పెళ్ళి భోజనాలు - వడియాలు
పెళ్ళిలో భోజనాలంటే ఒక యజ్ఞం లా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. ఐదు రోజుల పెళ్ళిలో చెప్పేదే ముంది, పూట పూటా సంబరమే. పెద్ద పెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువా లో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగు పక్కల వేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరి వేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకు గాని, తాటాకు చాపలు గాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు. సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది. పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా, ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండి వంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్య కూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవింద నామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభ మయ్యేది, తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచ కట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించే వారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు. వడ్డన సామానుల పేర్లే మరిచి పోతున్నారు ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడే పాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి, పప్పండి, పప్పండి అని వడిగా అంటు కదిలే వాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి, నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబ గబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడి అన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్న మండి తో ప్రారంభించి, మీ కన్న మండి, మీ కన్న మండి, మీ కన్న మండి అంటూ సాగిపోయేవారు. మీకు + అన్న మండి = మీ కన్న మండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆట పట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు, ఒరేయ్ సుబ్బన్నా, ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాత గారికి పడుచు పెళ్ళాం కావాలంటు న్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చిన తరవాత ఇదేమిటి ఇవి తెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలు కావలన్నారని అనేవాడు, యువకుడు. అప్పుడు తాతగారు ఒర్నీ, వడియాలంటె పడుచు పెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలు కావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా, పెళ్ళి చేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా, అనే వారు కాని వద్దనేవారు కాదు. అది ఒక సరదా. వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు. ఇప్పుడు అర్ధమైనదనుకుంటాను, అప్పడాలు (అప్పటి+ ఆలు = అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా (వడి + ఆలు = వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచి నీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసు ల్లో మంచి నీళ్ళు పోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చిన వారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయింది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా. భోజనాల దగ్గర నుంచి అంతా ఒక సారి లేచే వారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారి కోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యే దాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాల లో కూడా ఇలా సరదా చూపే వారు. అలా సందడి సందడి గా భోజనాలు ముగిసేవి. ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని, వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి, ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం. మాధాకవళం బ్రతుకులై పోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను. అందం, హాస్యం చచ్చిపోయాయి.
Courtesy: whats app 🤣
******
పదునాలుగేళ్ళ తరవాత నేను వ్రాసినది what's app లో తిరిగి నాకే వచ్చింది, 30.11.2011 నాటిది
No comments:
Post a Comment