ఆషాడమాసం-ములగాకు
కరోన పుణ్యామా అని బయట కాలు పెట్టింది లేదు, డాక్టర్ దగ్గరికి,నెలకోసారి తప్పించి. వారానికోసారి పక్క దోడ్లో ములగాకు కోసమూ.నడక పెరట్లొనే కానిచ్చేస్తూంటే గేటు తీసి బయటకు వెళ్ళే పనే కనపడటం లేదు.మొన్న ములగాకు కోసం బయలు దేరా! ములగ చెట్టుకి కరంటు వారు క్షవర కళ్యాణం చేసినట్టుంది, కిందకి అందే కొమ్మలూ కొట్టేసారు.కర్రతో ప్రయత్నం చేసినా ఆకు అందేలా లేకపోయింది. అప్పుడు రెండు వీధుల అవతల కిందకి అందేలా ఉన్న ములగ చెట్టు గుర్తొచ్చి, నెమ్మదిగా అడుగులేశా.ములగ చెట్టు దగ్గరో పాకుండేది,అదిలేదు,చెట్టు గుర్తు పట్టేలా లేదు. ఈ చెట్టుకు కూడా క్షవర కళ్యాణం అయిపోయింది, కొమ్మలందేలా లేవు. కర్రతో సాధ్యం చేసి ములగాకు కోస్తున్నా.
''ములగాకెందుకూ?'' అని వినపడింది.
''ములగాకు పప్పులో వేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు'' అంటూ చూశా! తెలిసినవారు.
''ఆషాఢం వెళ్ళిపోయింది కదండి'' అన్నారు.
''ఆషాఢంలోనే తినాలని కాదు, ఎప్పుడూ తింటూనే ఉండాలి, ఆకు కూరలా. తమిళ్ నాడులో తొమ్మిది జిల్లాలనుంచి ములగ ఉత్పత్తులు విదేశాలకి ఎగుమతి చేస్తున్నారట.ఇందులో ఇనుము, విటమిన్లు ఇంకా ఏవో చాలా ఉన్నాయట, నేటి కాలంలో ఇమ్యూనిటీకి చాలా అవసరమట, అందుకే తినాలని'' అన్నా ! నా తెలివి ప్రదర్శిస్తూ.దానికి వారు
''ఒక మాత్ర కొని పడేసుకుంటే సరిపోయేదానికి ఇన్ని తిప్పలా'' అన్నారు
తుళ్ళిపడ్డాను, ఎవరో గుర్తొచ్చారు.
వెంటనే నిజమండి, అలాగే అంటూ నమస్కారం చేసి వచ్చేశా, ములగాకు పుచ్చుకుని.
మౌనేన కలహో నాస్తి. మనకి తోచదు మరొకరు చెబితే వినం .
No comments:
Post a Comment