Saturday 5 October 2024

ఖరము పాలు

 ఖరము పాలు


గంగిగోవు పాలు గరిటెడైనను చాలు

కడివెడైననేమి ఖరము పాలు

భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు

విశ్వదాభిరామ వినుర వేమ.


ఆవుపాలు గరిటెడైనా చాలు. గాడిదపాలు కడివెడైనా ఉపయోగం లేదు. భక్తిగా పట్టెడు మెతుకులు పెట్టినా చాలు అంటున్నారు, తాతగారు.


చాలా పాతకాలంవాడు కదా అందుకలా అనేసారు. తాత ఆవుని గొప్పచేసి గాడిదను చులకన చేసేరు. నేటికాలంలో గరిటెడు ఆవుపాలు ఎందుకూ పనికిరావు! కడివెడు గాడిద పాలు అమ్ముకుంటే లక్ష రూపాయల పైమాటే. భక్తెవడికి కావాలి కడుపు నిండాలిగాని. తాతగారికి క్షమాపణలతో పేరడీ పద్యం.


గంగిగోవుపాలు గరిటెడైన నేలపాలు

కడివెడైన ఖరముపాలు లక్షవిలువ

కడుపునిండు కూడు  ఎంగిలైననేమి 

విశ్వదాభిరామ వినుర వేమ


గాడిద పాలతో సబ్బు తయారు చేసిందో టెకీ. నెమ్మదిగా మార్కెట్ చేసింది. ఇప్పుడా సబ్బు హాట్ కేక్ లా అమ్ముడుపోతోంది. ఇంటర్ నేషనల్ మార్కెట్ ఎక్కేసింది.సామాన్యులకి దొరకడమే లేదు.


 గాడిద వెన్న అతిమెత్తగా,సుతిమెత్తగా ఉంటుంది. గాడిదవెన్న కెజి. రెండు లక్షలు ఐదేళ్ళకితం మాట. ఇప్పుడెంతో తెలీదు.లీటర్ గాడిదపాలు ఎనిమిది వేలు.  లేడీ ఫైర్ నెస్స్ క్రీమ్ లన్నీ గాడిదవెన్నతోనే తయారు చేయబడతాయి.  

గాడిదల్ని పెంచండి కోటీశ్వరులు కండి అని చెపితే నన్ను ఎగతాళీ చేసేరు. ఇప్పుడు ఆడగాడిదలే దొరకటం లేదు, కంచరగాడిదలు కూడా, వాటికంత డిమాండ్ ఏర్పడింది. కాలమండీ బాబూ కాలం.


గాడిదలకీ జై


1 comment:

  1. గాడిదైనా కొనకపోతిని
    డబ్బు మూటలు దక్కగా
    …….. ……..

    గాడిదపాలు అంత శ్రేష్ఠమైనవని సైంటిఫిక్ ఋజువేమన్నా ఉందా, శర్మ గారు లేక మార్కెటింగ్ పుకార్లేనా?

    అవునూ సబ్బు కాక, అసలు గాడిదపాల వ్యాపారమే ఇంకా కార్పొ’రెట్ట’ల హస్తగతమవలేదా 🤔?

    ReplyDelete