Thursday 19 September 2019

కనకపు సింహాసనమున


కనకపు సింహాసనమున

శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం

దొనరగ బట్టము గట్టిన

వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

బంగారు సింహాసనం మీద కుక్కని కూర్చోబెట్టి మంచి ముహూర్తంలో 

వైభవంగా పట్టాభిషేకం చెసినా తన పాత గుణం మానలేదు.

ప్రతి జంతువుకు దాని సహజ లక్షణాలుంటాయి. మానవుడు కూడా

జంతువే. ‘’జంతూనాం నర జన్మ దుర్లభం’’ ఇది శంకరుల  మాట.

కుక్క గ్రామ జంతువు, ఇది ఏ జాతి కుక్కైనా ఏ పేరుతో పిలిచినా అది కుక్కే!

 సింహం కాదు, కాని కుక్కకి గ్రామ సింహం అనే బిరుదు మాత్రం ఉంది.

 పిల్లికి ఎలుక ఆహారం, పిల్లికి కుక్కని చూస్తే భయం. కుక్కకి మానవ

 ఉచ్చిష్టం కతకడం ఇష్టం. కుక్కకి సింహాసనమైనా మరో గొప్ప ఆసనమైనా 

ఒకటే, అది బంగారు సింహాసనమైనా దాని విలువా తెలియదు. అంత గొప్ప 

బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి మంచి ముహూర్తంలో పట్టాభిషేకం 

చేసినా మానవ  ఉచ్చిష్టం కనపడగానె గబుక్కున దానిని నోట కరచుకుంటుంది, 

ఇది సహజ లక్షణం కనక.


కుక్క గురించి ఇంత ఎప్పాలా? కాదు ఇది కుక్కగురించికాదు,అది కవిగారి 

అభిప్రాయం.

మానవులు ఎంత గొప్పవారైనా తమ సహజ నీచ లకక్షణం మాన్చుకో లేరు.


ఎంత ఉన్నత పదవులకు ఎగబ్రాకినా వారి వైఖరి మారదు.

దీనినే వేమనతాత ఇలా అన్నారు.

ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినగాని

హీనుడవగుణంబు మానలేడు

బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు

విశ్వదాభిరామ వినుర వేమ.

ఎంత చదువుకున్నా,ఎన్ని నేర్చుకున్నా సహజంగా హీన గుణం ఉన్న 

మానవుడు, తన సహజత్వాన్ని వదులుకోలేదు. ఎలాగంటే బొగ్గు నల్లగా 

ఉంటుంది. పాలు తెల్లగా ఉంటాయి పాలతో బొగ్గును ఎంత కడిగినా తన 

సహజమైన నల్లరంగు వదలలేదు. అలాగే నీచబుద్ధి కలవాడూ సహజగుణం 

వదల లేడు.