Thursday 20 June 2024

సామాన్యుడి సణుగుడు-ఇదీ మనరాత కత!

 సామాన్యుడి సణుగుడు-ఇదీ మనరాత కత!

nmrao bandi14 June 2024 at 05:47

''అవును గురూజీ నేనూ అనుకుంటూ ఉంటాను, నేను పోయినా నా బ్లాగు ఇలాగే ఉంటుంది కదా అని. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు - అలా నా వెనక!? దేవుడికే అది ఎరుక, తెలిసేది లేదు కనక!! మనం ఎగిరెళ్ళిపోయినా బ్లాగు చూసే మిగిలున్న వాళ్ళకి ఆ విషయం తెలీదు కనక! ఓ విధంగా ఆ విధంగా సజీవులమే కొన్నాళ్ళు, ఇంకొన్నాళ్లు - అదెన్నోళ్ళో మరి! ఇది కన్నోళ్ళు విన్నోళ్ళు ఏమంటారో మరి? ఔనంటారా సరి! రామ్మా, పజ్జెమేసుకో బామ్మా :)''




మిత్రుని వ్యాఖ్యకి సమాధానం రాయబోతే టపా అయ్యేలా ఉందని వెనకబెట్టేను. ఈ రోజుదయం సింహాసనం ఎక్కి రాయడం మొదలు పెట్టేటప్పటికి కరంటు పుటుక్కున పోయింది. అయ్యో! అనుకుంటూ వచ్చాకా మొదలెడితే మళ్ళీ పోయింది.(వారం కితం మాట)  ఎన్నిసార్లు లెక్కేయడం మానేసా! విసిగి రాయడమే మానేసాను! మొదలెట్టిన ప్రతిసారి కొత్త ఆలోచన, ఆలోచనలు ముసిరి,విషయం పక్కకి పోయి,చిందరవందరైపోతే! మొత్తం ఎత్తి కట్టేసాను! రాత్రి మొదలెడితే, అనుకుంటే వేడి రాత్రికీ దిగలేదు. మొదలెట్టేనుగాని వేడి భరించలేక మానేసాను. తెల్లవారుగట్ల మొదలెడదామని! (ఇదంతా నాలుగురోజుల కితం మాట) వేడి ఇంకా దంచుతోనే ఉంది,చినుకులు అక్షంతల్లా పడ్డాయి.


ఎక్కడ మొదలెట్టాలి? సమస్య అలాగే ఉండిపోయింది. ఎక్కడో ఒకచోట మొదలెట్టాలిగా! అని ఇలా!

మొదటగా ఆకాశం వ్యక్తమయింది. దానినుంచి గాలి, గాలినుంచి అగ్ని,అగ్నినుంచి నీరు,నీటి నుంచి భూమి. వీటన్నిటి సంయోగంతో సర్వసృష్టి వ్యక్తమయ్యాయని మన తత్త్వం చెబుతోంది,సయిన్సూ చెబుతోంది. ఆకాశం ఎక్కడినుంచి పుట్టిందీ? మహత్తు నుంచి అంటోంది భారతీయ తత్త్వం, అదే శక్తి అనికూడా అంటోంది,సయిన్సూ. ఆశక్తినే మనవారు లలితా దేవి అనికూడా అన్నారు. లలితా సహస్రనామాలో ఒక నామం ”వియదాది జగత్ప్రసూః” అని అంటే వియత్తు అనగా ఆకాశం మొదలుగా,వియదాది, జగత్ ప్రసూః అనగా సర్వజగత్తునూ కన్న తల్లి అని. అనగా ఆకాశం మొదలుగా పంచభూతాలను వ్యక్తపరచిన శక్తి అని అర్ధం. ఇలా సర్వజగత్తునూ వ్యక్తం చేయడం మరలా అవ్యక్తం, తనలోకి తీసుకోవడం చేయడం అనేది, ఈ శక్తి ఎక్కడా? అంటే! భాగవతం 'లోకంబులు లోకేశులు,లోకస్థులు దెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుంగు'.... అంటుంది ఆ శక్తిని వర్ణిస్తూ! అక్కడే పోతనగారు 'ఒకపరి జగముల వెలినిడి,ఒకపరి లోపలికి గొనుచు నుభయము తానై' అంటూ చెబుతారు. సయిన్స్ చెప్పే,మన తత్త్వం చెప్పే ఈ ఎవల్యూషన్,డివల్యూషన్ రెండూ పక్కపక్కలే జరిగిపోతుంటాయి.ఒక్క సారిగా అన్ని వ్యక్తం కావు అన్నీ ఒక్కసారిగా అవ్యకతమూకావు, కాలంలో వచ్చి వెళుతుంటాయి. మొత్తం ఒక్క సారిగా ప్రళయం సంభవించి అన్నీ ఏకమవుతాయి. అప్పటిదాకా ఈ రెండూ జరుగుతూనే ఉంటాయి. అన్నీ కాలంలో వచ్చి కాలంలో వెళుతుంటాయి. అందుకే దీనిని జగత్ అని అంటారు. జాయతే గఛ్ఛతే ఇతి జగత్, వచ్చేది,వెళ్ళేది. అన్నీ కాలంతో పాటివే! కొన్ని, కొన్ని క్షణాలే ఉంటే కొన్ని వందల సంవత్సరాలుంటే, మరికొన్ని వేల సంవత్సరాలు ఉంటాయంటున్నారు. సముద్రం లో వేల సంవత్సరాలుండే జీవులున్నాయని సయిన్స్ చెబుతోంది. కాలం మాత్రం ఆ శక్తికిలోబడి ఉంటుంది, దానినే ,కాలాతీత శక్తి, అని అంటాం.చెప్పుకుంటే చాలా ఉంది. ఇక్కడికాపుదాం. 

మనకతలో కొస్తే!


న+క్షరం='అక్షరం', అనగా నశింపు లేనిది. మనం రాసే ఈ అచ్చరాలెంతకాలముంటాయన్నదే ప్రశ్న. రామాయణం రాస్తూ వాల్మీకి, ''ఈ కావ్యం, నదులు పర్వతాలు ఉన్నంత కాలం ఉంటుంద''న్నారు. ఇటువంటి మాట ఆ తరవాత కవుల్లో ఎవరూ అనలేకపోయారు,నేటిదాకా.  ప్రకృతిలోకి వ్యక్తమయ్యేది ప్రతిదీ, కాలం తో ముడిపడి ఉన్నట్టే మన అచ్చరాలూ ముడిపడి ఉన్నాయి.   ప్రతిజీవికి కాలం ఉన్నట్టే  అచ్చరాలకీ కాలం ఉంది. కాలం తరవాత మరుగునపడతాయి,నశించవు. అక్షరాల సమూహానికో త్రాణ,త్రాణని బట్టి కాలం, కాలమే ప్రాణం. అది ఎంత? అదిగదా ప్రశ్న,సమాధానం లేని ప్రశ్న.  


 ఒకప్పుడు అచ్చరానికి మాధ్యమం శ్రవణం, కాలం మారి, అనేకరూపుల్లో పుస్తకాలొచ్చి చాలా మార్పొచ్చింది. ఇప్పుడు పుస్తకాన్ని ముట్టుకునే ఓపిక,తీరిక ఎవరికిన్నీ లేదు. అంచేత మరలా శ్రవణానికే మారిపోతున్నకాలం.


ఇక ఎలక్ట్రానిక్ యుగంలో మార్పులు చాలా తొందరగా వస్తున్నాయి. ఈ మాధ్యమాలు మనం చూస్తుండగా పుట్టాయి,పెరిగాయి, కొన్ని మరుగున పడిపోయాయి. ఈ అచ్చరం రాసే అలవాటున్నవాళ్ళు కొద్ది. చదివేళ్ళూ వేళ్ళమీద లెక్కపెట్టచ్చు. మాధ్యమాలు వెనకబడితే, రాసేవాళ్ళు వెనకబడితే,చదివేవాళ్ళు వెనకబడితే అన్ని మరుగున పడతాయి. అదెంతకాలం? అదీ పెద్ద కొచ్చను.????


Sunday 16 June 2024

సామాన్యుని సణుగుడు- దిన దిన గండం

 సామాన్యుని సణుగుడు- దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు.

గండం అంటే ప్రాణ ప్రమాదం. దినదినమూ ప్రాణప్రమాదమే కాని వందేళ్ళూ బతుకుతాడని భావం.ప్రళయం అంటే లయం, అనగా కలిసిపోవడం.ప్రాణులన్నిటికి నిద్ర నిత్య ప్రళయం,తప్పనిదిన్నీ! అలాగైతే నూరేళ్ళెలా బతుకుతారని కదా!బతుకుతారు అదే చిత్రం. దినదినమూ నిద్రపోతారు, మేల్కొంటారు. ప్రళయం గడుస్తుంది. ఇలా అలావాటైన నిత్య ప్రళయాన్ని ఎవరూ లెక్క చెయ్యరు. ఎప్పుడో ఒక రోజు నిద్ర లేవరు అంతే!!! అందుకే దాన్నే దీర్ఘనిద్ర న్నారు. అదీ ఈ నానుడి భావం.








ఎవరు తప్పుకున్నా ప్రభుత్వం పడిపోదని తెలిసినవారి మాట. ప్రభుత్వంతో ఉన్న పార్టీలకి బి.జె.పి కి పరస్పరాశ్రయ న్యాయం వర్తిస్తుందిట. వీరవసరం వారికుంది,వారవసరం వీరికుంది. ఎవరూ విడిచిపోయేవారు లేరు. ప్రతిపక్షంలోనే చీలికలొచ్చే సూచనలు కనపడుతున్నాయి.

జగన్ మాకు 15 మంది ఎమ్.పి లు ఉన్నారు. మా బలమేం తగ్గలేదు, దేశావసరాలు,రాష్ట్ర అవసరాలని బట్టి అవసరం మేరకు ప్రభుత్వాన్ని బలపరుస్తామన్నారు. మహారాష్ట్రలో లకలుకలు బయలు దేరాయి ప్రతిపక్షంలో!! దినదినగండం నూరేళ్ళాయుస్సే!!!!


Thursday 13 June 2024

సామాన్యుడి సణుగుడు-శాశ్వతం.

 సామాన్యుడి సణుగుడు-శాశ్వతం.


ఏది శాశ్వతం? ఏదీ కాదన్నదే సమాధానంట.మనకి కనపడే జంగమాలు,స్థావరాలు,ఉద్భిజాలు సర్వం ఎప్పుడో ఒకప్పుడు పుట్టినవే కాలంలో. అంచేత అన్నీ కాలంలో లయం కావలసినవే! కాలమే శాశ్వతమా? కాదు. మనకి శాశ్వతంగా కనపడే కాలాన్ని కూడా లయం చేసే శక్తి ఉంది. అదే శాశ్వతం. ఏంటో దీనికి అంతులేదు,ఆదీ లేదు.


నా తరవాత నేను సంపాదించిన ఇళ్ళు,పొలాలు,,బంగారం వగైరా వగైరా ఏమవుతాయి? అసలు నేనేమవుతాను? నేను పోయిన తరవాత ఏం జరిగితే నాకెందుకు? ఏమవుతానో నాకు తెలీదు కదా? మరి దేనికి చింత? అనుకోగలిగితే కొచ్చనే లేదు.కాని అలా అనుకోదే మనసు. నా తరవాత నా పేరైనా శాశ్వతంగా ఉండాలని తాపత్రయం. ఇది నాతోనే మొదలవలేదు. అబ్బో మానవజాతి పుట్టినప్పటినుంచీ ఉంది,ఈ ఆలోచన. 


 మహరాజులు,రాణులు గుళ్ళు కట్టించారు,చెరువులు తవ్వించారు, అన్న సత్రాలు పెట్టించారు, కావ్యాలు రాయించారు, కృతులు పుచ్చుకున్నారు, ఇలా చాలాచాలా చేసేరు. పోషణకై ఆస్థులిచ్చారు.  కలిగినవారు చేశారీ పని. వేశ్య కూడా ఈ పని చేసింది. బోగందాని చెరువు పేరుండిపోయింది,ఆవిడపేరు తెలియకపోయినా!


నా తరవాత ఏం జరగాలో విల్లు రాసాను, ఆస్థులు అలా పంచుకుంటారు,తగువు లేదు, రాయకపోయినా పంచుకుంటారు, మానెయ్యరు, ఇదో చాదస్తం అంతే! ఒక రోజేడుస్తారు లోకంకోసమే! అమ్మయ్య ముసలాడి గొణుగుడు తప్పింది,చాకిరీ తప్పిందని.ఆ తరవాత మరిచే పోతారు, సహజం, నేను తాతని గుర్తుపెట్టుకున్నానా? పేరెట్టుకున్న, గనక, గుర్తు అంతే!


అతి సామాన్యులు ఐతే గుడి మెట్ల మీద పేర్లేయించుకునీవారు. మెట్టుకి పావలా పేరు లో అక్షరానికి అణా ఇలా ఉండేవి.నేటికీ కొన్ని దేవాలయాలకి మెట్లు వాడుతున్నారు, వాటి మీద నేటికిన్నీ పేర్లు కనపడుతుంటాయి. మా తాతపేరు అన్నవరం గుడి మెట్లమీదుందోచ్! అని చెప్పుకునీవారూ ఉన్నారు.


ఇంత అశాశ్వత జగత్తులో మన రాతలో లెక్కా! ఉంటే ఎక్కడో మూలుంటాయి,లేదూ కొట్టుకుపోతాయి, కాలంతో. నాబ్లాగొకదాన్ని రెండేళ్ళ కితం వదిలేసా! అప్పుడప్పుడు చూస్తుంటా,తెరుస్తా! ఉందా? పోయిందా అని! ఇంకా ఉంది, చిత్రం ఎవరికో అవసరం, రోజూ పాతికనుంచి ఏభై హిట్లుంటాయి. ఎన్నాళ్ళుంటాయి? అదే తెలీదు :) 

Saturday 8 June 2024

సామాన్యుడి సణుగుడు

సామాన్యుడి సణుగుడు 

ఎన్నికల్లో చిత్రాలు.


  ఎన్నికల యజ్ఞం,ఫలితాల రాకా,  పూర్తయింది. చూసే కన్ను, మనసు ఉంటే చిత్ర విచిత్రాలే ఉన్నాయి.  ఎన్నికల్లో సామాన్యుడు చేసిన చిత్రం చూద్దాం.


మొన్నటిదాకా ఇ.వి.ఎమ్ లమీద అనుమానాలతో చెలరేగిపోయిన వారు ఫలితాల తరవాత నోరు మెదిపిన పాపాన పోలేదేమో!

ఇక ఎన్నికల కమిషన్ని, కమిషనర్లని, ప్రభుత్వoలో ఉన్న పార్టీకి కట్టుబానిసలని, తిట్టిన నోళ్ళు, తెరుచు   కోలేదు,ఫలితాల తరవాత.

కొంతమంది మేధావులు ఎన్నికల కమిషన్ కు,సుప్రీం కోర్టుకు ఉమ్మడి ఉత్తరం రాసేసి, ప్రభుత్వం పైన  తమకడుపులో కుళ్ళు వెళ్ళగక్కు కున్నారు.


ఎన్నికల తరవాత మోడీ మరో దేశం పారిపోతాడు అని నోరు పారేసుకున్న లాలూ ఎక్కడా? అరడజను సీట్లైనా గెల్చుకున్నాడా? లేదు 4 సీట్ల దగ్గరాపేసేరు.


మోడీ మళ్ళీ ప్రధానైతే గుండు గీయించుకుంటానన్నాడో  రాష్ట్ర మంత్రి,(తనకి నెత్తిమీద వెంట్రుకలు కూడా లేవు) ఏమయ్యాడో? 


భారతీయ పౌరులలో ఎక్కువమంది, చదువులేనివాళ్ళే కావచ్చు, మేధావులు కాకపోవచ్చు, పేదవాళ్ళే కావచ్చు, డబ్బుకి వోట్లు వేసేవాళ్ళు కావచ్చు, ఉచితాలకి ఎగబడేవాళ్ళే కావచ్చు కాని అవసరం వచ్చినపుడు, మండుటెండలో నిలిచి ఓటేసి, కొఱ్ఱు కాల్చి వాత పెట్టడం లో నిపుణులన్న  సంగతి ఎన్నికలని చూస్తే తెలుస్తుంది.  ఒక్కొకటే చూదాం!


నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు, అని సొల్లు కొట్టిన కేజ్రివాల్, పంజాబ్ లో మూడు సీట్లు గెల్చుకుని, డిల్లీలో, సోదిలోకి రాకుండా పోయాడు. ఉచితాలకి ఓట్లు రాలవన్న మొదటి మాట. 


ఉడుకెత్తించే ఉపన్యాసాలకి ఓట్లు రాలవని కూడా కన్నయ్యకి కాల్చి వాతేట్టేరు,డిల్లీలో!


బీహార్ లో లాలూకి,కాంగ్రెస్ కీ   తమ స్థానమేంటో చెప్పింది సామాన్యులే!

బెంగాల్లో కాంగ్రెస్ కీ, పూర్తిగా ఉద్వాసన చెప్పేసింది దీదీ! ఒకే ఒక్కడుగా పోరాడిన యోధుడు Adhir ranjan chowdary కూడా మమత దెబ్బకి నేలకొరిగాడు.   బెంగాల్లో కాంగ్రెస్ నీ వారి మిత్రులు కమ్యూనిస్టులని మమత కర్చు రాస్సినట్టే! ఒంటరి వీరుడు అధీర్ రంజన్ చౌదరీ ఆర్తనాదాలు కాంగ్రెస్ వారి చెవులబడుతున్నట్టు లేదు. నాకు మరో పని చెయ్యడం చేత కాదు,సంపాదనా మార్గమూ లేదు, కూతురు చదువుకుంటోంది. నేడో రేపో ఢిల్లీ వెళ్ళి క్వార్టరు కాళీ చేసి రావాలన్న ఆకలి కేకలు కూడా, నిన్నటివరకు  లోక్ సభలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత, ఆర్తనాదాలు కాంగ్రెస్ కోటలోకి చేరుతున్నట్టు లేదు.  కావాలంటే నన్నేమైనా చేసుకో కాని కార్యకర్తలని ఏమీ చెయ్యకని, మమతని ఫలితాల తరవాత జరిగే హింసనుంచి కాపాడమని, చేతులు జోడించి వేడుకున్నదైనా చెవులబడుతోందో లేదో,విన వలసిన వారికి, తెలియదు.    


 ఇక బెంగాల్ అంటే ఒకప్పుడు ఎఱ్ఱవారి కంచుకోటని పేరు, పాపం సోదిలోకి కూడా రాకుండా పోయారేమో! సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!

 

ఒడిషా ది మరో చిత్రం. ఒడిషా అంటే పట్నాయక్ అని మారుపేరు, పాతికేళ్ళగా మచ్చ లేని ముఖ్యమంత్రి, కాని బయటికి పంపేసేరు, రాష్ట్ర ఎన్నికల్లో, ఇక పార్లమెంటుకి ఒక్క సీటిచ్చెరు,BJP కి పందొమ్మిది సీట్లిచ్చేరు.కారణం, తను మెచ్చిన ఒక తమిళ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ ని పూర్తిగా చంకనెత్తుకోవడం,చివరికి అతన్ని ఉద్యోగం మాన్పించి పార్టీ లో చేర్చి పెత్తనమప్పగించడం, సహించ లేదు. ప్రతిపక్షంలో కూచో బెట్టేరు.సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!

 

ఉత్తరప్రదేశ్ యోగి బాబా పరిపాలన, కాని అక్కడ సమాజవాది పార్టీకి 37 సీట్లిచ్చేరు, కూడా ఉన్న కాంగ్రెస్ కి ఆరిచ్చేరు. కాంగ్రెస్ తమగొప్పే అని చంకలు గుద్దేసుకుంటోంది. గొప్ప సమాజ్ వాది పార్టీ దనుకోడం లేదు.దూకుడు తగ్గించమని యోగిబాబాకి చిన్న చురక. 

 

తెలంగాణాలో, సర్వమూ నేనే అని చెప్పిన బి.ఆర్.ఎస్ కి లోక్ సభలో స్థానమే లేకుండా చేసేరు. ఎంత చిత్రం.


ఇక ఆంధ్రా గురించి చెప్పక్కరనే లేదు. జగన్ 11 MLA సీట్లు గెల్చుకుంటే గొప్పయి పోయింది. 4 ఎమ్.పి లతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఉచితాలనేకం ఇచ్చానే! అయ్యో! ఇంత అన్యాయమా? అని ఆక్రోసించి ఉపయోగం లేదు. ఉచితాలు గండం గడుపుతాయన్న వారికి పెద్ద పాఠమే! ఉచితాలు మేమడగలేదు, మీరిచ్చారు,పుచ్చుకున్నాం. ఉచితాలిస్తే ఓట్లేస్తామని మీరనుకోడం పొరబాటు. చురకేసి చెప్పినట్టు కాలేదా?    కేజ్రి తరవాత రెండో వారికి పాఠం చెప్పిన సామాన్యుడు.    ఏదో జరిగింది ఆధారాలు లేవని ఆక్రోశం ఉపయోగం లేనిది.  


ఎక్కడైనా కాలు పెట్టేరేమోగాని తమిల్ నాడులోకి బి.జె.పి ని రానివ్వకుండా చేసిన ఘనత స్టాలిన్ మరియు పుత్ర రత్నానిదే!  అదే మరి ప్రజాస్వామ్యమంటే! కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ బొందరే
వారేరీ సిరి మూటగట్టుకుని పోవన్ జాలిరే! చివరికి భూమిమీద పేరైనా ఉందా? లేదే! ఇటువంటివారు కాలగతిలో ఎందరు చేరిపోలేదు? హిందూ సంస్కృతి డెంగూ, వగైరా అంటూ నేడు పేలుతున్నవారికి రోజు రావాలి! వస్తుంది!! అప్పటిదాకా ఇంతే!! దోస్తులకి ఇది వినపడుతోందా? 

  ఎ.ఐ.డి.ఎమ్.కె కనపడకుండా పోయింది, బి.ఆర్.ఎస్ లాగా!

చిట్ట చివరికి కేరళాలో సురేష్ గోపి, చిత్ర నటుడు రూపంలో బి.జె.పి కాలు పెట్టింది. ఇదొక రికార్డే! సామాన్యుని చిత్రం. కాంగ్రెస్ కి పద్నాలుగు సీట్లిచ్చి గెలిపించారు.సి.పి.ఎమ్ కి ఒక్క సీటిచ్చారు. రాష్ట్రం లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులకి పెద్ద చురక. దేశం మొత్తం మీద ఒకే ఒక కమ్యూనిస్ట్ ఎమ్.పి అనుకుంటా! సామాన్యుడు వేసిన పెద్ద చురక.

   M.Pలో వృద్ధ కాంగ్రెస్ వాదులందరిని తుడిచి పెట్టేసి, మొత్తం సీట్లు బి.జె.పి కే ఇచ్చేసేరు. రాహుల్, ఈ వృద్ధ కాంగ్రెస్ వాదుల్ని వదిలించుకో లేకపోయాడు. ఆ పని బి.జె.పి చేసి పెట్టింది. కాంగ్రెస్ కి పెద్ద లాభం  

కర్ణాటకా లో ఉచితాలు ఉచితాలే, కేంద్ర ఎన్నికలు ఎన్నికలే అని తొమ్మిదే సీట్లిచ్చారు కాంగ్రెస్ కి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా!  కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా BJP కి  17 సీట్లిచ్చారు  కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా ! సామాన్యుడు వేసిన పెద్ద చురక,కాంగ్రెస్ కి!


BJP:-మీరు దేశ భద్రత,రక్షణ,విదేశీ వ్యవహారాల్లో చూపిన నిపుణతకి జే జేలు చెప్పేం! ఐతే దేశపు అంతర్గత వ్యవహారాలలో కొంత పట్టు విడుపు అవసరం,దాన్ని విస్మరించి, ఒంటెత్తు పోకడ పోయినందుకు, మిమ్మల్నిప్రతిపక్షంలో   కూచోబెట్టలేదుగాని మీకుగా స్వతంత్రంగా 272 సీట్లు ఇవ్వటం లేదు, మరో నలుగుర్ని తోడిస్తున్నాం! వారితో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి! అని చెప్పి నాలుగు పార్టీలతో కలిపి 293 సీట్లిచ్చినది పెద్ద హెచ్చరిక!  BJP కి,  మీతో ఇప్పుడు. తీసుకున్న నిర్ణయం కచ్చితoగా అమలు చేసే మోడీ అంటే చాలామందికి కడుపుమంట, దేశంలోనూ విదేశాల్లోనూ కూడా!   BJP పార్టీకి పెద్ద హెచ్చరిక!ఇది సామాన్యుని హెచ్చరిక

Congress:- పార్టీని మా తాత,తండ్రులు నిర్మించుకున్నది, నేటికి ఒక కుటుంబానికి చెందిపోయింది. మీ నుంచి తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి, అందులో ఒక్కటి మచ్చుకి. మీ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ తో చేసుకున్న ఒప్పందం వివరాలు దేశానికి చెప్పేరా? ఏమిటవి? ఇప్పుడు మీకిచ్చిన 99 సీట్లు మీ ప్రతిభకి మెచ్చి ఇచ్చినవి కావు. బి.జె.పికి,  ఒక చిన్న చురక అంటించడానికి చేసిన కసరత్తు.పదేళ్ళు పరిపాలన చేసినవాళ్ళని ప్రతిపక్షంలో కూచోబెడ్తారు,ఆ పని చెయ్యలేదు. ఈ 99 సీట్లు,  మీప్రతిభే అనుకుంటే పొరబాటు, మరోమాట కూడా! ప్రభుత్వాన్ని పడకొట్టేస్తాం! రంకెలేస్తున్నారు, అస్తు! మరచిపోకండి! ఆ తరవాత మీరు నిర్మించే ప్రభుత్వం ను, మీరు ఆరు నెలలు నిర్వహించలేరు. ఇప్పుడే మీ దోస్తు మమత నిన్నటిదాకా మీ పల్లకీ మోసిన బోయీ అధీర్ రంజన్ చౌదరిని నానాగడ్డీ కరిపించేస్తోంది. నేడు మీతో ఉన్నవాళ్ళెవరూ మీ మిత్రులు కారు, ఇంతటి గొప్ప దోస్తుతో మీ ప్రభుత్వం ఎంత గొప్పగా ఉండబోతోంది? మీ యోధుడినే రక్షించలేని మీరు దేశాన్నేం రక్షిస్తారు? దేశo కుక్కలు చింపిన విస్తరైపోయి, మళ్ళీ మోడీకే ఈ సారి 400  సీట్లిచ్చి  పట్టం కడతారు. ఆ తరవాత మీ అడ్రసులు గల్లంతు, జాగ్రత్త! చూసుకుని అడుగేయండి. పశ్చిమ దేశాలన్నీ తమ స్వార్ధం చూసుకుంటాయి. అంతేకాదు భారత్ ఎప్పుడూ వాటికి అణిగిమణిగి ఉండాలనీ,వాటిమీద ఆధారపడి బతకాలనీ అనుకుంటాయి. అది తెలుసుకు మసలండి. మీ స్వంతంగా 272 స్థానాలూ వచ్చేదాకా ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రయత్నాలు చేస్తే ఫలితాలు విపరీతంగా ఉంటాయి. ఇది ఒక హెచ్చరిక,చురక, సామాన్యుడి నుంచి.