Friday, 12 December 2025

శర్మ కాలక్షేపం కబుర్లు-బుర్రగుంజు.

 

శర్మ కాలక్షేపం కబుర్లు-బుర్రగుంజు.

బుర్రగుంజు.

బుర్రగుంజా! ఏమిటీ ఫైలు పెట్టడం? ఏదితోస్తే అదేనా పెట్టెయ్యడం అని నిలతీసింది బుద్ధి మనసుని.  బుర్రగుంజు,కొబ్బరి పువ్వు నీకే తెలుసునా? తెలిసి నువ్వేమిటి చేసావు నిన్న అనిదెప్పింది మనసు. సరే ఆ చెప్పేదేదో సూటిగా చెప్పేడు అని చిన్న సంతకం పారేసి పైలు గిరవాటేసింది బుద్ది. మనసు పైలాపచ్చీసు వయసులో వుంది,బుద్ధికి వయసొచ్చింది అదీ తేడా. బుద్ధికి మనసుకిపై అధికారినని గర్వం.

బుర్రగుంజు తాటిచెట్టునుంచి వచ్చేది. మన వాళ్ళు తాటివనాలు పెంచేవారట. రామ కృష్ణులు తాటివనంలో వుండగా,గొడవ చేస్తున్న గార్ధభాసురుణ్ణి గిరగిరా తిప్పి తాటిచెట్ల కేసి కొట్టి చంపేసేడట బలరాముడు. నిన్ను తిన్నగా బుర్రగుంజుగురించి చెప్పమంటే ఇదంతా ఎందుకు సోది అని బుద్ధి అడ్డుపడితె,  మనసు, ఆగవయ్యా! ప్రతిదాంట్లో దూరిపోయి వేలెట్టుకోకు బాగోదు. నువ్విలా చేస్తే నేను పైవాళ్ళకి చెబుతానంది మనసు. నువ్వు పిచ్చిపిచ్చిగా వాగితే నీ మీద డిసిప్లినరీ ఏక్షన్ తీసుకుంటానంది బుద్ధి.  చాలు చాల్లేవోయ్! నీ పవర్స్ తెలుసుకుమాట్లాడు అని గింజు కుంది మనసు. నీ పైన ఇద్దరున్నారు. చిత్తం గారు ఇష్టమైతే వెంటనే ఫైలుమీద సంతకం చేసిచ్చేస్తాడు. ఆయన కూడా కాదంటే ఆయన పై అధికారి అహంకారం గారి దగ్గరకెళితే పని మరీ సులభం. నీ గౌరవం దక్కించుకో. నీకో సంగతి చెబుతా! ఒక సారి అహంకారం గారితో గొడవైంది. ఆయన మాట్లాడితే నేను,నేను అని గుండిలకేసి చూపించి కొట్టుకుంటూ, చెబుతూ వుంటాడు కదా.  ఏమండి! నేను,నేను అంటున్నారు కదా, మీరెవరని ప్రశ్నవేసాను.  గురుడికి బుర్ర తిరిగిపోయింది. అది తెలియకేకదా ఈ బాధంతా. తెలిస్తే సర్వం ఒకటే.  అద్వైతం చెబుతున్నావా అంది బుద్ధి.  అనుకో అంది మనసు. నువ్వెవరో చాల క్లియరుగా చెప్పిందయ్యా వేదం. “పద్మకోశప్రతీకాశగ్ం హృదయంచాప్యధోముఖం! అధోనిష్ట్యా వితస్త్యాన్తేనాభ్యాముపరితిష్టతి”…….. “నీవార శూకవత్తన్వీ పీతాభా స్వత్యణూపమా!!  తస్యా శ్శిఖాయా మధ్యేపరమాత్మా వ్యవస్థితః”. నేను అన్నవాడు ఎలా వుంటాడో కూడా వివరంగా చెప్పిందయ్యా! ఎలావుంటాడట! నివారి ( చాలా సన్నపాటి వరి రకంట.) వరి ధాన్యంగింజ పైన వుండె చిన్న ముల్లులా వుంటాడట. ఎక్కడుంటాడు. గుండెలో మధ్యలో వుంటాడట. ఆయనే పరమాత్మ, అదే నేను అనే నువ్వు. నీకూ పరమాత్మకీ తేడా లేదయ్యా! తెలిసిందా అంది మనసు. బుర్రగుంజు గురించి ఎక్కడనుంచి చెప్పమంటావు అంది మనసు. నీ ఇష్టం వచ్చినట్లు ఏడు అంది బుద్ధి.  ముసలిగోల వదిలిందికదా! ఇప్పుడు చెప్పుకుందామంది మనసు.  తాటిచెట్టులో మొగ ఆడ చెట్లుంటాయి. పోతుతాడి కల్లు బాగుంటుందిట. బుద్ధి మిర్రిమిర్రి చూస్తోంది ఏమీ అనలేక.  ఆడతాడికి కాయలు కాస్తాయి. అవి పండుతాయి. పండి రాలుతాయి. రాలిన పళ్ళ నుంచి రసం తీసుకుని రొట్టి కాల్చుకుంటారు. ఇదీ బాగుంటుంది.  తాటి కల్లు నుంచి బెల్లం వండుతారు.  ఇది మందుగా ఉపయోగం.  దీన్నే పాత బెల్లం అంటారు, లేదా తాటిబెల్లం అంటారు… రసం తీసేసిన టెంకలు పాతితే భూమిలోతేగలొస్తాయి. ఈ తేగల చివర టెంకలో వుంటుంది బుర్ర గుంజు. అన్ని టెంకలలో బుర్రగుంజు వుండక పోవచ్చు. అందుకే అదృష్టం బుర్ర గుంజు అంటారు.  తేగలో మధ్య చందమామ ఉంటుంది.  అది తింటే చదువురాదుట, పిల్లలు పుట్టరట, ఏదో చెప్పీవారు.  నేను చాలా సార్లు తిన్నాను.  ఒకటి మాత్రం నిజం అయింది చదువుమాత్రం రాలేదు నాకు.  తేగలు తినడం ఒక కళ.  తేగ ముక్కలుగా విరిచి పీచు శుభ్రంగా తీసి, పేరి, పూసలు తేరిననెయ్యిలో ముంచి, కారం అద్దుకుని తింటే నారాజా! అదుర్స్.  ప్రస్తుతం పళ్ళు లేవు మరి.  తేగ తిన్న తరవాత టెంక బద్దలుకొడితె, లోపలుంటుంది తెల్లగా బుర్ర గుంజు..  ఇది బలే తియ్యగా వుంటుంది.  పట్నవాసం వాళ్ళకి తేగలే తెలియకపోతే బుర్ర గుంజేమి తెలుస్తుంది? ఇది ఎక్కువగా తింటే చలవచేస్తుంది.  జలుబు చేస్తుంది, . జలుబు చేస్తే దగ్గు వస్తుంది,  దానితో జ్వరం వస్తుంది, తలనెప్పి వస్తుంది.  ఇవ్వన్నీ నాకు చెప్పి, నువ్వు, నిన్న, ఎందుకు, బుర్రగుంజు తిని, జ్వరం తెచ్చుకున్నావని బుద్ధిని, మనసు నిలతీసింది.  పైవాళ్ళిద్దరూ ఆర్డరేశారో మరి,  అందుకేతినమన్నాను అంది బుద్ధి.  ఐతే అనుభవించు అంది మనసు.

ఎవరు అనుభవిస్తున్నారు నేనా అంది బుద్ధి.  నేను నేననేవాడున్నాడుకదా ఆయననుభవిస్తాడు నాకేంఅంది.  అహంకారంగారు నాకేం తెలియదు!  అనుభవించేది నేనుకాదు,  ఐతే మరెవరు? శరీరం.  అంటే నువ్వు శరీరం కాదా.  కాదు అంది అహంకారం. సరే మీరూ మీరూ తేల్చుకోండని ముడెట్టి తప్పుకుంది మనసు. ఆత్మ వేరు శరీరం వేరు అని తెలిస్తే అద్వైతం తెలిసిపోయినట్లే.  తేగలు తినడానికి పళ్ళు లేవంటే బుర్రగుంజు అంట కట్టేడు తేగలమ్ముకునేవాడు. అదీ సంగతి.  బుర్రగుంజు బాగుందని తింటే జలుబు చేసి జ్వరం వచ్చిందని చెప్పడానికి ఇంత తిరకాసా? దానికో పోస్టా?దానికి అద్వైతంతో లింకా?.

మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ వుంటుంది. మనసు చేసే ప్రతి సంకల్పవికల్పాలను బుద్ధి తనస్వంత, ఇతరుల,చదివిన,విన్న, అన్ని విషయాల ద్వారా పోగుపడిన ఙ్ఞానం నుంచి ఆ విషయం మంచి చెడ్డలు విశ్లేషించి చిత్తానికి తెలుపుతుంది. అప్పుడు దానిపైచర్య ఉంటుంది. అహంకారం కనక అడ్డుపడితే ఈ మూడిటిని రద్దు చేసి తన ఇష్టం అమలు పరుస్తుంది. ఇది నేను అనేదానికి ప్రతీక.

No comments:

Post a Comment