Wednesday, 31 December 2025

గడచిన సంవత్సరం 2025

 గడచిన సంవత్సరం 2025


2019లో అనుకుంటా,రతన్ టాటా గారిని అడిగారట. 'ఈ సంవత్సరం మీరు సాధించిందేమిటీ?' అని, దానికి వారు 'ఈ సంవత్సరం బతికున్నాను,అదే ఘనకార్యం' అన్నారట. ఆ సంవత్సరంలో పెద్దవయసు వాళ్ళు చాలామంది కాలంచేసేరు,కరోనా మూలంగా. అప్పటికి ఆయన వయసు 80 దగ్గరనుకుంటా.
ఇప్పుడెందుకిదని అనుమానం రావచ్చు. నాకు తొమ్మిదో పది సమయం కనుచూపుమేరలో కనపడుతోంది. గత సంవత్సరం ముక్కుతోనో మూలుగుతోనో గడిపేసాను. రోజు గడిస్తే పండగ,బోనస్సు అనేలా గడుస్తోంది.
కుంతీ దేవి మేనల్లుడే ఐన శ్రీ కృష్ణుని ఇలా వేడుకుంటుంది.


యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి

చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!


శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!


ఇందులో వేడుకోలు  
 అంటే, ఈ భవలతలు అనగా ఇహలోక బంధాలను తుంచెయ్యవయ్యా, ఆంటుంది. పాండవులందు యాదవులందు మోహ విఛ్ఛేదము,     ఇలా ఒక్క కొడుకులనే కాదు అటు పుట్టింటివైపు వారిమీదా తనకున్న బంధాలను తుంచేలా చెయ్యమంది. ఇలా వేడుకున్నా చివరిదాకా కుంతికి భవలతలు వదలలేదు. అలాగే నాకున్నూ ఈ భవలతలు వదలటం లేదు. ఇవి ఎంత సున్నితం అంటే సాలెపురుగు తననోటి నుంచి స్రవించిన ద్రవంతో అల్లే సాలెగూటి దారమంత సున్నితంగా కనపడతాయి. చిత్రం ఆ సాలెగూటి దారం పెనుగాలివానలకూ తెగదు. నిజo 100 కి.మీ వేగంతో వీచేగాలి దానిని తెంపలేదు.అలా నేటికిన్నీ భవలతలు కొత్తకొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. నా ప్రయత్నం వ్యర్ధమవుతూనే ఉంది.



https://kasthephali.blogspot.com/2024/05/blog-post_24.html

విష్ణుమాయ దేనినీ వదలలేకపోతున్నాని తెలుసు, కాని సంపూర్ణ శరణాగతి చెయ్యలేకపోతున్నా! అదే విష్ణుమాయ. దానిని దాటడానికి మహామహుల ప్రయత్నాలే చెల్లలేదు,నేనెంత? అలా అని ఊరుకోలేకపోతున్నా! ఎప్పటికి ఆయన దయ కలుగుతుందో!



శాంతి శాంతి శాంతిః

స్వసి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీశాం
గోబ్రాహ్మణేభ్యశ్చ శుభమస్తు నిత్యం
లోకాః సమస్తా సుఖినో భవంతు. 
ఇక సెలవు
🙏🙏🙏

No comments:

Post a Comment