Thursday 1 September 2022

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)


భయపడి వరాలిచ్చాడు.

ఎవరికి భయపడ్డాడు?

ముగ్గురు, ఆ ఇంటికోడళ్ళకి.

ఎవరువారు?

1.గాంధారి.2.ద్రౌపది.3.కుంతి.

ఎందుకుభయపడ్డాడు

గాంధారి:- ఈమె ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. తన ఎదురుగా, కొడుకు వదినగారిని కొప్పు పట్టి లాక్కుపోతుంటే మాటాడలేక అసహాయంగా ఉండిపోయినది.ఆమె మనసు కుతకుతలాడింది, జరుగుతున్న అన్యాయానికి.జూదం మాటెలావున్నా ఇంటికోడలికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయింది. అందుకే తనకొడుకులు నీచప్రవర్తన మరెంతకు దిగజారిపోతుందో, కర్ణుని సావాసంలోనని, బయలుదేరి విదురునితో కలిసి ధృతరాష్ట్రునికి సభలో జరుగుతున్నది చెప్పింది. ఆమెకు పుత్ర ప్రేమలేకపోలేదు కాని ధర్మం మీద కూడా ప్రేమ ఉంది. 

తార్కాణం:- యుద్ధానికి వెళుతూ తల్లిదగ్గరకొచ్చి నమస్కారం చేశాడు దుర్యోధనుడు, అపుడామె ’జయోస్తు’ ని దీవించలేదు, ’యతో ధర్మస్తతో జయః’ ఎటు ధర్మం ఉంటే అటు జయం కలుగుతుందని దీవించింది. అంటే దుర్యోధనుని పక్క ధర్మం లేదనేగా! తన కొడుకు పక్క ధర్మం ఉండి ఉంటే జయోస్తు అనే దీవించేది. మరో మాట కూడా. యుద్ధం అయిపోయింది యుద్ధరంగంలో చనిపోయిన వారిని చూస్తూ, దుర్యోధనుని శవాన్ని చూసి మళ్ళీ తన దీవెన గుర్తుచేసుకుని, నాడు సభలో చేసిన అకృత్యానికి ఫలితం అనుభవిచావా కొడకా అని ఏడ్చింది. 

ఈ అగ్నిపర్వతాన్ని చలార్చకపోతే మొదలుకే మోసం రావచ్చని భయపడ్డాడు. 


గాంధారి సభలో జరిగినది చెప్పిన తరవాత ప్రమాదాన్ని పసికట్టిన ధృతరాష్ట్రుడు కి జ్ఞాననాడి కదిలి నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.   


ద్రౌపది:- ఈమె ప్రత్యక్షంగా అవమానానికి గురైనది, బద్దలైన అగ్నిపర్వతం, ఏ క్షణాన ఐనా లావా వెదజల్లచ్చు, అప్పుడు బాధపడి లాభం లేదు. ఆమె పట్ల కొడుకులు తప్పుజేసేరు. సభలో నేను దాసినా? అని అరిచింది తప్ప మరోమాట మాటాడలేదు.భార్య మానాన్ని కాపాడలేని నువ్వు మగాడివా? అని ఒక్క ప్రశ్న భీముని కనక వేసి ఉంటే!.... ఆమెగనక భీముని రెచ్చగొట్టి ఉంటే, ఆనాడు ఆ సభలో పీనుగులే ఉండేవి. ఈ అగ్ని పర్వతాన్ని ముందుగా చల్లబరచాలి, అనుకున్నాడు, భయపడ్డాడు

కుంతి:- ఈమె నివురుగప్పిన నిప్పు. గాలి ఊదితే చాలు మండిపోతుంది. ఈమె ఒక్క మాట కనక అంటే, ధర్మరాజుకు కబురంపితే, కోడలికి అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా? అని ఒక్క మాటంటే, అక్కడే కురుక్షేత్రం జరిగిపోయేది, అందుకు భయపడ్డాడు.


ఇంతేగాక ఆ రోజు సభలో కూడా ఎక్కువమంది జూదంలో జరిగినదానికంటే ద్రౌపది పరాభవానికే మండిపోయారు, అందుకు వెనక్కి జంకి నష్టనివారణ చర్యగా ద్రౌపదిని పిలిచి నువ్వు నాకోడళ్ళందరిలో ఎన్నదగినదానివని పొగిడేడు. ఆ తరవాత వరం కోరమన్నాడు, ఆమె ధర్మరాజు దాస్య విముక్తి అడిగింది, మరోవరమిస్తానన్నాడు, అప్పుడు మిగిలిన భర్తల దాస్య విముక్తి అడిగింది. ధృతరాష్ట్రుడు నిరాశపొందాడు, ఆమె రాజ్యం అడుగుతుందనుకున్నాడు,ఆమె అడగలేదు, అందుకు పాండవులందరిని పిలిచి రాజ్యం ఇచ్చి,అప్పటికి ఆ ఆపద నుంచి గట్టెక్కేడు. ఆ తరవాత జరిగిన అనుద్యూతానికి ఒప్పుకున్నాడు, కొడుకు చెప్పిన కారణాలకి.అసలు పాండవులను అడవులపాలుజేసి రాజ్యం కొడుక్కి కట్టబెట్టాలన్న ఆలోచన ధృతరాష్ట్రునిదే, దానికి తోడు దుర్యోధనుని అత్యాశ తోడయిందంతే! 

 స్వస్తి.



7 comments:

  1. విన్నకోటవారు,
    ధన్యవాదాలు.

    ReplyDelete
  2. నేను ముందే చెప్పలే? గాంధారి చీపురు తిరగేస్తుందని భయం. కుంతీ ద్రౌపదీ ఏమీ చేయకపోయినా గాంధారి చీపురు తిరగేయడం గారంటీ. అది అప్పుడు తలరాత అవుతుంది - అదే హెడ్ లైన్ న్యూస్. దాన్ని బట్టి ఓ జాతక చక్రం, శని వక్రించడం, కుజదోషం, అవన్నీ అంటుకోని కృష్ణుడు వెనకనుంచి [పగలబడి] నవ్వుకోవడం అన్నీ జరుగుతై. ఆయన చక్రం అడ్డేసి వీళ్ల పని పడతాడు. ఆ తర్వాత మనం మనం - చక్రం రమ్మంటె రాదురా సెలియా, సారంగ దరియా అని పాడుకోవడమే. లేకపోతే బాస్ ఈజ్ బేక్, నా మనసే ఎక్కేస్తుందే రైలు పట్టాలూ, ఉండనంటున్నాయే చొక్కా బొత్తాలూ అని ఐటం సాంగూ, సింహంతో సెల్ఫీలు. మళ్ళీ అడుగుతారని ముందే నేను చెప్పేస్తున్నా. :-)

    ReplyDelete
    Replies
    1. SDగారు,
      సగం చెప్పి వదిలేశారుగా!అదుకే నేను మళ్ళీ చెప్పాల్సి వచ్చింది.
      మనలో మాట :) ఏమనుకోవద్దూ :)
      తెనుగు సినిమా ఫీల్డులో డైరెక్టరుగా ప్రయత్నించరాదూ :)

      Delete
    2. ఎందుకండీ అనుకోవడం. మీరిచ్చింది కాంప్లిమెంటే. నేను సిన్మా తీద్దారనే అనుకుంటన్నా. జీరో ఒకడూ, జీరోయిన్ మరొకరూ కావాలి. అందులో సాఫ్ట్ వేర్ ఇంజీర్లై ఉండాలి. కట్ చేస్తే వైజాగ్ బీచ్చి, కట్ చేస్తే నంది అవార్డు, కాట్ మళ్ళీ - న్యూయారుకులో ఐటం సాంగు. మళ్ళీ కాట్ - నా డైరక్టర్ జీవితం కాట్ :-) సారంగ పత్రికలో ఈ పదిహెనో తారీఖుకి ఓ వ్యాసం వస్తోంది దీనిమీదే. వేచి చూడండి. పదిహేను ఏటహే అంటున్నారా? పదిహేనుకు కుజుడు గడి మారుతున్నాడు. బృహస్పతి నా గడిలోకి వచ్చి తన్నడానికి సిద్ధంగా ఉన్నాడు మరి. ఇంతకీ బొమ్మ పేరు చెప్పలేదు కదూ - "జీక" - అంటే జీబ్రా మేకా కలిస్తే బతికి బట్టకట్టేది. కాసుకోండి మరి.

      Delete

    3. SDగారు,
      అమ్మో! మీది హాలీవుడ్డు లెవలని తెలుసుకోలేకపోతినే :)

      Delete
  3. hari.S.babu
    Sep 8, 2022, 8:36 PM (12 hours ago)
    to me

    hari.S.babu has left a new comment on your post ' ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)':

    పెద్దలు చాలామందే ఉన్నారు గానీ అసలు విషయం పట్టుకోలేదు - చనువు వల్లనే ఇలా హాస్యం ఆడుతున్నాను,ఏమనుకోకండి!

    నేనిప్పుడు చెప్పిన పాయింటు కధలోలో ఉన్నదే - ఉషశ్రీ అనువాదం చదివితే తెలుస్తుంది.

    మహాభారత యుధ్ధం తప్పనిసరిగా జరగడానికి డృతరాష్ట్రుడి పుత్రవాత్సల్యమే మొదటిదైనప్పటికీ బలహీనమైన కారణం.

    //అంధత్వం వల్ల నేను రాజును కాలెకపోయాను.//

    నా తర్వాత నువ్వు రాజువి కావదానికి నువ్వు ఏ ప్రయత్నం చేసినా నావంతు సహకారం ఇస్తాను అని ధృతరాష్టుడు హామీ ఇచ్చిన తర్వాతనే భీముడికి విషం పెట్టటం,లాక్షాగృహదహనం లాంటివి మొదలయ్యాయి.లాక్షాగృహదహనం తర్వాత పాందవులు కొన్ని యేళ్ళ పాటు ప్రఛ్చన్నంగా ఉండిపోయారు.అందరూ పాండవులు చచ్చిపోయారనే అనుకున్నారు.ద్రౌపదీ స్వయంవరం జరగకపోయి ఉంటే కధ ఎలా మలుపు తిరిగేది?ఆలోచించండి!

    మహాభారత యుధ్ధం తప్పనిసరిగా జరగడానికి ద్రోణాచార్యుడికి ద్రుపదుడి మీద ఉన్న ద్వేషం రెండవదైనప్పటికీ అతి బలమైన కారణం.దరిద్రంలో ఉండి అడిగినప్పుడు సహాయం చెయ్యలేదనే కసి ఆ దరిద్రం తొలగిపోయిన తర్వత కూడా చూపించి ద్రుపదుణ్ణి అవమానించటం ద్రోణాచార్యుడి దుష్టబుధ్ధియే తప్ప మరొకటి కాదు.ద్రుపదుడు ఆశ్రితపక్షపాతం అనే నిందకు భయపడి సహాయం నిరాకరించే అవకాశం కూడా ఉంది.దాన్ని గురించి ఆలోచించి సర్దుకోలేకపోవటం ద్రోణుడి మూర్ఖత్వం.అదీ గాక తంతే గారెల బుట్టలో పడ్డట్టు అప్పటి లెక్కలో చూస్తే చిన్న రాజ్యంలో కొలువు తప్పి పేద్ద రాజ్యంలో కొలువు వచ్చింది కదా,అంతా మన మంచికే అని సర్దుకుపోక తన శిష్యులకి తన పాత పగలను తీర్చే స్వకార్యం అప్పగించి మీసాలు మెలెయ్యడం ఖచ్చితంగా క్రూరస్వభావమే!

    మనం భ్రమపడుతున్న తండ్రీకొడుకుల పాండవ పక్షపాతం అంతా దుర్యోధనుడు కోటరీలో తమని చేర్చుకోలేదన్న దుగ్ధనించి పుట్టిందే.పాండవుల మీద ఏమాత్రపు అభిమానం ఉన్నా ద్రోణుడు అభిమన్యుణ్ణి అలా చంపించేవాడు కాదు,అశవధ్ధామ ఉపపాండవుల్ని అలా చంపేవాడు కాదు.

    సరే, ఈ ద్రోణుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని మొదట ఒక కొడుకుని పొందాక కూడా అర్జునపత్ని కావాలనే లక్ష్యంతో యాజ్ఞసేనిని ఎందుకు పొందాడు ద్రుపదుడు?ధృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి చంపాలంటే కౌరవులతో ఎదిరిపక్షంలో ఉండి యుధ్ధం చెయ్యాలి.ద్రుపదుడి చిన్న రాజ్యం హస్తినాపురం అనే పెద్ద రాజ్యం మీద యుధ్ధానికి వెళ్ళదం కుదరదు కాబట్టి పాండవులతో వియ్యమందితే పాండవుల తరపున నిలబడి ద్రోణుణ్ణి సంహరించవచ్చును.మత్స్యయంత్రాన్ని వరపరీక్షగా పెట్టింది అర్జును డొక్కడే మత్స్యయంత్రాన్ని భేదించగలడనే విషయం తెలుసు గనకనే.

    శ్రీకృష్ణుడు రాయబారం వెళ్ళినప్పుడు వాళ్ళు శ్రీకృష్ణుణ్ణి ఖైదు చేద్దామని ఆలోచిస్తున్నారని తెలిసి ధృతరాష్ట్రుడు గజగజ వణికిపోయాడు.అప్పుడు తల్లి చెప్తే అయినా వింటాడని పిలిస్తే వచ్చిన గాంధారి దుర్యోధనుడికి కుండబద్దలు కొట్టి చెప్పింది - "యుధ్ధంలో నువ్వు పాండవుల్ని గెలవలేవు.ధర్మరాజు మీద వైరం నీకే ప్రమాదకరం." అని.మొదటిసారి తనని సలహా అడిగినప్పుడు శకుని కూడా అల్లుడి మేలు కోరి ఇదే మాట చెప్పాడు.దుర్యోర్ధనుడికి నచ్చక అది కాదు ఇంకోటి చెప్పమంటే కూటనీతి గురించి చెప్పాడు - వీడు లటక్కన పట్టేసుకున్నాడు,కుక్కచావు చచ్చాడు.

    యుధ్ధం మొదలయ్యాక కూడా భీష్ముడూ ద్రోణుడూ పాండవసైన్యం మొత్తాన్నీ సంహరించడానికి నెల రోజులు చాలన్నారు.అదే ఇద్దరూ అటువైపున అర్జునుడు ఉన్నాడు కాబట్టి రూఢిగా చెప్పలేం అని కూడా అన్నారు.ఆడవాళ్ళ కోపతాపాల కన్న భీమార్జునుల పరాక్రమమే ధృతరాష్ట్రుణ్ణి ఎక్కువ భయపెట్టింది అనేది నా తీర్పు.

    జై శ్రీ రాం!

    Reply
    హరిబాబుగారు!

    మీ వ్యాఖ్యను పూర్తిగా ప్రచురించటం లేదు. ఇతరులగురించి నా బ్లాగులో వ్యాఖ్యానించటం నచ్చదు, ఏమనుకోవద్దూ :)

    మీరు మేధావి(ట) జిలేబీ చెప్పింది, ఒప్పేసుకున్నాగా :)

    ఇంతతో ఈ చర్చ ముగిస్తున్నాను.

    ReplyDelete