తనది తనుతిన్నా భరించే పొరుగుండాలి.
''తనది తనుతిన్నా భరించే పొరుగుండాలి'' అని ఒక నానుడి చెబుతారు, మా పల్లెపట్టున. అనగానేమి?
నువ్వు పెద్దవాడివికావచ్చు, గొప్ప సంపాదన పరుడివి కావచ్చు, గొప్ప హోదా కలిగినవాడివి కావచ్చు లేదా గొప్ప ఆస్తి,ధనం కలిగినవడివే కావచ్చు, కాని నీ పక్కనున్నవారు, నిన్ను భరించేలా ఉండాలి. అంటే అర్ధం కాలేదు :)
నీది నువ్వు తిను, అనుభవించు ఎవరూ కాదనరు,నీ ఉనికి, మాట, పలుకు,చేష్ట నీ పక్కవారికి ఇబ్బంది కలగజేయకూడదు. ఇబ్బంది కలగజేస్తే, ఎదుటివారెంతగా సహించినా ఏదో ఒక రోజు బాధ వెలిబుచ్చక మానలేరు. నీవెంత గాలిలో తిరిగేవాడివైనా ఏదో ఒక రోజు భూమి మీదా కాలు పెట్టక తప్పదు. ''నేల విడిచి సాము ఉండదు'' కదా! అనగా రోజులెప్పుడూ ఒకలా గడవవు. ''ఎంత బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు తప్పదు''. ఆ గోడ మట్టిదే ఐ ఉంటుంది. అంటే ఏదో ఒక రోజు సామాన్యుడి అవసరం పడుతుంది, ఆ రోజు ఏవగించుకునేలా బతకద్దని, భావం. వైభవం,ఆస్తి,ధనం,దర్పం,హోదా అతి ప్రదర్శన పనికిరాదు. ఇలా కావాలంటే నీ పక్కవారు కూడా తిన్నారా? ఉన్నారా?ఆలోచించు, వారి కష్ట సుఖాలు విచారించు. వారి తలపుళ్ళన్నీ కడగలేకపోయినా అత్యవసరాల్లోనైనా ఆదుకోలేని జన్మ వ్యర్థమని చెప్పడమే ఈ నానుడి భావం. చివరగా మనిషిలా బతుకు అని చెప్పడం. ''ఈ వేళ చస్తే రేపటికి రెండు'' అంటే రేపటికే ఎవరూ గుర్తుపెట్టుకోరు సుమా అని హెచ్చరించడం. ఎవరుగుర్తు పెట్టుకుంటారు నిన్ను? ఎవరు మిగిలేరీ లోకంలో?
''కారే రాజులు? రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూటగట్టుకుని బోవంజాలిరే భూమిపై
బేరైనంగలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు?వారలన్ మఱచిరే? ఇక్కాలమున్? భార్గవా''
''జరిగినన్నాళ్ళే వెయ్యి మొహం మీద కాగడా''. అలా బతకద్దు, ఎదో ఒక రోజు ఆ కాగడాయే నిన్ను కాల్చేస్తుంది సుమా అని చెప్పడమే!
బాగా చెప్పారు 🙏.
ReplyDeleteతనది తనుతిన్నా భరించే …. …. బంధువులు కూడా ఉండాలి.
విన్నకోటవారు,
Deleteఎవరైనా మనుషుల మనస్తత్త్వం ఒకటే