Wednesday 16 October 2024

కొత్తకారు,కొత్తపెళ్ళాం 😁

 కొత్తకారు,కొత్తపెళ్ళాం😁


"కొత్తకారు,కొత్తపెళ్ళాం కొత్తలో ఇబ్బంది పెడతాయి తమ్ముడూ! నెట్టు,నెట్టూ" అన్నాడు మా ఎన్టీవోడు, గుండమ్మకతలోనేమో!!.


కొత్తకారా! బలేటోరే!! జీవితంలో కారెక్కిందే ఏ రెండు మూడు సార్లో,"సేవలందుటెకాని సేవించుటెరుగని" జీవితం కాదు, "సేవించుటేగాని సేవలందుటెరుగని" జీవితం, ఇలా కానిద్దురూ! ఆముచ్చటెందుకులేండి,ఇప్పుడు. 


కొత్తపెళ్ళాం ముచ్చటా! అప్పడాలూ లేదు, వడియాలూ లేదు. అప్పడాలు ఏభైయారేళ్ళు నేనుగనక నీతో కాపరంజేసేను, మరొకతైతే మూడో నిద్దరరోజే,  నెత్తిన చేటగొట్టి

  వదిలేసి పోయేదనుకుందో  ఏమోగాని,ఆరేళ్ళకితం దేవుడిదగ్గరకెళ్ళిపోయింది.  వడియాలా బలే! బలే!! ఒకప్పుడు సైన్యంలో పనిచేసేవారికి పిల్లనిచ్చేవారు కాదు. ఆతరవాతది పూజారులకూ, పురోహితలకూ పాకింది, నేడు టెకీలకీ పిల్లనిచ్చేవాడు కనపట్టం లేదు, నాకెక్కడబాబూ! ఐనా వడియాలుతో వేగే ఓపికలేదండోయ్! ఎవరూ కష్టపడి సంబంధం చూడద్దు సుమా!!!!


మరి ఈ ముచ్చట, ఇప్పుడెందుకనికదా కొచ్చను?

ఇరవైఏళ్ళకితం తప్పిపోతానని ఒక పంపురాయి జేబులో పడేసేరు, అలామొదలయింది,నాఫోన్ జీవితం. దాంతో ఒక ఐదేళ్ళు నడిపేను. ఓ రోజు పుట్టినరోజని మరో కొత్తఫోన్ చేతిలోపెట్టేరు, పదేళ్ళకితం, చిన్నబ్బాయి,కోడలు, దాంతో గడుస్తోంది కాలం. మొన్న విజయదశమి రోజు మరో కొత్తఫోన్ తెచ్చి పుట్టినరోజు బహుమతని, చిన్నకోడలూ,అబ్బాయి ఫోన్ చేతిలో పెట్టి పాతది తీసేసేరు,  ఇది స్లో ఐపోయింది, కొత్తదిబాగుంటుందని.   ఎప్పుడో మరచిపోయిన రెండో పుట్టినరోజును గుర్తుచేస్తూ!


  మూడునిద్దరలయినా కొత్తగానే ఉంది,కొత్తఫోన్ తో. సంసారంలో ఏదెక్కడందో కొత్తే,ప్రతిసారి వెతుక్కోడమే!  ప్రతిసారి పిల్లలని అడిగితే చిరాకు పడతారేమోనని భయం. ఏది నొక్కితే ఏమవుతుందోననీ భయమే! అంతేకాదు, ఇబ్బందుంటే పిల్లలకి చెబితే ఏమంటారో? మరో భయం. చెప్పింది గుర్తుండి చావటం లేదు, ఎలా? నాటిరోజులకి సెల్ ఫోన్ వాడుకలోకి రాలేదు గనక మా ఎన్టీవోడు దాన్ని చెప్పుండడు, లేకపోతే దీన్నీ చెప్పీవోడేనేమో. కొత్తఫోన్ కు అలవాటు పడ్డానికి సమయం పట్టుద్దా!లొంగుబాటుకొస్తదా? కొచ్చను? 


సెల్ తోనే వేగలేకుంటే డెస్క్ టాప్ మార్చేసేరు, విండోస్ ఎప్పటిదో ఉంది అంటూ, ఎలాబాబూ అలవాటు పడ్డం. ఇదీ కొచ్చనే? అంతా కొత్తబాబూ, కొత్త,కొత్త,కొత్త......... 

1 comment:

  1. కొత్త కొట్టు(డు) బావుంది :)


    ReplyDelete