Monday 26 December 2022

పడుచుకాపురం చితుకులమంట.

 పడుచుకాపురం చితుకులమంట.


చితుకులు

పడుచువాళ్ళకాపురం చితుకులమంట లాటిదీ అంటుందీ నానుడి, ఏంటీ దీని భావం. పడుచువాళ్ళకి ఏదో చేసెయ్యాలనే ఆవేశం, కోరిక బలంగా ఉంటాయి, సహజమే కాని దానికి తగిన అనుభవం ఉండదు, చిక్కుల్లో పడిపోతుంటారు, దీనికి చితుకులమంటకి ఏమి అనుబంధం అని కదా కొచ్చను? చితుకులంటే చిన్నచిన్న పుల్లముక్కలుగాని,వండ్రంగి పని చేసినప్పుడు మిగిలినరద్దు, అనగా చిత్రిక వగైరాలు. వీటిని మంటపెడితే వేడి ఉంటుందిగాని ఎక్కువసేపు నిలిచి ఉండదు,గుప్పున మండి తగ్గిపోతుంది. అందుకు పడుచుల ఆవేశాన్ని చితుకులమంటతో పోల్చారు. 


ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళిచేసుకుంటే రోజూ కుండలు బద్దలు కొట్టింది.

ఓలి అంటే కన్యాశుల్కం. ఇదిచ్చి కన్యను తెచ్చుకుని వివాహం చేసుకునేవారు. ఇదో దురాచారం. ఆబ్బో దీనిమీద ఒక నాటిక దానికి నేటికీ ఆదరణ, ఆచారం ఎప్పుడో చచ్చిపోయినా! అదీ సంగతి. దీని తరవాత దురాచారం వరకట్నం. దీనికీ ఒక నాటికుంది. దానికంత ప్రచారం లేదు. అంతకాదు అసలు లేదు. ఇదికదా చిత్రం. అందులో కాళింది పాత్ర అజరామరం, కాని నేటి ఆడకూతుళ్ళా  పాత్రని తలుచుకుంటే ఒట్టు. నేటి కాలంలో ఎవీ లేవుగాని అసలు పెళ్ళేవద్దు, కోలివింగ్ ముద్దు. ఇదీ జరుగుతున్నది. మోజు తీరేకా ఎవరిదారి వారిదే! అప్పటిదాకా కోలివింగ్ లో ఉన్నవాడు చంఫేయ్యకుంటే!

ఓలి ఇచ్చి పెళ్ళి చేసుకునే రోజుల్లో ఒక పేదవాడు ఓలి తక్కువని ఒక గుడ్డిదాన్ని పెళ్ళి చేసుకున్నాడు. పాపం ఆమె ఎం చేయగలదు. రోజూ కుండలు పగలగొట్టేసేది, పని చేస్తూ. రోజూ కుండలు కొనుక్కోడం ఓలికంటే ఎక్కువైంది. దాంతో ఒయ్యో! తెలివి తక్కువపని చేసానే అని వాపోయాడు.

బెల్లముంటేనే చీమలు చేరతాయి
 విచిత్రం ఏంటి? అసలు సంగతి వేరే! అధికారం ఉన్నదగ్గరకే మనుషులు చేరతారు.డబ్బున్నదగ్గరకే మనుషులు చేరతారు.  మురికున్నదగ్గరకే పందులు,దోమలు చేరతాయి.పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి.అందం ఆర్భాటం ఉన్నదగ్గరకే మనుషులు చేరతారు.తెరియమా? 

 

5 comments:

  1. బ్లాగుల్లో పస వున్న మీ లాంటి వారి టపాలకే కాపీ రయిటర్లుంటారు :)

    ReplyDelete
    Replies
    1. Anonymous26 December 2022 at 22:21
      నెట్ లో నా టపాలు లేని ఫోరం లేదనుకుంటాను. మొన్నీ మధ్య (Quora) కోరా లో ఒక టపా కనపడింది, కనపడనివెన్నో!!!!

      Delete
    2. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు కదా శర్మ గారు.

      Delete
  2. తెరియుం, తెరియుం..

    ReplyDelete
    Replies

    1. bonagiri27 December 2022 at 15:19
      ధన్యవాదాలు

      Delete