Thursday 17 November 2022

చస్తే చాలా ఖర్చు బతికుంటే పట్టేడు మెతుకులే ఖర్చు !

 చస్తే చాలా ఖర్చు బతికుంటే  పట్టెడు మెతుకులే ఖర్చు  !


జాతస్య మరణం ధృవం. పుట్టినవారు గిట్టకతప్పదు, చావుకూడా ఎప్పుడు,ఎక్కడ,ఎలా అన్నది కూడా తెలీదు.  చావు కూడా చాలా ఖర్చు తో కూడుకున్నదైపోయింది." చస్తే చాలా ఖర్చు బతికుంటే పట్టెడు మెతుకులే ఖర్చు  "  అన్నమాట పెద్దలనుండి ఎక్కువగా వినపడేది.


కలిగినవారింట చావు కూడా ఉత్సవమే! స్వతంత్రదేశంలో చావుకూడా పెళ్ళిలాటిదే బ్రదర్ అని ఒక సినీకవిగారిమాట. పదిమందితో చావూ పెళ్ళిలాటిదే అనే మాటా వినపడుతో ఉంటుంది మా పల్లెలలో. సామాన్యుల ఇళ్ళలోనే ఇబ్బందులన్నీ. స్వంత ఇల్లుంటే కొంత మేలు. !!అద్దె ఇంట ఉన్నవారైతే అదో నరకం.  నేటిరోజుల్లో అద్దె ఇళ్ళు వేరుగా లేనట్టే! అన్నీ అపార్ట్మెంటులే!! ఇక్కడే చిక్కులన్నీ! అపార్ట్మెంట్లో శవాన్ని ఉంచడానికి లేదని చెప్పేవారే ఎక్కువ. కామన్ ప్లేస్ లో కూడా ఉంచడానికి ఇష్టపడిని గేటెడ్ కమ్యూనిటీ లెన్నో! హాస్పిటల్ లో పోతే అప్పటికే తడిపిమోపెడు ఖర్చయి ఉంటుంది. మార్చురీలో శవాన్ని ఉంచడానికి, దాన్ని బయటికి తెచ్చుకోడానికి పడేవన్ని చెప్పుకోలేని తిప్పలు. మార్చురీలు లేనిచోట ఐస్ బాక్సుల్లో ఉంచడం కూడా ఖర్చుతో కూడిన పనే. ఇక పుట్టెడు పుల్ల లెక్క. దీని ఖరీదూ పెరిగిపోయింది. కొందరు ధర్మాత్ములు పుల్ల ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లూ ఉన్నాయి అక్కడక్కడ, పల్లెలలో. పట్నవాసాల్లో అన్నీ ఇబ్బందులే.శవాన్ని శ్మశానానికి తరలించడం కూడా ఖర్చుతో కూడినదైపోయింది. కొన్ని చోట్ల ధర్మ సంస్థలు,ధర్మాత్ములు ఉచిత వాహనాలు ఏర్పాటు చేసినవీ ఉన్నాయి. లేనిచోట అంతా ఖర్చే!


ఇటువంటి పరిస్థితులలో తల్లి,తండ్రి ఎవరిదైనా పార్ధివదేహాన్ని పంచభూతాలలో కలిపైడానికి అయ్యే ఖర్చు తక్కువలో తక్కువ పాతికవేలంటే నమ్మగలరా? పెళ్ళి కెళ్ళి తినో, తినకో, ఎంతో కొంత సొమ్ము ఇచ్చి వస్తున్నాం, చదివింపులని. మరి, చావులో సామాన్యుడు పడే బాధని ఇబ్బందిని మనమెవరం గుర్తించటం లేదు, సాయమూ చెయ్యటం లేదు. మనలో మార్పురావాలి, తప్పదు. ఆలోచించండి. ఈ కింది మెసేజ్ నాకు వాట్సాప్ లో ఒక మిత్రుని దగ్గరనుంచి వచ్చింది, అది అతని ఆలోచనే, నాకు నచ్చింది, మీరేమంటారు? 


Courtesy:Whats app


పన్నెండో తారీకున ఇంతదాకా రాశాను, నడకనుంచి తిరిగొచ్చిన తరవాత ప్రచురిద్దామనుకున్నా, కాని అనుకోని దుర్ఘటన జరగడంతో వెనకబెట్టేను. మర్నాడు మరణించిన వాకర్ కుటుంబానికి సహాయం చెద్దామని పెద్దలు నిర్ణయించడం, దానికోసం మా వాట్స్ ఆప్ గ్రూపులో మెసేజి ఇవ్వడం, వెంట వెంటనే సహాయాలు ప్రకటించడం,  ఆ సొమ్మును నేడు మా ఎమ్.ఎల్.ఎగారి చేతులమీదుగా ఒకలక్ష అరవైవేలు  చనిపోయినవాకర్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగిపోయాయి. 

 ఇలా మన కుటుంబాలలో, గేటెడ్ కమ్యూనిటీలలో ఇతరత్రా కూడా చేసుకుని మనం సహాయ సహకారాలందిస్తూ బలపడాలి తప్ప, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా!


11 comments:

  1. సినిమాల మీద ఆసక్తి లేదంటూనే రెండు మంచి సినిమా పాటలు ఉదహరించారే 👏🙂.

    పాతిక వేలేం సరిపోతాయి, శర్మ గారు? హైదరాబాద్ లో “మహాప్రస్ధానం” అని ఒక శ్మశానం ఉంది (కాస్త హైక్లాస్). ఆ మధ్య నా స్నేహితుడి తల్లిగారి అంత్యక్రియలు అక్కడే జరిగాయి. నేనూ వెళ్ళాను. గ్రౌండ్ వారికి ఇరవై వేలుట. కార్యక్రమం చేయించిన బ్రాహ్మడు తనకు కూడా ఇరవై వేలూ ఇవ్వాలని అడిగి తీసుకున్నాడు.

    వారసులు NRI లు గనక అయితే రేట్లు మరింత ఆకాశాన్నంటుతాయి - ఏ స్థలం అయినా, ఏ ఊరు అయినా కూడా. ఆ మధ్య మా పెదనాన్నగారి అల్లుడిగారు పోయారు. కొడుకులు అమెరికా నుండి దిగారు. ఇంకేముంది, మొదటి కార్యక్రమానికే అరవై వేలు లాగారు. ఇది జరిగినది విజయవాడలో. కాబట్టి అన్ని ఊళ్ళల్లోనూ అలాగే ఉంది పరిస్ధితి.

    వాట్సప్ లోని మెసేజ్, దానికి సంబంధిత
    మీ సలహా ప్రశస్తంగా ఉన్నాయి. మీరందరూ ఆచరణలో పెట్టడం ఎంతైనా మెచ్చుకోదగినది. కానీ ఇచ్చేదేదో మీరందరూ కలిసి వెళ్ళి డైరెక్ట్ గానే ఆ కుటుంబానికి అందజేసుండ వచ్చుగా? మధ్యలో MLA గారి శంఖం ఎందుకు? వారు కూడా ఇతోధికంగా ఏమైనా ఇచ్చారా ? లేక ఆ వాకర్ గారు కుప్పకూలిపోయిన ప్రదేశం ఆ MLA గారిదా?

    ReplyDelete
    Replies
    1. Anonymous17 November 2022 at 11:49
      సినిమాలమీద ఆసక్తి లేదు. సాహిత్యానికేం? దానిమీద ఆసక్తి ఎప్పుడూ తగ్గలేదు.

      అత్యేష్ఠి సంస్కారాలు ఎవరి ఇష్ట ప్రకారం వారు జరుపుకుంటారు. ఏ పద్ధతిలో పార్ధివ శరీరాన్ని పంచభూతాలలో కలిపినా కనీస ఖర్చునేను చెప్పినది. ఇంక సంస్కారాల ఖర్చు ఇందులో లేదు. సంస్కారాలు చెయ్యకపోయినా చచ్చిన వాళ్ళు చూడరారు. బతికున్నవాళ్ళ కోసమే ఈ సంస్కారాలు.

      ఇక పల్లెలలో పుల్ల ఖర్చు ఇతర ఖర్చులు కలిపి అంతవుతున్నాయి, ధర్మాత్ములు,సంస్థలు లేనిచోట.పట్టణాలలో చెప్పక్కరలేదు. ఈ చిక్కులన్నీ లేనివారికే, కలిగినవారు ఇప్పుడూ ఖర్చు చేయక మరెప్పుడు చేస్తరబ్బా! తల్లితండ్రుల అంత్యేష్ఠికి ఖర్చులయ్యాయని బాధపడే కొడుకులకాలమొచ్చింది. ఎన్.అర్.ఐ లు గురించి చెప్పను, బాధగా ఉంటుంది. ఇక సంస్కారాలు చేయించేవారిది అదే వృత్తి, దానిమీదనే బతకాలి. అన్నిఖర్చులూ పెరుగుతున్నపుడు ఇవ్చి పెరగక ఉండవుగా!

      ఇక పల్లెలలో కలిగినవారెవరూ ఈ సందర్భంలో ఉచితాలకి ఎగబడరు. నిజానికి ఈ సమయంలోనే చాలా ఉదారంగా ఖర్చూ పెడతారు, పెద్దల గురించి.

      ఖర్చులు పెరుగుతున్నాయి కనక నలుగురూ తలో చెయ్యీ వేసి దానిని గడిపి ఆ కుటుంబాన్ని ఆదుకోమన్నదే ఈ టపా లక్ష్యం. దాన్ని చేసి చూపించాం. పల్లెలలో పెద్దలను గౌరవించడం వారి చేతుల మీదుగా కార్యక్రమాలు జరిపించుకోడం ఇంకా కొనసాగుతూ ఉంది. ఆ రోజు ఉదయమే ఆరు గంటలకి రమ్మని పిలవగానే ఒప్పుకుని సమయానికి చలిలో విచ్చేసి, గ్రౌండులో నిలబడి సంతాప సభ జరిపిన వారితో పాల్గొన్న మా ఎమ్.ఎల్.ఎ గారికి అభినందన. ఇక మేమే చనిపోయినవారింటికి వెళ్ళి సాయమందించవచ్చు కాని మాతో పాటు నడకలో పాల్గొన్న వ్యక్తి కుటుంబానికి ఇంతమంది తోడున్నామని భరోసా ఇవ్వడానికే కుటుంబసభ్యులను గ్రౌండ్ కి పిలిచాం. మీ సందేహాలన్నిటికి సమాధానాలొచ్చాయనుకుంటా.

      Delete
  2. వచ్చాయి, థాంక్యూ శర్మ గారు.
    ఇటీవల మొదలై ఈ బ్లాగర్ కామెంట్ బాక్స్ తో మహా చిక్కొచ్చిందే ☹️.
    పైన కామెంట్ వ్రాసింది నేనే. Anonymous అని ఎందుకు publish అయిందో ….. విష్ణుమాయ 😧. నేనూ ఇంతకు ముందు గమనించలేదు.

    ReplyDelete
  3. విన్నకోటవారు,
    చిన్న క్లాసు ఏమనుకోవద్దూ :)
    బ్లాగులో కొచ్చాకా పైన యు.అర్.ఎల్ (బ్లాగు పేరు ) కనపడే బార్ లో చివరగా కన్నులాటి ఒక ఐకాన్ కనపడుతుంది, ఇతర ఐకాన్లతో, దీని మీద క్లిక్ చేస్తే తర్డ్ పార్తీ కుకీస్ బ్లాక్డ్, అని ఉంటే గూగుల్ అక్కౌంట్ తో కాక అనానిమస్ గా కామెంట్ వెడుతుంది. గూగుల్ అక్కౌంట్ లో కామెంట్ వెళ్ళాలంటే తర్డ్ పార్టీ కుకీస్ అలఔ చెయ్యాలి. అప్పుడు గూగుల్ అక్కౌంట్ తో కామెంట్ వెడుతుంది, ఇంకా ఫాలోఅప్ కామెంట్ల బాక్స్ కనపడితే, అదే నోటిఫై మి బాక్స్, కామెంట్ గూగుల్ అక్కౌంట్ తో వెళుతున్నట్టు, అలాగే గూగుల్ అక్కౌంట్, అనానిమస్,నేమ్/యు.ఆర్.ఎల్ కనపడతాయి. ఇవన్నీ మీకు తెలియనివేం కాదు :) గుర్తు చేయడమే :)

    కామెంట్ రాసే హడవుడిలో ఇవేవీ గమనించం :)

    ReplyDelete
    Replies
    1. మీకు తెలియని విషయాలూ అంటూ ఏవీ లేదండోయ్

      Delete
    2. Anonymous20 November 2022 at 21:38
      అందరికి అన్నీ తెలిసుండవు, అన్నీ జీవితానుభవాలే అంటే బతుకు చాలదు, కొన్ని నేర్చుకుంటాం, కొన్ని ఎదుటివారి అనుభవాలు పంచుకుంటాం.

      Delete
    3. you are more talented than you said before. I am an IT professional and I do not know details you mentioned here about anonymous comments. I am always surprised with your knowledge and its application.

      Delete

    4. Anonymous22 November 2022 at 00:25
      నమస్కారం.
      ఎవరో బాగా ఎరిగినవారిలాగే ఉన్నారు, ఎవరబ్బా!
      నిజంగానే నేను చదువుకోనివాడిని. విజ్ఞానం సముద్రంలాటిది. తెలిసినది గోరంత,తెలియాల్సింది కొండంత. మీలాటి ప్రొఫెషనల్స్ వీటి మీద దృష్టి సారించకపోవడమే కాని వేరు కాదు.మరీ పొగిడేస్తున్నారు సుమా! వద్దూ !!!!

      Delete
  4. అనుకునేదేమీ లేదు, శర్మ గారు. అవగాహనా పాఠం కదా. థాంక్యూ సర్ 🙏.

    ReplyDelete
  5. తమ రిరువురి గోష్టి కనగ ,
    చమరించె జిలేబి గారి సంస్మృతి మెరసెన్ ,
    కమనీయము గద ! అప్పటి
    మమకారపు మరపురాని మాటా మంతీ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      ధన్యవాదాలు

      Delete