Tuesday 13 June 2023

చూడమని చేతికిస్తే

 చూడమని చేతికిస్తే సుక్కురారమని ఇంట్లో పెట్టుకుంది.


ఇదో నానుడి, పల్లెలలో చెప్పుకుంటాం.ఓ బుల్లి కత చెప్పుకుందాం.

అనగనగా ఒక పల్లె, అందులో ఒక పేదరాలు.జన్మలో బంగారపు ఆభరణం చేయించుకోలేదు. పెళ్ళప్పుడే మొగుడు మావిడాకు మడిచి పుస్తి కట్టేడు. ఆ తరవాత పసుపుకొమ్ము కట్టుకుంది. ఆవిడకో కోరిక, జీవితంలో, ఒక మంచి నగ చేయించుకోవాలని. చాలాకాలం తరవాత ఒక నగ చేయించేడు,పోరగా,పోరగా మొగుడు.ఇరుగు పొరుగులకి చూపించుకుంది. అంతా బాగుంది,బాగుందన్నారు,  సంబరపడింది. పక్క వీధిలో ఉన్న దూరపు బంధువు, కలిగినది, ఒంటి నిండా ఆభరణాలతోనే ఉంటుందెప్పుడూ, ఆవిడ ఇంటి కెళ్ళి ఆ నగ చూపించింది, అదేమో సాయంత్రపు వేళ, అందులోనూ శుక్రవారం. ఆవిడ చూసింది. నగ బాగుందంది, బరువు, ఖర్చైన సొమ్ము వివరాలడిగింది, ఇటువంటిది నా దగ్గర లేదనీ చెప్పింది,నీకు అందంబాగా తెలుసని పొగిడింది.  పిచ్చి, పేద ఇల్లాలు మొహం చింకి చేటంతయింది. ఇంకేంటి ఈ పేదరాలికి ఏనుగెక్కినంత సంబరమయింది. మా అత్తగారికి చూపిస్తాను, నేనూ చేయించుకుంటానంది. నగ పట్టుకుని లోపలికెళ్ళింది. ఎంతకీ బయటికి రాదు, నగ తెచ్చి ఇవ్వదు. చూసి చూసి పేదరాలు వదినా చీకటడుతోంది, నగ ఇస్తే ఇంటికెళతానూ అని కేకేసింది. చాలా సేపు కేకేసిన తరవాత ఆ ధనికురాలు బయటికొచ్చి. అదేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళిపోయావనుకున్నా, అంది. విస్తుపోయిన పేదరాలు నగ ఇస్తే వెళ్ళిపోతానంది. దానికా ధనికురాలు, ఈ వేళ సుక్కురారం కదా, అందులోనూ సాయంత్రంపడి చిన్న తల్లి ఇంటికొచ్చింది, ఎలా ఇస్తానూ, రేపొచ్చి పట్టుకెళ్ళు, అంది.ఏమనాలో తెలియని పేదరాలు ఏడుపుముఖంతో తిరిగొచ్చింది.


 మర్నాడు ఉదయమే వెళ్ళింది,  బారెడు పొద్దెక్కినా నిద్దరమంచం మీంచి లేవని మహాతల్లి నెమ్మది లేచి ఆవలిస్తూ బయటికొచ్చి, రాత్రి మావారికి చూపించా, నాకూ చేయిస్తానన్నారు, నగ కంసాలికి చూపించి, మోడల్ కోసం, ఇస్తాలే అంది నిర్లక్షంగా. ఏమనాలో తెలియని పేద ఇల్లాలు విసవిసలాడుతూ ఇంటికొచ్చింది. విసవిసలాడుతున్న ఇల్లాలిని చూసిన మగడు ఏమైందని అడిగేడు. చెప్పకతప్పలేదామెకు. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది,గుడ్లనీరుగుక్కుకుంటూ.ఆమె బాధ చూచిన భర్త అనునయంగా, పిచ్చిదానా కలిగినవారితో వ్యవహారం ఇలాగే ఉంటుంది. జరిగిందేదో జరిగింది,తరవాతెళ్ళి తెచ్చుకో అని చెప్పడం తో ఊపిరిపీల్చుకుంది. తిడతాడనుకున్న మగడు సౌమ్యంగా మాటాడి అనునయించేటప్పటికి ఏడుపొచ్చి భర్తను చుట్టేసింది. మధ్యాహ్నం వెళ్ళింది. భోజనం చేస్తున్నానని గడపలో నుంచోబెట్టి, నెమ్మదిగా బయటికొచ్చి కంసాలి చూడడం అవలేదట, సాయంత్రంరా అని విసురుగా లోపలికెళ్ళుతూ,నగ తినేస్తామనుకుంటుందో ఏమో! అని గొణుక్కుంటూ లోపలికెళ్ళింది. విన్న పేదరాలు చేయగలది లేక తిరిగొచ్చింది. సాయంత్రం వెళితే నిలబెట్టి, నిలబెట్టి నగపట్టుకొచ్చి చేతికిచ్చింది. బతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి తిరిగొచ్చింది. మరెప్పుడూ ఇలాటి తప్పు చేయకూడదనుకుంటూ.    


ఇదీ చూడమని చేతికిస్తే సుక్కురారం కత. జీవితం లో అప్పుడప్పుడు ఇటువంటి అనుభవాలందరికి జరుగుతూనే ఉంటాయి.

12 comments:

  1. BaagundandiilaameelaopiggaavidamarichicheppevaaLLueetaraMlodorakaTamkashTamesUma.

    ReplyDelete
    Replies
    1. మీకు మాత్రం పదాల్ని విడమరిచి రాయడానికి తీరిక లేకపోయింది.

      Delete
    2. Anonymous14 June 2023 at 14:07
      చెప్పింది మీకు ఉపయోగపడితే అదే పదివేలు.

      Delete
  2. Anonymous గారు,

    // “ BaagundandiilaameelaopiggaavidamarichicheppevaaLLueetaraMlodorakaTamkashTamesUma” //

    పదానికి పదానికీ మధ్య space bar ఓసారి నొక్కండి స్వామీ - అసలే తెలుగు పదాల్ని ఆంగ్లంలో టైపు చేసారు కూడానూ.

    ఇక నేనే అతి కష్టం మీద ఈ రకంగా అమర్చ గలిగాను చదువుకోవడానికి సౌలభ్యం కోసం 👇👇. ఇదేనా మీ భావం?

    Baagundandi ilaa meela opiggaa vidamarichi
    cheppevaaLLu eetaraMlo dorakaTam kashTame sUma.

    తెలుగులో …… “బాగుందండి ఇలా మీలా ఓపిగ్గా విడమరిచి చెప్పేవాళ్ళు ఈతరంలో దొరకటం కష్టమే సుమా.”

    అంతేనా?

    lekhini.org లో తెలుగులో టైపు చేసి, దాన్ని కాపీ చేసి ఇక్కడ అతికించవచ్చు.

    మీ సెల్ ఫోన్ లో తెలుగు కీబోర్డ్ కూడా add చేసుకుంటే (సెట్టింగ్స్ లోకి వెళ్ళి) ఇక్కడే డైరెక్ట్ గా తెలుగులోనే టైపు చెయ్యవచ్చు (పదానికీ పదానికీ మధ్య స్పేస్ ఇవ్వడం మరవకండి 🙂).

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు14 June 2023 at 14:56
      శ్రమ తీసుకున్నందుకు ధన్యవాదాలు.
      డెస్క్ టాప్ దగ్గర కూచోడం కష్టంగా ఉంది, వేడికి, కాని ఇందులో తప్పించి తెనుగు లేదు. లేప్ టాప్ లో తెనుగు లేదు, ఫోన్ లో సరే సరి.వారం కితందాకా లేప్ టాప్ మనవరాలు వాడుకుంది.కాలేజి కెళుతోంది వారం పైగా, లేప్ టాప్ ఖాళి అయింది. అందులో వర్డ్ లో ఇంగ్లీష్ లో ఎ.సిలో కూచుని టైప్ చేసి, దానిని పెన్ డ్రైవ్ మీదకెక్కించి చల్లబాటు వేళ డెస్క్ టాప్ కి ఎక్కించి తెనుగు చేసి, అదీ సంగతి. ఎందుకింత అవస్థ అడగచ్చు. ఏపని చేయలేకపోతున్న కాలం, చేయడానికి శరీరం సహకరించనికాలం. చేయగలది ఇదొకటే, గిలకడం, అనిపించి, ఇదొక విధిగా తలచి చేయడం అంతే, ఖాళీ గా కూచుంటే శరీర బాధలు మరికొంచం ఇబ్బంది పెడుతున్నాయి. ఇదీ చేయలేని కాలమొస్తే....అమ్మ నిర్ణయం.
      ఎక్కువ చెప్పేనా? మన్నించండి.
      ధన్యవాదాలు.

      Delete
    2. అంతా కరక్ట్ గానే చెప్పారు. ఏమీ ఎక్కువవలేదు. 🙏

      Delete

  3. ఏదో కామెంటారు కదా ఆ మాత్రమైనా అని‌ సంతోషింపని సాహెబులు :)

    అసలే తెలుగు పదములను
    విసవిస ఆంగ్లమ్ములోన వేగమ్ముగ వ్రా
    సి సరి సరి స్పేసు కూడా
    యిసుమంతయు లేక పేర్చితే యెట్లాస్మీ ?

    నారదాయ నమః

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఈ జిలేబీగారొకరు. ఏదో సామెత చెప్పినట్టు, నువ్వు తెలుగు పదంతో ఒకటంటే, నేను పిడక పజ్జెంతో నాలుగంటా అని కామెంటుతారు.

      Delete
    2. Zilebi14 June 2023 at 16:03
      నారదాయనమః
      సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగఛ్ఛతి...కొనసాగించూ...
      కామెంట్లకి ఎదురు చూసినకాలం, పొంగినకాలం,కుంగినకాలం గడచినదే. ఇప్పుడు అన్నిటికి అతీతమే...
      నీకో మాట
      పృధివ్యా త్రీణి రత్నాని
      జలమన్నం సుభాషితం
      మూఢే పాషండ ఖండేషు
      రత్న సంజ్ఞా విధీయతె
      ఇంకా ఈషణ త్రయం లో నే పడి కొట్టుకుంటున్నావు. ఎనిమిది పదులు నిండేయి, చచ్చి బతికేవు కాదు చావబోయి బతికేవు. ఇంకా తడిపిడకలు చేసుకోడంలోనే ఉండిపోతానంటే నీ చిత్తం.
      చెప్పడమే నా ధర్మం
      వినకపోతే నీ ఖర్మం

      Delete

    3. Anonymous14 June 2023 at 20:17
      జిలేబికిది ఈ వేళ కొత్త కాదుగా? :)

      Delete
    4. ఓహో అలాగా! ఓకె.

      Delete
    5. Zilebi15 June 2023 at 16:34
      అర్ధం చేసుకుంటే ఆనందం.
      నేనే ఎందుకు చెప్పాలి? అదీ కొచ్చను
      సఖ్యం సాప్తపదీనం అన్నది ఆర్యోక్తి. ఎన్ననుకున్నా ఏమనుకున్నా ఈ బ్లాగుల్లో మనది పన్నెండేళ్ళ సావాసం కదా! మిత్రుడు చేయవలసిన పనే నేను చేశాను. మరో సారి, అర్ధం చేసుకుంటే ఆనందాయస్వాహా!! :) :) :)

      Delete