Thursday 2 May 2024

ఎండ మలమల మాడుస్తోంది.

 ఎండ మలమల మాడుస్తోంది.


వేడి పాపం పెరిగినట్టు రేసు గుఱ్ఱంలా పరిగెడుతోంది 40 నుంచి 45. ఎక్కడా బెత్తెడు నేల కనపట్టంలేదు,మొక్క లేదు. అంతా కాంక్రీటే! ఎన్ని సార్లనుకుని ఉపయోగం లేదు. ఇది ఒకరోజు పాపం కాదు తరాల పాపం. అనుభవించక తప్పదు. 


చేసుకున్న కర్మమోయ్ శంభు లింగమా! 

అనుభవింపక తప్పదోయ్ ఆత్మ లింగమా!


ఎండ వేడి నుంచి రక్షించుకోడమెలా? పాపం! విపత్తు నివారణ సంస్థ వారు రేపటి గురించి ఈ రోజో ఇంట్లో ముసలాళ్ళలా కురుపు సలిపినట్టు ఒక మెసేజి ఇస్తూనే ఉన్నారు. లెక్క చేసేవారే కనపట్టం లేనట్టుంది.


వేసవి వేడి మూలంగా వచ్చే అనారోగ్యాలనుంచి కాపాడుకోవాలంటే కొన్ని పనులు తప్పవు. బయట తిరక్క తప్పని వారు చెవులకి గుడ్డ కట్టుకోవాలి,అందుకే మనవారు తలపాగా చుట్టేవారు. జేబులో ఒక బళ్ళారి ఉల్లిపాయ ఉంచుకుంటే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ఎండలో దాహంగా ఉన్నపుడు,వడ తగిలిందేమో అనుమానం కలిగినపుడు, ఈ ఉల్లిపాయను నమిలిమింగండి, ప్రాణం కాపాడుతుంది, దాహం కడుతుంది. ఇది చాలా పురాతనంగా అనాగరికంగా కనపడచ్చు, కాని ఇది నిజం.


ఇక నీడపట్టునున్నవారు, ఎ.సి ఉన్నవారు, ఎ.సి లో ఉండేవారు, ఎ.సిని 27 లో ఉంచుకుని ఉంటే బహు బాగుంటుంది. ఇక తినే ఆహారంలో నీరుల్లి ఎక్కువ వాడితే మంచిది. నీళ్ళు ఎక్కువపోసిన మజ్జిగ నిమ్మకాయతో ఆరారా తాగడం  మంచిది. కొబ్బరి నీళ్ళు నిలవవికాక దొరికితే తాగడం మంచిది. తాటిముంజలు దొరికితే మంచిదే. వేసవి అంటే పళ్ళే. అన్నిటిని తినచ్చు,మితంగా. తాగేవాటిలో సబ్జా గింజలు నానబెట్టినవి,నీళ్ళతో గాని,మజ్జిగతో గాని, ఉప్పు,పంచదారలతో లేదా బెల్లం మహ మంచిది. ఈ అనుపానాలు వాడలేనివారు సబ్జా గింజల్ని నానబెట్టి మజ్జిగతో తీసుకోవచ్చు. ఆరారగ తాగితే బహుమంచిది. ఎ.సి లో ఉంటే నీళ్ళెక్కువ తాగాలి, అప్పుడు ఈ సబ్జా గింజల మజ్జిగ బహుమంచిది. ఎట్టి పరిస్తితులలోనూ ఫ్రిజ్ ఉన్న నీళ్ళు తాగద్దు, గది వేడి దగ్గరున్నవి,రాగి బిందెగాని ఇత్తడి బిందెలో ఉన్న నీళ్ళు తాగండి. ఆరోగ్యానికి మంచిది. సబ్జా గింజలంటే మరేమో కాదు తులసి విత్తనాలే! వీటి ఉపయోగాలనేకం, ఆరోగ్యానికి గొప్ప అవసరం.   ఛీ తులసి విత్తనాలా నానబెట్టుకుని తాగుతారా? అసలొప్పం కోకాకోలా తాగుతాం ,పిజ్జ తింటాం ఈ పిచ్చి తిళ్ళేం తింటామంటారా! అస్తు. 

చెప్పడమే నా ధర్మం 

వినకపోతె నీకర్మం


No comments:

Post a Comment