Monday 29 April 2024

రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే

 రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి.

రాజుఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా ఉంటాడు. చుట్టూ మంది మార్బలం, కైవారాలు , వందిమాగధులు ఇలా ఉంటాడు. ఊరేగితే ఏనుగు మీద ఎక్కి తిరుగుతాడు. అటువంటివాడిని చూసిన ఇల్లాలు, మొగుణ్ణి చూస్తే లోకువగానూ,చీదరించుకునేలా కనపడడూ? ఎందుకంటే రాజులా ఎర్రగా బుర్రగా ఉండడు,కూడా ఎవరూ ఉండరు, చెప్పినమాట వినేవాడే ఉండడు. 

ఈ దేశంలో పుట్టిపెరిగి ఇక్కడ పల్లెలో,చెరువులో పిత్తపరిగిలు పట్టుకునే  వాడికి,  తల్లితండ్రులు కడుపుకట్టుకు చదివిస్తే, దశ తిరిగి అమెరికా వెళితే,  ఇక్కడ దేశం దరిద్రంతో ఓడుతున్నట్టు కనపడదూ? ఇక్కడ జనాలంతా అనాగరికుల్లా కనపడరూ?   తల్లితండ్రులు బిచ్చగాళ్ళలా అనిపించరూ?

పేదవానికోపము పెదవికిచోటు.

పేదవాడికి కోపమొస్తుంది,ఎందుకు? తనకి అన్యాయం జరిగినపుడు. ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. చేయగలది తననుతాను తిట్టుకోవడం. అదే పేదవానికోపము పెదవికి చోటు,చేటు కాదు.

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

అడిగేవాడు తాను గొప్పవాణ్ణనుకుంటాడు.  అడుగుతూనే  ఉంటాడు. వాడికి సమాధానం చెప్పినకొద్దీ లోకువ కదా! అలా అడుగుతూనే ఉంటాడు. ఇదే లోక రీతి. వినేవాడికి చెప్పేవాడులోకువ ఇదీ మరొక లోకోక్తి.

6 comments:

  1. పేదవాడి కోపం పెదవికి చేటు అనవచ్చు నండీ. నిస్సహాయతతో వాడు పండ్లు నూఱుకుంటాడూ ఒక్కోసారి పెదవులూ కొరుక్కుంటాడు. పండ్లు గట్టివే కాని పెదవులు కాస్త సుకుమారంగా ఉంటాయి కదా. అవి పగిలే ప్రమాదం కద్దు.

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం29 April 2024 at 10:12
      నిజమేనండి.ఇలాగా కూడా అనుకోవచ్చని అనుకున్నా సుమండీ :)

      Delete
  2. చెప్పేవాడికి వినేవాడు లోకువ అని కూడా అనచ్చండి ఈ రోజుల్లో - ఆ చెప్పేది రాజకీయ ఉపన్యాసాలయినా, యూట్యూబ్ లో కనిపించే కొన్ని కొన్ని సలహాలయినా.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు29 April 2024 at 12:00
      లోకరీతిని బట్టే నానుడులు పుడతాయి కదండీ

      Delete
  3. ఎవర్ని చూసొచ్చి ఈ టపాస్ రాసేరండీ :)

    ReplyDelete
  4. Zilebi29 April 2024 at 18:59
    గుమ్మడికాయల దొంగా అంటే భుజాలు తడుముకున్నవారు.

    ReplyDelete