Monday, 30 August 2021

అమ్మా తమ్ముడు మన్ను తినేను...


https://youtu.be/YpTb3VvqQ5Q

అమ్మా తమ్ముడు మన్ను తినేను...
మన్నేటికి భక్షించెదు ? మన్నెందుకు తిన్నావయ్యా? మన ఇంట తినడానికేం లేదా అడిగింది యశోద.

అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్ఱినో
నమ్మంజూడకు వీరిమాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ
రి మ్మార్గము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మాదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే...

అమ్మా మన్ను తినడానికి నేను చిన్నపిల్లాడినా,వెఱ్ఱివాడినా?వీరి మాటలు నమ్మకు. నేను మన్ను తిన్నానంటే నువ్వు నమ్మేసి నన్ను కొడతావు చూడు, అలా నన్ను నీ చేత కొట్టించాలని వీరి పన్నాగం. కావాలంటే నా నోరువాసన చూడమ్మా? అని నోరు తెఱచి  నిలబడిన కన్నయ్య నోట్లో అమ్మకి కనపడిందేంటీ? సర్వజగత్తూ.  చూసిన తల్లి ఏమనుకుంది?

కలయో వైష్ణవ మాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్..

కలగంటున్నానా? మాయా? మరో ఆలోచన చేస్తున్నానా? నిజమా? ఆలోచించలేకపోతున్నాను. అసలు నేను యశోదనేనా?వేరే లోకంలో కాని ఉన్నానా? చిన్ని బాలుని ముఖంలో ఈ విశ్వమంతా కనపడటానికి కారణం ఏంటని ఆశ్చర్యపోయిందా తల్లి. 

ఒకప్పుడు ఆటపాటలతో మట్టి తినడం కూడా ఒక బాల్య చేష్ట. నేడు మట్టి కనపడటం లేదు కనక మట్టి తినడం, మట్టిలో ఆడుకోవడం, మట్టిని ఆనందంగా ఒంటినిండా పట్టేలా దొర్లడం అనేది వికృత చేష్ట, ఏం చేస్తాం కాలం మారింది కదా! ఉస్స్.. కాలం మారలేదు, మనుషులే మారేరు...బుద్ధులు మారేయి.

ఒకప్పుడు చద్దెన్నం తింటూ అన్నం పారేసాను. పెంచుకున్న తల్లి తిట్టలేక యశోదలాగానే ”నాన్నా! అన్నం పారేయ కూడదయ్యా!! అన్నం పరబ్రహ్మ స్వరూపం''. అని చెప్పింది. అప్పుడు అర్ధం కాకపోయినా ఆ మాటలు గుర్తుండిపోయాయి. కాలంలో అవగతమయ్యాయి. అప్పుడే మరో మాటా చెప్పింది. ”కరువు కాలం లో అన్నం లేక జనులు మట్టి తినేవారు సుమా" అని. నాకున్న కొద్దిపాటి జ్ఞానం ప్రదర్శించా! మట్టి ఎలా తింటారని? అమ్మ మాట నిజం కాదనుకుని. అప్పుడు అమ్మ వివరంగా చెప్పిందిలా" 

“ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || ”

“ సమస్త ప్రాణులూ ‘ అన్నం ’ నుంచి పుడ్తున్నాయి … అన్నోత్పత్తి ‘ వర్షం ’ వల్ల కలుగుతోంది; ‘ వర్షం ’ ‘ యజ్ఞం ’ వల్ల కలుగుతుంది ; ‘ యజ్ఞం ’ సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతోంది.
Courtesy: pssmovement.org

వర్షం లేకపోతే పంటలేదు. పంట లేక ఆహారం లేదు, అన్నం లేదు. అప్పుడు ప్రజలు గంజి,అంబలి తాగి బతికేవారు. ఆ తరవాత ఆకులు ఉడక బెట్టుకుని తినేవారు. ఆ తరవాత కరువు తీవ్రమైతే రేగడి మట్టి పిసుక్కుని మజ్జిగలో/పెరుగులో కలుపుకుని తాగేవారు, అలా మట్టి తినేవారయ్యా! ఇప్పుడు మనకు అన్నం దొరుకుతోంది అదృష్టవంతులం, అన్నమెప్పుడూ పారెయ్యకూ" ఇది అస్తిగతమైపోయింది, నేటికీ...

అమ్మ చెప్పిన అన్నం పారెయ్యద్దన్న మాట ఆచరించాగాని, మట్టి తింటారన్న మాట, నమ్మలేకపోయాను, మొన్నటి దాకా. 

మనం తీసుకునే ఆహారం మట్టి నుంచి పుట్టినదే! మట్టితో మిగిలిన నాలుగు భూతాలూ సంయోగం చెంది పుట్టేదే అన్నం. అన్నం నుంచే జనులు పుడతారు. అది తిని మనుషులు పెరుగుతారు. అది తిన లేకపోతే మరణిస్తారు. పంచభూతాలూ సంఘటితమైతే జననం, విఘటితమైతే మరణం, ఇంతే ఇది..ఇదే సృష్టి..


 వీడియో చూడండి. హైతీ అనే దేశంలో అన్నం దొరక్క మట్టి తింటున్నారు, ఎలాగో చూడండి...

2 comments:

  1. అమ్మ తమ్ముడు మేనమామ మన్ను తినేను. మేనత్త చెద బావిలో దిగీ నీరు పట్టైలోపూ మేన్ మరదలితో మేనబావ ఊసూలేవో చెప్పేను. ఇంతిరే రామ్..

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      మీకూ కొంచం జిలేబి పోలికలున్నట్టున్నాయే!!!! :) :) :)

      Delete