Friday, 26 December 2025

ఊరు పొమ్మంటోంది.....

ఊరు పొమ్మంటోంది..... 

ఊరుపొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అని ఒక నానుడి చెబుతారు, అదేమో చూదాం.

మొన్న, కూచుంటే కాదని కర్రబోటుతోనే వీధిచివరి ఇంటిదాకా వెళ్ళేను. బాబాయ్! నువ్వేవచ్చేవు,బాగున్నావా! ఏరోజుకారోజే వద్దామనుకుంటున్నాను, ఏదీ కుదిరితేనా!! కళ్ళులేని పెద్దపులి,ఈ సంసారంతోనే సరిపోతోంది లెద్దూ అంది,కూచుంటే లేవలేకుండా ఉన్న ఓ కూతురు వరసమ్మాయి. అమ్మా! నీదొడ్లో ఎర్రబచ్చలుంది కదా,నాలుగు కాడలు పట్టుకెళ్ళి, కందా బచ్చలీ కూర చేయించాలని, అన్నా! అయ్యో! బాబాయ్! కబురంపితే నేనే తెద్దును,లేదంటే మీ అల్లుడినే పంపుదును కదూ! వయసైపోయిందిగా తిరక్కు,జాగర్తా! అని నాలుగు కాడలు బచ్చలి కూర చేతిలోపెట్టి కుంటుకుంటూ గేటుదాకావచ్చి సాగనంపింది, ఆ కూతురు.

మొన్న ఒక వైద్య మిత్రుడు కలిసేడు. సుగర్ అదుపులో ఉంది చాలాకాలంగానే , ఒకప్పుడు,సుగర్ ఎక్కువ అదుపులో లేక ఉండిపోవడంతో తిమ్మెరలు వగైరా చిన్నెలు అందుకున్నాయి. డాక్టర్ మందులు రాసారు,వాడుతున్నా, విడవక,కాని తగ్గటం లేదు,ఏమని డాక్టర్ గారినడిగితే మందులు లేట్ గా పని చేస్తాయని అంటున్నారు. ఏమి సంగతన్నా! డాక్టర్ చెప్పినది నిజం వయసైపోయింది కదూ. మందులు పని చెయ్యకాపోవచ్చు. కాని అది చెప్పం, కారణం మీరు నిరాశపడిపోతారని చెప్పం.వయసు మీరిన కొద్ది శరీరంలో రోగాన్ని తట్టుకునే శక్తి తగ్గిపోతుంది,అందుకు మందులు పని చెయ్యవు, పని చేసినా తగ్గినట్టుంటాయి,మళ్ళీ వచ్చేస్తాయని గుట్టు విప్పేసేడు. 

వయసైపోయి వ్యాధి నిరోధకశక్తి పూర్తిగా తగ్గిపోయిన ముసలాళ్ళు కుటుంబాలకి పెద్ద బరువు. వారినేం చెయ్యలేరు,బతికుండగా చంపెయ్యలేరు.వాళ్ళ నిత్య జీవితంలో ప్రతి పనికి వీళ్ళు అడ్డుగానే ఉంటారు. వయసైపోవడంతో వాళ్ళతో కలసి సినిమాలు షికార్లు చెయ్యలేరు,ఒంటరిగా ఇంట్లో ఉండలేరు. ఇంట్లో వాళ్ళు వీళ్ళని ఒంటరిగా వదిలేసి బయటికిపోతే ముసలాళ్ళు బాధపడిపోతారు.అందుకే వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తున్నారు. ఇది పెద్ద ఇబ్బంది,ఇదీ వయసైపోయినవారి కత.

ఇక కాడు రమ్మనడమేమి? కాడు అనగా శ్మశానము, అది రమ్మని పిలవదు. అక్కడికి తీసుకుపోబడ్డవాడెవడూ తిరిగిరాడు. మరిదేంమాటా? వారణాశిని మహా శ్మశానం  అంటారు. స్మశానం పిలవడం అంటే, కాశీ విశ్వేశ్వరుని మహాశ్మశానంలో అగా వారణాశిలో అంతిమ శ్వాస విడవాలని సనాతనుల కోరిక. అనగా కాశీ రమ్మని పిలుస్తోంది అని చెప్పడం. యువ సంసారాలకి బరువైనవారిని కాశీ పిలుస్తోందని అంటారు.అంటే సంసార బంధాలు వదలిపెట్టు చివరికాలం వానప్రస్తంలో కాశీలో గడపమని అర్ధం.  అదీ ఊరుపొమ్మంటోంది కాడు రమ్మంటోంది కత.  

1 comment:

  1. కోరిక కాశిలొ గడపగ ,
    తీరున మలి వయసులోన , తేకువ కలదా ?
    శారీరక రుగ్మతలను
    ఏ రీతి జయించ గలను ? యిల్లే ముదమౌ .

    ReplyDelete