కాటరాక్ట్ ఆపరేషన్
సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇది పెద్దలమాట. కాని బాగా అశ్రద్ధ చేయబడేదీ కన్నే!
నేటి రోజుల్లో ముఫై ఏళ్ళకే సుగర్ వ్యాధి కలుగుతోంది, దీని వల్ల వచ్చే అవకరాల్లో కాటరాక్ట్ ఒకటి. ఇది నెమ్మదిగా సంవత్సరాల తరబడి పెరుగుతుంది, నెమ్మదిగా దృష్టిని అడ్డుకుంటుంది. ఒకసారి కాటరాక్ట్ అని తేలితే ఆపరేషన్ తప్పదు, నేడో !రేపో!నాకు ఆరేళ్ళగా ఉన్నట్టు తెలిసింది,కాని అశ్రద్ధ చేసేను, కారణాలనేకం, అందులో భయం ముఖ్యమైనది.
నా అనుభవాలు రాస్తున్నా!
ఒకసారి ఆపరేషన్ కి నిర్ణయించుకున్న తరవాత డాక్టర్ గారితో తారీకు నిర్ణయం చేసుకున్నా! నిర్ణయమైన తారీకుకు ముందు నాలుగు రోజులు కంటిలో మందు చుక్కలు రోజూ నాలుగు సార్లు వేసుకోమన్నారు. రోజుకొక కాప్శూల్ వేసుకుని నాలుగో రోజు మూడు గంటలకి రమ్మన్నారు. అలాచేసి నాలుగో రోజు మధ్యాహ్నం మూడుకు చేరేం.ఒక రూం ఇచ్చారు. విశ్రాంతి తీసుకున్నా, ఆ తరవాత బి.పి,సుగర్,కారోనా టెస్టులయ్యాయి. వాటి ఫలితాలు చూసి కంటికి పరీక్ష చేసి అన్నీ బాగున్నాయి రేపు ఉదయం ఆరుగంటలి రండి, రోజూ వేసుకునే మందులు సమయం ప్రకారం వేసుకోండి, టిఫిన్ సమయానికి చేయండి. అని చెప్పి ఇంటి కెళ్ళి మరునాడు ఉదయమే రమ్మన్నారు.(లోకల్ కనక) ఆపరేషన్ లో ఉపయోగించే ఐ.ఒ.ఎల్ కొనమని రాసిచ్చారు, దాని ఖరీదు పదివేలు,అక్కడే పక్కన కొన్నాం.
మరునాడు ఉదయమే స్నానం అన్నీ పూర్తి చేసుకుని రోజువారీ మందులేసుని టిఫిన్ చేసి ఉదయం ఆరుకి రూంలో చేరాం.ఏడుకి కంటిలో మందు వేసింది, నర్సు.ఎనిమిది తరవాత ఆపరేషన్ చెప్పింది.కంటి రెప్పలపై ఉన్న వెంట్రుకలు తొలగించింది.ఎనిమిదికి ఆపరేషన్ థియేటర్ ఎదురుగా ఉన్న సీనియర్ సర్జన్ రూంలో కూచో బెట్టేరు. నాకు ముందు ఒకరున్నారు.ఎనిమిదికి సీనియర్ సర్జన్ మళ్ళీ టెస్ట్ చేశారు, ఒకె ముందుకెళ్ళమంటే నా ముందున్నతన్ని ఆపరేషన్ కి తీసుకెళ్ళారు.
ఆ తరవాత పది నిమిషాల్లో నాకు పిలుపొచ్చింది. ఒక నర్స్ నన్ను డిసానిజేషన్ రూంలోంచి నడిపించి తీసుకెళ్ళింది. మరో సానిటజెడ్ వరండాలో పీట మీద కూచోమంది.నాకు రెండు మాత్రలిచ్చి వేసుకోమంది. వేసుకున్నా! ఐదు నిమిషాల్లో కొద్దిగా మత్తనిపించింది,(ముందుగానే నాకు ఆపరేషన్ భయం ఎక్కువని, ఆతృతరోగం ఉందని, వినపడదని,రాసిచ్చి విన్నవించుకున్నా, డాక్టర్ గారికి.)
చిత్రంగా నాలో భయం,ఆలోచన ఏమీలేని శూన్యస్థితి ఏర్పడింది.కుడికాలుపెట్టి థియేటర్ లో అడుగుపెట్టా. నన్ను నర్స్ ఆపరేషన్ టేబుల్ దగ్గరకి నడిపించింది. టేబుల్ మీద పడుకోమన్నారు. టేబుల్ మీద బుట్టలా ఉన్నచోట తలపెట్టి పడుకున్నా. కంటిలో మందు చుక్కలేశారు, కళ్ళమీద గుడ్డలాటిది వేశారు, కళ్ళు కనపడుతున్నాయి.కంటి పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పిగా అనిపించి అబ్బా అన్నా! చేతులు పక్కన పెట్టుకోండన్నారు,ఈ లోగా కంటి మీద లేజర్ ఫోకస్ చేశారు, ఒక బొమ్మ కనపడింది,(ఈ బొమ్మ కితంరోజు సాయంత్రం టెస్ట్ చేసినప్పుడు కనపడింది)మరుక్షణం లేజర్ తొలగించారు, ఏమీ కనపడలేదు, మరుక్షణం ఏదో పెట్టినట్టయింది, కన్ను కనపడింది.మందు చుక్కలేశారు. దూది ఉండ కంటి మీద పెట్టి టేప్ వేశారు నిలువుగా అడ్డంగా కదలకుండా.( దీనికి తీసుకున్న సమయం పది నిమిషాల లోపు ఉండి ఉంటుందని ఊహించా)కొంచం పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పి ఉంది. లేవమన్నారు, నర్స్ నన్ను థియేటర్ నుంచి నడిపించి తీసుకొచ్చి మా వాళ్ళకి అప్పజెప్పింది.
నన్ను రూం కి తీసుకెళ్ళి పడుకోమన్నారు. టైం ఎంతన్నా! తొమ్మిది దాటిందన్నారు. మరి కాసేపటిలో ఇంటికెళ్ళిపోమన్నారు, మర్నాడు ఉదయం రమ్మన్నారు. విశ్రాంతి తీసుకోమన్నారు, రాత్రికి నిద్ర పట్టదేమో అని సంశయం చెప్పా,నిద్ర పడుతుందని చెప్పేరు.లిఫ్ట్ లో కిందకి తీసుకొచ్చారు. ఆటోలో ఇంటికొచ్చాం! పదయింది. ఆటో వాళ్ళకి అలవాటనుకుంటా ఎవరూ చెప్పకనే నెమ్మదిగా గతుకుల రోడ్ లో తీసుకొచ్చాడు.ఇంట్లో విశ్రాంతి తీసుకున్నా, మామూలుగా భోజనం చేసాను.సాయంత్రానికి కంటి నొప్పీ తగ్గింది, హాయిగా నిద్ర పట్టింది.
మర్నాడు ఉదయం ముఖాన్ని తడి దూదితో తుడుచుకున్నా! స్నానం మామూలుగా చేసాను.హాస్పిటల్ కి చేరాం. నాలాటివారు మరో పది మంది, ఒక హాల్ లో కూచున్నాం,నర్స్ లు కంటి కట్టు తీసేశారు.కంట్లో మందు చుక్కలేశారు, కన్ను కనపడుతోంది.కళ్ళు మూసుకు కూచున్నా! ఈ లోగా నల్లకళ్ళజోడిచ్చి పెట్టుకుని చూడచ్చన్నారు. నల్ల కళ్ళజోడులోంచి లోకం అందంగా కనపడింది.
ఆనందమానందమాయె!మరి ఆశల నందనమాయె! మాటలు చాలని చోట పాటగ మారిన మాయే!
డాక్టర్ పరీక్ష చేశారు, బాగుందన్నారు. ఈ కింది జాగ్రత్తలూ తీసుకుంటూ నల్లకళ్ళజోడు వాడుతూ ఇరవైరోజుల తర్వాత రమ్మన్నారు.
నాకు తోచినది ముఖ్యంగా కంటికి శ్రమ వద్దు.ఇన్ఫెక్షన్ కి దూరంగాఉండాలి.ఎక్కువ వెలుగు చూడద్దు.హాస్పిటల్ నుంచి ఇంటి కొచ్చాకా మొదటిరోజు ఇంట్లో కూడా నల్ల కళ్ళజోడు పెట్టుకున్నా, మర్నాటి నుంచి బయటికెళ్ళినప్పుడు మాత్రం నల్ల కళ్ళజోడు వాడేను.మొదటి మూడు రోజులూ దూదితో కళ్ళు ముఖం శుభ్రం చేసున్నా. నాలుగో రోజునుంచి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కున్నా. ఇరవైరోజుల తరవాత షాంపూతో తలంటుకున్నా! క్షవరం చేయించుకున్నా. గడ్డం మామూలుగానే చేసుకున్నా. టివి.ఫోన్ వగైరాలన్నీ ఇరవై రోజులు వదిలేశా.మొదటి పది రోజులు బాగుందిగాని తరవాత కాలం గడవడం కష్టం అనిపించింది. ధ్యానం చేయడం నేర్చుకున్నా. కాలం గడచిపోయింది, తెలియకనే.ఇక అవసరమైన మైల్స్,మెసేజిలకి రోజూ మనవరాలు సాయంత్రం ఒక గంట సాయపడేది. సమాధానాలివ్వవలసిన చోట నేను చెప్పినట్టు టైప్ చేసి పంపేది, అలా గడిపేశా.
ఇరవైరోజుల తరవాత హాస్పిటల్ కి వెళ్ళా. రెండు కళ్ళు టెస్ట్ చేశారు. కళ్ళ జోడు రాసిచ్చారు.ఇరవై రోజుల తరవాత వెళ్ళినపుడు ఒక చుక్కల మందు రాసిచ్చారు. అది రోజు ఆపరేషన్ ఐన కంటిలో ఒక చుక్క ఉదయం సాయంత్రం వేయమన్నారు, అది వచ్చినంత కాలం, వేసుకుంటున్నా! రేపో, మాపో ఐపోతుంది. మూడో రోజు కళ్ళ జోడుతో జీవితం గాటిలో పడింది.రెండు కళ్ళకి జోడి కుదరడానికి కొంత కాలం పడుతుంది. ఆపరేషన్ కన్ను చురుగ్గాను, అప్పటిదాక పని చేసిన కన్ను మందంగా ఉంటాయి.మొదటి మూడు రోజులు నడక మానేశా. ఆ తరవాత నడిచాను. ఆపరేషన్ ఐన రోజునుంచి యోగా మానేశాను. ఆరు వారాల తరవాత మొదలెట్టాను.
Total cost of operation.Rs24,500.
I.O.L 10,000.
Doctor fees 10,000
Medicines 2,200
Transport 3days 300
karona test 500
Spectacles 1500
|
డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు.
|
| | | | | | |