Monday 14 November 2022

అభిమానులు

 అభిమానులు



దయా బెన్ 
ఎవరీ దయాబెన్?
హిందీ టి.వి. సీరియల్లో ఒక పాత్ర పేరు.
ఎంటి సంగతి?
ఈ పాత్రని ఒక అమ్మాయి పోషించింది. ఆమె అసలు పేరు దిశా వాకాని. దయా బెన్ అన్నది పాత్రపేరో, ఆ నటి పేరో, తెలియనంతగా కలగలిసిపోయింది, ప్రజలలో.  ఆ హిందీ సీరియల్ పేరు తారక్ మెహతా కా ఉల్టా చష్మా! చాలామంది ఆమె అసలు పేరే మరచిపోయారు. మూడేళ్ళకితం పెళ్ళి చేసుకుంది. గర్భవతి అని తెలిసిన తరవాత ఒక సంవత్సరం పాటు ఎపిసోడ్ లకి పని చేసి ముందే ఇచ్చేసింది.సీరియల్ నుంచి తప్పుకుంది. 

ఆ తరవాత బిడ్డని కన్నది. షో నిర్మాత మరల షో కి రమ్మని పిలిచాడు,బిడ్డని సాకాలి రానంది. అదొగో అప్పుడు మొదలయింది కథ, చిలవలు పలవలుగా, ప్రెస్ లో.అభిమానులు బాధపడ్డారు. డబ్బులు ఎక్కువడిగితే నిర్మాత ఇవ్వనన్నాడని, మరొకరిని తీసుకుంటామని అన్నారని, ఎన్నెన్ని వన్నెలు చిన్నెలో, ప్రెస్ లో కనపడ్డాయి. ఆమెకు బదులు మరొకరి కోసం, అటువంటి వారి కోసం వెదుకులాటకి వీధిని పడ్డారు, సహనటులు,నిర్మాత అంతా. ఉహు! చాలామందిని చూసినా ఎవరూ సరిపోలేదు. ఆమెకు  బదులు మరొకరు దొరకలేదు. ఇక ఈ కాలం లో అభిమానులు చూపిన ఆదరమూ మరువలేనిదే! రెండేళ్ళ వెతుకులాట ఫలించలేదు.మరొకరు దొరకలేదు. బిడ్డకి రెండేళ్ళొచ్చేయి. ఆమెనే మరల అడిగాడు నిర్మాత. అమె మరల షో లో పాల్గోబోతోందన్నది సంచలన వార్త.   అభిమానులు పండగ చేసుకుంటున్నట్టు వార్త. 

ఆమె ఒక సామాన్య నటి. గ్లామర్ ఉన్నదేంకాదు, కాని అభిమానుల అనుగ్రహం పూర్తిగా పొందినది.


ఇక్కడి దాకా రాసేటప్పటికి మా సత్తిబాబు,సుబ్బరాజు వచ్చారు. రాసినది చూసి, మీకీ అలవాటు (తెగులు) తగ్గిందనుకున్నాను ( కుదిరింది )అనుకున్నాను. కుదరలేదనమాట! అంటూ మానిటర్ తన పక్క తిప్పుకుని చదివేడు, ఆ తరవాత సుబ్బరాజు చదివి, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి ఏం చేస్తాం లే! అని, సత్తిబాబూ నాకు కొన్ని అనుమానాలు తీర్చుదూ! అన్నాడు.  

ఈ తారకి అభిమాన సంఘం ఉందంటావా? మరో పెద్దనుమానం, 

మన తెనుగునాట సినీ తారళ్ళకి అభిమాన సంఘాలున్నాయి, మరి తారలకి లేవేం? ఇప్పటి తారలంతా దిగుమతీ సరుకే అంటావా?, అటైతే మన తెనుగువాళ్ళే ఐ గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన తారలు, సావిత్రి,భానుమతి, షావుకారు జానకి లాటి తారలకి అభిమాన సంఘాలెందుకు లేవు?

 ఈ అభిమాన సంఘాలున్న తారళ్ళు కట్టుకున్న గుడ్డలాళ్ళవిగావు,నిర్మాతవి. తెరమీద మాటాడే తూటాల్లాటి మాటలాడివిగావు,మాటల రచయితవి. ఆడు పాడే పాటాడిదిగాదు, పాటల రచయిత తెలివి.

    పాట, ఎనకమాల పాడే ప్లేబాక్ సింగర్ ది. ఇకాడు ఏసే స్టెప్పులు, ఆడెవడు కొరియొగ్రాఫర్ చెప్పినయి. మరి నటన, డైరెక్టర్ చెప్పినది. మరీళ్ళు చేసేదేటంటావ్? గొప్పంతా ఈళ్ళకే పులిమేత్తన్నారేటీ?    

మా సత్తిబాబు తన పక్కనే ఆటం బాంబు పడినంత కంగారు పడిపోయి, అవన్నీ పెద్ద విషయాలు సుబ్బరాజూ, నీకు చెప్పినా తెలియవులే అని వెళిపోయాడు.  పాపం మా సుబ్బరాజు తెనుగు ప్రజల్లా నిలువుగుడ్లేసుకునుండిపోయాడు.
(9.10.2019)

2 comments:

  1. పాత టపా రీ సైకిల్ చేస్తున్నారు గుజ్జయిపోయిందాండీ ?

    ReplyDelete
    Replies
    1. Anonymous14 November 2022 at 20:45
      జంతికొచ్చి చక్కిలాన్ని ఎక్కిరించినట్టా :)

      Delete