ఎవరు స్నేహితులు?
స్నేహితుల దినోత్సవ శుభకామనలు.
అసలు స్నేహితులెవరు? ఈ ప్రశ్న నన్ను చాలా కాలం నుంచీ వేధిస్తోంది. స్నేహితుడు అనే మాటకి అర్ధం చెప్పమంటే ఫ్రెండ్ అని చెబితే కాని తెలియని రోజులొచ్చాయి. అసలు స్నేహితుడు/స్నేహితురాలు అనేవారెవరు? ఇప్పుడు ఫేస్ బుక్ లో లైక్ కొట్టేవాళ్ళూ, ట్వీట్ చేసేవాళ్ళూ అంతా స్నేహితులేనా? స్నేహితునికి/స్నేహితురాలికి ఉండవలసిన లక్షణాలేమిటి? అన్ ఫ్రెండ్ అనే మాటకి అర్ధం ఏమిటి? శత్రువనుకోవాలా? అని చూస్తే,
ఇదిగో ఈ శ్లోకం కనపడింది, అవధరించండి.
పాపాన్నివార్యతి,యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి,
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలేః
సన్మిత్రలక్షణం మిదం ప్రపదన్తిసన్తః……భర్తృహరి.
అఘమువలన మరల్చు హితార్ధకలితు
జేయు, గోప్యంబు దాచు బోషించు గుణము
విడువడాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్త్రు డీలక్షణంబుల మెలగుచుండు…..లక్ష్మణ కవి.
చెడుపనులనుంచి రక్షించుట,మంచిపనులకు ప్రోత్సహించడం, రహస్యాన్ని దాచిపెట్టడం, కష్టంలో వదలిపెట్టకపోవడం,లేని సమయంలో సొమ్ము ఇచ్చి ఆదుకోవడం, ఇవి సన్మిత్ర లక్షణాలు అన్నారు కవిగారు.
పాపాన్నివార్యతి అంటే పాపం చేయడం నుంచి వారించాలి. పాపం, తప్పుచేస్తే కలుగుతుంది. తప్పునుంచి మళ్ళించడం సాధ్యమా? ఎవరైనా చెప్పగలరుకాని చేయించలేరు కదా! ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు తక్కువ జరుగుతాయి, మందలో ఉంటే….”పబ్బుకెళదాం రావే!” ”అమ్మో! రాను”, ”వాడిదేం కరిగిపోదు, నీదేం అరిగిపోదులే! ఒక్కరోజు పబ్బుకెళ్ళినంతలోనే పాతివ్రత్యం పోదులే”, ఇదెవరిమాట? నీతి మీద అసలు నియమం లేనివారిది. దీనికి తోడెక్కువుంటుంది, మిగతావారు భజన చేస్తారు. మంచిమాట వినరు గాని చెడ్డమాటకి ఊపెక్కువ. రాను అని చెప్పగలిగినవారెంతమంది ఉంటారు. ”ఒకసారికే కదా!” మానవ బలహీనత, ”ఆ( ఎవరు చూసారు లెద్దూ, ఎవరిగోలవారిది”, ఇది సమర్ధింపు.. తప్పు, ఒక సారి మొదలు, తరవాత అలవాటు, ఆ తరవాత వ్యసనం. దీనినుంచి రక్షించేవారుండరు. అసలెవరు చూశారు? మనల్ని ఎవరు పట్టించుకుంటారు! ఇది మనల్ని మనం మోసం చేసుకోడం. మనకెందుకుపోనిద్దూ ఎవరిష్టంవారిది అనుకుంటారంతే, ఎవరూ తప్పని చెప్ప సాహసించరు.. మారీచుడు కూడా సులభా పురుషా రాజన్ అని ఎప్పుడు చెప్పేడు? నిన్ను చంపుతా వెళ్ళకపోతే అన్నపుడు కదా! బాగున్నంతకాలం హాయి, హాయ్ అనేసుకుంటే పోలా! ఉన్నమాట చెప్పి విరోధమెందుకు తెచ్చుకోడం అనుకునేవారే హెచ్చు. ఇదీ మానవ బలహీనతే. వేమనతాత ఏమన్నారు
వేరు పురుగుజేరి వృక్షంబు జెరచును
చీడ పురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు జేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ.
వేరుపురుగు చేరితే ఎంత పెద్ద వృక్షమైనా చచ్చిపోతుంది. చాలాపెద్దదాన్ని వృక్షం అని చిన్నదాన్ని చెట్టు అని అంటారు. ఎంత పెద్దదయిన వృక్షాన్నయినా చిన్న వేరుపురుగు చంపేస్తుంది,తల్లి వేరు కొరికేసి జీవనాడి లేకుండా చేస్తుంది..దానితో వృక్షమైనా చస్తుంది. చీడ పురుగుచేరితే చెట్టు చెడుతుంది, చచ్చిపోదు, చీడపురుగు చెట్టుని పాడు చేస్తుంది.. చెడ్డవాడు మంచివాడిని పాడుచెయ్యడానికే చూస్తాడు, అదివాడి నైజం, నైజ గుణానికి లొట్టకంటికీ మందులేదని సామెత కదా! అందుచేత పాపాన్నుంచి రక్షించే స్నేహితుడు కావాలి.
యోజయతే హితాయ స్నేహితుని మంచిగురించి ఆలోచిచాలంటారు, జరిగేమాటా? ఎవరి స్వార్ధం వారిదే! మరొకరిగురించి ఆలోచనే కనపట్టంలేదు. పొరబాటు జరిగిందేమోనని, అది ముందు జీవితానికి మంచిది కాదేమోనని, ఒకరికి ఒకమాట చెప్పేను, వారికామాట నచ్చినట్టులేదు, మాటాడటమే మానేశారు. ఇప్పుడు ఎవరు ఎవరిగురించి ఆలోచిస్తారు? ఇక ముందు నేనెవరైకైనా చెబుతానా, ఈ అనుభవంతో?
గుహ్యం నిగూహతి, రహస్యాన్ని కాపాడాలన్నారు, ప్రతిజీవితంలోనూ కొన్ని రహస్యాలుంటాయి, తెలిసినవారు వాటిని పదిమందిలో చెప్పకూడదు, కాని నేడు జరుగుతున్నది దానికి వ్యతిరేకమే. ఇంతకుమించి చెప్పుకోడం బాగోదు. కావాలని తప్పులు చేయించి వేధించేవారే కనపడుతున్నారు. రహస్యాన్ని కాపాడే స్నేహితులు కావాలి.
గుణాన్ ప్రకటికరోతి, మిత్రునిలో ఉన్న సుగుణాన్ని పదిమందిలో చెప్పాలన్నారు, ఇప్పుడు జరుగుతున్నదేంటీ? అందరిలో ”మావాడుట్టి వెధవాయండీ” అన్నట్టు మాటాడి, ఒకరూ ఉన్నపుడు, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి, నీకు తగిన గుర్తింపురాలేదనేవారే కనపడుతున్నారు. దీన్నే ముడ్డి కాల్చి ఉప్పు పెట్టడం అంటారు. ఎవరిడబ్బా వారు కొట్టుకోడానికే సమయం చాలటం లేదు, మరొకరి గొప్ప చెప్పే పెద్దమనసున్నవారు కావాలి.
ఆపద్గతం చ న జహాతి, ఆపదలో ఉన్నప్పుడు వదలిపెట్టకూడదు. దీని గురించిన టపాలే రాశాను. ఒకప్పుడు ఒక ఆఫీసర్ గారితో గొడవొచ్చింది, నాకు. అది తెలిసినది మొదలు నా స్నేహితులంతా నాతో మాటాడటమే మానేశారు. అంతా బాగున్న కాలంలో హాయ్ హాయ్ అన్నవారే నావల్ల ఉపకారం పొందినవారే.. ఒక స్నేహితుడు మాత్రం ”ఒరే బాధపడకు, రోజులిలాగే ఉండవు, నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు చేస్తున్నపని తప్పుకాద”నేవాడు, నిన్న మొన్న మాటాడి, జ్ఞాకానికొచ్చావు, రాత్రి పదిగంటలవేళ, పడుకుని ఉంటావని పిలవలేదని, ఉదయమే మాటాడేడు.
దదాతి కాలేః, ప్రపంచంలో గొడవలన్నిటికి మూలకారణం కాంతా కనకాలే, సొమ్ముకావలసివచ్చి అడుగుతాడేమోనని పారిపోయేవారే ఎక్కువ. ధనమూలమిదం జగత్. ఇదే సత్యం…డబ్బుంటే అందరూ స్నేహితులే, చుట్టాలే…లేకపోతే ఒక్కడు కనపడడు.
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ…
సొమ్ములున్నపుడు అందరూ చుట్టాలే, అందరూ స్నేహితులే, ఎలా వస్తారటా? కవి చమత్కారంగా చెప్పేరు, నిండా నీరున్న చెరువులోకి కప్పలు చేరినట్టనీ, బలే ఉపమానం, నీరుతగ్గిపోతే కప్ప ఒక్కటీ కనపడదు, అలాగే సొమ్ము తగ్గిపోతే ఒక్క బంధువూ, స్నేహితుడూ కనపడడు.
ఇలా కవిగారు చెప్పిన మంచిగుణాలున్న వారు స్నేహితులుగా దొరుకుతారా? అసలు ఆ స్నేహితులు, మన చుట్టూ అలా ఎందుకు తిరగాలి, ఇన్ని ఉపకారాలు చేస్తూ? ఇన్ని సుగుణాలూ ఒకరిలో ఉంటాయా? అసలు ఇటువంటి స్నేహితులు కావాలనుకుంటే, మనలో ఈ మంచి గుణాల్లో ఎన్నుండాలి? మనలో మంచి గుణాలు లేక మంచివారు స్నేహితులుగా ఎలాదొరుకుతారు? అంటే ముందు మనలో మంచిగుణాలు, కవిగారు చెప్పినవి కొన్నయినా ఉండాలి కదా! అబ్బా! కవిగారెంత డొంకతిరుగుడుగా చెప్పేరో చూడండి, ఇటువంటి గుణాలుండాలిరా అబ్బీ అంటే ఎవరు వింటారు? 🙂
ఇటువంటి స్నేహం ఎలా ఉండాలి, మొదలవాలి?
ఆరమ్భగుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృద్ధిముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధభిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానామ్……..భర్తృహరి.
మొదలు చూచిన కడుగొప్ప పిదప గుఱుచ
యాది కొంచము తర్వాత నధికమగుచు
దనరు దినపూర్వపరభాగ జనితమైన
చాయపోలిక గుజన సజ్జనులమైత్రి…..లక్ష్మణ కవి.
మొదట ఎక్కువగానూ తర్వాత చిన్నదైపోయే, మొదట చిన్నదిగానూ ఆ తరవాత పెద్దదయే,ఉదయ, మధ్యాహ్న కాలాలలో ఉండే మన నీడలా, దుర్జనుల, సుజనులతో మైత్రి ఉంటుంది.
ఉదయపునీడ పెద్దదిగా ఉండి మధ్యాహ్నానికి మనమీదనే పడుతుంది, అంటే పొడవు తగ్గి, తొందరగా మొదలయే స్నేహాలు, అలాగే వదలి ఉండలేనట్టుగా మొదలయి, తొందరగానే ముగుస్తాయి,అదే మంచివారితో స్నేహం మధ్యాహ్నపు నీడలా చిన్నదిగా మొదలయి సాయంత్రపు నీడలా పెరుగుతుంది. సూర్యుడు అస్తమించినపుడు నీడ అస్తమించినట్లు, ఆ వ్యక్తులు అస్తమించిన తరవాతనే ఆ స్నేహమూ అస్తమిస్తుంది. అదీ అలా ఉండాలి స్నేహమంటే. లేకపోతే
కూరిమిగలదినములలో
నేరములెన్నడును గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ…
స్నేహం ఉన్నకాలంలో వారే వీరు, వీరేవారు చెప్పడమే కష్టం,ఎవరెవరో. ఆ స్నేహం కాస్తా విరిగింది, కారణం ఏదయినాకావచ్చు, చిన్నదే అయిన కారణం కూడా పెద్ద భూతం లా పెద్దదిగానూ కనపడచ్చు, అప్పుడు ఎవరు మాటాడినా రెండవవారికది తప్పుగానే తోస్తుంది, ”వెధవ! వాడిపాపాన వాడేపోతాడు” అని తిట్టుకుంటూ
ఈ కాలంలో భర్తృహరి సుభాషితాని లలో చెప్పిన గుణాలు కలిగిన స్నేహితులు ఏ లక్షల్లో ఇద్దరో ముగ్గురో ఉంటారనటంలో అతిశ్యోక్తి లేదు. ఒకపటి స్నేహం రామాంజనేయుల్లా ఉండేవి, రామ జటాయుల్లా ఉండేవి..
ReplyDeleteకాని ఇప్పటి కాలపు స్నేహాలు మీరన్నట్లుగానే ట్విట్టర్లలో లైక్, ఫేస్బుక్ లో లైక్, యూట్యూబ్ లో లైక్ షేర్ సబ్స్‌క్రైబ్ చేసేవారు; స్నేహం పేరిట కాలయాపన, ధనయాపన చేసేవారు; అదే స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ధనం కోసం కొట్లాట లకు దారి తీసే వరకు వెళ్ళే ఉత్తుత్తి స్నేహాల దాక ప్రతి నిత్యం ఎవరో ఎక్కడో ఏ మూలానో స్నేహం మూలాన మోసపోయిన వారు ఉన్నారని న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉన్నాం.
స్నేహమంటే ప్రాణ త్యాగం చేయాలనేమి లేదు. నిజాయితిగా, నిరాడంబరంగా, విధేయతగా నిలవగలిగే వారే అసలు సిసలైన స్నేహితులని నా అభిమతం..!
శ్రీధరా!
Deleteఉన్నమాట చెప్పితిరిగదా!
స్నేహానికి పునాది లేకపోతే ఆ స్నేహం అవసరార్థం చేసేదే అవుతుంది, తాత్కాలికమే అవుతుంది.
ReplyDeleteలక్ష్మణ కవి గారి పద్యాలల్లో కొన్ని మా స్కూలు చదువుల్లో ఉండేవి, తెలుగు టీచర్లు కూడా చక్కగా వివరించేవారు. ఈ కాలపు పాఠ్యపుస్తకాల్లో ఆ పాఠాలు ఉంటున్నాయా అని నా అనుమానం. ప్రతి తరం వారూ నేర్చుకోదగినవి.
విన్నకోటవారు,
Deleteవీటిని చాలా కాలం కితమే పాఠ్యాంశాలుగా తొలగించారు కదు సార్
దురదృష్టకరం. ఈ కాలంలో అంతా వ్యక్తి ఆరాధన (ఆ వ్యక్తులు ఎక్కువగా సినిమా వాళ్ళు …. సో కాల్డ్ సెలెబ్రిటీలు), డబ్బు తప్ప పెద్దగా మరే విలువలు లేకపోవడం, ఎగదోస్తున్న మీడియా… పిల్లలు నేర్చుకుంటున్నది అదే.
Delete