Tuesday, 3 September 2019

హమ్మయ్య! పీడా విరగడయ్యె!!!

హమ్మయ్య! పీడా విరగడయ్యె!!!

పేపర్ చదవడం అలవాటెప్పటిదీ? అరవైఐదేళ్ళ కితంది. పద్నాలుగో ఏట నాలుగో ఫారం చదివేటప్పుడైనది కదూ!  అలవాటెలా అయిందీ? ఆరోజుల్లో పేపర్ పల్లెటూరికి రావడమంటే, అదో యజ్ఞం. ఈ రోజు పేపర్ రేపో ఎల్లుండో టపాలో వచ్చేది. ఆ పల్లెలో ఎంత మంది కొచ్చేది పేపరు? ఒకటి హైస్కూల్ కి రెండవది ఓ కలిగిన షావుకారు గారికి. . షావుకారు గారికి ఆదివారం,శలవురోజుల్లో పేపర్ చదివి వినిపించడం అలవాటు.ఆయనా కాంగ్రెస్ వాదే! కాకపోతే భూస్వామి, ఈ చిల్లరమేళం తమ బూమి మీదకేమైనా వస్తారేమో తెలుసుకోడానికే ఆయనకి పేపర్ అవసరం.   ఆయనకి దృష్టి దోషం, అందుకు నా అవసరం.పేపర్ చదివి పెట్టినందుకు బత్తాయి తొనలో, కరకజ్జమో..ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపేవాడు.

హెడ్ మాస్టరి ఇంటికి ఎదురుగా ఉన్న మరో మాస్టారి ఇంటి అరుగు మీద చదువుకునేవాడిని. రోజూ హెడ్మేస్టారికి ఇంటికొచ్చిన పేపర్లు పుస్తకాలు మరునాడు ఉదయం స్కూల్ కి పట్టుకెళ్ళి అప్పజెప్పడం, నా పని. ఇలా పేపర్లు నా దగ్గర ఉదయం ఒక గoట ఉండేవి. ఆ సమయంలో నా పేపరు చదవడం అలవాటయి, బలవత్తరంగా ఇన్నాళ్ళు కొనసాగింది.


ఇంతకి ఆరోజుల్లో ఉన్న పేపర్లెన్ని? నాలుగో ఐదో! చెప్పుకోతగినవి, ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రిక తెలుగులోనూ, INDIAN EXPRESS,THE HINDU  ఇంగ్లీష్ లోనూ వచ్చేవి. ఇందులో హిందూ మొహం ఎప్పుడూ చూడలేదు. ఏ వార్తలుండేవి? తెలుగు పేపర్లలో ఎప్పుడూ కాంగ్రెస్ వారి ముఠాతగాదాల కబుర్లు తప్పించి మరో మాట లేదంటే నమ్మలేరు. ఇక ఇంగ్లీష్ పేపర్ లో మొదటి పేజిలో జి.కె.రెడ్డి అని గుర్తు ఆయన రాసిన వార్త తప్పక ఉండేది. వార్త రాసిన వారి పేరు కూడా ప్రచురించేవారు. ఇంగ్లీషు పేపర్ చదవడానికి కొంత కష్టపడ్డాను. కూడబలుక్కుని చదివినా అర్ధమయ్యేది కాదు. అప్పుడు హెడ్ మాస్టారు నా సంగతి చూసి ఒక నిఘoటువు ఇచ్చి ,చదువు, అర్ధం కాని పదాలకు అర్ధం చూసి రాసుకో . అలా అలవాటు చేసుకోమన్నారు. క్లాసు పుస్తకాలకే దిక్కులే దు మరి పేపర్ చదివి పదాలకి అర్ధం రాసుకోడానికి పుస్తకమేదీ? ఒక మిత్రుడు నా అవస్థ చూసి ఒక వైపు రాసిన కాగితాలిచ్చి వాడుకోమన్నాడు. అలా ఇంగ్లీషు పేపర్ చదవడానికో సంవత్సరం పట్టిందంటే నమ్మగలరా? ఆ తరవాత కాలంలో ఎడిటోరియల్, లీడర్ ఆర్టికల్ చదివే స్థాయికి ఎదిగాను.

ఆ తరవాత కాలంలో ఇంగ్లీషు పేపర్ తెప్పించుకోవడం, ఉద్యోగాలకి దరఖాస్తులు చెయ్యడం అదో ఘట్టం. ఆ తరవాత ఉద్యోగం, ఆ కాలంలో ఇంగ్లీషు పేపర్ తోబాటుగా తెలుగు పేపరు, తెలుగు వార పత్రికలు, ,R.K.KARANJIA BLITZ, BABURAO PATEL QUESTION&ANSWERS ఇలా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లింది. తెలుగు పత్రికలు క్షీణ దశకు చేరుకున్న సమయం, ఇంగ్లీష్ పేపర్లపైన వెగటు కలుగుతున్న కాలంలో కొత్త పత్రికలొచ్చాయి. అందులోవే ఈనాడు,ఉదయం వగైరా..

వీటిలో ఈనాడు ఎన్ని ఊళ్ళు ఉద్యోగరీత్యా మారినా వెంటబడి వచ్చింది. చివరికి రిటయిర్ అయి వచ్చాకా కూడా వదల లేదు. 

స్వంత ఇంటిలో అన్నీ మొక్కలే మామిడి,పనస నుంచి,మల్లె,మొల్ల,జాజి,కలబంద, అరటి ఇలా ఎన్నో! ప్రతి రోజూ ఉదయమే పేపర్ కోసం ఈ మొక్కల్లో వెతుక్కోడమో పని. ఏ రోజు పేపరు ఏ మొక్క మొదటిలోనే మామిడి చెట్టు పైనో,పనసచెట్టు పలవలోనో దొరికేది. మా చుట్టు పక్కలెవరి ఇళ్ళలోనూ మొక్కలుండవు. ఈ అగచాట్లకీ అలవాటు పడిపోయాం. కాలం మారింది, పేపర్ పంపిణీ చాలా చేతులూ మారిపోయింది. ఇంతకీ ఈ పేపర్లో నేడు వస్తున్న వార్తలన్నీ ఏదో ఇంగ్లీషు పేపర్ నుంచి తర్జుమా చేసినవే! సరే లీడర్ గురించి చెప్పే పని లేదు. అలవాటు బలవత్తరం కదా! రోజూ పేపర్ ఒక సారి తిరగెయ్యకపోతే సిగరెట్టు మానేసినవాడి బాధలా ఉండేది. 

మొన్న జూలైనెలాఖరు, రాత్రి నుంచి వర్షం పడింది,దొడ్డి నిండా నీరు, వర్షo ఇంకా పడుతూనే ఉంది. పేపర్ కోసం చూస్తే నీళ్ళలో పూర్తిగా నానిపోయి,పెరటి గచ్చు మీద ఉంది. ఇటువంటివి ఇదివరలో చెప్పడం,సరి చేస్తాననడం మామూలైపోయింది గాని ఈ సారి, వెంఠనే డిస్ట్రిబ్యూటర్ ని పిలిచి పేపర్ చూపించి, రేపటినుంచి పేపర్ తేవద్దని చెప్పెయ్యడం అయిపోయింది. ఇలా లవాటే గనక మరునాడొచ్చి కోడల్ని బతిమాలి నెల చివరదాకా పేపర్ వేస్తానని చెప్పి ఒప్పించుకుని వెళ్ళేడు. ఈలోగా కోడలు మరో ప్రయత్నం చేసింది, పేపర్ చదవక ఉండలేరేమో, తెమ్మంటానని, నిర్ణయం నిర్ణయమే, సిగరెట్లు మానెయ్యలేదూ అలాగే ఇదీ, ఇక పేపర్ మొహం చూసేది లేదని చెప్పేసా! నెల దాటింది, పేపర్ చదవకపోతే ఏమయిందీ.

హమ్మయ్య! పీడా విరగడయ్యే!!!