Tuesday 9 April 2024

ఉగాది శుభకామనలు

 క్రోధి నామ సంవత్సర ఉగాది శుభకామనలు

చిగురేసె మొగ్గేసే సొగసంతా పూతపూసె ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరిపాపా ఎన్నాళ్ళు దాస్తావేమి అన్నాడట సినీకవి . ఈ సంవత్సరం పూతలేదు కాపు లేదు,చిగురొచ్చేసింది చెట్టునిండా, 
 కాపు మళ్ళీ సంవత్సరానికి వాయిదా వేస్తూ!!!


ఇంత చిగురులోనూ రెండు కాయలు కనపడ్డాయి,చిత్రమే బహుచిత్రమే అంటూ!!!


చైత్ర వైశాఖమాసమౌలు-వసంత ఋతువు-- చెట్లు చిగిర్చి పూలు పూయును,కాయలు కాయును.


జ్యేష్ట ఆషాఢ మాసములు- గ్రీష్మ ఋతువు--ఎండలు మెండుగా కాయును.


శ్రావణ భాద్రపద మాసములు- వర్ష ఋతువు-వానలు ఎక్కువగా కురియును,నదులు పొంగును.


ఆశ్వయుజ కార్తీక మాసములు- శరదృతువు-- వెన్నెల బాగుగా కాయును.


మార్గశిర పుష్య మాసములు-- హిమవంత ఋతువు-- మంచుకురియును. చలి ఎక్కువగా ఉండును.


మాఘ ఫాల్గుణ మాసములు శిశిర ఋతువు-- చెట్లు ఆకు రాల్చును.


ఇవన్నీ పాతకాలం మాటలు. అంతా మార్పే! ఇప్పుడు వసంత ఋతువు రాకుండానే  గ్రీష్మ ఋతువు కనపడుతోంది, అందునా రోహిణీ కార్తె ఎండలు కాస్తున్నాయి. వేడి శివరాత్రికే 34 నుంచి రేసు గుఱ్ఱంలా ఈ రోజుకు, నలభై ఐదు రోజుల్లో 43  కి చేరిపోయింది, వేడి. 

ఇక ముందెలా ఉంటుందో చెప్పలేం. ఉన్నవి మూడు ఋతువుల్లాగా ఉంది.వసంత ఋతువు గ్రీష్మ ఋతువుతో కలిసిపోయి గ్రీష్మ ఋతువే కనపడుతోంది. అలాగే శిశిరం హేమంతంలో కలిసిపోయింది. 


 కారణాలు మీరంటే మీరంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ది చెందుతున్న దేశాలని తప్పుపడుతున్నాయి. మొన్ననో సారి గుయానా అద్యక్షునితో బి.బి.సి విలేకరి ఇలా తప్పుపట్టినట్టు మాటాడితే నోరెత్తనివ్వకుండా జవాబిచ్చారు. అలా జవాబిచ్చినపుడే ఆ దేశాలకి తెలుస్తుంది, తమ తప్పేంటో! 


No comments:

Post a Comment