Wednesday, 25 September 2019

ఆరునెల్లు సావాసం చేస్తే

ఆరునెల్లు సావాసం చేస్తే

ఆరునెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. అదెలా? అసలదేంటీ?

అంటే ఆరు నెలలు కనక ఒకరితో సహవాసం అంటే స్నేహం కనక కొనసాగిస్తే వారు అనగా ఎవరితో ఐతే మనం స్నేహం కొనసాగించామో వారి అలవాట్లు,లక్షణాలు మనకి అలవాటవుతాయన్నది దాని భావం. మరో చిత్రమేంటంటే  ”సిరి అబ్బదు చీడ అబ్బుతుందని” సామెత. 

వీరిలా వారు  కావచ్చుగా అని అడగచ్చు. ఇక్కడ ఉన్నమాట చూస్తే వారు వీరవుతారని చెప్పబడిందిగాని వీరు వారవుతారని చెప్పలేదు,గుర్తించండి.చెడ్డ అలవాట్ల దగ్గర స్నేహం తొందరగా బలపడుతుంది.

ఇదే భార్య భర్తలైతే ఒకరిని మరొకరు అనుసరిస్తే జీవితం ఏమిహాయిలే హలా

సిరి అంటే ధనం అది ఏ రూపం లోనైనా కావచ్చు, మంచి అలవాటు, విద్య, ప్రత్యక్షంగా ధనం ఇలా ఏదైనా జీవితానికి ఉపయోగపడేది కావచ్చు. 

చీడ అంటే వారికున్న చెడు లవాట్లు, తొందరపాటు, అబద్ధం చెప్పడం, మందు కొట్టడం, సిగరెట్టు కాల్చడం ఇలా అవకరాలు తప్పక అలవాటవుతాయి. చెడు అలవాటైనంత తొందరగా మంచి అలవాటు కాదు. దీన్నే చీడ అంటారు. 

అంచేత స్నేహితుని ఎంచుకునేటపుడు జాగ్రత! 

తెలియక స్నేహం చేసేసాం, కొంత కాలమూ గడచింది, కొన్ని అవకరాలూ అలవాటయ్యాయి, మాన్చుకోడం ఎలా? సాధనమున పనులు సమకూరు ధరలోన.....

కావలసింది ఈ చీడ వదిలించుకోవాలనే ధృడ సంకల్పం... ఇదంత తొందరగా అలవడదు. తస్మాత్ జాగ్రత!