పెళ్ళి చేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా, అనే వారు కాని వద్దనేవారు కాదు. అది ఒక సరదా. వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు. ఇప్పుడు అర్ధమైనదనుకుంటాను, అప్పడాలు (అప్పటి+ ఆలు = అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా (వడి + ఆలు = వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచి నీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసు ల్లో మంచి నీళ్ళు పోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చిన వారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయింది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా. భోజనాల దగ్గర నుంచి అంతా ఒక సారి లేచే వారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారి కోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యే దాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాల లో కూడా ఇలా సరదా చూపే వారు. అలా సందడి సందడి గా భోజనాలు ముగిసేవి. ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని, వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి, ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం. మాధాకవళం బ్రతుకులై పోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను. అందం, హాస్యం చచ్చిపోయాయి.
Courtesy: whats app 🤣
******
పదునాలుగేళ్ళ తరవాత నేను వ్రాసినది what's app లో తిరిగి నాకే వచ్చింది, 30.11.2011 నాటిది
మనసున మనసై.....
మనసున మనసై బతుకున బతుకై
తోడొకరుందిన అదే భాగ్యము అదే స్వర్గము
సినీకవి మాట నూటికి నూరుపాళ్లు నిజం.
మనసున మనసై దగ్గరగా అరవై ఏళ్ళు కలిసి బతికి, ఏడేళ్ల క్రితం ఇహలోక యాత్ర చాలించిన ఇల్లాలు జ్ఞాపకాలు మిగిల్చి దివి కేవినది, ఈ రోజు. నాటి నుంచి మనసు లేని రాయిలా బతికేస్తున్నాను,ఎందుకో తెలీదు.
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఊరు,విడచి వాడ విడచి ఎంతదూరమేగినా
ఐనవారు అంతరాన ఉందురోయ్!
అల్లి పళ్ళు
వీధి కుక్కల సమస్య-ఒక పరిష్కారం.
మానవులు పశువులతో సహజీవనం చేయడం ఈ వేళ కొత్తమాటేం కాదు, వాటిని ప్రేమగా సాకడం కూడా కొత్తమాట కాదు.
నాకు తోచిన మటుకు సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం. కుక్కలు,డేగలు,పావురాలు,కోతులు ఇలా అన్ని జంతువులూ దేశరక్షణలో పని చేస్తాయంటే నమ్మలేరు. హక్కుల సంఘాలవారు సమస్య ప్రభుత్వం మెడకి వెయ్యాలనే తాపత్రయం తప్పించి దానిని పరిష్కరి0చాలని అనుకోవు, కారణాలనేకం. పెటా లాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
దేశీ గాడిదలకి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. మనగాడిదలు జపాన్ గాడిదల తరవాత లెక్కలో కొస్తాయి. పాకిస్తాన్ గాడిదలు కూడా మన దేశగాడిదలతో పోటీ పడతాయి. గాడిదలు పెంచి ఎగుమతి చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు.
కుక్కలు దేశరక్షణలో పాలు పంచుకుంటాయన్నది జగమెరిగిన సత్యం. విదేశీ కుక్కలే కాదు, మన కుక్కలు కూడా ఇందుకు తీసిపోవు. ఐతే వాటికి శిక్షణ ఇచ్చి తీర్చి దిద్దాలి. రక్షణ రంగం ఈ పని కొంత చేస్తుంది, కాని ప్రైవేట్ రంగం దీని పైన శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. ప్రభుత్వం వీటి గురించి శిక్షణ సంస్థలు నెలకొల్పితే జరిగేదేంటో తెలియనిదేంకాదు. నిజమైన జంతు ప్రేమ ఉన్న సంస్థలకి ప్రోత్సాహం ఇచ్చి ఇలా కుక్కలను వినియోగించుకోవచ్చు.
గద్దలు,డేగలు ఇప్పటికే రక్షణ రంగంలో ఉన్నాయి. అంతే కాదు విమానాశ్రయాలలో పక్షుల బెడద లేకుండా చేయడానికి డేగలు,గద్దలని ఉపయోగిస్తున్నారు. పావురాలు రక్షణ రంగంలో పని చేయడం నేడు కొత్త విషయమూ కాదు. నాకు తెలిసి కోతులను కూడా రక్షణ రంగంలో వినియోగించచ్చు అనుకుంటాను. ఇలా దేశీయ వనరులను వినియోగించుకున్నపుడే మనం సమస్యలని అధిగమించగలం. పెటా లాటి సంస్థలని దేశం నుంచి తరిమెయ్యచ్చు. హక్కుల సంఘాల వారు పాపం నిరుద్యోగులైపోతారు. పేరెన్నికగన్న లాయర్ల నోటి దగ్గర కూడు పడిపోతుంది 🤣
వీధి కుక్కలు
సుప్రీం కోర్టు ఒక్కసారి ఉలిక్కిపడి,వీధి కుక్కల్ని సురక్షిత స్థానాలకు తరలించి,ప్రజల్ని కాపాడమని ఢిల్లీ అధికారులను ఆదేశించింది. దీనిని అమలు చేసేటపుడు ఎవరైనా అడ్డుపడితే అది కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పింది. ఏం జరగబోతోంది, చూడాలి.
కుక్కలకు స్వేచ్ఛగా జీవించే హక్కులేదా? ఇలా కుక్కల్ని జైళ్ళలో వేసి చంపేస్తారా అని కుక్కల హక్కుల సంఘాలవారు సుప్రీం కోర్ట్ మీద దండయాత్ర చేసినంత పని చేసారు. దాంతో ప్రధాన న్యాయమూర్తి కలగజేసుకుని కుక్కల హక్కులు మిగతా విషయాల గురించి విచారించడానికి ముగ్గురు న్యాయ మూర్తుల బెంచీని ఏర్పాటు చేసారు. హక్కుల సంఘాలవారికి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకోడానికి డబ్బులెక్కడినుంచి వస్తాయో తెలీదు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు తేలుస్తారో మొత్తం ఫుల్ కోర్ట్ సమావేశం కోరతారో వేచి చూడాలి. ఫుల్ కోర్ట్ సమావేశం జరిగినా ఆశ్చర్య పడక్కరలేదు. వేచి చూదాం! కుక్క కరిస్తే ఒకడేకదా చచ్చేది దీనికింత రాద్ధాంతం అవసరమా అనే వారే కనపడుతున్నారు.
మానవులకేనా భూమి మీద బతికే సావకాశం? కుక్కలకి ఇతర జంతువులకీ సమానంగా బతికే హక్కు లేదా? కొన్ని జంతువులు అడవుల్లోనే ఎందుకుండాలి? అవీ మనతో పాటు ఉండచ్చుగా! హక్కుల సంఘాలవారు పెంచూకోనూ వచ్చు. పులలను సింహాలను అరబ్ దేశాలలో పెంచుకోడం లేదూ? మానవులదేముంది లెండి,ఈ వేళ ఉంటారు,రేపు పోతారు. మా జంతు రాజ్యం పరిపాలనకోస్తే ఎట్టుంటదో తెలుసా! అంతా సమానం ఎవరికి కావలసినది వారు వేటాడుకుని నచ్చినదాన్ని తినెయ్యచ్చు. జంతు రాజ్యం జిందాబాద్!
నాకూ సొతంత్రం వచ్చింది.
***
నాకూ సొతంత్రం వచ్చింది.
🤣🤣🤣🤣🤣
ఎందుకంత పడి,పడి నవ్వుతావు?
నీకు సొతంత్రమొచ్చిందా? ఎలా బాబూ!
నా చెయ్యి,నా కాలు,నా నోరు,నా చెవి, నా ముక్కు అంటున్నావుకదా! ఇవే కర్మేంద్రియాలూ,జ్ఞానేంద్రియాలూ కదూ!
అవును అనుమానమేంటీ?
నిజం కదూ! 🤣🤣🤣
అదేమిమాటా?
నీవి అనుకుంటున్నవన్నీ నీ అధీనంలో లేవు. నీ మనసు అధీనంలో ఉన్నాయి. అవునుకదా!
నీ మనసు నీ అధీనంలో లేదు. నువ్వు నీ మనసు అధీనంలో ఉన్నావు. నీకు సొతంత్ర ఎక్కడా? మనసు సంకెళ్ళనుంచి బయటపడు,అప్పుడూ నీకు సొతంత్రమొచ్చినట్టు.
మనసు బానిసత్వం నుంచి సొతంత్రం పొందు.
*****
మనసు బానిసత్వం నుంచి బయటపడిన వారందరికి సొతంత్ర దిన శుభకామనలు.
లా వొక్కింతయు/ లావొక్కింతయు
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
భయం
*ఇది హాస్యం కాదు…🙏*
*దయచేసి చదవండి, మీకు నచ్చితే ఇతరులతో కూడా పంచుకోండి!*
### *!!! అల్ట్రా-మాడరన్ మెడికల్ సైన్స్ !!!*
*డా. అనన్యా సర్కార్ రచన*
మీకు రెండు లేదా మూడు రోజుల పాటు జ్వరం వచ్చింది. మందులు తీసుకోకపోయినా, మీ శరీరం కొన్ని రోజుల్లోనే స్వయంగా కోలుకుంటుంది..
కానీ మీరు డాక్టర్‌ను సంప్రదించారు.
డాక్టర్ మొదటినుంచే పలు టెస్టులు రాసేశారు.
పరీక్షల్లో జ్వరానికి స్పష్టమైన కారణం కనపడలేదు.
కానీ కొద్దిగా కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవల్స్ పెరిగినట్టు చూపించాయి — ఇవి చాలా మందిలో సాధారణంగా ఉండే విషయాలే.
జ్వరం తగ్గిపోయింది.
కానీ ఇప్పుడు మీరు కేవలం జ్వరంతో ఉన్న వ్యక్తి కాదు.
డాక్టర్ మీకు చెప్పారు:
> "మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. షుగర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అంటే మీరు ప్రీ-డయబెటిక్. మీరు కొలెస్ట్రాల్ మరియు షుగర్ కంట్రోల్ చేసే మందులు వాడటం మొదలుపెట్టాలి."
దీనితో పాటు అనేక ఆహార నియమాలు విధించబడ్డాయి.
మీరు ఆహార నియమాలను కచ్చితంగా పాటించకపోయినా — మందులు తీసుకోవడం మాత్రం మరిచిపోలేదు.
మూడు నెలలు గడిచాయి. టెస్టులు మళ్లీ జరిగాయి.
కొలెస్ట్రాల్ కొద్దిగా తగ్గింది.
కానీ ఇప్పుడు మీ *బీపీ* కొంచెం పెరిగిపోయింది.
ఇంకో మందు వచ్చేసింది.
ఇప్పుడు మీరు *మూడు మందులు* వాడుతున్నారు.
ఇవన్నీ విని మీకు *ఆందోళన* పెరిగింది.
> “ఇంకా ఏమి జరుగుతుంది?”
> ఈ టెన్షన్ వల్ల మీరు *నిద్రలేమి*తో బాధపడడం మొదలుపెట్టారు.
> డాక్టర్ *నిద్ర మాత్రలు* రాసేశారు — ఇప్పుడు మందుల సంఖ్య *నాలుకైంది*.
ఈ మందుల వలన మీకు *అమ్లత (acidity)* మరియు *జ్వాల (heartburn)* మొదలయ్యాయి.
డాక్టర్ చెప్పారు:
> “ఆహారానికి ముందు ఖాళీ కడుపుతో గ్యాస్ టాబ్లెట్ తీసుకోండి.”
> ఇప్పుడు మీ మందుల సంఖ్య *ఐదు*.
ఆరు నెలల తర్వాత ఒకరోజు మీకు *ఛాతీలో నొప్పి* వచ్చి ఎమర్జెన్సీకి వెళ్లారు.
పూర్తి చెకప్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు:
> “మీరు సమయానికి వచ్చారు, లేకపోతే పరిస్థితి తీవ్రమయ్యేది.”
మరిన్ని టెస్టులు అవసరమయ్యాయి.
వెరిఫై చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు:
> “ప్రస్తుతం ఉన్న మందులు కొనసాగించండి. కానీ గుండె కోసం ఇంకో రెండు మందులు వేసుకోవాలి. అలాగే ఎండోక్రినాలజిస్ట్‌ను కలవండి.”
> ఇప్పుడు మీరు *ఏడు మందులు* వాడుతున్నారు.
కార్డియాలజిస్ట్ సలహాతో, మీరు ఎండోక్రినాలజిస్ట్‌ను కలిశారు.
ఆయన ఇంకో *షుగర్ మందు* మరియు *థైరాయిడ్ టాబ్లెట్* చేర్చారు — ఎందుకంటే థైరాయిడ్ లెవల్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
ఇప్పుడు మొత్తం *తొమ్మిది మందులు*.
ఇలా మీరు నెమ్మదిగా మీరు అనారోగ్యంతో ఉన్నవారని నమ్మడం ప్రారంభించారు:
* గుండె రోగి
* డయాబెటిక్
* నిద్రలేమి బాధితుడు
* గ్యాస్ సమస్యలు
* థైరాయిడ్
* కిడ్నీ సమస్యలు
... ఇంకా చాలానే
ఎవ్వరూ మీకు చెప్పలేదు — మీరు మెరుగైన *మనోబలం, ఆత్మవిశ్వాసం మరియు జీవనశైలితో* ఆరోగ్యంగా ఉండవచ్చని.
అదే బదులుగా, మీకు పదే పదే చెప్పబడింది — మీరు తీవ్రమైన రోగి, బలహీనుడు, విఫలమైన వ్యక్తి అని.
ఆరు నెలల తర్వాత ఈ మందుల దుష్ఫలితాల వలన మీకు *మూత్ర సంబంధిత సమస్యలు* మొదలయ్యాయి.
అదనంగా టెస్టులు చేశారు — *కిడ్నీ సమస్యలు* ఉన్నట్టు అనుమానం వ్యక్తమైంది.
డాక్టర్ మరిన్ని టెస్టులు చేశారు. రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పారు:
> “క్రియాటినిన్ లెవల్స్ కొద్దిగా పెరిగాయి. కానీ ఆందోళన అవసరం లేదు — మీరు మందులు క్రమంగా తీసుకుంటే సరిపోతుంది.”
> ఇప్పుడు ఇంకో *రెండు మందులు* చేర్చారు.
ఇప్పుడు మీరు *పదకొండు మందులు* తీసుకుంటున్నారు.
మీరు ఇప్పుడు ఆహారంకంటే *ఎక్కువ మందులు* తీసుకుంటున్నారు, మరియు ఆ మందుల దుష్ప్రభావాల వలన మీరు *మెల్లగా మరణం వైపు* నడుస్తున్నారు.
ప్రారంభంలో, మీరు జ్వరంతో డాక్టర్‌ను కలిసినప్పుడు, ఆయన ఇలా చెప్పి ఉంటే ఎలా ఉండేది?
> "ఎటువంటి భయం అవసరం లేదు. ఇది తేలికపాటి జ్వరమే. మందుల అవసరం లేదు. విశ్రాంతి తీసుకోండి, ఎక్కువగా నీళ్లు తాగండి, తాజా పండ్లు మరియు కూరగాయలు తినండి, ఉదయం వాకింగ్‌కి వెళ్లండి — అంతే. మందులేమీ అవసరం లేదు."
*కానీ అలా అయితే… డాక్టర్లకు మరియు ఫార్మా కంపెనీలకు ఆదాయం ఎలా వస్తుంది?*
---
### ముఖ్యమైన ప్రశ్న:
*డాక్టర్లు హై కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు అని ఎలా నిర్ణయిస్తారు?*
*ఈ ప్రమాణాలను ఎవరు నిర్ణయిస్తారు?*
ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం:
* *1979లో, డయాబెటిస్ గా పరిగణించే బ్లడ్ షుగర్ లెవల్ **200 mg/dl*.
అప్పట్లో ప్రపంచ జనాభాలో కేవలం *3.5%* మాత్రమే టైప్-2 డయాబెటిక్‌గా గుర్తించబడ్డారు.
* *1997లో, ఇన్సులిన్ తయారీ సంస్థల ఒత్తిడితో, ఈ పరిమితి **126 mg/dl*కి తగ్గించబడింది.
దీంతో డయాబెటిక్ జనాభా \\*3.5% నుండి 8%\\కి పెరిగింది — అంటే **4.5% మంది అసలైన లక్షణాలు లేకుండానే రోగులుగా మారిపోయారు*.
*1999లో*, WHO దీనిని అధికారికంగా ఆమోదించింది.
ఇన్సులిన్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయి. మరిన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పాయి.
* *2003లో, **అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA)* ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్‌ను *100 mg/dl*గా పేర్కొంది — దీన్ని ప్రీ-డయాబెటిక్‌గా తీసుకున్నారు.
దాంతో *27% జనాభా డయాబెటిక్‌గా మారిపోయారు* — ఎటువంటి అసలు కారణం లేకుండానే.
* ప్రస్తుతం ADA ప్రకారం, *భోజనం తర్వాత బ్లడ్ షుగర్ 140 mg/dl* అయినా డయాబెటిస్ గా పరిగణిస్తున్నారు.
దీని వల్ల ప్రపంచ జనాభాలో *సుమారు 50% మంది* డయాబెటిక్ లు అయిపోయారు — కానీ వారిలో చాలామంది వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నవారే.
భారత ఫార్మా కంపెనీలు దీన్ని ఇంకా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాయి — అంటే *HbA1c 5.5%* అని స్టాండర్డ్ పెట్టాలని చూస్తున్నారు, తద్వారా మరింత మందిని రోగులుగా మలచి మందుల అమ్మకాలు పెంచడం.
చాలా నిపుణుల అభిప్రాయం ప్రకారం *HbA1c 11% వరకు* కూడా డయాబెటిస్‌గా పరిగణించాల్సిన అవసరం *లేదంటారు*.
---
### మరో ఉదాహరణ:
*2012లో, ఒక పెద్ద ఫార్మా కంపెనీకి *\$3 బిలియన్** జరిమానా వేసింది *US సుప్రీం కోర్టు*.
2007–2012 మధ్యకాలంలో వారి డయాబెటిస్ మందు *గుండెపోటు వచ్చే అవకాశాన్ని 43% పెంచింది* అనే ఆరోపణ.
ఆ కంపెనీ ఇది ముందుగానే *తెలుసుకుని కూడా దాచేసింది* — లాభాల కోసమే.
ఆ సమయంలో వారు *\$300 బిలియన్* లాభం పొందారు.
---
*ఇదే ఈరోజు “అధునాతన వైద్య విధానం”!*
*ఆలోచించండి… ఆలోచించడం మొదలుపెట్టండి…*
---
✅ ఇది తప్పక భద్రపరచదగిన విషయం.
🧏♂️🧏♀️
*అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి — ఇదే నా మనస్ఫూర్తి కోరిక.
Courtesy:Whatsapp.
భయం మన శరీరంలోకి నరనరానా కొద్దికొద్దిగా ఎక్కించబడింది. మనదైన వైద్యాన్ని పోగొట్టుకున్నాం, చేతులారా నాశనం చేసుకున్నాం!
పేకాట పేకాటే పెద్దన్నయ్య....
పేకాట పేకాటే, పెద్దన్నయ్య పెద్దన్నాయే. ఈ నానుడిని తెనుగునాట విరివిగానే చెబుతారు.దీన్నే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనీ చెబుతారు. పేకాటలో కూచున్నాకా ఓడిపోతే ఓకులు లెక్కపెట్టి డబ్బులివ్వను, నేను అన్ననురా/తమ్ముణ్ణి అనడానికి లేదు. ఇచ్చి తీరవలసిందే. అదేదో పేకాటలో కూచునే ముందే తేల్చుకోవాలి. దీన్నే మరో ముతక సామెతగా చెబుతారు మా పల్లెటూరివాళ్ళు 'మంచం ఎక్కేదాకానే వరస, మంచం ఎక్కేకా వరసేంటి?' అంచేత పేకాటకి బంధుత్వానికి లింక్ పెట్టద్దు.
ఇదీ భారతం నుంచి వచ్చిందే! జూదానికి పిలిచినప్పుడు వెళ్ళక తప్పదు, వెళ్ళి జూదం లో కూచున్నాకా అన్నీ ఓడిపోయాడు. జరగవలసినవన్నీ జరిగిపోయాకా, గుడ్డి రాజుగారు ఇదంతా తూచ్! అనేసి వరాలిచ్చేసి పంపించేసేడు. మళ్ళీ జూదంలోనూ ఓడిపోయిన పాండవులు అడవులకు పోయారు. రాజ్య భాగం గురించిన మాట షరతుల్లో లేదు. వనవాసం తరవాత రాజ్య భాగమడిగితే సూది మొన మోపినంత కూడా ఇవ్వనన్నాడు,దుర్యోధనుడు. 'రాజ్యం వీర భోజ్యం' కనక యుద్ధం జరిగింది. గెలిచినవాళ్ళు రాజ్యం చేసుకున్నారు. ఇదిప్పటికిన్నీ జరుగుతున్నదే!
నేటికాలానికి ఈ నానుడిని వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే అని చెబుతుంటారు. రష్యాతో వ్యాపారం చేసేవాళ్ళకి పన్నులు పెంచేస్తామని అమెరికా,యూరోపియన్ యూనియన్ దేశాలు చెబుతున్నాయి. ఇదేంటి మీరు రష్యాతో వ్యాపారం చేస్తున్నారు,మమ్మలిని వద్దనడం,కాదని చేసిన వాళ్ళకి పన్నులు పెంచుతాం. ఇదేం వ్యాపారం? ఇది వ్యాపారం కాదు, వ్యవహారానికి లింకు. రష్యాని యూక్రెయిన్ తో యుద్ధం మానుకోమని చెప్పండి మేమూ చెబుతాం. కాదు మేము రష్యాతో వ్యాపారం చేసినవాళ్ళకి పన్నులు పెంచుతామని బెదిరించి రుబాబులు చేసి రోజులు గడుపుకునే కాలం చెల్లింది. రుబాబులు చెయ్యకండి వ్యాపారం వ్యాపారం లా చేయండి,వ్యవహారం వ్యవహారం లా చేయండి, రెండిటిని కలిపి ఆధిపత్యం వెలగబెట్టె రోజులు చెల్లేయని గుర్తించండని భారత్ యూరోపియన్ యూనియన్ కి తెగేసి చెప్పింది. వార్నీ! మన పేకాట సామెత అంతర్జ్యాతీయంగా వెలిగిపోతోంది.
----------------------/--------------------
ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏమాత్రం గర్వంలేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియోస్టేషనుకి కార్లో పోతున్నాము. అప్పుడు మాస్టారు –‘‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తే గాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే వానికి ఏమిమర్యాద చేయగలమా! అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదు గదా ! ఆ వేళకు మా ఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడ నుండి ఊడి పడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమ్రుతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ!? నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956లో మేడ కట్టాను. అప్పటి వరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే! కాని అప్పటి మా ఆవిడ పడిన కష్టం వాన కురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు! ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సి వచ్చేది! అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి, యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం.. కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది! లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడి నంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో, కష్టమేమిటో తెలిసినంత...సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలావుంటుంది? (అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు ఎక్కువకాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనేవుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలా మంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్యలేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె." ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!
‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి’’
‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’
అని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరు ఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.
(విశ్వనాథవారి వ్యక్తిత్వం వారిని పై పై చూపులతో చూసినవారికి అర్థం కాలేదు. వారికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు, వారి రచనలు చాలావాటికి లేఖకుడు, స్వయంగా గొప్ప కవిపండితుడు ఐన శ్రీ పేరాల భరతశర్మ గారు విశ్వనాథవారి గురించి మనసుని తాకే వ్యాసాలు కొన్ని రాశారు. అందులో ఒకదాని నుండి చిన్న భాగం ఇది!)🙏🙏
=====================
Courtesy:Whats app.
Sharing courtesy:Narasimha Rao. Vinnakota.
శవాలంకారం.
ఊపిరున్నంత కాలంలోనే వ్యక్తులను పేరుతో పిలుస్తారు ఆపై శవం అనే అంటారు. ముద్దుగా నేటి కాలంలో పార్ధివ శరీరం అంటున్నారు. పార్ధివ శరీరం అంటే శవమనే అర్ధం కదా! మరి ఈ శవానికి అలంకారం చేస్తారు. బతికుండగా అలంకారం చేస్తే ఆ శరీరంలో ఉన్నవారు ఆనందించనైనా ఆనందించేవారు. చనిపోయి శవమైన తరవాత అలంకారం ఏమి ప్రయోజనం? నిష్ప్రయోజనమని తెలిసీ అలంకారం చేయడమే చిత్రం. మానవులు బహు చిత్రాతి చిత్రమైనవారు సుమా!
మగాడు
తాతా! ఒంటరిగా అడవిలోకి పోతున్నా అందో మనవరాలు ఓ రోజు పొద్దుటే ఛాట్ లో.
ఏమైందబ్బా అని సోచాయించి,బంగారం ఒంటరిగా అడవిలోకి పోకు(జనారణ్యం లోకైనా) పెద్దపులులెత్తుకుపోతాయి. బంగారాన్ని పులెత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోనా! ఓ పని చెయ్యి. ఎక్కడిదక్కడ వదిలేసి నా దగ్గరకొచ్చెయ్యి. నీకు కోపమనిపిస్తేతిట్టు,నాకు వినపడదుగా బాధలేదు(పిచ్చి నవ్వు నవ్వుతూ ఉంటా) కొట్టాలనిపిస్తే కొట్టు పంచ్ బేగ్ లా,అనేసాను.
ఎవరి మీద కోపమొచ్చి ఉంటుందబ్బా! అని ఆలోచిస్తే,ముత్యం లాటి మొగుడు,చెప్పినమాట వింటాడు. రత్నంలాటి కొడుకు చదువుకుంటున్నాడు. రేపో,నేడో రెక్కలు కట్టుకుని ఎగిరిపోడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంక మావ కాపరానికి వెళ్ళకముందే కాటికిపోయాడు. అత్త ఎక్కడో దూరాన ఉంది. తెలుసుకుందామని ఎవరి మీదా కోపం అడిగేసా.
ఎంజాయ్ చేసే వయసులో పని,పని అని విసుక్కుంది. ఆ! బిజీగానే ఉండు,ఖాళీగా కూచోకు,అంటే జీవితం ఎంజాయ్ చెయ్యకుండా పనులు తగిలించుకున్నదెవరు? నువ్వు కాదా! తగ్గించుకో!! ఎంజాయ్ చెయ్యి, వచ్చెయ్యి,వచ్చెయ్యి అన్నా. వస్తా! మా ఆయనతో చెప్పి, అని కట్ చేసింది.
-------------
కట్ చేస్తే
పడిపోయాను అని ఏడుస్తూ అమ్మకి చెబితే ఆడపిల్లలా ఏడుపేంట్రా మగాడివికాదూ! అంది.
సూతోవాచా !
పరిక్ష పోయింది నాన్నా అంటే నాలుగుతికేడు, ఏడుస్తుంటే, ఎందుకాఏడుపు ఆడదానిలా అని మరో రెండు ఉతికాడు.
మాస్టారు తిట్టారు,ఆఫీసర్ తిట్టాడు అని కొలీగ్ కి చెప్పుకుంటే ఏడవకు మగాళ్ళం కదూ అనేసాడు.
దేనికి ఏడుపొచ్చినా ఏడవకూడదనీ,అది ఆడవారి స్వామ్యం అనీ, చిన్నప్పటినుంచి ఎగో పెంచిపోషించేసేరు. పెళ్ళాం తిట్టినా,కొట్టినా ఏడవలేదు. పనెక్కువైనా,ఆరోగ్యం బాగోకపోయినా,కొడుకు కోడలూ వినకపోయినా,మనవలు,మనవరాళ్ళూ తిట్టుకున్నా ఏడవలేడు. మగాడు కదూ! కుటుంబం కోసం గాడిదలా చాకిరీ చెయ్యడం,ఎద్దులా సంపాదించడమే గాని మనసారా,కరువుతీరా ఏడవనుకూడా ఏడవలేడుగా! అదీ మగాడు.
ఆరు నూరైనా
ఆరు నూరైనా,నూరు ఆరైనా! ఆ సూర్యుడిటు పొడిచినా, ఈ సూర్యుడటు పొడిచినా ...
ఇదొక వ్యవహారికం.
ఆరేమిటి,నూరేమిటి? అర్ధం కాలేదు. ఆరు రుచులు (షడ్రుచులు), ఇవి ఎప్పటీ నూరు కావు. నూరు రుచులు లేవు. కనక ఇవి కాదు.
ఆరు గుణాలు (షడ్గుణాలు). అవి కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు. ఇవి వెర్రితలలేస్తే నూరు పైనే కావచ్చు. కాని నూరు ఐన ఆగుణాలు ఆరు మాత్రం కావు,ఎన్నటికిన్నీ! అందుచేత ఇవీ కావు.
షడంగాలు, ఇవి చాలా రకాలున్నాయి, అందు చేత అవీ కావు.
ఆరు రూపాయలు నూరు రూపాయలూ అవుతాయి,నూరు రూపాయలు ఆరు రూపాయలూ అవుతాయి. నేటి కాలంలో ఇవే చెప్పుకోవాలి. ఆరు నూరెలా అవుతాయి? కష్టపడి పని చేస్తే ఆరు నూరవుతాయి.తిని కూచుంటే నూరు ఆరు కావడం పెద్ద కష్టం కాదు. ఆరు నూరైనా,నూరు ఆరైనా; ఆసూర్యుడిటు పొడిచినా,ఈ సూర్యుడటు పొడిచినా పని కావాల్సిందే! అంటే సవ్యమైన పద్ధతులలోగాని అపసవ్య పద్ధతులలో గాని పని కావలసిందేనని భావం.