Friday, 25 November 2022

వేగపడక వివరింపదగున్...

 వేగపడక వివరింపదగున్...

https://kasthephali.blogspot.com/2022/11/blog-post_23.html   (నిన్నటి తరవాయి) 



వినదగునెవ్వరు చెప్పిన

వినినంతనె వేగడక వివరింపదగున్

విని కల్లనిజము దెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!


ఎవరుచెప్పినా విను. విన్న వెంఠనే ఉద్వేగపడిపోకు, విన్నదానిని విశ్లేషించుకో! విన్నదానిలో నిజానిజాలు తేల్చుకున్నవాడే తెలివైనవాడు అన్నారు, బద్దెన.


వినినంతనె  వేగపడక

ఎవరెవరో రరకాలుగా చెప్పేరు కదా!   ఎలా చెప్పేరు? ఒకరు చాలా కటువుగా,వాస్తవానికి దగ్గరగా చెప్పేరు, మరొకరు ఆకుకి అందకపోకకి పొందకుండా చెప్పేరు, మరొకరు ఇప్పటికే సర్వం నాశనమయిందిమరి బాగుపడే ఆశ లేదన్నారు. మరొకరు అసాధ్యాన్ని చెప్పి అది చేస్తే సమస్య తీరుతుందన్నారు. చివరగా ఒకరు చాలా తియ్యగా చెప్పరు, సాధ్యంకూడా అయ్యేదే! విన్నాం కదా! విన్నవెంఠనే ఉద్వేగం చెందడం, ఆవేశపడటం, కోపగించడం చేసుకోవద్దు! 


వివరించదగున్..

ఇప్పుడు చెప్పినవి ఒక్కొకటీ గుర్తుకు తెచ్చుకోవాలి. చెప్పినవాటిని కూలంకషంగా కీడుమేళ్ళు, సాధ్యా సాధ్యాలూ వివరించుకోవాలి, అదే విశ్లేషించుకోడం. ఇలా చెప్పినవారి స్వార్ధం ఉందా అని కూడా పరిశీలించాలి. అన్ని సలహాలనీ ఇలా చూసుకుంటే పొల్లుతో ఉన్న ధాన్యాని ఎగరబోస్తే పొల్లు దూరంగాపోయి, ధాన్యం కాళ్ళముందు పడినట్టు, ఏది సాధ్యమో, ఆపద గడుస్తుందో తెలుస్తుంది. అప్పుడు వారెవరో చూసుకుంటే తెలుస్తుంది, వారు బంధు మిత్రులా,చుట్టాలా, శత్రువులా, గూఢ శత్రువులా అన్నది. వీటిలో సాధ్యమైన మేలైనదాన్ని ఎన్నుకుని మనదైన ఆలోచన జోడించుకుని అప్పుడు కార్యాచరణకి దిగాలి. నిజంగా పైన చెప్పినదంతా రంధ్రాన్వేషణే...


ఎంతచెప్పినా అర్ధం చేయడం వల్లకాని పని కావచ్చు, ఒక చిన్న ఉదాహరణ, భారతం  నుంచి.

సందర్భం:- ధృతరాష్ట్రుడు రాజుగా ధర్మరాజు యువరాజుగా పరిపాలన సాగుతున్నకాలం.దుర్యోధనుడు తండ్రి చేత పాండవులను దూరంగా పంపి, మట్టు పెట్టాలని ఆలోచిస్తున్న కాలం.

ఘట్టం:- పాండవులు వారణావత ప్రయాణం, లక్క ఇల్లు... 

ధృతరాష్ట్రుడు ధర్మరాజు ను పిలిచి, కొంతకాలం వారణావతంలో ఉండి గంగాస్నానం చేస్తూ, దానధర్మాలు చేసి రావలసిందిగా, తల్లి తమ్ములతో వెళ్ళవలసిందిగా చెబుతాడు. ధర్మరాజు విని ప్రయాణానికి తయారవుతాడు. అందరూ రధాలెక్కేరు, ధర్మరాజు రధం ఎక్కుతుండగా విదురుడు పంచభూతాలనుంచి జాగ్రత్త వహించు అని చెబుతాడు. విన్న ధర్మరాజు మిన్నకుంటే, కుంతి అడిగింది, కొంత దూరం పోయాకా! విదురుడు గూఢంగా ఏదో చెప్పేడు,ఏమది, చెప్పవచ్చనుకుంటే చెప్పూ! అని. దానికి ధర్మరాజు అగ్ని,జల ప్రమాదాలనుంచి జాగ్రత్త వహించమని చెప్పేడని చెబుతాడు.

 వారణావతం చేరిన కొంతకాలం తరవాత లక్క ఇంటికి చేరేరు.లక్క ఇంట్లో చేరగానే విదురుని మాట గుర్తుచేసుకున్న ధర్మరాజు భీముని కూడా తీసుకుని లక్క ఇల్లంతా తిరిగి పరిసరాలూ గమనించి, భీమునితో ఇలా అన్నాడు. తమ్ముడూ! ఈ ఇల్లు లక్క నెయ్యితో నిర్మించబడింది,ఏ క్షణంలోనైనా అగ్నిప్రమాదం జరగచ్చు, దానికితోడు ఇది ఆయుధాగారానికి దగ్గరలో కూడా ఉన్నది, అన్నాడు.విన్న భీముడు విషయం అర్ధం చేసుకుని, ఐతే ఈ ఇంటిని మనమే కాల్చేద్దామన్నాడు. దానికి ధర్మరాజు, మనం కాల్చేయచ్చు కాని శత్రువు మరో పన్నాగం పన్నుతాడు, మనం మళ్ళీ దాన్ని తెలుసుకోవాలి, ఛేదించాలి, దానికంటే శత్రువు పన్నాగాన్నే ఎరగనట్టు కొనసాగిస్తూ సమయం వచ్చినపుడు పనిచేసుకుపోవడం మేలన్నాడు. విషయం గ్రహించిన భీముడు మిన్నకుండిపోయాడు. తరవాతేం జరిగింది తెలిసినదే కదా!

ఘట్టాన్ని విశ్లేషిస్తే

ధృతరాష్ట్రుడు తియ్యగా వారణావతం వెళ్ళి గంగలో ములిగి దానధర్మాలు చేస్తూ కొంతకాలం గడపవయ్యా! తల్లి,తమ్ముళ్ళతో అని చెప్పేడు, ఒక పెద్ద పథకం దృష్టిలో ఉంచుకుని,చూడ్డానికి, వినడానికి ఇదెంత చక్కగా ఉంది.తమను వారణావతం వెళ్ళమని ధృతరాష్ట్రుడు చెప్పినదానిలో సత్యం లేదని గ్రహించినా ధర్మరాజు, ఆవేశపడలేదు.వేగపడకపోవడమంటే ఇదే

ధర్మరాజు విదురుడు చెప్పినది విని విననట్టు ఊరుకుని సమయం వచ్చినపుడు అనగా లక్క ఇంట్లో చేరిన వెంఠనే చర్యతీసుకున్నాడు కదా! ఇది విశ్లేషణలో భాగం. భీముడు లక్క ఇల్లు కాల్చేద్దామని ఉద్వేగపడ్డాడు, చెప్పినవెంఠనే! ఇదే కూడనిది కదా! ధర్మరాజు శత్రువు పన్నాగం ఎరగనట్టు కొనసాగిస్తూ తిప్పికొట్టాలనే ఆలోచన వివరించడంలో భాగం కదా!  

ఆత్మరక్షణకి శత్రువును ఉపయోగించుకోడం ఎలా? ఎవరేనా చెప్పండి.


7 comments:



  1. బలే ముళ్ళెట్టేరే!

    ReplyDelete
    Replies
    1. Anonymous25 November 2022 at 19:04

      ముళ్ళెట్టడం=తగవులు పెట్టడం. ముడెట్టడం=కలపడం అని అర్ధంటండి, తమరి భావమేమి తిరుమలేశా!

      Delete
  2. మల్లీ మల్లీ ముల్లెట్టడంలో వీరికి వీరే సాటి గనుక

    ReplyDelete
    Replies
    1. Anonymous25 November 2022 at 21:07
      ముల్లు= Thorn,ఎవరో వారెవరో తమరికెఱికా తిరుమలేశా!

      Delete
  3. ఈ ముసలోల్లకి పనీపాటా ఏమీ లేనట్టుంది
    పొద్దస్తమానూ ఏదోఒక సోది

    ReplyDelete
    Replies
    1. Anonymous26 November 2022 at 19:11
      ఒకప్పుడు పని దానితో పాటా, పని చేస్తేనే పాటూ ఇలా ఉండేది. రోజులు మారేయి పని,పాట,పాటులలో పాట ఎగిరిపోయింది,కాదు ఇగిరిపోయింది. అందుకే నేడు పని,పాటూయే కనపడుతున్నాయి. ఇక నాకంటావా? మొన్ననే ఒక మిత్రుడు వచ్చి నా ఆఫీసులో కూచో చాలు, ఏం కావాలంటే అదే ఇస్తానన్నాడు, ఆరోగ్యం కావాలి ఇస్తావా అన్నా! అది నావల్ల కాదే అన్నాడు.పనిలేనోళ్ళు చాలామందే ఉన్నారు చూడు అన్నా! పనికిరానోళ్ళనేసేడు. తమరుగాని ఆ జాబితాలోవున్నారా? ముసలోళ్ళని దేబిరిస్తన్నారు.

      ఇక సోది, తెలుసా?

      సోది చెబుతానమ్మ,సోది!

      అంబపలుకు
      జగదంబపలుకు
      కంచికామాక్షి పలుకు
      కాశీ విశాలాక్షి పలుకు
      బెజవాడ కనకదుర్గా పలుకు
      పలుకుతల్లీ, పలుకు, పలుకు.

      ఇది జగదంబ, అమ్మ మాట, వినేందుకూ యోగముండాలి.

      ఇక జగడాలమ్మిని అనుకరించద్దు. తమరు జగడాలమ్మి కాదని తెలుసు.ఇంకా చెప్పాలి వినే యోగం లేదే!

      Delete
  4. ముసలాల్లన్నపుడే రా
    జసముగ తిని కూర్చునేటి జనమని తెలియున్
    కసిగా మాటాడ తగదె ,
    పసగలుగమి పనియు పాట పట్టు కుదురునా ?

    ReplyDelete