Wednesday 23 November 2022

వినదగునెవ్వరు చెప్పిన

వినదగునెవ్వరు చెప్పిన

 


వినదగునెవ్వరు చెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్

విని కల్లనిజము దెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!


ఎవరుచెప్పినా విను. విన్న వెంఠనే ఉద్వేగపడిపోకు, విన్నదానిని విశ్లేషించుకో! విన్నదానిలో నిజానిజాలు తేల్చుకున్నవాడే తెలివైనవాడు అన్నారు, బద్దెన.


తెనుగుపద్యానికి కూడా అర్ధం చెప్పాలా? అందులోనూ సుమతీ శతకపద్యానికి అని కోప్పడ వద్దు. నేటికాలంలో తెనుగు పద్యానికే అర్ధం చెప్పవలసిన రోజులొచ్చాయి.  దీనికేంగాని ముందుకెళదాం.



ఎవరు చెప్పినా విను, విను, విను, అని ముమ్మారు నొక్కిచెప్పారు శతకకర్త.

ఎవరు చెబుతారు?

బంధుమిత్రులు,శత్రువులు,అయాచితులు.

ఎవరు బంధువులు?

తల్లి,తండ్రి,భార్య/భర్త వీరే బంధువులు. మిగిలినవారంతా చుట్టాలే. బంధువులు ఏపరిస్థితులలోనూ మనమంచి కోరతారు.

ఎవరు మిత్రులు?

చాలాపెద్దది సమాధానం, టూకీగా. (పాపన్నివారయతి,యోజయతే హితాయ)పాపాన్నించి రక్షించేవాడు, ఎప్పుడూ మనహితంకోరేవాడు, అవసరంలో సాయం చేసేవాడూ, రహస్యాన్ని దాచి ఉంచేవాడూ,మనలోని గుణాలని ప్రకటించేవాడు. వీరే ఆత్మీయమిత్రులు.

ఎవరు శత్రువులు?

వీరు రెండు రకాలు. ప్రత్యక్ష శత్రువులు,పరోక్ష శత్రువులు.వీరెప్పుడూ మన నాశనమే కోరతారు. ప్రత్యక్ష శత్రువునుంచి కాచుకునే ఉంటాం ఎప్పుడూ, మరి ఈ పరోక్ష శత్రువే ప్రమాదకారి. వీరితోనే జాగ్రత హెచ్చుగా అవసరం.

పైవారంతా తెలిసినవారే!

అయాచితులు, వీరెవరో తెలీదు, వీరికి మనకి సంబంధమూ ఉండదు, వీరు ప్రతిఫలాపేక్ష లేక సమయ సంధర్భాలూ, సాధ్యాసాధ్యాలూ, వేటినీ పట్టించుకోరు, మనం ఆపదలో ఉంటే గట్టెక్కే మాట చెప్పిపోతారు, చెప్పాలనిపించింది, చెప్పేశా! ఈబాపతనమాట.

వింటే ఏమిటి ఉపయోగం?

ఎవరే చెప్పినా వినడం అలవాటు చేసుకుంటే ముందుగా అలవడేది ఓపిక. ఆ తర్వాత అలవడేది సహనం. ఇదేమిటీ? చెప్పినవారంతా మనకి నచ్చినదే చెప్పరు.  నచ్చినది విన్నంతలో కోప్పడిపోయే అలవాటు తప్పి సహనం అలవాటవుతుంది. 

ఎవరేనా చెప్పడం మొదలుపెట్టగానే వీరు,బంధువులు,మిత్రులు,శత్రువులు,అయాచితులు అని వర్గీకరీంచుకోవద్దు. ఎందుకువద్దో తరవాత చెబుతా. శత్రువు మన శ్రేయస్సు కోరడు, వారినెందుకు వినాలి?   ఇది సందేహం. 

శత్రువును కూడా ఆపదనుంచి కాపాడుకోడానికి వాడుకోవాలి, చెప్పినదానిలో మనకు ఉపయోగపడేవాటిని తీసుకోవాలి. అదేగాక శత్రువు మనని ఎలా పక్కదోవ పట్టించాలని చూస్తుంటాడో తెలుస్తుంది. రాబోయే అడ్డంకులు ముందు తెలిసినట్టవుతుందిగా! అందుచేత శత్రువును తప్పక వినాలి. ఇక చుట్టాలెవరూ ఆపదలో కనపడరు, కొంతమంది కనపడచ్చు, వారు ఆత్మీయమిత్రుల కోవకి చెందుతారు.


ఇప్పటికి వినడమయిందిగదా! ఎవరు చెబుతారో,ఎందుకు చెబుతారో!  తరవాత వినినంతనె వేగపడక వివరింపదగున్.

వేచి చూడండి.    


2 comments:

  1. వివరిం దగున్ అంటే.విశ్లేషించుకోవాలీ.అని మిత్రులు శర్మ గారు అర్ధం చెప్పారు. బాగుంది.

    ఇకపోతే మరికొంచెం లోతు ఉందిక్కడ.

    వివరం అంటే రంధ్రం అని అర్ధం. క్రమంగా పూర్తిగా తెలుసుకోవటం అనే అర్ధవిస్తృతి వచ్చింది ఈమాటకి. కాబట్టి వివరించటం అంటే నిజానికి రంధ్రాన్వేషణ చేయటం అన్నమాట.

    ఈకోణంలో చూస్తే పద్యకారుడు ఏం చెబుతున్నాడూ ?

    ఎవరేం చెప్పినా విను తప్పకుండా. వచ్చిన సలహాలో లోపాలను గురించి కూడా ఆలోచించు. ఎంత నిజం ఉందీ ఎంత మోసం ఉందో తెలుసుకో. అలా తెలుసుకో గలిగిన వాడే లోకనీతి తెలిసిన మనిషి లోకంలౌ.

    తెలుసుకోలేని వాడు మంచిసలహాను నిరాకరించి చెడవచ్చు లేదా చెడ్ఢసలహాకు బలికావచ్చును!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,
      శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కదా! రంధ్రాన్వేషణ చెయ్యాల్సిందే కదా! :)


      Delete