మళ్ళీ జూదం (అనుద్యూతం)
అంధ్రమహాభారతం,సభాపర్వం,ద్వితీయాశ్వాసం 270 నుండి 279 వరకు స్వేఛ్ఛానువాదం.
జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ధర్మరాజుకి,కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పి, వారి రాజ్యం వారికిచ్చి పంపించాడు. వారంతా ఇంద్రప్రస్థం వెళ్ళారు.
"ఇక్కడ జరిగిన సంగతంతా దుశ్శాసనుడు అన్న దుర్యోధనుని చెవిని వేశాడు. దుర్యోధనుడు, కర్ణ, శకుని,సైంధవులతో ఆలోచించి ధృతరాష్ట్రుని దగ్గరకొచ్చి,ఎంతమంచి చేసినా పాండవులకు ప్రీకరమైనవాళ్ళమవుతామా? పగపట్టిన పాముని మెడలో వేసుకున్నట్టయింది, పొరపాటు చేసేసేం.బలవంతులైన అర్జున,భీమ, నకుల సహదేవులను యుద్ధంలో గెలవగలమా? అంచేత మళ్ళీ వాళ్ళని ద్యూతం లో ఓడించి దేశం నుంచి వెళ్ళగొట్టడం చేయవలసిన పనని ధృతరాష్ట్రుని చెప్పగా ఒప్పుకుని మళ్ళీ జూదానికి రమ్మని ప్రాతికామిని పంపించాడు. ప్రాతికామి చెప్పినకబురుతో ధర్మరాజు, అనుజ,భార్యా సహితుడై హస్తిన చేరాడు, తండ్రి మాట జవదాటలేనని, మిత్రులు ప్రజలు గోలపెడుతున్నా!. ఇదివరలాగే అదే సభాభవనంలో ఆసీనులుకాగా, శకుని ధర్మరాజుతో సంపదలు రాజ్యము మీకు ధృతరాష్ట్రుడు గౌరవంగా ఇచ్చేడు, కనక వాటిని పందెంగా ఒడ్డి అడటం కుదరదు.ఇప్పుడు నేను చెప్పే పందెం అపూర్వం. ఇందులో ఓడినవారు నారచీరలుగట్టి,బ్రహ్మచర్యంతో, కందమూలఫలాలు తింటూ, పన్నెండేళ్ళు వనవాసం చెయ్యాలి, పదమూడో ఏట జనపదంలో అజ్ఞాతవాసమూ చెయ్యాలి. అజ్ఞాతవాసంలో పట్టుబడితే మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసమూ, ఆపై అజ్ఞాతవాసమూ చెయ్యాలి. ఇందుకు ఇష్టపడితే జూదమాడదామన్నాడు. ధర్మారజు పందెం ఒడ్డేడు, ఓడిపోయాడు. అన్నట్టుగానే నారచీరలుగట్టి వనవాసానికి పోయారు."
కొద్దికాలం కితం జూదం జరిగినదానికి, కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పిన ధృతరాష్ట్రుడు, మళ్ళీ జూదానికెందుకొప్పుకున్నట్టు?
కొడుకు మొహమాటం లేకుండానే చెప్పేసేడు, వాళ్ళు బలవంతులు, యుద్ధం చేసి నెగ్గలేం. ఎలాగైనా వాళ్ళని రాజ్యం నుంచి బయటకి తోలెయ్యడమే కావలసింది, అనికూడా చెప్పేసేడు. ధృతరాష్ట్రునికి కావలసింది కూడా పాండవులు బయటికిపోవడమే! కాని అది తను చేస్తున్నట్టు ఉండకూడదు, అదీ ఉద్దేశం. మూలకారణం ధృతరాష్ట్రుడే!
కితం సారి జూదం జరిగినపుడు సభంతా కలగుండుపడింది, నాడు జరిగిన విషయాలన్నీ అందరికి బాధ కలిగించాయి. గాంధారి అగ్నిపర్వతంలా ఉంది, ఎప్పుడు పేలుతుందో చెప్పలేనట్టు ఉంది. ఇక ద్రౌపది బద్దలైన అగ్ని పర్వతమే, వాళ్ళని చల్లార్చకపోతే నాడు కురుక్షేత్రం అక్కడే జరిగుండేది. అందుకు వరాలిచ్చి బులిబుచ్చి మాటలు చెప్పి వాళ్ళకి రాజ్యం ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు కొడుకు చెప్పిన పథకం నచ్చింది. ఇందులో రాజ్య ప్రసక్తిగాని, స్త్రీలను అవమానించే ప్రసక్తిగాని లేదు. పదమూడేళ్ళ తర్వాత ఏమగునో? ఎవరి కెరుక? అదేగాక అజ్ఞాతంలో దొరికితే మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చెయ్యాలి, పథకం బాగా నచ్చింది, ధృతరాష్ట్రునికి, అందుకే మళ్ళీ కబురు పెట్టేడు. ధర్మరాజుకి బుద్ధి లేదా? ఆయనదొకటే మాట తండ్రి చెప్పేడు, అంతే!
"పందెంలో ఓడినవాళ్ళు పన్నెండేళ్ళు వనవాసం,ఆ తరవాత ఒక సంవత్సరం అజ్ఞాతవసం జనపదంలో. అజ్ఞాతవాసంలో తెలిసిపోతే మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం సంవత్సరం అజ్ఞాత వాసం"
ReplyDeleteఈ పందెం షరతులు ఏర్పాటు చేసినవాడు నేటికాలపు నక్కజిత్తుల లాయర్లకంటే బహు మేధావి. మొదటగా వనవాసం తరవాత అజ్ఞాతవాసంలో దొరికితే మళ్ళీ మొదలుకొస్తుంది కత, అలా కాకపోతే ఇందులో రాజ్యం ఓడిపోవడం షరతులేదు గాని రాజ్యం వదలిపోవాలి, పదమూడేళ్ళు రాజ్యాన్ని వదిలేసేరు గనక, కాలదోషం పట్టింది కనక, రాజ్యం మీద మీకు హక్కు లేదనచ్చు. :)
బలే గుంట చిక్కులు కదా! ఇలా ఆలోచించడం కి మనమే మొదటివాళ్ళమూ కాదు ఆఖరివాళ్ళమూ కాదు. భారతంమీద పెద్దపెద్ద లాయర్లు కోర్టుల్లో వాదోపవాదాలు చేసుకున్నారు, ఏమీ తేలలేదు, ఏ కోర్టులోనూ నాకు తెలిసి. :)
వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన భారత తత్వ నిర్ణయము అనేది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1928లో ‘మహాభారత చరిత్రము’ అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించితే పెండ్యాలవారి రచనను ఖండిస్తూ 1948-49 ప్రాంతంలో ఆరు సంపుటాలుగా వచ్చింది. ఈ గ్రంథ రచయిత వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. ఈయన కూడా పిఠాపురం వాస్తవ్యులే. వీరిద్దరూ తమ వాదోపవాదాలు వినిపించడానికి అప్పట్లో పండితుల మధ్యవర్తిత్వంలో సభలు కూడా జరిగాయి.”మహాభారత చరిత్రము” పుస్తకాన్ని ప్రప్రధమంగా ఖండించిన వారిలో ప్రసిద్ధులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు. ఆయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి కూడా. పెండ్యాల-శ్రీపాదవార్ల వివాదం చివరికి కోర్టుకు ఎక్కి, ఏడాది- ఏడుమాసాలపాటు కేసు నడిచింది. రాజమండ్రిలోని ఆనరరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఇద్దరికీ ఇరవై రూపాయల వంతున అపరాధ రుసుము విధించారు. కృష్ణమూర్తిశాస్త్రిగారు రెండుసార్లు తన సాక్షులను ప్రవేశపెట్టని కారణంగా పెండ్యాల వారికి పన్నెండు రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా మెజిస్ట్రేటు తీర్పు చెప్పారు.
ReplyDeleteమహాభారతాన్ని సంప్రదాయేతర కోణం నుంచి పరిశీలించిన రచనలు కొన్ని పెండ్యాలవారి రచనలకు ముందే వచ్చాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు మద్రాసులోని గోఖ్లేహాలులో ఇచ్చిన మహాభారతోపన్యాసం పెక్కుమంది ఆంధ్రులను భారతంపై దృష్టి మళ్లించేలా చేసిందని పెండ్యాలవారు అంటారు. అప్పటికే రావుబహద్దర్ పనప్పాకం అనంతాచార్యులుగారు, విమర్శకాగ్రేసర కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ నిర్ణయము’ల గురించి గ్రంథాలు రాశారు. బ్రహ్మయ్యశాస్త్రిగారి గ్రంథాన్ని ఖండిస్తూ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ వినిర్ణయ’మనే గ్రంథం రాశారు. దుర్యోధనుని పక్షంలోనే న్యాయముందని చెబుతూ కోటమర్తి చినరఘుపతిరావు అనే కవి ‘సుయోధన విజయము’ అనే కావ్యం రాశారు. వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రి గారు సంప్రదాయాభిన్న వివరణతో ‘కర్ణచరిత్రము’ రాశారు. పూర్తిగా సంప్రదాయ పక్షం నుంచి ‘మహాభారత తత్త్వ కథనము’ రచించిన వారణాసివారు ఇలాంటి రచనలను అన్నిటినీ ఖండించారు.
ReplyDeleteపెండ్యాల, వారణాసి వార్ల మధ్య తలెత్తిన ఒక వివాదంలో జమ్మలమడక మాధవరామశర్మ గారు ఒక తీర్పరిగా ఉన్నారు. బ్రహ్మసూత్రాలు రచించిన బాదరాయణుడు, వ్యాసుడు ఒకరు కారని పెండ్యాలవారి వాదన అయితే, ఒకరే నని వారణాసివారి వాదన. ఎవరి వాదన సమంజసమో నిర్ణయించడానికి 1947 జూలై, 2న అన్నవరం దేవస్థానంలో సభ ఏర్పాటు చేశారు. పెండ్యాలవారు ఎన్నుకున్న జమ్మలమడకవారిని, వారణాసివారు ఎన్నుకున్న పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రిగారిని తీర్పరులుగా నియమించారు. మళ్ళీ వీరిద్దరూ కలసి రాళ్ళభండి వేంకట సీతారామశాస్త్రి గారిని తీర్పరిగా ఎన్నుకున్నారు. పెండ్యాలవారు చారిత్రకమైన దృష్టితో సమీక్షిస్తే, చరిత్ర సంబంధములేని ప్రామాణిక దృష్టితో వారణాసి వారి వాదము సాగిందనీ, ఎవరి విమర్శ కూడా గాఢంగా లేదనీ, నేను ఈ తగాయిదాను త్రోసివేస్తున్నాననీ జమ్మలమడకవారు తీర్పు చెప్పారు. మిగిలిన ఇద్దరూ వారణాసి వారి పక్షం వహించి ఆయనకు అనుకూలంగా ‘మెజారిటీ’ తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరిలో సంప్రదాయ పాక్షికత వ్యక్తమైతే, జమ్మలమడకవారిలో విషయ ప్రధానమైన నిష్పాక్షికత కనిపిస్తుంది.
ReplyDeleteహరిబాబుగారు,
ReplyDeleteఆంధ్రులు విశ్వామిత్ర శపిత సంతానం కదా!దానికితోడు దుర్యోధనుని పక్కన యుద్ధంలో పాల్గొన్నవాళ్ళం, ఆమాత్రం అభిమానం ఉంటుందిలెద్దురూ! మరోమాట పిఠాపురం రాజావారు దుర్యోధనాభిమానులు(ట)
హరిబాబు గారు, చాలా విషయాలు చెప్పారు మీవ్యాఖ్యల్లో. గత 23న నాబ్లాగులో వ్యాఖ్య వ్రాస్తూ బాలవ్యాస వారణాశి సుబ్రమణ్య శాస్త్రి గారి పేరే నాకు తెలియదు అన్నారు. కొద్దిరోజుల్లోనే చాలా సమాచారం చక్కగా సేకరించారు. సంతోషం. ధన్యవాదాలు.
ReplyDelete