భారత స్వాతంత్ర్య చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి- మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. బ్రిటిషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ పాలెగాడు: తండ్రి పేరు పెదమల్లా రెడ్డి. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామి రెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది, బ్రిటిషు ప్రభుత్వం. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. ఉయ్యాలవాడ, రూపనగుడి,గుళ్లదుర్తి, ఉప్పులూరు, గిద్దలూరు మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఇప్పటికి ఉన్నాయి.
తిరగబడ్డ తెలుగు వీరుడు- తిరుగుబాటు- విప్లవ కార్యక్రమాలు: 1846 జూన్‌లో నరసింహా రెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగోండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహా రెడ్డితో చేరినవారిలో ఉన్నారు. నరసింహా రెడ్డి కి రెండు వేల మంది సైన్యం ఉంది.
1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి,ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు.ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.
జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహా రెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది.
బహిరంగ ఉరి-వీర మరణం: నరసింహా రెడ్డిని, అతని అనుచరులను విచారించిన బ్రిటిషు ప్రభుత్వం అతనికి ఉరిశిక్షను, అనుచరులకు వివిధ ఇతర శిక్షలను విధించింది. ఈ బహిరంగ ఉరి కి రెండు వేల మంది ప్రజలు హాజరు అయ్యారు. బ్రిటిషు ప్రభుత్వం, 1847 ఫిబ్రవరి 22, సొమవారం, ఉదయం 7 గంటలకు జుర్రేటి వడ్డున ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని బహిరంగంగా ఉరితీసింది . ఉరి దృశ్యాన్నిచుసిన ప్రజలు, మౌనం గా రొదించారు.విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహా రెడ్డి తలను 1877 వరకు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.
For more information Plz click
http://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1_%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF
వీరిని తెల్లటోపీ నల్లదొరలు తీవ్రవాదులంటున్నారు. అసలు చరిత్రేలేదు పొమ్మంటున్నారు.
This post is stolen from one blog, forgot to note the bloger's name. Pray excuse.Thanks to the blogger.
No comments:
Post a Comment