Wednesday 3 January 2024

నీళ్ళుకొడితే ఒకటవుతాయి....

  నీళ్ళుకొడితే ఒకటవుతాయి...


నీళ్ళుకొడితే ఒకటవుతాయి! పాలు కొడితే ఒకటవుతాయా?

అనికాని

నీళ్ళుకొడితే ఒకటవుతాయిగాని, పాలు కొడితే ఒకటి 

కావు.

అంటూ ఈ నానుడిని వాడుతుంటారు. ఎంటి దీని విశేషం?    ఇది మానవ సంబంధాలను నిర్ణయించడానికి తరచుగా చెప్పే మాట.


ఈ నానుడి నిక్కచ్చి నిజం.  జీవిత సత్యాన్ని చిన్న మాటలలో ఇమిడ్చి చెప్పేరు,ఎంతో అనుభవం మీద పెద్దలు. అది ఇప్పటికి సత్యమే! ఎప్పుడూ నిత్య నూతనమే!! నీళ్ళని ఎంత చిలికినా నీళ్ళుగానే ఉంటాయి. కాచినా ఆవిరైపోతాయేమోగాని నీళ్ళుగానే అవుతాయా తరవాత కూడా, మార్పు చెందవు. కాని పాలు  చిలికితే  వెన్నొస్తుంది. దీన్ని పచ్చిపాల వెన్న అంటారు. కాస్తే నెయ్యవుతుంది, కాని కొవ్వు వాసనుంటుంది.  కాచి  తోడు వేస్తే పెరుగవుతుంది. చిలికితే మజ్జిగవుతుంది,వెన్నొస్తుంది.  వెన్న కాస్తే నెయ్యొస్తుంది. పాలు ఎన్ని రూపాంతరాలు  చెందాయి? మరి నీళ్ళు మారాయా? లేదే!! 

అసందర్భపు మాటే గాని అవసరమైనమాట. మజ్జిగ చుక్క వెయ్యనిది,వేలు ముంచనిది పాలు పెరుగుకావు. మరి మొదటిసారి పాలు పెరుగెలా అయ్యాయి,అవుతాయి? గోరు వెచ్చని పాలలో ఒక ముచికున్న ఎండు మిరపకాయ పడెయ్యండి, చాలు,పాలు తోడుకుపోతాయి,పెరుగవుతుంది. పాలు పెరుగవడానికి కావలసిన బేక్టీరియా ఆ ఎండు మిరిరపకాయ తొడిమలో ఉంది.  

 పాలుకాస్తే అందులో నీరు ఆవిరై పొడిలా మిగుల్తుంది. అంటే ఏం చేసినా నీరు ఒకటిగానే ఉంది, పాలు మాత్రం రూపాంతరం చెందిపోయింది. అలాగే కావలసినవారి మానవ సంబంధాలూ అలాగే ఉoటాయని ఈ నానుడి మాట. 


ఒక ఉదాహరణ చెబుతా స్వానుభవం....

నా మిత్రుడు భార్యకి, తల్లికి, సరిపడక, తల్లిని వేరుంచాడు. మిత్రుని  తల్లి ఓ రోజు వచ్చి కూచుని,  తన కొడుకు కోడలి మీద చెప్పిన నేరం చెప్పకుండా చెప్పి,  కళ్ళనీళ్ళు తుడవకుండా ఏడ్చి, ముక్కులు చీది గోడలు ఖరాబు చేసి వెళ్ళింది. ఆ తరవాత ఇల్లాలు నెమ్మదిగా 'మనకెందుకొచ్చిన గొడవ' అని ఊరుకుంది. నేను ఊరుకోలేక మర్నాడు మిత్రుడు కనపడితే ఒంటరిగా చూసి 'ఏం బాగోలేదురా!  

నీతల్లి అలా బాధపడుతుంటే' అని క్లాసు పీకేను,  

చెప్పిన సంగతీమరచాను కూడా! ఆ తరవాత వారంలో ఒకరోజు ఇంటికొచ్చేసరికి, ఇల్లాలు మొన్ననొచ్చినావిడ మధ్యాహ్నం నుంచి రెండుసార్లొచ్చింది మీకోసం, అని చెప్పింది. ఏమయిందిట,అనేలోగానే ఆవిడొచ్చి కూచుంది. ఏదో మంచిమాట చెబుతుందిగాబోలనుకున్నా! ఆవిడ,"ఔరౌరా! ఏం పెద్దమనిషివయ్యా నువ్వూ!  వాళ్ళు నా కొడుకు, నా కోడలు,  

పైవాళ్ళేం కాదు. ఏదో! నా కడుపులో మాట నీ చెవినేసేనో అనుకో! వాళ్ళనిలా వీధిని పడేస్తావా!"   అంటూ చింతచెట్టును దులిపినట్టు దులిపి, నేను చెప్పేమాట కూడా వినక వెళ్ళింది. ఇది జరుగుతున్నంత సేపు ఇల్లాలు నవ్వు బిగబట్టుకుని ఉన్నట్టే అనిపించింది. ఆవిడెళ్ళిన తరవాత, ఇక ఈవిడ దులుపుతుంది  కాబోలురా దేవుడా! అనుకుంటూ 'రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెరువనేర్తునా' అనే నానుడి గుర్తుచేసుకుని ఇల్లాలికేసి చూసాను.  కాని చిత్రంగా స్వీటు,స్వీటుగా ''పాలుకొడితే ఒకటిగావు,నీళ్ళు కొడితే ఒకటే'' అని చెప్పలేదూ! అని ఊరుకుంది. ఇంత స్వీటుగా చెప్పి ఊరుకున్నందుకు ఏదో చెయ్యబోతే చాలు!చాలు!! పిల్లలెదురుగా పోకిరీ వేషాలంటూ స్నానం చెయ్యండని బాత్ రూమ్ లోకి తోసింది....నిజం కదూ! ఆ తల్లి,కొడుకు,కోడలు ఒకటయ్యారు, నేను వేరయ్యాను..


అంతెందుకు నిన్నమొన్న,మన రాష్ట్ర రాజకీయాల్లో జరిగిందిదే కదూ!

దీనికి కుటుంబాలు,కులాలు,  మతాలు 

 ట్రేడ్ యూనియన్లు, లాయర్ల,డాక్టర్ల అసోసియేషన్లు, పత్రికా విలేకరుల యూనియన్లు రాజకీయపార్టీలు,రాష్ట్ర రాజకీయాలు,దేశరాజకీయాలు,అంతర్జాతీయ రాజకీయాలూ అతీతం కాదు. 

అంతా మేము దీనికి అతీతం అంటుంటారు, విని నవ్వుకోడమే! 'అందరూ శ్రీవైష్ణవులే,బుట్టడు రొయ్యలూ ఏమైనట్టు' అన్నది ఒక నానుడి.

ఎవరు ఏం చెప్పినా నీళ్ళు కొడితే ఒకటవుతాయి, పాలుకొడితే కావు!!!!


7 comments:

  1. తణ్ణి అడిచ్చా అందరూ మమేకమే :)


    ReplyDelete
    Replies
    1. Zilebi3 January 2024 at 09:32
      ఉదకం,జలం,నీరు,పానీ,నీర్,తణ్ణీ ఏపేరుతో పిలిచిన నీరు నీరే. నీఱుకాదు.

      Delete
    2. తణ్ణి అడిక్కరదు వేరే :)

      Delete
  2. కొంతమంది అరవ్వాళ్ళు మద్యాన్ని కూడ తన్ని అంటారండి.

    ReplyDelete
    Replies
    1. మద్యాన్ని తన్ని, ...ఏమని అంటారండీ బోనగిరి గారూ ? :)

      Delete
    2. తన్నాకా ఏమీ అనరు, తొంగుంటారు.

      Delete
    3. దేన్ని ? బాల్చీనా ?

      Delete