----------------------/--------------------
ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏమాత్రం గర్వంలేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియోస్టేషనుకి కార్లో పోతున్నాము. అప్పుడు మాస్టారు –‘‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తే గాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే వానికి ఏమిమర్యాద చేయగలమా! అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదు గదా ! ఆ వేళకు మా ఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడ నుండి ఊడి పడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమ్రుతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ!? నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956లో మేడ కట్టాను. అప్పటి వరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే! కాని అప్పటి మా ఆవిడ పడిన కష్టం వాన కురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు! ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సి వచ్చేది! అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి, యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం.. కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది! లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడి నంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో, కష్టమేమిటో తెలిసినంత...సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలావుంటుంది? (అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు ఎక్కువకాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనేవుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలా మంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్యలేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె." ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!
‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి’’
‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’
అని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరు ఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.
(విశ్వనాథవారి వ్యక్తిత్వం వారిని పై పై చూపులతో చూసినవారికి అర్థం కాలేదు. వారికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు, వారి రచనలు చాలావాటికి లేఖకుడు, స్వయంగా గొప్ప కవిపండితుడు ఐన శ్రీ పేరాల భరతశర్మ గారు విశ్వనాథవారి గురించి మనసుని తాకే వ్యాసాలు కొన్ని రాశారు. అందులో ఒకదాని నుండి చిన్న భాగం ఇది!)🙏🙏
=====================
Courtesy:Whats app.
Sharing courtesy:Narasimha Rao. Vinnakota.
No comments:
Post a Comment