Wednesday 21 September 2022

ఎద్దు పుండు కాకికి నొప్పా?

 ఎద్దు పుండు కాకికి నొప్పా?

స్వంతవైద్యం చేసుకోకూడదు. అలాగే ఇంట్లో వారెవరూ వైద్యమూ చేయకూడదు,ఎంత గొప్ప వైద్యులైనా. ఎందుకు? ఇదిగదా మన ప్రశ్న :) సందేహజీవులం కదా!


మొన్న నిమ్స్ డిరెక్టర్ అపోలో లో చేరితే నిమ్స్ లో వైద్యం బూటకం వగైరా అనేశారు. కాని ఆయన అపోలో లో చేరి మంచిపని చేశారు. నిమ్స్ లోనే కనక చేరితే అక్కడ ఆయన రోగిగా గుర్తించబడి వైద్యం జరగదు. ఆయన డైరెక్టర్ గానే గుర్తిస్తారు, అందరూ. ఇది ఎంత చెప్పినా వైద్యులు మిగతా సిబ్బంది మీద ఉంటుంది. ప్రమాద సమయాల్లో నిర్ణయం తీసుకోడానికి వైద్యులు జంకుతారు. అందుకు స్వంతవైద్యమూ పనికిరాదు, స్వంత ఇంటిలో వైద్యుడే ఉన్నా, ఎంత గొప్పవాడైనా, కావలసినవారికి వైద్యం చేయకూడదు. తెలిసిన వైద్యులెవరూ అలా చేయరు. పెరటిలో మనం చెట్టు వేస్తేనే పెరుగుతుంది, దానికి ఎంతో కొంత దోహదం చేస్తాం, అది సహజవాతావరణం పెరిగినదై ఉండదు,దానిలో కొన్ని సహజ గుణాలు లోపిస్తాయి. అందుకే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు.


సందేహజీవులం కదా మరో సందేహం ప్రాథమిక చికిత్స చేయవచ్చా? ప్రాథమిక చికిత్స ఎప్పుడు చేస్తారు? ప్రమాదం జరిగినపుడు కదా! ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అత్యవసరం, అది ఎవరైన, ఎవరికైనా చేయచ్చు, ఆ తరవాత అవసరాన్ని బట్టి వైద్యుల దగ్గరకు తీసుకుపోవాలి. 


పెరటి చెట్టు మందుకు పనికిరాదు


యజమాని ఎద్దును కాడి మెడమీద వేసి బండికి, నాగలికి కడతాడు. ఐతే పని చేసేటపుడు ఎద్దు మెడమీద అధికభారం మోపితే పుండు పడుతుంది. యజమాని పుండు పడినా పనికి మలుపుతూనే ఉంటాడు, ఎద్దు ఎత్తుబడిపోయేదాకా! . ఎద్దు మెడ మీదపడ్డ పుండు మీదనే కాకివాలుతుంది, మాంసం పొడుచుకుతినడానికి. ఎద్దు కాకిని తోలుకో లేదు. తోక మెడదాకా అందదు, చెవులాడించినా, అవీ మెడమీద కాకిని బయటికి తోలలేవు, ఎద్దు మెడ ఆడించినా కాకి ఎగిరి మళ్ళీ అక్కడే వాలుతుంది. పాపం ఎద్దు అసహాయం గా కాకితో హింసింపబడుతూ ఉంటుంది. కాకికి బాధేంటి ఎద్దుకుగాని? 


సమాజంలో కాకిలాటి వారుంటారు, ఎద్దులా అసహాయంగా బాధ అనుభవిస్తున్నవారూ ఉంటారు. తస్మాత్ జాగ్రత!!! 


ఎద్దు పుండు కాకికి నొప్పా?

3 comments:

  1. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళకుండా ప్రైవేట్ హాస్పిటల్ లో జేరడం కూడా ఈ బాపతే అంటారా (నిమ్స్ డైరెక్టర్) ? బాసుడే ఖాయిలా పడి వస్తే సిబ్బంది మరింత శ్రద్ధగా చూస్తారుగా - మెప్పు కోసమయినా? లేదా వాళ్ళ ఎప్పటి నిర్లక్ష్యపు పద్ధతిలోనే ఉండి, మన హాస్పిటల్ వే సరైన సౌకర్యాలు లేవు, మీకు తెలియనిదేముంది సార్ అంటారా?

    పాపం, ఎద్దుకు మెడ మీద పుండు పడితే ఆ పుండు మీద యజమాని ఓ సన్నటి బట్ట కప్పడం (కట్టడం) చెయ్యచ్చు కదా …. దాన్ని కాకి పొడుచుకు తినకుండా? లేదా బెల్-డోనా ప్లాస్టర్ వెయ్యచ్చు. రైతు నాట్ బోదర్డ్ (not bothered) అంటారా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      పదవిలో, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎప్పుడు జేరతారో,అనారోగ్యంతో ఎందుకు చేరరో, మీకు తెలియందిగనకనా :)

      ఇక హోదాల్లో ఉన్న డబ్బున్న వారికి గవర్నమెంట్ ఆసుపత్రిలో సౌకర్యాలు,వైద్యం ఎలా ఎగిరొస్తాయో చెప్పక్కరలేదనుకుంటాను :)

      ఇప్పటికిన్నీ తెలిసినవైద్యులెవరూ కుటుంబ సభ్యులకి వైద్యం చెయ్యరనుకుంటున్నాను. మనుషులు యంత్రాలలా మారనిరోజుల మాటిది,నిమ్స్ డైరెక్టర్ కూడా పాతకాలపు మనిషిలా ఉన్నారనుకున్నా! యంత్రాలలా మారేరంటే మీరు చెప్పిన మాటే :)

      నేడు పల్లెలలో కూడా ఎద్దూ లేదు,అరకాలేదు,బండీ లేదు. నాటి కాలానికి ఎద్దుకు మెడమీదనే పుండు పడేది,అందుకే ఈ నానుడి పుట్టింది. నాడు ఇంత వైద్యమూ ప్లాస్టర్లూ లేవు,పసరు పోయడం తప్పించి, ఉన్న వైద్యం అంతరించిపోయె.
      ఐతే మెడమీద పుండు పడితే, కాకి వాలి పొడుస్తుంటే, తోలుకో లేక అసహాయంగా ఉండిపోయిన ఎద్దులాటివారూ, కాకుల్లాటి పొడుచుకు తినే మనుషులూ ఉన్నారని చెప్పడమే ఈ నానుడి ఉద్దేశం, అది మీకు తెలియంది గనకనా!

      Delete
    2. // “మీకు తెలియంది గనకనా!” //

      శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది కదా, శర్మ గారు 🙂🙏.

      Delete