Thursday, 10 November 2022

ఆ వూరికి ఈ వూరెంతదూరమో ...............

 ఆ వూరికి ఈ వూరెంతదూరమో ఈ వూరుకి ఆవూరూ అంతే దూరం.


ఆ వూరికి ఈ వూరెంతదూరమో, ఈ వూరుకి ఆవూరూ అంతే దూరం, ఇదొక నానుడి మా పల్లెటూళ్ళలో చెప్పుకుంటూ ఉంటారు. ఆవూరునుంచి ఈ వూరు ఎంతదూరమో ఈ వూరునుంచి ఆవూరూ అంతే దూరం ఒక్కంగుళం అంటే ఒక్క అంగుళం కూడా తేడా ఉండదు. అంటే వారు వీరికెంత గౌరవం ఇస్తే వీరూ అంతే గౌరవం ఇస్తారు. అది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, దేశాలు కావచ్చు. గౌరవమనేది ఇచ్చి పుచ్చుకోవాలి.


మనం ఎదుటివారిని ఒరే అంటే వారూ ఒరే అనే అంటారు, ఏమండీ అనరు. మనం ఏమండీ అంటే వారూ అదే అంటారు. మనం వెధవా అంటే వారు వెధవన్నర వెధవా! అంట్ల వెధవా!! అని వడ్డి చెల్లించి మరీ తిడతారు. కొండొకచో అంతేవాసులూ తిడతారు, అక్కుపక్షీ అని.మురబ్బీ చెల్లదు సుమా! ఒకవేళ చెల్లించుకున్నా, ఖర్చు లేకుండా జీవితకాల శత్రువును కొనుక్కున్నట్టే :)


కొందరికి నోరు అదుపులో ఉండదు, బహుశః మెదడు మోకాటిలో ఉంటుందేమో!బలవంతంగా గౌరవం పొదలేరు, ఒక వేళపొందినా అది చాలా కొద్దికాలమే! మనం తిడితే మన అంతేవాసులు, వందిమాగధులు కీర్తించచ్చు,ఆ తరవాత జరిగేదానికి వగచి ఉపయోగం ఉండదు, తస్మాత్ జాగ్రత! జాగ్రత!! 


6 comments:

  1. ఎవరికీ హెచ్చరిక ?

    ReplyDelete
    Replies

    1. బలే కొచ్చను

      Delete
  2. బంధుమిత్రుల మధ్య రాకపోకలు ఇరువైపులా జరుగుతున్నాయా లేక ఎప్పుడూ ఒకవైపేనా అన్నదాని గురించి కూడా ఈ సామెత వాడతారనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      నిజమేనండి, మరచాను.
      నేటి కాలంలో అంతా ఒంటికాయ శొంటికొమ్ములేకదండీ! ఆలి వంకవారు ఆత్మబంధులు, అంతకు మించి బంధువులెక్కడా? ఇప్పుడు వరసలు చెప్పుకుందామంటే మనుషులేరీ?

      Delete
  3. నిజంగా ఆఊరికి ఎంతదూరమో ఈఊరికి ఆవూరు అంతదూరం కానక్కరలేదండీ. మాటవరసకు ఒక వన్‌వే రోడ్ మీదుగా వెళ్ళవలసి రావచ్చును. పోయేటప్పుడు మార్గమూ వచ్చేటప్పుడు మార్గమూ వేరువేరు కావచ్చును అప్పుడు. ఇలాంటివి మరికొన్ని పరిస్థితులు ఉండవచ్చును. లౌకికంగా ఇలా ఉండవచ్చును కాని ఆకాశమార్గాన మాత్రం సామెత అక్షరాలా నిజం ఐతీరుతుంది అని ఒప్పుకోవాలి!

    ReplyDelete
    Replies

    1. Anonymous11 November 2022 at 22:41,
      మీరు చెప్పింది నిజం.
      ఈ నానుడి వంకరదార్లు, వన్వే ట్రాఫిక్కులూ, వంకదణ్ణాలూ లేనికాలంలోదండి.

      Delete