Thursday 15 September 2022

గాడిద మాలక్ష్మికీ జై

గాడిద మాలక్ష్మికీ జై   

వ్యాధి నిరోధక శక్తి అనేది బజారులో కొనుక్కుంటే దొరికేది కాదు. దీనికోసం మనవారు చాలా ప్రయత్నాలే చేశారు, అందులో కొన్ని, దొండాకుపసరు తాగించడం, వసపోయడం, తిప్పతీగనుంచి తిప్పసత్తు తయారు చేసుకువాడటం, గాడిదపాలు తాగటం, ఒంటెపాలు తాగటం ఇలా చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక టపారాస్తూ గాడిద పాల వ్యాపారం లాభసాటి అన్నాను.అది నిజమని నిరూపించబడింది. చూడండి. 

https://kastephale.wordpress.com/2016/02/27/


శర్మ కాలక్షేపంకబుర్లు-చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో…..

”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

ఏంటీ! తెగనీలుగుతున్నావ్!! చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కిస్తానేంటనుకుంటున్నావో!!!” ఇలా తిట్టడం  తెనుగునాట బాగా అలవాటు.

చిన్నప్పుడు దొండాకు పసరు ఎందుకు తాగిస్తారు?. దొండ రెండు రకాలు. తియ్యదొండ,చేదుదొండ లేదా కాకిదొండ, లేదా పిచ్చిదొండ అంటారు. ఈ పిచ్చి దొండపాదులు పల్లెలలో బాగా పెరుగుతాయి, ఎక్కడపడితే అక్కడ. చిన్నపిల్లలికి మూడు నెలలుదాటి సంవత్సరం లోపులో వస పోస్తారు, మాటలుబాగా వస్తాయట, ఎక్కువగా మాటాడేవాళ్ళని వసపిట్టలని అంటారు, వసెక్కువ పోసినట్టున్నారంటారు. అలాగే ఈ పిచ్చిదొండ ఆకులు తెచ్చి మెత్తగా నలగకొట్టి రసం తీసి, రోజుకి రెండు పూటలా మూడు రోజులు పట్టిస్తారు. ఇలా చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. ఇప్పటివారికి పోయటం లేదుగాని, మా చిన్నప్పుడు అందరూ దొండాకు పసరు తాగినవాళ్ళే. మరోమాట ఈ పిచ్చి దొండపాదుల్ని కాయలు బాగా కాస్తాయి, తెలివైనవాళ్ళు వాటిని తెచ్చుకుని చక్రాల్లా తరుక్కుని ఎండబెట్టి వరుగులు చేసుకుంటారు. వీటిని ఆ తరవాత వేయించుకుని తింటారు, కొంచం చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదిట. మరో సంగతి పిచ్చి దొండాకుల్ని మెత్తగా నలిపి రక్తపుగడ్డ మీద వేస్తే మూడో రోజుకి ఫట్, ఆ తరవాత అదే ఆకులముద్ద వేస్తే పుండు మానుతుంది, ఇది ఆంటీ బయోటిక్ ట.

మరచాను మరోమాటా! తెనుగు నాట దొండాకు పసరే కాకుండా గాడిదపాలు పోయడమూ, దేశంలో కొన్ని చోట్ల ఒంటె పాలు పోయడమూ అలవాటే. ఇలా గాడిద పాలు మూడు రోజులు తాగిస్తే కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందటా! ఇప్పుడు తెనుగునాట గాడిదపాల వ్యాపారం మూడు గాడిదలూ రోజుకి ఆరువేల రూపాయల సంపాదనా లా నడిచిపోతోందట. ఇంటికి గాడిదనుతోలుకొచ్చి వంద ఎమ్.ఎల్ పాలు పితికి రెండువందల ఏభై రూపాయలు పట్టుకుపోతున్నారట. గాడిద మహాలక్ష్మి రాకకై ఎదురు చూస్తున్నారట. దానికీ సమయం కేటాయించేస్తున్నారట (కాల్ షీట్ బుక్ చేసుకొంటున్నారట) గాడిదలు కాసేవారు. పిల్లలకే కాదు పెద్దవారూ గాడిద పాలు తాగుతున్నారట.

చిన్నప్పుడు మా మాస్టారు చదువుకోక గాడిదల్ని కాస్తావా అనేవారు. నిజంగా గాడిదల్ని కాస్తేనే బాగున్నట్టుంది, రోజుకి ఆరువేలు నెలకి రెండు లక్షలు, ఆపైన లెక్కొద్దుబాబూ! టాక్స్ లేని ఆదాయం!

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? గాడిదలు కాయండి!

ఒక కేజి గాడిద వెన్న తయారు చెయ్యడానికి డెభ్భై లీటర్ల గాడిద పాలు కావాలిట. ఒక కేజి గాడిద వెన్న ఖరీదు అక్షరాలా రెండు లక్షలు, గాడిద వెన్న చాలా సున్నితంగా మెత్తగా ఉంటుందిటా! సౌందర్య సాధనాల్లో,  మొహానికి రాసుకునేవాటిలో వాడతారటా!

ఆడగాడిదలని పెంచండి, కోటీశ్వరులు కండి.

గాడిద మహాలక్ష్మికీ జై!!!


9 comments:

  1. గతంలో మీరు టపా వ్రాసినప్పుడు వంద ML 250 రూపాయలున్నది ఇప్పుడు 750 రూపాయలయిందట - పైన ఫొటో క్రిందనున్న వార్త ప్రకారం. గిరాకీ అంతగా పెరిగిపోయింది కాబట్టి ఇక నుంచీ గాడిదను ఇంటికి తోలుకొచ్చి పాలు పితకరేమో, కావాలంటే ఫారమ్ కి వచ్చి పాలు కొనుక్కెళ్ళండి అంటారేమో? పబ్లిసిటీ యొక్క ప్రభావం. లేకపోతే ఉద్యోగం వదిలేసి గాడిదల్ని కాస్తాడా కుర్రాడు.

    ఇంత లాభసాటి వ్యాపారం అయినప్పుడు ఇంకా కార్పొరెట్ట గద్దలు వచ్చి వాలిపోలేదేమిటి చెప్మా🤔?

    ఏమైనా మీరన్నట్లు - గాడిద మాలక్ష్మికీ జై 👍.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      మల్లంపూడి మా పక్క ఊరే! అమెరికాలో ఉండేవాడీ టెకీ, బెంగలూరు కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇతనికో కూతురు, ఆ అమ్మాయి అనారోగ్యం ఇతనికి, వరమయింది. ఆ పాప అనారోగ్యానికి గాడిదపాలు పోయడంతో కుదుటపడింది, దాంతో ఈ వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన పుట్టి, విషయాన్ని పరిశోధించి, మరో ఇద్దరితో కలిసి ఈ గాడిదల ఫారం పెట్టాడు, అది పల్లెటూరు కనక సేల్స్ ఉండటం తక్కువ, కష్టం కూడా. గాడిద మూత్రం కూడా ఎగుమతి చేస్తున్నాడు.పాలు రోజూ ముఫై లీటర్లు హైదరాబాద్ కి పంపుతున్నాడు.నాటు గాడిదలకంటే జపాన్ గాడిద రోజుకు రెండు లీటర్లదాకా పాలిస్తోందిట, ఇదే కొంచం ఖరీదైన గాడిద.మన దేశంలో గుజరాత్ గాడిదలు పేరెన్నిక కన్నవి, రాణ్ ఆఫ్ కచ్ గాడిదలకి ప్రసిద్ధి. ఇక పాకిస్తాన్ గాడిదలూ పేరున్నవే.నాటు గాడిదలు లీటర్ పాలివ్వవు. రోజుకు అరలీటర్ పాలిస్తాయి. గాడిద పిల్లలని కూడా అమ్ముతున్నాడని తెలిసింది. రాజస్థాన్ నుంచి రోజూ ఒంటెపాలు ముంబై కి విమానంలో పంపబడతాయి. కొంతమంది పిల్లలికి ఆ పాలే ఆహారం.

      ఈ వ్యాపారం చెబితే జిలేబీ నన్ను ఎకసెక్కం చేసింది.

      Delete
  2. గాడిద ఎంతో గొప్పదని ఘంటసాలగారు 50 ఏళ్ళ క్రితమే గానం చేసారు :-)
    https://www.youtube.com/watch?v=7wSNlHIPg3k

    ReplyDelete
    Replies
    1. కేకే గారు,
      గాడిద మాలచ్చిమండి. :)
      ధన్యవాదాలు.

      Delete
  3. హేమిటో శర్మగారు, ఆ రోజుల్లో చదువుకు ఎగనామం పెట్టి “అడ్డగాడిదలాగా” తిరిగున్నట్లయితే …. తరువాత ఎంచక్కా గాడిదలు కాచుకునుండచ్చు కదా అని విచారం కలుగుతోంది. సంపాదనతో కూడిన కాలక్షేపం ఉండేది కదా 😧😧. ప్చ్ ప్చ్.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      గాడిదల్ని కాయడం తేలిగ్గాలేదండి, వాటి వెనకే తిరిగి అవి ఎప్పుడు ఉచ్చపోస్తే అప్పుడు పట్టుకోవాలండి, లేకపోతే ఖరీదైన మూత్రం నేలపాలే :)
      నేటి రోజుల్లో గాడిదలు కాయడమే లాభసాటి, ఒక టెకీ ఉద్యోగం మానేసి కూరలు పండించి అమ్ముతోంది, మరో టెకీ ఉద్యోగం మానేసి వ్యవసాయం మొదలెట్టేడు.
      డిఫరెంట్ గా ఆలోచించండి. :)
      పెద్ద వయసైపోయిందా మీకు గిని :)

      Delete
  4. గంగి గోవు పాలు కన్నా, ఖరము పాలే విలువన్న మాట..

    ReplyDelete
    Replies
    1. బోనగిరి సారూ!
      అన్నమాట కాదు సార్! ఉన్నమాటే :)
      గోవుపాలు లీటరు 75 ఐతే గాడిదపాలు లీటరు 7500 అంటే వందరెట్లు ఖరీదు కదా అదీగాక

      "దేశేదేశే కళత్రాని
      దేశేదేశే మిత్రబాంధవా....."
      ఏ దేశంలోనైనా పెళ్ళాం దొరుకుతుంది, బంధువులు, మిత్రులూ దొరుకుతారు కాని తమ్ముడు దొరకడు కదురా లచ్చన్నా అని ఏడిచాడు, రాముడు. లచ్చన్న మూర్ఛపోయినపుడు. అలా ఏ వూళ్ళో నైనా ఆవుపాలు దొరుకుతాయి మరి గాడిదపాలు దొరకవు కదండీ! అందుకే విలువైనవి కదా! :)

      Delete
    2. దేశేదేశే కళత్రాణి
      దేశేదేశే చ బాంధవాః
      తం తు దేశం న పశ్యామి
      యత్ర భ్రాతా సహోదరః
      శ్రీరామ ఉవాచ
      శ్రిమద్రామాయణం యుద్ధకాండ, 102 సర్గ.౧13

      Delete