6, ఫిబ్రవరి 2024, మంగళవారం

బడ్జట్

 చాలా రోజుల తరవాత మా సత్తిబాబు, సుబ్బరాజు వచ్చారు. వస్తూనే మా సత్తిబాబు ''చెల్లెమ్మా! కాఫీ'' 

 అనరచి నాలిక కరుచుకున్నాడు, ఈలోగా లోపలనుంచి కోడలమ్మాయి ''తెస్తున్నా! బాబాయ్!!'' అంది. కూచునోలోగానే కాఫీ తెచ్చిచ్చింది, ముగ్గురుకీ! చాలా రోజుల తరవాత కదా పుచ్చేసుకున్నా! సత్తిబాబు కాఫీ కప్పు పుచ్చుకుని ''అమ్మా! కాఫీ అద్భుతం'' అన్నాడు. దానికి సుబ్బరాజు ''తాగకుండానే ఎలా చెప్పేవేంటీ?'' అని నిలదీశాడు. సత్తిబాబు, ''కాఫీ వాసనే ఘుమఘుమలాడిపోతోంటే తాగి మరే చెప్పాలా?''  అనడంతో కబుర్లు మరో దోవపట్టేయి. కబుర్లు దొల్లిపోతున్నాయి, అలా అవి బడ్జట్ దగ్గరకొచ్చి ఆగాయి. 

మా సుబ్బరాజు ''బడ్జట్ లో ఏముందిలే? పయోళ్ళకి కిందోళ్ళని చూసేరు, మద్దెలో ఓళ్ళనొదిలేసేరు అంతేగా'' అన్నాడు. దానికి మా సత్తిబాబు 'అనుకో' అని ఊరుకున్నాడు. ''అదేమన్నమాట సత్తిబాబూ! అదేదో చెప్పరాదా'' అన్నా, కలగజేసుకుని. ''ఈయనడుగుతాడు, నేను నిజాలు చెబితే, ఈయనకి కోపాలొస్తాయి, మద్దెలో నాకెందుకొచ్చిన తంటా చెప్పండి'' అన్నాడు, భీష్మునిలా! ''నీ అభిప్రాయం నువు చెబుతున్నావు దానికి కోపమెందుకు చేసుకుంటాం! చెప్పు'' అని బ్రతిమాలాను. సత్తిబాబు అందుకున్నాడిలా! 


 మన దేశంలో ప్రజలు నాలుగు రకాలు 

కలిగినవారు,లేనివారు,మధ్య తరగతివారు. నాలుగో రకమే రాజకీయనాయకులు. కలిగినవారు నూటికి పదిమంది.లేనివారు నూటికి ఏభై.మధ్య తరగతివారు నూటికి ముఫై ఐదు. రాజకీయనాయకులు నూటికి ఐదుగురు.

కలిగినవారు నూటికి పది మంది,వీరు పెద్ద వ్యాపారవేత్తలు,పారిశ్రామికులు,ధనవంతులు.వీరికి బడ్జట్లు గొడవలు,పెంచడాలు,తుంచడాలు అక్కరలేదు. వారికి కావలసిన పని ఏ ప్రభుత్వం ఉన్నా అవుతుంది. బయట వీరిని తిట్టిపోసేవారంతా, లోపల వీరి కాళ్ళ దగ్గర కూచునేవారే! ఎందుకంటే, వీరే వారికి పోషణ కర్తలు. వీరూ ఈ మధ్యన ఓట్లు వేస్తున్నారు. వారు ఎవరికి వేస్తారన్నది బహిరంగ రహస్యమే! వారినెప్పుడూ రాజకీయనాయకులు ఈగ వాలకుండా చూసుకుంటారు. వీరు అన్ని పార్టీలకి విరాళాలిస్తారు.వీళ్ళు ఓటెయ్యడానికి రావడమే గొప్పనుకుని లైన్ లో ఉన్నవారంతా తప్పుకుని లోపలికి పంపించేస్తారు. అప్పుడప్పుడు వీళ్ళు కూడా లైన్ లో నిలబడినట్టూ, లైన్ లో రమ్మని చెప్పినట్టూ డ్రామాలు కూడా కనపడుతూ ఉంటాయి.

   

 లేనివారు నూటికి ఏభై మంది.వీరు ఏమీ లేనివారు. రెక్కాడితే డొక్కాడేవారు, లేదా ఏదో కొద్దిగా ఉన్నవారు అంతే!ఎవరి ప్రభుత్వమైనా వీళ్ళనే  చూసుకుంటుంది . లైన్ లో నిలబడి ఓట్లేసేవాళ్ళు వీళ్ళే! వీళ్ళు అల్ప సంతోషులు.శ్రామికవర్గ పచ్చపాతులమని చెప్పుకునేవాళ్ళకి,చొక్కాలు చింపుకునేవాళ్ళకి ఓట్లెయ్యరెందుకో!  వీళ్ళు, డబ్బుకి మందుకి లోబడిపోతున్నారంటూ ఉంటారు,  

కొందరు   పైవాళ్ళు. ఎదుటి పార్టీవాళ్ళ దగ్గర డబ్బులుచ్చుకుని, ఓట్లు మాకెయ్యండంటూ ఉంటారు, రాజకీయనాయకులు. వీళ్ళంత తెలివైనవాళ్ళు మరొకరు లేరు. డబ్బులుచ్చుకుంటారు,మందూ పుచ్చుకుంటారు. కావలసినోళ్ళకే ఓట్లు నొక్కుతారు. వీళ్ళకి కావల్సింది రక్షణ,నిత్యావసరాలు,అంతే!


రాజకీయ నాయకులు,వీరు నూటికి ఐదుగురు.వీరు ఏపార్టీ వారైనా అధికారమే ప్రధాన లక్ష్యం.   

పోలసీలు వగైరాలంతా ఉత్తిమాటే. అధికారమున్నచోటకి చేరిపోడమే ధ్యేయంగా ఉంటుంది. సాధారణంగా వీరంతా మధ్యతరగతి మేధావులే! అక్కడక్కడ కలిగినవారుంటారు.వీళ్ళంతా నోరున్నవాళ్ళు :) ఎక్కడా మొదటి ఓట్లు వీళ్ళవే!వాళ్ళకి వాళ్ళే ఓట్లేసుకుంటారు :) 


ఇక మధ్య తరగతివారు,వీరు నూటికి ముఫైఐదనుకున్నాంగా! వీళ్ళంతా ఏకరూపుగాదు. వీళ్ళలో మూడు రకాలు.అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. 


అప్పర్ మిడిక్లాస్ వాళ్ళు నూటికి ఐదుగురు. వీళ్ళు రాజకీయనాయకులతో రాసుకుపూసుకు తిరుగుతారు.పెద్ద ఉద్యోగస్తులు. పాలసీ మేకర్లు.చట్టాలు,రూల్స్ తయారు చేసేవాళ్ళు.బడ్జట్లు తయారు చేసేవాళ్ళు, వీళ్ళే! వీళ్ళంతా మహా మేధావులు,గుంట చిక్కులు పెట్టగలిగిన,విప్పగలిగినవాళ్ళు. చట్టాలకి భాష్యాలూ,వక్రభాష్యాలూ,వ్యాఖ్యానాలూ చెప్పగలవాళ్ళు నోరున్నవాళ్ళు ,  వీళ్ళ లో కొంతమంది  నోరు పైకి వినపడదు,తొడపాశాలు పెట్టగలిగిన రకాలు. అంతెందుకు రెండు మీటర్ల చొక్కాగుడ్డ టైలర్ దగ్గరికి పట్టుకెళితే మనకి కావల్సిన ఫేషన్ లో కొలతలు తీసుకుని కుట్టే దర్జీలాటివాళ్ళు. ఏటైలరుకిచ్చినా గుడ్డ రెండు మీటర్లే, అందులోనే పొడుగుచేతులు,పొట్టి చేత్లులు,కాలర్ లెస్ ఇలా రకరకాలుగా చొక్కా కుట్టగల దర్జీలాటివారు.  ఏపార్టీ వాళ్ళు అధికారంలో కొస్తే ఆ పార్టీ రాజకీయనాయకులు చెప్పినట్టు బడ్జట్లు, పరిపాలన అల్లగలవారు. 

 వీళ్ళూ ఓట్లేస్తారుగాని తెలీదు,ఎక్కడేసేరన్నది, వీళ్ళగురించి వార్తలే తెలియవు. కన్నగాడు కత్తిమరవడని, వీళ్ళబాగు ఒప్పు వీళ్ళు బాగానే చూసుకుంటారు. బడ్జట్ బాధలుండవు.

ఇక మిడిల్ క్లాసు వాళ్ళు. వీరికీ బడ్జట్ గోలుండదు, పట్టించుకోరు. పైవారంతా పోలసీ మేకర్లైతే వీరు పాలసీ ప్రోపగేటర్లు,కొత్తకొత్త,వింతవింత భాష్యాలూ చెప్పగలవారు, ఒపీనియన్ మేకర్లు.వీరు ఏ రంగంలోనైనా ఒకటే, అది పబ్లిక్ కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు. వీరతి మేధావులు. నూటికి పది మంది. వీరిలో వ్యాపారస్తులు,మధ్య మేనేజిమెంటువారు, పన్నులు వసూలు చేసేవాళ్ళు ఇలా ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే పత్రికా ఎడిటర్లు,కొండొకచో విలేకరులు. వీరందరి ధ్యేయం సొమ్ములు చేసుకోడమే,ఎలాగైనాగానీ! అల్లప్పుడు అలా జరిగింది,ఇల్లిప్పుడిలా జరిగిందంటూ పుస్తకాలు రాసుకునీవోళ్ళు, అమ్ముకుని సొమ్ము చేసుకునీటోళ్ళు.వీరంతా రాజకీయనాయకుల కళ్ళలో పడాలని అనుకుంటూ ఉంటారు,ఎప్పుడూ. అతిమేధావులుగా గుర్తింపు పొందాలని తహతహలాడిపోతుంటారు. ప్రాజాస్వామ్యం,వ్యక్తిస్వాతంత్ర్యం,వాక్స్వాతంత్ర్యం,కాన్సిట్యూషన్, రాజ్యాంగం ఇలా గొప్పగా మాటాడగలవారు.తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని చేయగలవారు. వీరూ ఓట్లేస్తారు,వీలుబట్టి.వీళ్ళు పైవాళ్ళలో చేరిపోవాలనుకుంటూ ఉంటారు,పైవాళ్ళు వీళ్ళని అవసరానికి ఉపయోగించుకుంటారు. అవసరం తీరేకా బయటికి గెంటుతూ ఉంటారు. 


ఇక చివరివాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్. వీళ్ళు నూటికి ఇరవైమంది. వీరికి సోకులెక్కవ, వచ్చేది తక్కువ.  వీరంతా మేధావులు. వీళ్ళకి ఏమిచ్చినా తృప్తి లేనివాళ్ళు. నిత్య అసంతృప్తులు. ఏదో ఒకటి ధర తగ్గిందంటే రెండోది పెరగలేదా అంటారు. వీళ్ళకి పట్టింపులెక్కువ,ఆచారాలు,వ్యవహారాలు అన్నిటా.వ్యక్తి ఆరాధకులు, అలా అరాధించే నమ్మినవానికైనా ఓటేయరు.   వీరు తీవ్రంగా ద్వేషిస్తారు,తీవ్రంగా ప్రేమిస్తారు. ఎన్నికల రోజు తప్పకపోతే, ఎవరేనా వచ్చి తీసుకెళితే, అక్కడ లైన్ లో జనం లేకపోతే ఓటేస్తారు, లేదూ శలవు రోజుకదా! ముడిచిపెట్టుకు పడుకుంటారు. అబ్బో వీరే పెద్ద పెద్ద ఉపన్యాసాలు రాస్తారు,కీ బోర్డ్ వారియర్లూ వీరే! మమ్మల్నెవరూ పట్టించుకోటంలేదంటారు. వీళ్ళకి భయమెక్కువ.ఉన్నమాట చెప్పలేరు. అలాగే చస్తూ బతుకుతూ బతుకీడ్చేస్తారు. నిజంగానే వీళ్ళనెవరూ పట్టించుకోరు.కింద తరగతిలోకి జేరలేరు,పైతరగతికి జేరలేరు. వీళ్ళింతే! నిత్య అసంతృప్తులు!. 

 ఇక చాల్లే! చెప్పుకుంటే ఎంతైనా ఉంది, నడు అంటూ లేచాడు మా సత్తిబాబు.


5, ఫిబ్రవరి 2024, సోమవారం

వినతి

  వినతి

అభిమాన మిత్రులకు సవినయ వినతి

కొంతమంది నాతో ఫోన్లో మాటాడటానికి ప్రయత్నిస్తున్న కాల్ రికార్డ్ నాదగ్గర ఉన్నది. అందులో ముఖ్యంగా ఒకరు అమెరికా,మరొకరు ఆస్ట్రేలియా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఈ మధ్య బహరైన్ దేశం నుంచి ఒకరు నాతో మాటాడటానికి ప్రయత్నిస్తున్నది కాల్ రికార్డ్ చూశాను. నేను ఎవరితోనూ ఫోన్ లోకాని వీడియో కాల్ లోగాని మాటాడలేను, వినపడకపోవడమే కారణం. నేను అత్యవసరంగా మాటాడాలంటే నాకు మరొకరు తోడు ఉండాలి,తప్పదు. అందుచేత దయచేసి నన్ను మన్నించ ప్రార్ధన. నా పరిస్థితి ఈ మధ్య నన్ను దయతో చూడటానికి వచ్చిన మిత్రులు ప్రత్యక్షంగా చూడటం వలన వారికి తెలుసు. మీరు మెయిలివ్వండి జవాబిస్తాను,లేదా బ్లాగులోకి రండి, జవాబిస్తాను.

నమస్కారం.

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

దుర్వినియోగం

 దుర్వినియోగం

దుర్వినియోగం మన జీవితంలో భాగమైపోయిందా అంటే నిజమే అనిపిస్తూ ఉంది.


ఉదయం లేచినది మొదలు పళ్ళు తోమినంతసేపూ కుళాయి నీళ్ళు తిప్పి వదిలెయ్యడం అలవాటు దుర్వినియోగం. అలాగే మనుషులు లేకపోయినా  పట్టపగలే లైట్లు ఫేన్లు పనిచేస్తూ ఉండడం. ఆపై ఆహార దుర్వినియోగం, తిన్నంత తిని, తిన్నదానికంటే ఎక్కువ పారెయ్యడం అలవాటైపోయింది. ఇక  పెళ్ళిళ్ళు పేరంటాలలోనైతే చెప్పేదేలేదు.  మందుల దుర్వినియోగం,అదో పెద్దకత. మూడు మాత్రలేసుకోండి, మూడు పూటలా, తగ్గితుంది చాలు, ఇది డాక్టర్ గారి మాట, చీటి పట్టుకెళితే షాపువాడు మూడు అమ్మడం కుదరదండి, స్ట్రిప్ కి పదుంటాయి, మీరువాడుకున్నా మరేం చేసుకున్నా పదీ కొనాల్సిందే. అవసరం! కొనక తప్పదు, మూడు వాడిన తరవాత మిగిలినవి దుర్వినియోగం, పారెయ్యాలి లేదా రోగాన్ని మళ్ళీ ఆహ్వానించాలి. వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 


సమాజపరంగా దుర్వినియోగానికి లెక్కే లేదు. ఆపై చట్ట దుర్వినియోగానికొస్తే సెక్షన్ 498 A మరియుSC/ST Atrocities act దుర్వినియోగమైనంతగా మరేదీ దుర్వినియోగం కాలేదనే అనిపిస్తుంది. వాక్స్వాతంత్ర్యం పేరిట జరిగే దుర్వినియోగానికి లెక్కలేదు.  మన దేశంలో అనధికారుల అధికార దుర్వినియోగం ఓ పెద్ద కత.

2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

మధ్యాహ్న సూర్యుని మీద ఉమ్మేస్తే మన మొహానే పడుతుంది.

 


మధ్యాహ్న సూర్యుని మీద ఉమ్మేస్తే మన మొహానే పడుతుంది.


ఇదొకనానుడి.

సూర్యుని మీద ఉమ్మెస్తే ఏం జరుగుతుంది?ఎక్కడ సూర్యుడు ఎక్కడ మనం. సూర్యుడు మనకి 8 నిమిషాల ఇరవై సెకండ్ లు కాంతి దూరంలో ఉన్నాడు. మా పాశర్లపూడంత దూరముండదూ! అదేంటి? దూరం చెప్పాలంటే మైళ్ళో,కిలో మీటర్లో అనాలిగాని, ఈ కాంతి దూరమేంటీ? కాంతి సెకనుకి మూడులక్షల  కిలో మీటర్లు దూరం ప్రయాణం చేస్తుంది. 8నిమిషాల్లో ఎంత దూరం చేస్తుంది?  ఒక సెకనులో మూడులక్షల  కిలోమీటర్లయితే నిమిషానికెంత దూరం? 60 X 8= 480sec. 500 X 3=1500 లక్షలకిలో మీటర్లు. అమ్మబాబోయ్! అంత దూరమా? అంతదూరాన ఉన్న సూర్యుడు వేసవిలో మనభూమి కొంచం ఆయనవైపు తిరిగితేనే భరించలేం,వేడికి. అంతదూరం ఉమ్మి వేయగలమా? దగ్గరకెళ్ళగలమా? ఆవేడికి బతికుంటామా? ఏదీ మనవల్లకాని పని అని అర్ధం. మామూలు రోజుల్లోనే మధ్యాహ్నం సూర్యునికేసి తిరిగి ఉమ్మితే అది మన ముఖానే పడుతుంది. ఇది లోకరీతికి తర్జుమా చేసుకుంటే!!!


మనకంటే గొప్పవాడైన వ్యక్తిని కించపరచడానికో,ఎగతాళీ చేయడానికో మనం పిచ్చి పిచ్చిగా వాగితే అది తిరిగి మనకే అంటుకుంటుంది. అందుచేత ఎప్పుడూ అర్హులైనవారి జోలికి పోవద్దు. వారిని తూలనాడటం, కించపరచడానికి ప్రయత్నించడం,ఎగతాళీ చేయడానికి ప్రయత్నం చేస్తే మనమే వాటికి గురవుతాము తప్పించి ఆ గొప్పవ్యక్తికి ఏం జరగదు. ఇది చెప్పడానికే ఈ నానుడి వాడుతుంటారు.

29, జనవరి 2024, సోమవారం

అభిమానులు



అభిమానులు

చాలాకాలంగా నన్ను చూడడానికొచ్చిన అభిమానులగురించి చెప్పలేదు.నా బ్లాగు పుస్తకంలో అభిమానులది పెద్ద ప్రకరణమే! నిజం చెప్పాలంటే, అభిమానులే నన్ను బ్లాగులో ఇంతకాలం నిలబెట్టేరన్నది కాదనలేని సత్యం. 

ఐదేళ్ళకితం మాట. ఓ రోజో మెయిలొచ్చిందిలా!

''నాపేరు చెఱువు సుబ్రహ్మణ్య శాస్త్రి గుడివాడ దగ్గర, ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నా! మీ బ్లాగు చూస్తాను. అభిమానిని,విశాఖ పెళ్ళి
కెళుతున్నా!వచ్చేటపుడు వస్తా!'' అంతకుముందు పరిచయమే లేదు.  రమ్మని ఆహ్వానించా!ఎలా వస్తారు? ఎప్పుడొస్తారు. అడిగా! ''నాది గాంధీగారి టిక్కట్టు, ఎప్పుడొస్తానో చెప్పలేను, వచ్చి మిమ్మల్ని చూసి వెళతా!'' అన్నారు.  మర్నాడు ఉదయం, ''ఇప్పుడు స్టేషన్లో ఉన్నాను,బండి ఏది దొరికితే అది ఎక్కేసివస్తా''ననంటే బండెక్కేకా చెప్పండి స్టేషన్ కొస్తా అంటే,''రావద్దు నేనే వస్తా! ఎలా రావాలో చెప్పండంటే'' చెప్పక తప్పలేదు. ఎదురుచూస్తూ కూచున్నా! మధ్యాహ్నం పన్నెండున్నర దాటింది. అప్పుడు ఒక పెద్దాయన వచ్చారు.వయసు ఎనభై అన్నారు. భోజనాలు చేసేం,చేస్తూ కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు కూచోండన్నా! ''కూచోను, ఏ బండి దొరికితే అదెక్కేస్తాను. ఏరాత్రి కైనా హైదరాబాదు చేరతానని'' వచ్చినంత వేగంగానూ వెళ్ళేరు. వారిని కలిశాను,అదో ఆనందం! అంతే!!


ఆ తరవాత కాలంలో శ్యామలీయం,శ్రీమతి శారద,తమ్ముడు రామంతో "వస్తున్నా "అన్నారు, కాకినాడనుంచి. రమ్మని ఆహ్వానించా!అప్పటికే ఇల్లాలు లేవటం లేదు,మంచాన ఉంది. ఎలా వస్తున్నారు? అడిగా! కార్ ఉంది చేతిలో ఏలారావాలో చెప్పండంటే, చెప్పేను. దురదృష్టం ఆ రోజు ఫ్లై ఓవర్ కట్టేసేరు, అక్కడికొచ్చి ఫోన్ చేసేరు, ఇలా జరిగిందని. అక్కడికెళ్ళి సందుగొందులగుండా ట్రేక్ దాటించి,ఇంటికి చేరేం! ఆ తరవాత అంతంత మాత్రమే అతిథి సత్కారం  చేయగలిగేం. దానికేవారు చాలా ఆనందపడ్డారు. నిజానికి ఏమీ చేయలేకపోయేం అన్నది, నిజం.


ఆ తర్వాత ఇల్లాలు కాలం చేయడంతో అన్నీ వెనకబట్టేయి. ఎవరిని రమ్మనటమూ లేదు. ఇలా జరుగుతుండగా ఒక రోజు లలితమ్మాయి ''దేశంలో కొచ్చా! వస్తున్నా'' అంది! రమ్మని ఆహ్వానించా! గౌరవం చేయలేనేమోనని భయం, అనుమానం. వచ్చింది,ఇంటి ఆడపడుచుకంటే ఎక్కువగా కలసిపోయిందంటే! అభిమానం ఇలా అని చెప్పలేను.  ఇంతకు మించి చెప్పను. బంగారు తల్లికి దిష్టి తగులుతుంది.  తను మాకోసం ఎవో ఏవో బహుమతులు తెచ్చింది. మంచినీళ్ళు కూడా తెచ్చుకుంది,పాపం.   మా చిన్న సత్కారం పుచ్చుకుంది. వీటన్నిటికంటే నాకు మీ ఆశీర్వచనం కావాలని  
పాదాభివందనం చేసి, కూచుంది. చిన్న ఆశీర్వచనం పనస చెప్పి ఆశీర్వదించా! కడుపు నిండింది, మీరు పిలవకపోయినా వచ్చానంది.అవునమ్మా! నిజమే నేనే ఎవరిని పిలవలేకపోతున్నా! ఇల్లాలు కాలం చేయడంతో  అన్నా! అభిమానం ఉన్నపుడు పిలుపులు పట్టింపులు ఉండవు, అందుకే పిలవకపోయినా వచ్చాను, ఆశీర్వచనానికే వచ్చానని, సరిపెట్టుకుంది.. మీ అభిమానానికి కడుపు నిండిందని సంబరపడి వెళ్ళింది.  నిజానికి తను నన్ను చూడ్డానికి వచ్చి నన్ను సంబరపెట్టింది. నన్ను మళ్ళీ లోకంలో పడేయడానికి తనరాక దోహదం చేసింది.


 ఆ తరవాత మొన్న విన్నకోటవారు, నేనూ బండివారూ వస్తున్నాం మిమ్మల్ని చూడ్డానికీ అన్నారు. రండి! రండి!! రండి!!! దయచేయండని ఆహ్వానించా! ఎలా వస్తున్నారంటే ట్రైన్ అన్నారు. స్టేషన్ కొస్తా అంటే వద్దన్నారు. చెబుతా వినండి! మీరొచ్చేబండి మూడో నంబర్ ప్లాట్ఫాం మీదకొస్తుంది. అక్కడినుంచి నడిచి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి దిగి మళ్ళీ ఒకటో నంబర్ ఫ్లాట్ఫాం నడిచి బయటికొచ్చి కొంత దూరం నడిస్తేగాని ఆటో దొరకదు. ఈ నడిచే దూరం  అరకిలో మీటరుంటుంది.  ఆటోమూడున్నర కిలోమీటర్లు చుట్టు తిరిగి తీసుకొస్తుంది. నేనొస్తే మూడోనంబర్ ప్లాట్ఫాం నుంచి పట్టాలు దాటుకుని అరకిలో మీటర్ నడిపించి ఇంటికి చేర్చేస్తా! అన్నా. మీ ఇష్టం ఏం చేయమంటే అదే చేస్తా అన్నా! ఐతే స్టేషన్ కి రమ్మన్నారు.

 బండి పదింపావుకొస్తుందంటే పదికి ఇంటి దగ్గర బయలుదేరా! ప్లాట్ఫాం మీదకి చేరి దిక్కులు చూస్తూ కూచున్నా! చాలా కాలమయింది రైల్ స్టేషను చూసి, అందుకు. అదుగో ఇదుగో అంటూ గంట పైన ఆలస్యంగా చేరింది,బండి. కబుర్లు చెబుతూ నడిపించి ఇంటికి చేర్చేను, ఇటుపక్క ఆటోలు దొరకవు మరి. కబుర్లు చెబుతూనే ఉన్నా!
కొంచం సేపు తర్వాత భోజనాలు చేసేం. నేను కబుర్లు చెబుతూనే ఉన్నా! కబుర్లతోనే వారి కడుపులు నింపేశాను. లెక్కకి రెండేసి మెతుకులు కతికేరంతే! నాతో  ఏమైనా చెప్పాలంటే అదో పెద్ద ప్రయత్నం, అప్పుడప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేసి, కొన్ని సార్లు సఫలమై,కొన్ని సార్లు విఫలమై,సంజ్ఞలతో,అమ్మాయి చెప్పడంతో,  ఇలా కాలం నడచింది.  

భోజనాల తరవాత మీకు సన్మానమని మిత్రులిద్దరూ వేరు వేరుగా, నూతన వస్త్రాలతో సత్కరించి, ఆశీర్వచనం కావాలని అక్షతలు తెప్పించారమ్మాయి చేత. ఆశీర్వచనం చేసి, ఇలా కాదు కూచోండని, ఇద్దరిని కుర్చీల్లో కూచోబెట్టి ఒక ఆశీర్వచనప్పనస చెప్పి ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. ఆ తరవాత మిత్రులకి బహుచిన్న సత్కారం చేసేను.




 ఆ తరవాత విన్నకోటవారు ప్రత్యేక బహుమతిగా ఎన్.టి.ఆర్ నూరవజయంతికి (NTR birth centenary coin) వచ్చిన వెండి డాలర్ బహూమానంగా ఇచ్చారు. ఇది అభిమానానికి పరాకాష్ట.నేనా చదువు లేనివాణ్ణి, ఒక గొప్పవ్యక్తినీ కాదు, ఆటగాణ్ణీ,పాటగాణ్ణీ కాదు, పెద్ద ఉద్యోగమూ చేయ్యలేదు. తెనుగు బ్లాగర్లలో ఒకడిని, అంతకు మించి ప్రత్యేకతేం లేదు. నన్ను చూడ్డానికి చలిలోపడి వందలకిలో మీటర్లు, శ్రమపడి ప్రయాణం చేసి రాకపోతే వీరి పెద్దలు చెఱబోయారా! ఇదేకదా అభిమానమంటే!!
  మిత్రులిద్దరు బహు ఆనందపడి నన్ను ఆనందపెట్టేరు. విషయం మరింత వివరించడానికి మాటలు సరిపోవు.
నన్ను ఇంతమంది అభిమానించడమన్నది వారి గొప్పతనమేకాని నా గొప్ప ఇందులో లేశమాత్రమున్నూ లేదు..ఇంతమంది చేత అభిమానింపబడటం, వారు పెద్దమనసుతో నాన్ను చూడ రావడం, నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం.

27, జనవరి 2024, శనివారం

దోచుకో! దాచుకో!!

 దోచుకో దాచుకో 

 దోచుకో! దాచుకో!! ఇదే నేటి నినాదమనిపిస్తూ ఉంది. దోచుకుని ఏమి అనుభవిస్తున్నట్లు? పొట్టకి తిండా మూడు పూటలకంటే ఎక్కువ తినలేము. కట్టుకునే గుడ్డా? ఏదైనా మానం కాపాడుకోడానికే! ఉండే ఇల్లా? ఎంతపెద్ద ఇల్లున్నా ఒకమంచంమీదే పడుకోగలం.స్త్రీ/పురుష అనుభవమా? మూడు నిమిషాల ముచ్చట. అంతే! ఇతర వైభవాలా? అర్ధం చేసుకుంటే కొరగానివే. ఇది ఐశ్వర్యంకాదు. రెండు పూటల తింటే ఆకలి వేయడం ఐశ్వర్యం.ఆరోగ్యం ఐశ్వర్యం. కట్టుకున్నవారితో మనసుకలిసుండడం ఐశ్వర్యం. ఎందుకు దోచుకుంటున్నట్లు?

నృసింహ శతకకర్త అన్నారిలా.

సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు

వెళ్లిపోయెడినాడు - వెంటరాదు

లక్షాధికారైన - లవణ మన్నమె కాని

మెఱుగు బంగారంబు - మ్రింగబోడు

విత్త మార్జనజేసి - విర్రవీగుటె కాని

కూడబెట్టిన సొమ్ము - తోడరాదు

పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి

దానధర్మము లేక - దాచి దాచి

తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ

తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।


సృష్టి మొదలు ఎందరు పుట్టేరు? ఎందరు పోయారు. పోయినవారెవరూ చిటికెడు మన్ను పట్టుకుపోలేదు.  నిన్న మొన్నటి ఉదాహరణలు స్టీవ్ జాబ్స్, రాకేష్ ఝున్ ఝున్ వాలా! కదలలేని స్థితిలో నిస్సహాయంగా ప్రాణాలు వదలినవారు.  ఆఖరికి తాను అనుకున్న శరీరం కూడా ఇక్కడే వదిలేసిపోతున్నారు. ఎవరూ నిన్ను గుర్తుపెట్టుకోరు. ఈవేళ చస్తే రేపటికి రెండు.  దోచుకోకు!

కడుపాకలికి కక్కుర్తి పడితే అదో అందం. అంతే!!!!


నోరున్నవారూ, బలమున్నవారూ;దోచుకుంటున్నారు,దాచుకుంటున్నారు.  ఎవరి వీలున్నంతవారు, వ్యాపారస్థులనుంచి, బలమైన వృత్తి వారలనుంచి,రాజకీయులదాకా! ఎందుకో!!!

ఎంత కళ్ళు మూసుకుందామనుకున్నా చూడక తప్పటం లేదు. బాధపడకా తప్పటం  లేదు . ఏమీ చేయలేని అసహాయ స్థితి. ఇదింతే!!!!

25, జనవరి 2024, గురువారం

రహస్యం దాగదు.

రహస్యం దాగదు.

దుష్యంతుడు వేటకి వెళ్ళి, కణ్వుడు లేనప్పుడు కణ్వాశ్రమంలో శకుంతలని చూసి మోహించి, గాంధర్వం అని పెళ్ళి చేసుకుని, ఆమెను తల్లిని చేసి వెళ్ళాడు.నిన్ను తీసుకువెళతానని వాగ్దానమూ చేసాడు. అడగొచ్చిందా? అనుకున్నాడు. శకుంతల కొడుకుని కన్నది. కొడుకు పెద్దవాడవుతున్నాడు, రాజు దగ్గరనుంచి ఎన్నాళ్ళకి కబురులేకపోతే తనే బయలుదేరిందీసారి,కణ్వునికి చెప్పి. రాజసభలో కొడుకుని చూపించి, వీడు మన కొడుకు అని చెప్పింది. దుష్యంతుడు ఎవరినో కుర్రాణ్ణి తీసుకొచ్చి వీడు నీకొడుకు అనడం బాగుందా? అసలు నువ్వెవరు? నాకు తెలియదే అనేసాడు. దానికి శకుంతల చాలా చెబుతూ, ఇలా అంటుంది 


విమల యశోనిధీ పురుషవృత్త మెరుంగుచు నుండు జూవె వే

దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్

యముడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా

ర్థము లివి యుండగా నరుడు దక్కొన నేర్చునె తన్ను మ్రుచ్చిలన్.


తెల్లనిదైన యసస్సు కలిగినవాడా! మానవుల చర్యలను చూస్తున్నవారున్నారు సుమా! వారు

 ధర్మం-1

యముడు-1

అంతరాత్మ-1

సూర్యుడు,చంద్రుడు-2

పగలు,రాత్రి-2

సంధ్యలు-3

వేదములు-4

పంచభూతాలు-5.

     వీరిలో  ఎవరో ఒకరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. మానవుడు  రహస్యంగా,  ఎవరికి తెలియకుండా  ఏమీ చేయలేడు.  అందుచేత నువ్వు చేసిన పని  ఎవరికీ తెలియదనుకోకు. అని చెప్పింది.అబ్బే అలాగా వినలేదు, తరవాత కత చాలానే జరిగి చివరికి ఒప్పుకున్నాడు. 


నేటికీ ఈ మహా పదార్ధాలు ఏదో ఒకటి మనం చేసేపని చూస్తూనే ఉంటాయి. నేటికాలం లో మరొకదాన్ని ఈ మహాపదార్ధాలలో చేర్చుకోవలసి వస్తూంది :) అదే గూగుల్. ఎలాగని అడగచ్చు. మీరు ఏం చదువుతున్నారు, ఏ రకపు వార్తలను చూస్తారు, ఏవస్తువులు కొనాలనుకుంటున్నారు, ఏవి మీకిష్టం, ఎక్కడ ఎమి దొరుకుతాయి,వాటిఖరీదులెంత,ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు,అక్కడకి దగ్గరలో చూడవలసినవేంటి? ఏమి తింటారు?  


మీ ఆలోచనేంటి? కల్పితమేధస్సుతో మీరెలా ఆలోచిస్తారో కూడా చెప్పేస్తున్న సంఘటనలున్నాయి. మీరెక్కడున్నారు,ఎంతసేపున్నారు, ఏ దిశగా కదిలేరు, ఇలా సర్వం జి.పి.ఎస్ లో దొరుకుతుంది. ఆధునికత పేరుతో బందీలైపోతున్నారు సుమా!  బహుపారాక్! ఒక రోజు మీ చర్యలే మీ కాళ్ళకి,చేతులకి బంధాలు కావచ్చు సుమా! 

 ఇలా మీసర్వస్వమూ గూగుల్ గుప్పెట్లో ఉంది. ఇది మహా పదార్ధం కాదా?


23, జనవరి 2024, మంగళవారం

కల్లు తాగె.

కల్లు తాగె.

స్థల,కాల,పరిమితులు లేనిదేది?


 అసలే కోతి,నిప్పులు తొక్కె,

ముల్లు గుచ్చుకునె,కల్లు తాగె,

పిచ్చి పట్టె, ఆపై దయ్యం పట్టె,

ఏమని చెప్పుదు గురువరా!  


22, జనవరి 2024, సోమవారం

జననీ జన్మ భూమిశ్చ

  జననీ జన్మ భూమిశ్చ


జననీ జన్మ భూమిశ్చ

స్వర్గాదపి గరీయసి

తల్లి,జన్మ భూమి స్వర్గం కంటే గొప్పవి.

రాముడు నేడు జన్మ భూమికి చేరుతున్నాడు.

భారతీయుల ఒక కల నెరవేరింది.
జై శ్రీరామ్

19, జనవరి 2024, శుక్రవారం

రెటమత శాస్త్రం :

 రెటమత శాస్త్రం :


లోకంలో కొంత మంది ఉంటారు. ఇతరులు ఏం చెప్పినా దాన్ని కాదు అనడం, దానికి వ్యతిరేకంగా మాట్లాడటం, విమర్శించడం, వ్యతిరేకంగా ప్రవర్తించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. కాదన్నవాడే కరణం అన్నట్లు, ఇతరులు చెప్పినది కాదనడం లోనే మన తెలివితేటలు ఉన్నాయి,వాళ్ళ కంటే భిన్నంగా ఆలోచించడంలోనే మన గొప్పదనం ఉంది అని నిశ్చితాభిప్రాయం కలిగి ఉంటారు. ఏదైనా ఎవరైనా చెబితే దానికి వ్యతిరేకంగా చేస్తారే తప్ప ఎవరు చెప్పినా వినరు. వారికి తోచిందే చేస్తారు. పోనీ అదైనా సరిగ్గా చేస్తారా అంటే అది కూడా సరిగా చేయరు. అయినా ఈ అలవాటు వదిలిపెట్టలేరు.

ఇంకా ఈ రెటమత శాస్త్రం లో ఉన్న మనసు ఎవరు ఏమి చెప్పినా దానికి వెంటనే ప్రశ్న వేయడం, ప్రతీ సమస్యనూ వ్యతిరేక దిశలో చూడటం, దానికి విరుద్ధంగా సమాధానం చెప్పడం చేస్తారు. భగవంతుడు ఉన్నాడు అని ఎవరైనా అంటే లేడు అని వెంటనే అంటారు. ఉండటం చేత వచ్చింది ఏం లేదు, లేకపోవడం వలన వీడికి వచ్చింది ఏం లేదు. కానీ భగవంతుడు ఉన్నాడు అని వారు అన్నారు కాబట్టి లేదని నేను అనడంలోనే నా వ్యక్తిత్వం నిలబడుతుంది. నేను గొప్ప తెలివి తేటలు కలిగిన వాడిని అని ఆలోచిస్తూ ఉంటాడు.

రేణుక పరశురాముని తల్లి. భర్త ఏం చెబితే దాన్ని వ్యతిరేకంగా ఆలోచించేది, వ్యతిరేకంగా చేసేది. అందుకే రేణుకా మతం, రెటమత శాస్త్రం అనే పేరు వచ్చింది.

ఎవరు ఏం చెప్పినా వీరు వ్యతిరేకంగా మాట్లాడుతారు. తనకు తోచదు, ఇతరులు చెబితే దాన్ని వినరు. ఇది రెటమత శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం. తనకు ప్రతీది తెలుసు అన్నట్లు మిగిలిన వారికి ఏమీ తెలియదు అన్నట్లు, తాను మాత్రమే తెలివి గలవాడినని మిగిలిన వారు తెలివి తక్కువ వారుగా భావించి విఱ్ఱవీగుతూ ఉంటారు. ఇటువంటి వారు శిష్యులుగా గురువు దగ్గరకు వచ్చినా ఈ పద్దతినే అవలంబిస్తారు. మళ్లీ దానిని సమర్థించుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇది తప్పు. నీకు తెలియదు అని ఒక చోటుకు వచ్చావు! నీ కంటే లోకంలో ఎంతో మంది తెలిసిన వారు ఉన్నారు అంటే నీకు రక్షణ. నాకు మాత్రమే అంతా తెలుసు అన్నట్లు అందరితో మాట్లాడుతూ ఉంటే అతని అలవాటు అతనికి వదిలి పెడతారు. అతనికి ఏమీ చెప్పరు. మళ్ళి చెప్పకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అయ్యో నాతో మాట్లాడటం లేదు. నేను ఇంత తెలివితేటలు కలిగిన వాడినని భాధ పడతారు. మళ్లీ ఎవరి దగ్గరికో వెళ్లి ఏమంటారు ఆ విషయం !? అంటూ చిన్నగా కదుపుతారు. నీతో ఎందుకు అంటే నాతో నేనయ్యా..ఏదైనా విషయం తేలాలంటే నాతోనే తేలాల్సి ఉంది అని నిష్కర్షగా గర్వంగా చెబుతారు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళను గురువు కాదు కదా భగవంతుడు కూడా మార్చలేడు. ఎంత జ్ఞాన బోధ చేసినా ఒక్కటే. కరుడు కట్టిన సూక్ష్మమైన అహంకారం అందరి కంటే మేం చాలా గొప్ప వారిమి అని వారి మనసులో చిన్న బీజం చిన్నప్పుడే నాటుకొని,ఆ తర్వాత అది మహ విషవృక్షం అయిపోయి, ఆ రూపంగానే వారి వారి ఆలోచన ఉండటం వలన వారు ఎవరు ఏం చెప్పినా వినరు. ఇక్కడితో ఆగితే పర్వాలేదు. ఇంకా ప్రమాదకరమైన లక్షణం ఇంకోటి ఉంది ఈ రెటమత శాస్త్రం లో...

అది ఏంటి అంటే మాట్లాడుతూ ఉంటే ఇంకొకరు ఎవ్వరూ ఎదురు మాట్లాడకూడదు. అందురూ చచ్చినట్టు నోరు మూసుకుని వినాలి. ఎందుకు అంటే మేం చాలా చాలా తెలివి తేటలతో , చాలా అనుభవంతో ఎంతో గ్రంథ జ్ఞానం , ఎంతో లోక జ్ఞానం చేసి చెబుతున్నామని వారి లోపల అహంకారం. అందువలన వారు మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోరు. ఇంకో రకం వారు కూడా ఉన్నారు. భగవంతుడు ఎవరైనా లేడు అని అంటే వెంటనే వీళ్ళు ఉన్నాడు అని అంటారు. ఇంకోంత సేపటికి భగవంతుడు ఉన్నాడు అంటే వెంటనే భగవంతుడు లేడు ఉంటే ఎక్కడ ఉంటారు!? కనపడడు ఏంటి!? అని వాదన ప్రారంభిస్తారు.

ఈ రెటమత శాస్త్రం వారికి శ్రోతలు కావాలి. వారు ఏం చెబితే అది జేజేలు కొట్టడానికి సంఘాలు కావాలి. వీళ్ళు సింగిల్ గా ఉండలేరు.. వీళ్ళని ఎవరు భరించలేరు. వారు చెప్పేది ప్రతీ వ్యక్తీ వినాలి. వీళ్ళు మాత్రం ఎవరి మాటా వినరు. ఇలాంటి వ్యక్తులకు అవసరమైన సాధన అవసరం ఉండదు. కానీ వారు సాధన చేయడానికి ఏ మాత్రం ఒప్పుకోరు. ఎందుకు అంటే వారి అహంకారం ఇంకొకరి ముందు తల వంచనివ్వదు. చివరికి గురువుకు కూడా. గురువు చెప్పింది వింటారు కానీ ఆచరణలో మాత్రం ఉండదు. గురువు అలాగే చెబుతారు అది ఈ రోజుల్లో సాధ్యమా !? అన్ని నియమాలు ఎవడు ఆచరిస్తారు!? ఎవరు చేయగలరు అని అనుకుంటారు. అంటే గురువు ఉపదేశాన్ని కూడా కాదు అనగల సూక్ష్మ అహంకారం తో ఉంటారు. వీరి యొక్క లక్షణం వలన మిగిలిన వారు కూడా భాధ పడతారు. ఇదే రేణుకా సంప్రదాయం. మనం ఆచరించాల్సిన నియమాలు ధర్మం అని ఆలోచించరు. వారు ధర్మం అంటున్నారు దానికి నిదర్శనం ఏంటి అని వెంటనే ప్రశ్న ! మళ్లీ వీళ్ళే ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు ఎదురు ప్రశ్న వేశామా ఇంక సహించలేకపోతారు. ఇతరులు చెప్పిన విషయం వినే ఓపిక, సహనం కాని, ఇతరుల నుండి నేర్చుకొనే నేర్పు కానీ ఎప్పటికీ ఉండదు. ఆ కారణం వలన వారి జీవితాలు అలా వెళ్లి పోతూనే ఉంటుంది కానీ వారిలో ఎప్పటికి మార్పు రాదు!? వేల పుస్తకాలు చదివినా వెయ్యి మంది గురువుల దగ్గరకు వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. చూశావా ఇంత మంది గురువులను కలిశాను అని అందరికీ చెప్పుకోవడానికి తప్ప వారి గుణంలో మార్పు రాదు ‌ .

గురువు దగ్గరకు ఎందుకు వెళుతున్నాం మనం!? మన జీవితం యొక్క మార్గాన్ని, మన ఆలోచనా పద్దతిని గురువు మార్చి ఏది నీకు మంచిదో, ఏది నీకు శాంతిని ఇస్తుందో, ఏది సౌఖ్యమో, ఏది ధర్మమో, ఏది భగవంతుని పదార్థమో, ఏది భ్రమనో అది చెప్పి దానిని మనం గుర్తించి మనం ఆ విధంగా వెళితే మంచి జరుగుతుందో చెబుతారని వెళ్తాం. వారు చెప్పింది చెప్పినట్టు జరుగుతందా ఇంత సాధన ఎవరు చేస్తారు అంటూ కనీసం ప్రయత్నం కూడా చేయరు ఈ రేటమత శాస్త్రం వారు. ఇతరులను సాధించడమే వీరి యొక్క తపస్సు. ఈ రోజు స్నేహం తో ఉంటారు రేపు వారితోనే విరోధం పెంచుకుంటారు. ఈ రోజు విరోధం గా ఉన్నవారితో రేపు స్నేహం తో కూడా ఉంటారు. ఈ స్నేహం, ఈ విరోధం రెండూ కూడా వీరిలో శాశ్వతంగా ఉండవు. వారిది చంచల మనసు. ఆ చంచల మనసుతో వారు బాధ పడుతూనే ఇతరులకు కూడా ఆ భాధను అందరి నెత్తిన పులుముతారు ఈ విధమైన సాధకులను ఆ భగవంతుడు కూడా మార్చలేడు. కనీసం అంతరాత్మ చెప్పే మాటను కూడా వినడానికి సిద్ధంగా లేని మనిషి, తన వాక్కే వేదవాక్కని, తను ఆచరించేదే ధర్మం అని, తన ఆలోచనే సరైనది అని అనుకుంటూ కాలం వెళ్ళదీస్తారు.

ఇందులో మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి. మేధావి రెటమతం వారు అంటే మామూలుగానే మాట్లాడుతారు. ఏదైనా ఒక మాండూక్యోపనిషత్తు గాని ఛాందోగ్యోపనిషత్ గాని ఎవరైనా మాట్లాడితే వెంటనే అది చాలా తప్పు. నేను త్రిపుర తాపినీ ఉపనిషత్తు చదివాను. అందులో ఇంతకంటే గొప్ప రహస్యం ఉంది, మీకు ఏం తెలుసు అని అంటారు. వారు మేధావులుగా ఇంకొక మేధావితో మాట్లాడే విధం ఇది.

ఇంకొందరు స్నేహం లో రెటమతం ఉంటుంది. అందరితోనూ ఒక వ్యక్తి బాగా క్లోజ్ గా ఉన్నాడు అనుకోండి. అతనితో ఎందుకు అందరూ స్నేహంగా ఉండాలి అనుకుంటూ మిగిలిన స్నేహితులతో అతడు మంచి వాళ్ళు అని మీరు అనుకుంటున్నారు అతను------- అని విమర్శిస్తారు. చెప్పేవాడికి సిగ్గులేకపోతే పోనీ .. వినే వాడి వివేకం ఏమీ అయింది!! అన్నట్టు ఈ ప్రపంచంలో చెప్పుడు మాటలు వినే వారే ఎక్కువగా ఉన్నారు. దాంతో ఎంత మంచి స్నేహితులు అయినా విడిపోతుంటారు. ఈ రెటమతం వారు చాలా నైపుణ్యం గల వారు ఎవరికి ఎలా చెబితే కింద పడతారో వారికి బాగా తెలుసు.

ఇంకొందరు ఉంటారు వారు పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనే రకం. ఇది కూడా రెటమతమే . సర్దుకోవడం, దిద్దుకోవడం ఈ రెండూ చేతకాని రెటమతం వారు. ఇంకొందరు మేమే బాగా చదువుకున్న వారిమి అని, మేం బాగా ఉన్నవాళ్లం అనీ, మాకే బాగా తెలివి తేటలు ఉన్నాయి అని, మా కంటే ఎవరూ గొప్ప వారు కాదు అనేటువంటి భావాలు కలిగి ఉన్నవారు. వీరికి కనుక కులం, మతం పిచ్చి పట్టింది అంటే ఇంక అంతే సంగతి.
Courtesy:What's app

నిన్న వాట్సాప్ చూస్తుండగా ఈ మెసేజ్ కనపడింది.   అజ్ఞాత రచయితకి శతకోటి వందనాలు. 

16, జనవరి 2024, మంగళవారం

చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది

 చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి  పడుతుంది

అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.

ఇదొక నానుడి అమ్మ తరచు చెప్పేది. ఏమిటి ఇలా చెబుతుందనుకునీ వాడిని.  నిజమే కదా! అన్నీ వడ్డించిన విస్తరి బరువుకి అణిగి ఉంటుంది,  పుల్లాకు(పులివిస్తరి) ఏమీ బరువు లేక ఎగిరెగిరి పడుతుంది. జీవితం లో అనుభవాలతో గాని దీని అర్ధం తెలియలేదు. సంపద కలిగినవాడు సంపాదన ఉన్నవాడు ఎప్పుడూ నెమ్మదిగానే ఉంటాడు,ఎగిరెగిరి పడడు. ఏవిషయానికి ఉద్రేకపడిపోడు. సంపాదన లేనివాడు సంపద లేనివాడే ఎగిరెగిరి పడుతుంటాడు. అలాగే జీవితం లో కష్టసుఖాలు చూసినవాడు ఉద్రేకపడిపోడు, సమస్యను పరిష్కరించుకోడానికే చూస్తాడు. జీవితానుభవం లేనివాడు మరికొన్ని చిక్కులు తెచ్చుకుంటాడు. అలాగే చదువుకున్నా,  అణుకువ కలిగి వున్నవాడు, తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు విద్యాభారంతో అణుకువగా ఉంటాడు. నోటికొచ్చినదంతా మాటాడడు. నాకింకా తెలియదు అనుకున్నవాడు వృద్ధిలో కొస్తాడు,ఎగిరి పడడు. మిడిమిడి జ్ఞానం వారు చెప్పక్కరలేదు.  మొన్నటి పద్యభాగమే మరోసారి.

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి


చమురున్న పెంకు నిలిచి కాలుతుంది,   చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి  పడుతుంది ,  అనేవారు నాటి కాలంలో. ఇదీ ఒక నానుడే!  

14, జనవరి 2024, ఆదివారం

మా పల్లెలో సంక్రాంతి

  ఎల్లరకు శోభకృత్నామసంవత్సర సంక్రాంతి శుభకామనలు.


మా పల్లెలో సంక్రాంతి


సద్యోజాత ముఖాయైనమః


అమ్మ



శివాలయం ముందు భోగిమంట

ఈరోజు ఉదయం నడకలో......అడుగడుగున ఒక భోగిమంట...సంక్రాంతి ఆనందహేల

10, జనవరి 2024, బుధవారం

చెట్టు మొదలు పైకి చిగుళ్ళు కిందికి ఉన్నది.

 మొదలు పైకి   చిగుళ్ళు కిందికి ఉన్న చెట్టు


చెట్టు మొదలు కిందికి చిగుళ్ళు పైకి ఉన్నది,మన కంటి పటలం మీద(రెటీనా)ఆ చెట్టుయొక్క బొమ్మ (image formed on retina is real and inverted ) తలకిందుగా ఉంటుంది. కాని మనకు చెట్టు మొదలుకిందికే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు?

*****

ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయం

ఛన్దాంసి యస్య పర్ణాని యన్తం వేద స వేదవిత్

భగవద్గీత.15-1

పైకి వేళ్ళు కలదియు,కిందికి కొమ్మలు కలదియు,వేద ఋక్కులే ఆకులుగ కలదియునగు అనశ్వరమైన అశ్వత్థ వృక్షము కలదని చెప్పుదురు. ఈ చెట్టు నెరుగువారు వేదములనెరుగువాడగును.


అధశ్చోర్ధం ప్రసృతా స్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః

అధశ్చ మూలన్యనుసంతతాని కర్మానుబన్ధీని మనుష్యలోకే

                                                                                                                        భగవద్గీత.15-2

వృక్షశాఖలు ప్రకృతి యొక్క త్రిగుణములచే పోషింపబడి కిందికిని మీదికిని వ్యాపించును. చిగురాకులు ఇంద్రియార్ధములు. ఈ వృక్షమునకు కిందికిపోవు వేళ్ళు కూడా నున్నవి. ఇది లోకముయొక్క సకామ కర్మలచే బద్ధములై యుండును.


5, జనవరి 2024, శుక్రవారం

కవులు-మసాగత్తు /మశాగత్తు.

కవులు-కదపా-మంద-మసాగత్తు/మశాగత్తు.


కవులుని, కౌలు అని కూడా అంటుంటారు, కవులు శబ్దానికి నానార్ధాలూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది రైతు,భూయజమాని మధ్య ఒడంబడిక గురించి. ఇది రైతు భూయజమానికి రాసిచ్చేది.  కవులును ఉయలు అనికూడా కొంతమంది లేకరులు నాటికాలం రాయగా చూసిన అనుభవం ఉంది. ఇక కదపా అన్నది భూయజమాని రైతుకు రాసిచ్చే హామీ.  ఈ రెండిటిలో వచ్చే పదాలే మంద,మశాగత్తు/మసాగత్తు. నేను వీటితో పరిచయం వదిలేసి చాలాకాలమే అయింది, నాకు తెలిసిన కాలంలో కవులు ఎలా ఉండేది? రాస్తాను.


దివి.....     .....నామ సంవత్సర,...మాస బహుళ/శుక్ల....  ...వాసరాన,......జిల్లా......తాలూకా.......గ్రామ కాపురస్థులు........గారి కుమారుడు..........గారికి.

......జిల్లా......తాలూకా..........గ్రామ కాపురస్థుడు.........గారి కుమారుడు........వ్రాయించి ఇచ్చిన కవులు.


మీకు ....గ్రామంలో ఉండుకున్న సర్వేనెం.......రి.సర్వేనెం.......లోని య........సెం.....భూమిని ఈ రోజు కొలతవేయించి వ్యవసాయం నిమిత్తంగా  నాకు  అప్పగించినారు.   సదరు భూమిపై కవులుగా    సంవత్సరం ఒక్కంటికి,  యకరానికి .......  3 గుళ్ళ /75 కే.జిల కాటాబస్తాలు  మొదటిపంట ధాన్యం ,  మొత్తం య........సెం.....భూమి కి   .....బస్తాల నెంబు,తప్ప,తాలు,పొల్లు, తుక్కు,దూగర లేని మొదటిపంట ధాన్యం, మీగాదివద్ద కొలగారంవారిచే తూకం వేయించి  అప్పగించగలవాడను. ఈ కవులు కాలం ఐదు సంవత్సరములు. ఈ కాలంలో మొదటిపంటగా వరిని,రెండవపంటగా నువ్వు,మినుము,పెసర,కంది, జొన్న లాటి మెట్టపైరులు పండించుకునే నిర్ణయం. రెండవపంట ఫలసాయంలో మీకు సంబంధము లేదు. ఈ భూమికి ప్రభుత్వానికి చెల్లించవలసిన   పన్నులు యావత్తూ మీరే చెల్లించుకోవలెను. ఈ భూమికి ఉన్న నీటివనరులు పాడుచేయక రక్షిస్తాను, ఉన్న ఈజుమెంటు హక్కుల్ని రద్దు చేయను,కొత్తవాటిని కలగజేయను.   సరిహద్దురాళ్ళను జాగ్రత్తగా కాపాడతాను. చివరి సంవత్సరంలో నువ్వు పంట వేయకుండా ఉండే నిర్ణయం. చివరి సంవత్సరం రెండవపంట తరవాత మంద,మశాగత్తులు జరిపించి, మీ భూమిని మీకు అప్పగించగలవాడను. ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కవులు. 

సంతకం....................


ఇందుకు సాక్షులు....

౧.

౨.


దస్తూరి..............


ఇక కదపా అనేది, కవులులో చెప్పబడిన షరతులు అన్నీ ఇందులోనూ ఉంటాయి. ఫలానా,ఫలానా షరతులు రైతు అమలు చేయాలనీ,వివరాలుంటాయి.  చివరలో ఈ కవులు కాలంలో ఇవ్వవలసిన కవులు బకాయిలు పెట్టకుంటే కవులు రద్దు చేయనని కదపా ఇస్తున్నాను, ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కదపా.

అనగా రైతుకు యజమాని చ్చే భరోసా,గేరంటీ,హామీ. చెవికదపా ఇస్తానోయ్! అన్నమాట వింటుంటాం, అంటే చెవిని హామీ ఇచ్చాడనమాట. :)


మంద అనేది మందగట్టడం. ఏభై ఏళ్ళ కితం రసాయన ఎరువులు లేవు, ఎరువుగా  పెంటతోలడం,పశువులు,మేకలు,గొర్రెలని మందగా భూమిలో ఉంచడం చేసేవారు.

ఇక మశాగత్తు/మసాగత్తు అనే పదానికి అర్ధంలేదు. మసాహత్ అనే ఉర్దూ/హిందీ పదం మన తెనుగునోటబడి            మశాగత్తు/మసాగత్తు అయింది. దీనికి అర్ధం, భూమి కొలత,సర్వే అని అర్ధం. రైతు భూమి తీసుకునేటపుడు కొలతవేయించి అప్పజెప్పుకుంటాడు, మళ్ళీ కొలత వేయించి అప్పజెపుతాడు.  ఇక మసాహత్ అనగా కొలత ఎందుకని సందేహం కదా! సర్వేరాళ్ళు జరిపేసేవారు,గట్లు  జరిపేసేవారు, ఇలా చాలాచాలా అపభ్రంశాలు జరిగేవి,దీనితో తగవులూ చాలా ఉండేవి, వీటిని మొదటిలోనే పరిహరించడానికి చేసే ప్రయత్నమే ఇది. మాస్టర్ రాయి అని ఒక పెద్ద సర్వేరాయి ఉంటుంది. మొత్తం గ్రామ సర్వే అంతా ఆ రాయి ఆధారంగా నడుస్తుంది.   ఇది ఎంతుంటుందంటే, పైన రెండ డుగుల పొడవు వెడల్పులతో దగ్గరగా   పది అడుగుల పొడవుంటుంది.  కిందికిపోను లావుగా ఉంటుంది. ఏడు,ఎనిమిదడుగులలోతుపాతిపెట్టి,ఒకడుగు పైకి ఉంచేటట్టు చేస్తారు. ఈ మాస్టర్ రాయిని రైతులంతా గమనిస్తుంటారు. దీనినే రాత్రికి రాత్రి తవ్వితీసి మరోచోట పాతిపెట్టిన ఘనులూ ఉన్నారు,నాడే! ఆ తరవాత కాలంలో రివెన్యూవారు సరిచేసిన సందర్భాలు కోకొల్లలు. 

గ్రామానికో డిగ్లాటు ఉంటుంది. ఇది కరణం దగ్గరఒకటి,తాసిల్దారు దగ్గరొకటి, కలక్టర్ దగ్గర కాపీలుంటాయి. ప్రతి సర్వే నెంబరు భూమి పరిమితం,కొలతలు,భూమి ఆకారపు చిత్రం స్కేలుకి వేసి ఉంటుంది, సర్వేరాళ్ళు ఎక్కడ ఉన్నదీ నమోదయి ఉంటుంది. మనభూమి తాలూకు డిగ్లాట్ కావాలంటే కరణం అచ్చుగుద్దినట్టు వేసి ఇచ్చేవాడు, అసలును చూసి. ఈ డిగ్లాటును సర్వే,రిసర్వేలలో సర్వే చేసినవారు, వేస్తారు. సర్వే చేసి డిగ్లాటు వేసిన వారి పేరు హోదా కూడా నమోదయి ఉంటుంది. చాలాచాలా మార్పులొచ్చాయి, ఇప్పుడెలా ఉన్నది తెలియదు.


3, జనవరి 2024, బుధవారం

నీళ్ళుకొడితే ఒకటవుతాయి....

  నీళ్ళుకొడితే ఒకటవుతాయి...


నీళ్ళుకొడితే ఒకటవుతాయి! పాలు కొడితే ఒకటవుతాయా?

అనికాని

నీళ్ళుకొడితే ఒకటవుతాయిగాని, పాలు కొడితే ఒకటి 

కావు.

అంటూ ఈ నానుడిని వాడుతుంటారు. ఎంటి దీని విశేషం?    ఇది మానవ సంబంధాలను నిర్ణయించడానికి తరచుగా చెప్పే మాట.


ఈ నానుడి నిక్కచ్చి నిజం.  జీవిత సత్యాన్ని చిన్న మాటలలో ఇమిడ్చి చెప్పేరు,ఎంతో అనుభవం మీద పెద్దలు. అది ఇప్పటికి సత్యమే! ఎప్పుడూ నిత్య నూతనమే!! నీళ్ళని ఎంత చిలికినా నీళ్ళుగానే ఉంటాయి. కాచినా ఆవిరైపోతాయేమోగాని నీళ్ళుగానే అవుతాయా తరవాత కూడా, మార్పు చెందవు. కాని పాలు  చిలికితే  వెన్నొస్తుంది. దీన్ని పచ్చిపాల వెన్న అంటారు. కాస్తే నెయ్యవుతుంది, కాని కొవ్వు వాసనుంటుంది.  కాచి  తోడు వేస్తే పెరుగవుతుంది. చిలికితే మజ్జిగవుతుంది,వెన్నొస్తుంది.  వెన్న కాస్తే నెయ్యొస్తుంది. పాలు ఎన్ని రూపాంతరాలు  చెందాయి? మరి నీళ్ళు మారాయా? లేదే!! 

అసందర్భపు మాటే గాని అవసరమైనమాట. మజ్జిగ చుక్క వెయ్యనిది,వేలు ముంచనిది పాలు పెరుగుకావు. మరి మొదటిసారి పాలు పెరుగెలా అయ్యాయి,అవుతాయి? గోరు వెచ్చని పాలలో ఒక ముచికున్న ఎండు మిరపకాయ పడెయ్యండి, చాలు,పాలు తోడుకుపోతాయి,పెరుగవుతుంది. పాలు పెరుగవడానికి కావలసిన బేక్టీరియా ఆ ఎండు మిరిరపకాయ తొడిమలో ఉంది.  

 పాలుకాస్తే అందులో నీరు ఆవిరై పొడిలా మిగుల్తుంది. అంటే ఏం చేసినా నీరు ఒకటిగానే ఉంది, పాలు మాత్రం రూపాంతరం చెందిపోయింది. అలాగే కావలసినవారి మానవ సంబంధాలూ అలాగే ఉoటాయని ఈ నానుడి మాట. 


ఒక ఉదాహరణ చెబుతా స్వానుభవం....

నా మిత్రుడు భార్యకి, తల్లికి, సరిపడక, తల్లిని వేరుంచాడు. మిత్రుని  తల్లి ఓ రోజు వచ్చి కూచుని,  తన కొడుకు కోడలి మీద చెప్పిన నేరం చెప్పకుండా చెప్పి,  కళ్ళనీళ్ళు తుడవకుండా ఏడ్చి, ముక్కులు చీది గోడలు ఖరాబు చేసి వెళ్ళింది. ఆ తరవాత ఇల్లాలు నెమ్మదిగా 'మనకెందుకొచ్చిన గొడవ' అని ఊరుకుంది. నేను ఊరుకోలేక మర్నాడు మిత్రుడు కనపడితే ఒంటరిగా చూసి 'ఏం బాగోలేదురా!  

నీతల్లి అలా బాధపడుతుంటే' అని క్లాసు పీకేను,  

చెప్పిన సంగతీమరచాను కూడా! ఆ తరవాత వారంలో ఒకరోజు ఇంటికొచ్చేసరికి, ఇల్లాలు మొన్ననొచ్చినావిడ మధ్యాహ్నం నుంచి రెండుసార్లొచ్చింది మీకోసం, అని చెప్పింది. ఏమయిందిట,అనేలోగానే ఆవిడొచ్చి కూచుంది. ఏదో మంచిమాట చెబుతుందిగాబోలనుకున్నా! ఆవిడ,"ఔరౌరా! ఏం పెద్దమనిషివయ్యా నువ్వూ!  వాళ్ళు నా కొడుకు, నా కోడలు,  

పైవాళ్ళేం కాదు. ఏదో! నా కడుపులో మాట నీ చెవినేసేనో అనుకో! వాళ్ళనిలా వీధిని పడేస్తావా!"   అంటూ చింతచెట్టును దులిపినట్టు దులిపి, నేను చెప్పేమాట కూడా వినక వెళ్ళింది. ఇది జరుగుతున్నంత సేపు ఇల్లాలు నవ్వు బిగబట్టుకుని ఉన్నట్టే అనిపించింది. ఆవిడెళ్ళిన తరవాత, ఇక ఈవిడ దులుపుతుంది  కాబోలురా దేవుడా! అనుకుంటూ 'రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెరువనేర్తునా' అనే నానుడి గుర్తుచేసుకుని ఇల్లాలికేసి చూసాను.  కాని చిత్రంగా స్వీటు,స్వీటుగా ''పాలుకొడితే ఒకటిగావు,నీళ్ళు కొడితే ఒకటే'' అని చెప్పలేదూ! అని ఊరుకుంది. ఇంత స్వీటుగా చెప్పి ఊరుకున్నందుకు ఏదో చెయ్యబోతే చాలు!చాలు!! పిల్లలెదురుగా పోకిరీ వేషాలంటూ స్నానం చెయ్యండని బాత్ రూమ్ లోకి తోసింది....నిజం కదూ! ఆ తల్లి,కొడుకు,కోడలు ఒకటయ్యారు, నేను వేరయ్యాను..


అంతెందుకు నిన్నమొన్న,మన రాష్ట్ర రాజకీయాల్లో జరిగిందిదే కదూ!

దీనికి కుటుంబాలు,కులాలు,  మతాలు 

 ట్రేడ్ యూనియన్లు, లాయర్ల,డాక్టర్ల అసోసియేషన్లు, పత్రికా విలేకరుల యూనియన్లు రాజకీయపార్టీలు,రాష్ట్ర రాజకీయాలు,దేశరాజకీయాలు,అంతర్జాతీయ రాజకీయాలూ అతీతం కాదు. 

అంతా మేము దీనికి అతీతం అంటుంటారు, విని నవ్వుకోడమే! 'అందరూ శ్రీవైష్ణవులే,బుట్టడు రొయ్యలూ ఏమైనట్టు' అన్నది ఒక నానుడి.

ఎవరు ఏం చెప్పినా నీళ్ళు కొడితే ఒకటవుతాయి, పాలుకొడితే కావు!!!!


31, డిసెంబర్ 2023, ఆదివారం

మందున్నది మంచి విందున్నది.

2024ఆంగ్ల నూతన వత్సర ప్రారంభదిన ముoదస్తు శుభకామనలతో

మందున్నది మంచి విందున్నది.


 రారోయి బావా! మా ఇంటికి 

మందున్నది మంచి విందున్నది.

మందున్నది మంచి విందున్నది.


నువ్వు రానీకి బుల్లెట్టు బండున్నది

మనం కూచోను ఫామ్ హవుజ్ ల చోటున్నది.

రావోయ్ బావా మా ఇంటికి 

మందున్నది మంచి విందున్నది.


నువు తాగనీకి పోతుతాడి కల్లున్నది.

నంజుకోను దోర దోర చికినున్నది

రావోయి బావా మా ఇంటికి 

మందున్నది మంచి విందున్నది.


కాదు కాదంటె పాతపాత చిగురున్నది. 

అందులోకి  చీకు ముక్కున్నది.

రావోయి మా ఇంటికి బావా

మందున్నది మంచి విందున్నది.


నీకు నచ్చకుంటె కంపెనీ సరుకున్నది.

అందులోకి వర్రవర్ర కాజున్నది.

రావోయి బావా మాఇంటికి

మందున్నది మంచి విందున్నది. 


లేదు కాదంటె సీమ సరుకున్నది.

నంజుకోను సీమకోడి ఇగురున్నది.

రావోయి  బావా  మాఇంటికి

మందున్నది మంచి విందున్నది.


నీకాకలేస్తె బాస్మతి   వైట్ రైసున్నది.

అందులోకి  పొట్టేలుతల కూరున్నది.

 రావోయి బావా మాఇంటికి 

మందున్నది మంచి విందున్నది.


ఆపైన  మంచి ఉలవచారున్నది

రావోయి బావా మాఇంటికి

మందున్నది మంచి విందున్నది.


ఆపైన అసలు పాల పెరుగున్నది.

 చీక్కోను మాగాయి టెంకున్నది.

రావోయి బావా మా ఇంటికి

మందున్నది మంచి విందున్నది.


నువు పడుకోను డబల్ కాట్ల బెడ్డున్నది

దానితోడు, ఏ.సి  మిసనున్నయి. 

రావోయి బావా  మా ఇంటికి

మందున్నది మంచి విందున్నది.

(రావోయి మావా మా ఇంటికి పాట పేరడీ)


ఈపాటికి చాలామందికి ఇలా ఆహ్వానాలొచ్చే ఉంటాయి, నూతన సంవత్సరం సందర్భంగా!

ఇది ప్రమోదం అయ్యేలా లేదు. కరోనా ప్రమాదం చెప్పి చెప్పిరాదు. సింగపూర్ లో XBB వేరియంట్ బలంగా వ్యాపిస్తోందిట. మూలమైన చైనాలో గత మూడు నెలలుగా ఇది నడుస్తున్నట్టు వార్తలు. లక్షణాలు పిల్లలని ఎక్కువగా సోకుతున్నట్టు, న్యూమోనియా ఆక్రమించి ప్రాణాలు తీస్తున్నట్టు వార్తలు.


ఇక మనదేశంలో ఇది ఇంకా అడుగుపెట్టలేదు గాని, JN1 అనే వేరియంటు కేరళా,మహారాష్ట్ర, గోవాలలో ఉన్నట్టు వార్త. లక్షణాలు దగ్గు,రొంప,జ్వరం,న్యూమోనియా...ఇలా నడుస్తున్నట్టు వార్తలున్నాయి. మా జిల్లాలో మూడు కేస్ లున్నట్టు, ఒకటి పండు ముసలి,మరొకటి చిన్ని పాప,మరొకటి మధ్యవయసు. ఈ వార్త ధృవీకరింపబడలేదు. మేం మాత్రం ము.మూ గుడ్డలు కట్టుకునే తిరుగుతున్నాం. పది మందిలోకి పోవటం లేదు.  ఆరోగ్యం జాగర్త! బతికియుండిన సుఖములబడయవచ్చు.



మరో బావయ్య ఇలా అంటున్నాడు చిత్తగించండి.

 వద్దురా బావయ్య!

ఈపొద్దు మందు మాటొద్దురా
అయ్యా! అయ్యా!! వద్దురా బావయ్య!

పెద్దోళ్ళింటిని తఱిచి చూచేవేళ

పసిపాలను కరోన పట్టుకెళ్ళేవేళ
వద్దురా! వద్దురా!!

ఈపొద్దు మందు మాటొద్దురా

అయ్యా! అయ్యా!! వద్దురా బావయ్య!

పూడ్చిన చిగురేమో పండని వేళాయె
చీకు
లకి  నీ చెల్లి చెల్లు  
చెప్పినవేళ

వద్దురా! వద్దురా!! బావయ్య.

ఈపొద్దు మందు మాటొద్దురా

చుట్టాలందరు గాలిగాళ్ళురా!
మనమీద కొండెములు మళ్ళీ చెప్పేరు
వద్దురా! వద్దురా బావయ్య.
ఈపొద్దు మందు మాటొద్దురా

కంపెనీ మందంటే కడు గోలరా
మొదటి రౌండ్ కే వాంతులొచ్చేను.
వద్దురా! వద్దురా! బావయ్య.
ఈపొద్దు మందు మాటొద్దురా

ఆడుకోవలనన్న పాడుకోవలెనన్న
అన్నిట, సెల్లు చాలురా
వద్దురా! వద్దురా! బావయ్య

ఈపొద్దు మందు మాటొద్దురా

( వద్దురా కన్నయ్యా! పాటకి పేరడీ! బండి వారి బ్లాగులో కామెంటుగా ఆశువుగా చెప్పినది, కొన్ని కొన్ని మార్పులతో.)

28, డిసెంబర్ 2023, గురువారం

తుమ్ముకి తమ్ముడున్నాడు ఆవులింతకి అన్న లేడు.

  తుమ్ముకి తమ్ముడున్నాడు ఆవులింతకి అన్న లేడు.

ఇదొకనానుడి జనసామాన్యం చెప్పుకునీదిన్నీ! ఏమి దీని కత?


     తుమ్ము సాధారణంగా ఒంటరిగా ఉండదు. కనీసం రెండు సార్లు తుమ్ముతారు. కొంతమంది మూడు,నాలుగు,ఐదు సార్లు వరసగా తుమ్మడం అలవాటు ఉంటుంది. అందుకే తమ్ముకి తమ్ముడున్నాడంటారు, అంటే ఒక్కసారి తుమ్మడంతో కాదు, మరోసారి కూడా  తుమ్ముతారు  సుమా! అని చెప్పడమే.

ఇక ఆవులింతకి అన్నలేడు. నిజం :) అన్నలేడన్నారుగాని తమ్ముడు  లేడనలేదు. అంటే ఆవులింత కూడా వస్తే ఒక్కసారితో కాదు. వరసగా వస్తాయని చెప్పడం. కొంతమందైతే అలా అవులిస్తోనే ఉంటారు.  కొంతమంది ఆవులింతతో పెద్ద పెద్ద, వింత వింత శబ్దాలు కూడా చేస్తారు.


అసలు తుమ్మెందుకొస్తుంది? అదీ తెలుసుకోవలసింది. ముక్కులోకి ధూళి కణాలు చేరినా, ఘాటైనా వాసన పీల్చుకున్నా వాటిని అసంకల్పితంగా బయటకు పంపే చర్యనే తుమ్ము. ధూళి కణాలను అడ్డేందుకు ముక్కులో వ్యవస్థ ఉంది.వెంట్రుకలుంటాయి,  ముక్కు తడిగా ఉంటుంది.. ఇవి ఫిల్టర్ లా పనిచేస్తాయి. వాటిని అందంకోసం తొలగించేస్తున్నారు. ఆలిఫేక్టరీ నాడులకొసలు ప్రతిస్పందించి, లోపలికి ఊపిరి తిత్తులలోకి పీల్చుకున్న ఘాటైన వాసనల్ని బయటికి పంపించేస్తాయి.


ఇక ఆవులింత శరీరం అలసినపుడు నిద్ర ముంచుకొస్తున్నవేళ ఆవులింతలొస్తాయి,ఎక్కువగా.!


తుమ్ముకుని చిరంజీవ అనుకోడం.

తుమ్మినపుడు గుండె లిప్తకాలం లయతప్పి మరలా లయ అందుకుంటుందట. దానికిగాను, తుమ్మితే పెద్దలు చిరంజీవ అని  ఆశీర్వదించడం  అనూచానంగా వస్తున్న అలవాటు. గుండె లయతప్పడమన్నది మనవారికి తెలుసునా? ఏమో చెప్పలేను. కాని చిరంజీవ! అని ఆశీర్వదించడం మాత్రం అనూచానంగా జరుగున్నదే!

రాత్రులు భోజనసమయంలో తుమ్మితే నెత్తిన నీళ్ళు జల్లి చిరంజీవ అని ఆశీర్వదించడం అలవాటు. అలా పెద్దలు ఆశీర్వదించేదాకా మరోముద్దనోట పెట్టకూడదంటారు. కారణమేమై ఉండచ్చని ఆలోచిస్తే మరో తుమ్ము రావచ్చనీ అందుకుగాను కొద్ది సమయం వేచి చూడడం మంచిదని అనుకుంటా!  ఇలా తుమ్మిన తరవాత ఆశీర్వదించేవారు లేక,తమమటుకు తమరే ఆశీర్వదించుకోడాన్ని తుమ్ముకుని ఆశీర్వదించుకోవడమంటారు.


దీన్ని తర్జుమాచేసి  తప్పుచేసి (మరొకరు తప్పుపట్టేలోపు)తమనుతామే నిందించుకోవడాన్ని ఈ నానుడితో చెబుతారు.


తుమ్ముపై లోకoలో మాటలు

తుమ్మును ఎక్కువగా అపశకునంగానే భావిస్తారు.

తుమ్ముకుంటూ నిదరకి ఉపక్రమించచ్చంటారు.

తుమ్ముకుంటూ నిద్ర లేవకూడదంటారు.

తుమ్ముకుంటూ ప్రయాణానికి బయలుదేరకూడదంటారు.

ప్రయాణానికి బయలుదేరి ఒకడుగేసిన తరవాత,వెనకనుంచి తుమ్ము వినపడితే, వెనకతుమ్ము ముందుకు మంచిదంటారు. ప్రయాణం సాగిస్తారు.


25, డిసెంబర్ 2023, సోమవారం

యతికుతం....

 యతికుతం....


ఆతనో యతికుతం మనిషిలెద్దురూ అంటుంటారు, అన్నీ యతికుతం బుద్ధులే.... ఈ ,యతికుతం, కి అర్ధమేంటి?


పూజ చేస్తున్నారా? కొంతపూజయ్యాకా మొదలవుతుంది.....యానికానిచ పాపాని......పాహిమాన్ కృపాయా దేవ శరణాగత వత్సల,అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ..రక్ష రక్ష....

 పాపాలు చేశాను... దేవుడా దయతో మన్నించు, మరో     దిక్కులేదు,రక్షించు,రక్షించు, అంటూ....


ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి...

నీకు ప్రదక్షణ చేసి నమస్కారం చెయ్యాలని కోరిక,శక్తి లేదు, నీవు నాలో కూడా ఉన్నావని నమ్ముతూ, నా చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నా, నీకు ప్రదక్షిణం చేసినట్టు భావించు, నమస్కారం స్వీకరించు. 


ఆపైన

 కరచరణ కృతంవా

మనోవాక్కాయజంవా చ

తవాపరాధం క్షమస్వ

......................

  చేతులు, కాళ్ళతో;మనసు, వాక్కు, శరీరంలతో చేసిన తప్పులు, నీపట్ల చేసినతప్పుల్ని మన్నించు, క్షమించు,దేవా అంటూ, చెంపలు వాయగొట్టుకుంటూ...


చివరకొచ్చేసేం....

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాధిప ,

'యత్కృతం' తు మయాదేవ పరిపూర్ణం....


నేను చేసిన పూజలో మంత్రాలు సరిగా చెప్పలేకపోయినా,చేసే పూజలో లోపం ఉన్నా,(పత్రి, నైవేద్యం వగైరాలు) సరిగా లేకున్నా, నీపట్ల భక్తిలేకున్నా, నేను ఎలా చేస్తే అదే సంపూర్ణంగా భావించు...

మంత్రాలు చెప్పలేకపోయావు సరే,పూజలో లోపం అదిన్నీ సరే,భక్తి కూడా లేని నిన్ను నేను రక్షించాలా? అని భగవంతుడు అడగడు...... 


ఇంతకీ 'యతికుతా'నికి దీనికి లింకేంటని కొచ్చను కదా!

మంత్రహీనం.......లో .......'యత్కృతం'.... అనివచ్చిందిగా అదే ఇది, నేను ఎలా చేస్తే అదే సంపూర్ణం అనుకో అన్నాడుగా అలాగే నేనేది చేసిన,చెప్పినా అదే సంపూర్ణం అనే మనుషులుంటారు చూడు! అని చెప్పడానికే 'యత్కృతం'....అలా అలా నలిగి 'యతికుతం' అయింది అనుకుంటా.


ఇటువంటి వాళ్ళకి ఉదాహరణలు కావాలా?......  :)