Saturday 5 October 2024

ఖరము పాలు

 ఖరము పాలు


గంగిగోవు పాలు గరిటెడైనను చాలు

కడివెడైననేమి ఖరము పాలు

భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు

విశ్వదాభిరామ వినుర వేమ.


ఆవుపాలు గరిటెడైనా చాలు. గాడిదపాలు కడివెడైనా ఉపయోగం లేదు. భక్తిగా పట్టెడు మెతుకులు పెట్టినా చాలు అంటున్నారు, తాతగారు.


చాలా పాతకాలంవాడు కదా అందుకలా అనేసారు. తాత ఆవుని గొప్పచేసి గాడిదను చులకన చేసేరు. నేటికాలంలో గరిటెడు ఆవుపాలు ఎందుకూ పనికిరావు! కడివెడు గాడిద పాలు అమ్ముకుంటే లక్ష రూపాయల పైమాటే. భక్తెవడికి కావాలి కడుపు నిండాలిగాని. తాతగారికి క్షమాపణలతో పేరడీ పద్యం.


గంగిగోవుపాలు గరిటెడైన నేలపాలు

కడివెడైన ఖరముపాలు లక్షవిలువ

కడుపునిండు కూడు  ఎంగిలైననేమి 

విశ్వదాభిరామ వినుర వేమ


గాడిద పాలతో సబ్బు తయారు చేసిందో టెకీ. నెమ్మదిగా మార్కెట్ చేసింది. ఇప్పుడా సబ్బు హాట్ కేక్ లా అమ్ముడుపోతోంది. ఇంటర్ నేషనల్ మార్కెట్ ఎక్కేసింది.సామాన్యులకి దొరకడమే లేదు.


 గాడిద వెన్న అతిమెత్తగా,సుతిమెత్తగా ఉంటుంది. గాడిదవెన్న కెజి. రెండు లక్షలు ఐదేళ్ళకితం మాట. ఇప్పుడెంతో తెలీదు.లీటర్ గాడిదపాలు ఎనిమిది వేలు.  లేడీ ఫైర్ నెస్స్ క్రీమ్ లన్నీ గాడిదవెన్నతోనే తయారు చేయబడతాయి.  

గాడిదల్ని పెంచండి కోటీశ్వరులు కండి అని చెపితే నన్ను ఎగతాళీ చేసేరు. ఇప్పుడు ఆడగాడిదలే దొరకటం లేదు, కంచరగాడిదలు కూడా, వాటికంత డిమాండ్ ఏర్పడింది. కాలమండీ బాబూ కాలం.


గాడిదలకీ జై


Tuesday 1 October 2024

ఎవరు వృద్ధులు?

 ఎవరు వృద్ధులు?

చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు.  అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి. 


దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే  పావురాల రాజు, ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి పావురాల రాజు,  ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే 

1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడదు.
2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.
3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.
4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.
5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో రాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.
6.   పావురాల రాజు బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా పావురాల రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.
7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.

వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.

జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము. 

ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.  
అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.
కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.