సామాన్యుడి సణుగుడు
ఎన్నికల్లో చిత్రాలు.
ఎన్నికల యజ్ఞం,ఫలితాల రాకా, పూర్తయింది. చూసే కన్ను, మనసు ఉంటే చిత్ర విచిత్రాలే ఉన్నాయి. ఎన్నికల్లో సామాన్యుడు చేసిన చిత్రం చూద్దాం.
మొన్నటిదాకా ఇ.వి.ఎమ్ లమీద అనుమానాలతో చెలరేగిపోయిన వారు ఫలితాల తరవాత నోరు మెదిపిన పాపాన పోలేదేమో!
ఇక ఎన్నికల కమిషన్ని, కమిషనర్లని, ప్రభుత్వoలో ఉన్న పార్టీకి కట్టుబానిసలని, తిట్టిన నోళ్ళు, తెరుచు కోలేదు,ఫలితాల తరవాత.
కొంతమంది మేధావులు ఎన్నికల కమిషన్ కు,సుప్రీం కోర్టుకు ఉమ్మడి ఉత్తరం రాసేసి, ప్రభుత్వం పైన తమకడుపులో కుళ్ళు వెళ్ళగక్కు కున్నారు.
ఎన్నికల తరవాత మోడీ మరో దేశం పారిపోతాడు అని నోరు పారేసుకున్న లాలూ ఎక్కడా? అరడజను సీట్లైనా గెల్చుకున్నాడా? లేదు 4 సీట్ల దగ్గరాపేసేరు.
మోడీ మళ్ళీ ప్రధానైతే గుండు గీయించుకుంటానన్నాడో రాష్ట్ర మంత్రి,(తనకి నెత్తిమీద వెంట్రుకలు కూడా లేవు) ఏమయ్యాడో?
భారతీయ పౌరులలో ఎక్కువమంది, చదువులేనివాళ్ళే కావచ్చు, మేధావులు కాకపోవచ్చు, పేదవాళ్ళే కావచ్చు, డబ్బుకి వోట్లు వేసేవాళ్ళు కావచ్చు, ఉచితాలకి ఎగబడేవాళ్ళే కావచ్చు కాని అవసరం వచ్చినపుడు, మండుటెండలో నిలిచి ఓటేసి, కొఱ్ఱు కాల్చి వాత పెట్టడం లో నిపుణులన్న సంగతి ఎన్నికలని చూస్తే తెలుస్తుంది. ఒక్కొకటే చూదాం!
నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు, అని సొల్లు కొట్టిన కేజ్రివాల్, పంజాబ్ లో మూడు సీట్లు గెల్చుకుని, డిల్లీలో, సోదిలోకి రాకుండా పోయాడు. ఉచితాలకి ఓట్లు రాలవన్న మొదటి మాట.
ఉడుకెత్తించే ఉపన్యాసాలకి ఓట్లు రాలవని కూడా కన్నయ్యకి కాల్చి వాతేట్టేరు,డిల్లీలో!
బీహార్ లో లాలూకి,కాంగ్రెస్ కీ తమ స్థానమేంటో చెప్పింది సామాన్యులే!
బెంగాల్లో కాంగ్రెస్ కీ, పూర్తిగా ఉద్వాసన చెప్పేసింది దీదీ! ఒకే ఒక్కడుగా పోరాడిన యోధుడు Adhir ranjan chowdary కూడా మమత దెబ్బకి నేలకొరిగాడు. బెంగాల్లో కాంగ్రెస్ నీ వారి మిత్రులు కమ్యూనిస్టులని మమత కర్చు రాస్సినట్టే! ఒంటరి వీరుడు అధీర్ రంజన్ చౌదరీ ఆర్తనాదాలు కాంగ్రెస్ వారి చెవులబడుతున్నట్టు లేదు. నాకు మరో పని చెయ్యడం చేత కాదు,సంపాదనా మార్గమూ లేదు, కూతురు చదువుకుంటోంది. నేడో రేపో ఢిల్లీ వెళ్ళి క్వార్టరు కాళీ చేసి రావాలన్న ఆకలి కేకలు కూడా, నిన్నటివరకు లోక్ సభలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత, ఆర్తనాదాలు కాంగ్రెస్ కోటలోకి చేరుతున్నట్టు లేదు. కావాలంటే నన్నేమైనా చేసుకో కాని కార్యకర్తలని ఏమీ చెయ్యకని, మమతని ఫలితాల తరవాత జరిగే హింసనుంచి కాపాడమని, చేతులు జోడించి వేడుకున్నదైనా చెవులబడుతోందో లేదో,విన వలసిన వారికి, తెలియదు.
ఇక బెంగాల్ అంటే ఒకప్పుడు ఎఱ్ఱవారి కంచుకోటని పేరు, పాపం సోదిలోకి కూడా రాకుండా పోయారేమో! సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!
ఒడిషా ది మరో చిత్రం. ఒడిషా అంటే పట్నాయక్ అని మారుపేరు, పాతికేళ్ళగా మచ్చ లేని ముఖ్యమంత్రి, కాని బయటికి పంపేసేరు, రాష్ట్ర ఎన్నికల్లో, ఇక పార్లమెంటుకి ఒక్క సీటిచ్చెరు,BJP కి పందొమ్మిది సీట్లిచ్చేరు.కారణం, తను మెచ్చిన ఒక తమిళ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ ని పూర్తిగా చంకనెత్తుకోవడం,చివరికి అతన్ని ఉద్యోగం మాన్పించి పార్టీ లో చేర్చి పెత్తనమప్పగించడం, సహించ లేదు. ప్రతిపక్షంలో కూచో బెట్టేరు.సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!
ఉత్తరప్రదేశ్ యోగి బాబా పరిపాలన, కాని అక్కడ సమాజవాది పార్టీకి 37 సీట్లిచ్చేరు, కూడా ఉన్న కాంగ్రెస్ కి ఆరిచ్చేరు. కాంగ్రెస్ తమగొప్పే అని చంకలు గుద్దేసుకుంటోంది. గొప్ప సమాజ్ వాది పార్టీ దనుకోడం లేదు.దూకుడు తగ్గించమని యోగిబాబాకి చిన్న చురక.
తెలంగాణాలో, సర్వమూ నేనే అని చెప్పిన బి.ఆర్.ఎస్ కి లోక్ సభలో స్థానమే లేకుండా చేసేరు. ఎంత చిత్రం.
ఇక ఆంధ్రా గురించి చెప్పక్కరనే లేదు. జగన్ 11 MLA సీట్లు గెల్చుకుంటే గొప్పయి పోయింది. 4 ఎమ్.పి లతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఉచితాలనేకం ఇచ్చానే! అయ్యో! ఇంత అన్యాయమా? అని ఆక్రోసించి ఉపయోగం లేదు. ఉచితాలు గండం గడుపుతాయన్న వారికి పెద్ద పాఠమే! ఉచితాలు మేమడగలేదు, మీరిచ్చారు,పుచ్చుకున్నాం. ఉచితాలిస్తే ఓట్లేస్తామని మీరనుకోడం పొరబాటు. చురకేసి చెప్పినట్టు కాలేదా? కేజ్రి తరవాత రెండో వారికి పాఠం చెప్పిన సామాన్యుడు. ఏదో జరిగింది ఆధారాలు లేవని ఆక్రోశం ఉపయోగం లేనిది.








