Sunday 6 November 2022

ఉబోస కావాలి

ఉబోస కావాలి 

ఒక నెలనుంచి ఒక పెద్దాయన ఉదయం నడకకొస్తున్నారు, ఒకటి రెండు రోజులు నడవగా చూసాను, ఆ తరవాత ఆయన నడిచింది చూడలే! ట్రేక్ దగ్గరే బెంచి మీద కూచుని ఉంటున్నాడు, నడిచేవాళ్ళని చూస్తూ! ఈయనకేం పెద్ద వయసనుకోకండి, మొన్ననే అరవై వచ్చినవాడు, కొత్తగా స్టెంటు వేయించుకున్నవాడు.డాక్టర్ బహుశః నడవమని చెప్పి ఉంటాడు. కాళ్ళకి నీ కేప్ లు వేసుకుని అవస్థ పడుతుండగా చూసాను. తెలిసినవాడే! తెల్లగా పాలిపోయాడు, ఏంటి సంగతంటే, నాకే అనిపించినది. ఆయన ఒక ఏ.సి బాధితుడని. ఇంటిదగ్గర ఏ.సి, ఆఫీసులో ఏ.సి, కారులోనూ ఏ.సి. అదీ బాగా కూల్ గా. మనిషి పాలిపోక మరెలా ఉంటాడు? కష్టపడి ఉదయం సూర్యుని కోసం చూస్తూ ఉంటాడు, సూర్యుడు కనపడ్డాకా పావుగంటకి వెళిపోతుంటాడు. ఆయన చుట్టూ భజంత్రీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు :)


ఇది చూసి కొంచం బాధ కలిగింది, ఆగలేకపోయా! చెప్పాలనిపించింది 

 చెబుతున్నా, ఉబోస అనుకున్నా ఏమనుకున్నా! అని చెప్పేసానిలా!

మోకాళ్ళ నెప్పులు తగ్గలంటే బరువు తగ్గాలి, అది అంత తొందరగా జరగదు, నడిస్తే బరువు తగ్గుతుంది, నడవాలంటే మోకాళ్ళనెప్పులు,ఇలా ఇది ఒక విషవలయం. నడవడానికి ప్రయత్నించాలంటే, మోకాళ్ళకి చిన్న చెంచాడు ఆవునెయ్యి,నాలుగు చుక్కల నిమ్మరసంకలిపిరాయండి, నెప్పులు తగ్గిపోతాయనను,  

 నడవడానికి కొంత అనుకూలిస్తాయి, చెప్పాలనిపించింది, 

చెప్పేసా! ఉబోస అనుకున్నా ఏమనుకున్నా! 


వద్దనుకుంటూ ఉన్నా ఉబోసలు పెరిగాయి :) తగ్గేదెలా? ఎవరేనా స్పందించకుండా ఉండేందుకు 

 ఉబోస చెప్పరాదూ?  :) 



6 comments:

  1. స్పందించకుండా ఉండేందుకు ఉబోస కావాలా? మీకెవరన్మా చెబితే నాక్కూడా చెప్పండి దయచేసి. ఎందుకంటే నేను కూడా “కందకు లేని దురద …... “ బాపతే (ఈ సామెతను వాడినందుకు ఏమనుకోకండి 🙂). అందువల్ల ఆ అలవాటుని తగ్గించుకోవడానికి ఏదైనా చిట్కా.ఉందా అని ఆలోచిస్తుంటాను 😒.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      పరోపకారి పాపన్న/పాపక్కలు భారతదేశం లోనే హెచ్చుటండి. సెల్ ఫోన్ వీడియో వచ్చాకా, ఆక్సిడెంటయి చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళని సాయంచేయడానికి బదులు,వీడియోలు తీసుకునే సంస్కృతికి పెరిగాము కదండీ! ఇది పురోగతి కాదంటారా? స్పందించే ముందు చేతిలో చెయ్యేసుకుని నాకేంటీ? అనుకుంటే కటీఫ్! :)

      బాధపడుతున్నవాళ్ళని,కష్టపడుతున్నవాళ్ళని చూసి స్పందించలేకపోవడమే సంస్కృతి అనుకుంటున్న లోకం. ఏమో నేను మారేలా లేనండి, ఇవేళ ఉదయమే జరిగిన సంఘటన.
      ==================================
      ఉదయం ఎవరిని పలకరించక నడక పూర్తి చేసుకుని ప్రాణాయామానికి కూచుంటున్న సమయం. నిన్న ఉదయం కలిపిన పెద్దాయన నడుచుకుంటూ నా దగ్గర కొస్తున్నారు. ఏదో అయ్యిందిరా నీకూ ఈ వేళా అని మనసు హెచ్చరించింది. రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెఱువనేర్తువా? అని బుద్ధి కూకలేసింది. ఈ లోగా ఆ పెద్దాయన దగ్గరొకొచ్చి నమస్కారం శర్మగారూ! మీరు చెప్పిన చిట్కా వైద్యం నిన్న ఇక్కడినుంచి వెళ్ళినది మొదలు అమలు చేసాను. కాలు కొంచం స్వాధీనమయినట్టనిపించిందీ వేళ. ధన్యవాదాలు అని చెప్పి వెళిపోయారు. కొద్ది సేపు అవాక్కయ్యాను.ఆయన మాటల్లో నాగురించి ఆలోచించిన వారొకరున్నారే! అనే సంతోషం కనపడింది. చాలు! ఇది చాలు!! నేను మారనంటే మారను.
      సలహా చెబితే తిడతారు, లేదా కొడతారు అంతేగా! :)

      Delete
  2. అంతే లెండి, "చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం" అన్న సినిమాపాటలో లాగానన్నమాట 🙂? అదే ఉత్తమమైన పాలసీ.

    మీ అనుభవం చూస్తే .... అప్పుడప్పుడు ఉబోసలను వినిపించుకునే వాళ్ళు కూడా తగులుతారన్నమాట అనిపిస్తోంది. శుభం. వినిపించుకోవడమే కాకుండా ఉబోస ఇచ్చినవారి వద్దకు తిరిగొచ్చి ఆ మాట చెప్పిపోవడం మరీ అరుదు. ఆయనెవరో బాగా సంస్కారవంతుడిలా అనిపిస్తున్నారు 👏.

    అవునండి, సెల్ ఫోన్లు వచ్చాక సాటివారి పట్ల నిర్లక్యం బాగా పెరిగిపోయింది.

    ReplyDelete
  3. మీరు మంచి మంచి ఉబోసలే చెబ్తున్నారు కదండీ. ఇంకెందుకు చింత ? ఆవునెయ్యి దొరుకుతుందా ?

    ReplyDelete
    Replies
    1. Anonymous9 November 2022 at 04:41
      నేటి కాలం వారికి వినే ఓపిక తగ్గిందండి! అందుకే విసుగు,కోపం ఇలా రకరకాలుగా ......., అప్పుచిన్నబుచ్చుకోవలసివస్తుందేమోనని.....

      ఇక ఆవునెయ్యి ప్రశస్తమైనదే దొరుకుతోంది. ఆవునెయ్యి అవునా కాదా ? అనుమానమైతే తేల్చుకునే పద్ధతి (ఇదిగో !దీన్నే ఉబోస అన్నారు మరి) ఆవునెయ్యి మాత్రమే కొంచం పసుపు పచ్చగా ఉంటుంది,గేదినెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవునెయ్యి కి కొద్ది వాసన ఉంటుంది, గేది నెయ్యికి కమ్మటి వాసన ఉంటుంది. ఇక దేశవాళీ ఆవులపాలు,నెయ్యి ప్రశస్థం. ప్రయత్నించండి. Not jersey cow ghee

      Delete
    2. ఆవుపాలు కాచి పెరుగుచేసి,దానిని చిలికి వెన్నదీసి కాచి, వచ్చిన నెయ్యి చాలాబాగుంటుంది, ఇది మందుగా వాడుకోడానికేకాదు, తినడానికి మంచిది. ఇలా చేసిన నేతికి కొద్ది వాసన ఉంటుంది. అలాకాక పచ్చి పాలు చిలికి వెన్నతీసి కాస్తే కొవ్వు వాసన ఉంటుంది. ఇది తెలుసుకుంటే మంచిది.

      Delete