*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
కింది విషయాలు తమ కామెంటులో బోనగిరిగారు (courtesy: What"s app) చెప్పేరు. ఇందులో ఎన్ని మనం ఆచరిస్తున్నాము,ఎన్ని సంపాదించుకోగలిగాము,ఎన్ని అలవాటు చేసుకున్నాం చూదామని బయలుదేరి నిష్కర్షగా సమాధానాలు రాసుకున్నవి ఇలా ఉన్నాయి. ఇవి ఎవరిమటుకు వారు రాసుకోవచ్చు.
************
*ఎంత డబ్బు వెచ్చించిన ఔషదాలయాల్లో అందు బాటులో లేని దివ్య ఔషధాల రకాలు ఈ క్రింది విషయం చదివితే దొరుకుతాయి.*
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
ఈ అలవాటు దగ్గరగా గత పాతిక సంవత్సరాలుగా అలవాటయింది. ఇప్పుడు తెల్లవారుగట్ల నాలుగు తరవాత పడుకోబుద్ధికాదు. రోజూ ఉదయాన్నే లేస్తే ఆ రోజంతా హుషారుగా ఉంటుంది. ఇలా నాలుక్కే లేవాలంటే రాత్రి ఎనిమిదికే పడుకోవాలి. ఎనిమిదికే పడుకోవాలంటే ఆరుగంటలకే తినెయ్యాలి. ఈ మధ్య ఒక మనవరాలికి చెప్పా! అలాగే అంది,ఎలా కుదురుతుంది చెప్పు ? అని మళ్ళీ మామూలయిపోయింది, రెండు రోజుల్లోనే. నిద్ర పట్టటం లేదంటుంది, రాత్రి ఒంటిగంట దాకా రోజూ మెలకువగా ఉంటే ఇక నిద్ర ఎక్కడపడుతుంది? ఈ అలవాట్లే ఆ తరవాత కాలంలో డయబెటీస్ కి కారణం.
*సూర్య నమస్కారంలు ఒక ఔషధం*
చిన్నప్పుడు యోగా నేర్చుకున్నా! ఉద్యోగంలో చేరేకా మార్పొచ్చేసింది. రిటయిర్ అయ్యాకా మరచిపోయాను. కరోనా పుణ్యామా అని నాలుగేళ్ళుగా యోగా చేస్తున్నా! ఆసనాలు వేస్తున్నా! సూర్య నమస్కారాలు మొదటి మెట్టు.
*నిత్య అగ్నిహోత్రం ఒక ఔషధం*
అబ్బో! చెబితే శానా ఉంది. నలభై ఏళ్ళు శ్వేతకాష్టాలు నిత్యాగ్నిహోత్రం లో వ్రేల్చి, రిటయిర్ అయ్యాకా, మనవరాలు పుణ్యమా అని మానేశా! దీని మూలంగా మిగిలిన సౌభాగ్యం హై బి.పి.
*ప్రాణాయమం ఔషధం*
యోగాలో భాగం ప్రాణాయామం. నిత్యమూ చేస్తూనే ఉంటా.
*ధ్యానం ఔషధం*
ధ్యానం లో కూచోలేకపోతున్నా! కూచోలేకపోవడం ఒక కారణం, ఆలోచనల్ని నిరోధిoచలేకపోవడం మరో కారణం
*ఉదయం/సాయంత్రం నడక ఔషధం.*
ఒకప్పుడు ఉదయం నడిచేవాడిని. ఆ తరవాత కాలంలో ఉదయమూ, సాయంత్రమూ నడవడం అలవాటయింది. ఆ తరవాత రోజుకు ఐదు సార్లు నడవడం అలవాటయింది. రోజు మొత్తం నడుస్తూనే ఉంటారా? అడగద్దు. ఉదయం 2500,టిఫిన్ తరవాత 1500,భోజనం తరవాత 1000,సాయంత్రం 2000,రాత్రి టిఫిన్ తరవాత 1000 అడుగులు వేస్తా. ఇది నాలుగు కిలోమీటర్లవుతుంది. ఇది బాగా అలవాటయిపోయింది. ఎవరి అవసరాన్ని బట్టి అనగా BMI ఇండెక్స్ ను బట్టి నడక నిర్ణయించుకోవాలి. అoదరికి ఒకటే కొలత పనికిరాదు.
*ఉపవాసం ఔషధం.*
ఉపవాసం కుదరనిదే! బాలలు వృద్ధులు, అనారోగ్యవంతులు ఉపవాసం చెయ్యకూడదనో,చేయలేరనో, చెయ్యక్కరలేదనో చెప్పేరు,పెద్దలు.
*కుటుంబం తో కలిసి భోజనం చేయడం ఔషధం.*
ఇది పగలు సాధ్యం కాదు. రాత్రిపూట నేను మాత్రం సాయంత్రమే టిఫిన్ చేసేయడంతో మిగిలినవాళ్ళంతా కలసి కింద కూచుని భోజనం చేస్తారు. ఇది కుదరలేదు. ఇల్లాలున్నంతకాలం ఇద్దరమూ కూచుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళం. అది గత స్మృతే!
*నవ్వు మరియు హాస్యం కూడా ఔషధం.*
నవ్వు ఎప్పుడొస్తుంది? మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు. అలా ఉల్లాసంగా ఉండాలంటే పాజిటివ్ ఆలోచనలే ఉండాలిట.అప్పుడే నవ్వొస్తుంది. నేను నవ్వుతూ ఉంటానో లేదో ఇతరులే చెప్పాలి,నేను చెప్పుకోకూడదు.
హాస్యం ఆస్వాదిస్తాను,ఆనందిస్తాను. అపహాస్యం సహించడం కష్టంగా ఉంటుంది. నా జీవితం నుంచి హాస్యం అడుగంటిపోయిందనుకుంటా.
*గాఢ నిద్ర ఔషధం.*
ఎనిమిదికే పడుకుంటా కనక నిద్ర బాగానే పడుతుందనుకుంటా. పగలు ఒక గంట పడుకుంటా ,ఇది నా అలవాటు.
*అందరితో కలిసి మెలిసి మెలగడం ఔషధం.*
దీనిగురించి కూడా ఇతరులు చెప్పాల్సిందే!
*సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఔషధం*
దీనికేం లోటులేదు.
*మనస్సులో సానుకూలత ఔషధం.*
దీనికేం లోటులేదు.
*ఆధ్యాత్మిక జీవనం ఔషధం*
ఇదేంటో తెలీదుగాని ఇతరులు మనకు చేయకూడదనుకునేవి ఇతరులకు మనం చేయకపోవడమే పరమ ధర్మం. అదే ఆధ్యాత్మిక జీవనానికి నాంది అనుకుంటా.
*అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఔషధం.*
లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇదే నా నినాదం.
*ఇతరుల కొరకు ప్రార్థించడం ఔషధం.*
ఇతరుల గురించి చింతించి వారు బాగోవాలని కోరుకోవడమే ప్రార్ధన అనుకుంటా.
* ఆలింగనం ఒక ఔషధం*
పరమౌషధం. కాని ఇది మరచిపోతున్నారు. మిత్రులు కలసినపుడు ఇది అనుభవం లోకి వస్తూనే ఉంది.
*పరోపకారం దివ్య ఔషధం*
ఇది ఇతరులు చెప్పాల్సిందే!
*మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు దివ్య ఔషధం*
ఇంతకు మించిన ఔషధం లేదు కాని ఆ మనసుకు నచ్చినవారికి తీరికా,ఓపికా ఉండాలిగా!
*ఆత్మీయులను తలుచుకోవడం ఒక ఔషధం*
ఆత్మీయులను తలుచుకోడానికి ఇబ్బందులుండవుగనక అందరికి సాధ్యమే!
*కొన్నిసార్లు, నిశ్శబ్దం ఔషధం.*
అందుకే తాతగారు
అనువుగానిచోట అధికులమనరాదు
కొంచముండుటెల్ల కొదువకాదు
కొండ అద్దమండు కొంచమైయుండదా
విశ్వధాభిరామ వినురవేమ. అన్నారు.
*ప్రేమ ఇతరులకు పంచడం ఔషధం.*
మనం పంచడానికి సిద్ధమైనా తీసుకునేవారుండాలి.
*ఇక చాలు అని తృప్తి చెందడం ఔషధం*
సంపూర్ణ జీవితం గడిపేసేను ఇక దేని మీదా ఆశలేదు. తృప్తి చెందా!
*ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం....*
ముమ్మాటికి నిజం. కొందామంటే ఎక్కడా అమ్మకానికి దొరకవు.
*ప్రతి ఒక్క “మంచి” మనిషితో మనసువిప్ఫి మాట్లాడడం దివ్య ఔషధం**
😄😄😄😄😄
*ఇవన్నీ ఏ మoదుల దుకాణములో దొరకవు.*
ముమ్మాటికి నిజం.
*ఇవన్నీ మనలో మనమే సృష్టించుకోవాలి అంటే కొద్దిపాటి సమయం సాధన చేయాలి*
అన్నిటికంటే కష్టమైనది ఇదేనేమో!
*******
ధ్యానం లో కూచోలేకపోతున్నా! :)
ReplyDeleteనిలబడండి :)
ధ్యానమౌషధమైతే దానికి పథ్యంవుండాలె.
ఉంటున్నారా తాతగారండీ ?
యెకచిక మెగతాళి హేళన మపహాస్య
Deleteమధికుడ నను తత్త్వ మతిశయమ్ము
ధర్మ దైవకార్య దరిదాపులకు వోని
పెంకె వారి గూర్చి పేరు లేద ?
వెంకట రాజారావు . లక్కాకుల25 November 2024 at 10:34
Deleteకొరివి దయ్యం అంతే కదుసార్!
ఆంగ్లంలో K D అవునా సార్ ,
Deleteవెంకట రాజారావు . లక్కాకుల25 November 2024 at 17:59
Deleteఅంతే కదండీ
Zilebi25 November 2024 at 09:53
ReplyDeleteమేధావివి గొప్ప సలహా!
ఆయుర్వేదం లో ఔషధము,అనుపానము,పథ్యము అన్నవి మూడూ మూడు రకాలైనవి. ఔషధం వ్యాధిని తగ్గించేది, అనుపానం ఔషధం తో పాటు తీసుకోవలసినది( అన్ని అఔషధాలకీ అనుపానాలుండవు. ఒక్కో అనుపానం తో ఔషధం తీసుకుంటే ఒక్కో వ్యాధి నయమవుతుంది.) ఇక పథ్యమన్నది ఏ ఆహారం తీసుకోకూడడు,ఏది తీసుకోవచ్చు అన్నది చెప్పేది. ప్రొఫెసర్ ని అని డప్పు కొట్టుకుంటావు, కట్ పేస్టులు పి.హెడి లూ ఇలాగే ఉంటాయి.
ఏమోనండి తెలిసినది చెప్పా
Deleteఆ పై వినకుంటే మీ చాదస్తం అనుకోవడమేనూ :)
శర్మ గారు,
ReplyDeleteనియమాలన్నీ బాగున్నాయి. బద్ధకం అన్నిటి కన్నా పెద్ద ప్రతిబంధకం.
// “ ఆధ్యాత్మిక జీవనం ఔషధం* “ //
“ ఒరులేయని యొనరించిన
నరవర! యప్రియము దన మనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. “
అని తిక్కన సోమయాజి గారు మహాభారతంలో చెప్పారు కదా. మన పూర్వీకులు చెప్పిన సూక్తులు జీవితానుభవాన్ని రంగరించి చెప్పినవి 🙏. ఈ సూక్తిలో ఎంత సైకాలజీ దాగి ఉందో కదా 👌🙏.
విన్నకోట నరసింహా రావు25 November 2024 at 20:54
Deleteబద్ధకం, వాయిదా వేయడం, కదా అన్నిటికి మూలం.
పిల్లలెవరికి ఇవేవి తెలియనివేనండి. రామాయణ,భారత,భాగవతాలు స్కూళ్ళలో చెప్పకూడదు కదా!
🌷 ఉద్యోగం నుండి🍁 రిటైర్ అయితే జీవితమే ముగిసి పోయినట్లు భ్రమ పడతారు కొందరు.
ReplyDeleteరిటైర్ అయిన మరునాటి నుండి -
ఉదయాన్నే లేవరు - సమయం ఆదా
వాకింగ్ చేయరు - చెమట ఆదా
గెడ్డం గీసుకోరు - బ్లేడు ఆదా
బైటకు వెళ్ళరు - ఇస్త్రీ బట్టలు ఆదా
జుట్టును నల్లగా చేయరు-రంగు ఆదా
బాగుంది.
సైకిల్ గానీ, మోటార్ సైకిల్ గానీ, కారు గానీ వాడక పోతే తుప్పు పట్టేస్తాయి.
వాలు కుర్చీకి, TV కి అంకితం అయితే ఈ శరీరం కూడా అంతే.
ఈ ఆదాలన్నీ ఒక దుర్మూహార్తాన డాక్టర్ల ఖాతాల్లోకి వెళ్లిపోతాయి.
క్రోసిన్ తో మొదలయ్యి, ఈ మై సిన్ (----mycin) ఆ మై సిన్ (----mycin) లతో సాగుతుంది. ఎక్కడ ఆగుతుందో తెలియదు .
అప్పుడు
ప్రొద్దున్నే లేచి, మాసిన గడ్డంతో, స్నానం చేయకుండా, నలిగిన బట్టలతో హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది.
****
రిటైర్మెంట్ ఉద్యోగానికి మాత్రమే అనుకుంటే తర్వాత జీవితం ఆనందంగా గడిపేయొచ్చు.
కుటుంబం కోసం, సమాజం కోసం కాకుండా మన కోసం మనం జీవించే గొప్ప అవకాశం రిటైర్మెంట్.
ఉదయాన్నే లేవండి.
మీ బజార్లోనో, పార్కు లోనో అర్ధగంట వాకింగ్ చేయండి.
ఎదురుపడ్డ వాళ్ళని నవ్వుతూ పలకరించండి.
ఇంటికి వచ్చి గెడ్డం గీసుకోండి.
జుట్టుంటే రంగు వేయండి.
స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకోండి.
టిఫిన్ తిని ఇంట్లోంచి బైట పడండి.
దగ్గర్లో పబ్లిక్ లైబ్రరి ఉంటే అది మూసేదాకా దినపత్రికలు చదవండి.
దగ్గర్లో షాపింగ్ మాల్ ఉంటే, చేతులు వెనక్కి కట్టుకుని దుకాణాల బాహ్య సౌందర్యాన్నిచూస్తూ ఆస్వాదించండి.
మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కునుకు తీయండి.
సాయంత్రం లేచి మొహం కడుక్కుని, టీ తాగి లైబ్రరీ చేరండి.
ఇప్పుడు పుస్తకాలు చదవండి.
పార్కుకు పోతే తెల్లటి జుట్టుతో (రంగు వేయక పోతే) తెల్లని దుస్తులతో కొందరు సిమెంట్ సోఫాల మీద కూర్చుని లోకాభి రామాయణం నడిపిస్తుంటారు. విషయం ఉంటే చర్చలో పాల్గొనండి. లేకపోతే చెవులు అప్పగించండి.
దగ్గరలో గుడి ఉంటే మరీ ప్రశస్తం. దైవ దర్శనం అవుతుంది. ప్రసాదం లభిస్తుంది. కాస్త తిని, కాస్త ఇంటికి పట్టుకు రండి. ఇంట్లో అనుకూల పవనాలు వీస్తాయి. అప్పుడప్పుడు మంచి ప్రవచనాలు కూడా ఆలకించ వచ్చు.
వెళ్లే దారిలోనో వచ్చే దారిలోనో అక్కడక్కడా పదిమంది గుమిగూడి ఉంటారు. దూరం నుండి విషయం తెలుసుకోండి.
ఉద్యోగం లో ఉన్నపుడు చూడని, చూడ లేని ప్రపంచాన్ని నింపాదిగా చూడండి.
ఇంట్లో లేకుండా పోతే ఏమైనా అనుకుంటారేమో అని భయపడకండి. ఏమీ అనుకోరు. పైగా సంతోషిస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉంటే సపర్యలు చేయాలిగా.
ఇంట్లో ఉన్నపుడు అవసరాలన్నీ కూర్చున్న చోటికి రావాలనుకోకండి. దాహం వేస్తే వెళ్లి తాగండి.
నీరు ఒలికితే తుడవండి.
కళ్ళజోడు కనపడక పోతే వెతుక్కోండి.
ఏదైనా వస్తువు కావాలంటే వెళ్లి తెచ్చుకోండి.
చేతనైతే, చేయనిస్తే, చిన్నపాటి ఇంటిపనులు చేయండి.
పిల్లకాయలు ఉంటే, వింటే పురాణ కథలు చెప్పండి.
మంచి బాలుడనిపించు కోవచ్చు.
ఇక పోతే, ఖర్చుతో కూడుకున్న కాలయాపన అంటారా -
పెండింగు పెట్టిన సొంత పనులు, ఇంటి పనులు, తీర్థ యాత్రలు, దేశ, విదేశీ యాత్రలు లాంటివి కోకొల్లలు. ఆకాశమే హద్దు.
****
జీవితం చాలా అందమైంది. అంతకన్నా ఎంతో విలువైంది. బ్రతకడం కాదు,
జీవించాలి. ................... - జై శ్రీరామ్
🙏🏻🙏🏼🙏
Deletebonagiri29 November 2024 at 05:36
మందు,విందు,పొందు ఎంజాయ్ చెయ్యండి అరవై వచ్చేకానైనా! ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు లైఫ్, ఇలాటివి చెప్పుతూ! ఇవి నా మాటలు కాదండోయ్! మా కట్,పేస్టు ప్రొఫెసర్ వి. ఇంతటి మంచిమాటలు మా కట్, పేస్టు ప్రొఫెసర్ కి నచ్చవండి.