వాక్స్వాతంత్ర్యం
ఏంటో!
వాక్స్వాతంత్ర్యం,ఈ మాట రాయడమే ఇంత కష్టంగా ఉందే!ఈ హక్కును నిలుపుకోడం ఎంత కష్టమో కదా!
ఈ హక్కు గురించి మాటాడేవారంతా, వారేమైనా అనచ్చు, కాని ఎదుటివారు ఏమీ అనకూడదు, ఇదీ వారి వాక్స్వాతంత్ర్యం. సుప్రీం కోర్టువారేమో, ప్రతి స్వాతంత్ర్యానికి హద్దుంటుంది, అదేముద్దు అంటారు.సుప్రీం కోర్టు లెక్కా :) సుప్రీం కోర్టు నే ఏమైనా అంటాం అంటున్నారు.
ముఫై ఎకరాల మా కాలేజి కాంపౌండ్ రోజంతా పెళ్ళివారిల్లులాగే ఉంటుంది. ఉదయం నాలుక్కి నడిచేందుకొచ్చేవాళ్ళతో ప్రారంభం, నడిచేవాళ్ళు,యోగా చేసేవాళ్ళు, ఇండోర్ లో టెన్నిస్ అడేవాళ్ళు, ఇలా రకరకాలుగా మొత్తం దగ్గరగా రెండొందలమంది ఉంటారు,ఉదయం.
పున్నమినాడు అస్తమిస్తున్న చంద్రుడు
ఉదయం నా కార్య స్థానం, అప్పటికే యోగా చేస్తున్న మిత్రుడు.
యోగా క్లాస్
నాది తక్కువ అంచనా!! మాకో కల్బ్ ఉంది దానిపేరు జి.బి.ఆర్ వాకర్స్ క్లబ్, దీనికి అనుబంధంగానే మిగిలిన సబ్ క్లబ్బులన్నీ, అవే యోగా క్లబ్,టెన్నిస్ క్లబ్. ఎనిమిది దాటితే వీళ్ళెవరూ ఉండరు. పిల్లలొచ్చేస్తారు. సాయంతరం నాలుగు దాటిన తరవాత పిల్లలంతా వెళ్ళిపోతారు. అప్పుడు స్త్రీలు ఎక్కువా, పురుషులు తక్కువా, ముసలాళ్ళు ఉదయం సాయంత్రం సమానంగా ఉంటూంటారు,నడకకి.
వీళ్ళూ మరో మూడువందల మందిదాకా ఉంటారు,అదిన్నూ రాత్రి ఎనిమిది దాకా. కేంపస్ అంతకీ లైటింగ్ ఉంటుంది,ఉదయం నాలుగునుంచి ఆరు, సాయంత్రం ఆరునుంచి ఎనిమిది.మా ఊళ్ళో మూడు వాకింగ్ ట్రేక్ లు ఉన్నాయి. మాదే మొదటిదిన్నూ! రెండోది పక్క హైస్కూల్ గ్రవుండ్లో, మూడోది రైల్ ఫైఓవర్ కి అప్రోచ్ రోడ్ కింద, ట్రేక్ అవతల. నాలుగోది రైల్వే ప్లాట్ఫారం.ఇన్ని చోట్ల చాలమంది నడుస్తూనే ఉంటారు,రోజూ, ఉదయం,సాయంత్రం.
నేను వేసవి,వర్షకాలాలలో ఉదయమూ, శీతకాలంలో సాయంత్రమూ నడవడానికి వెళతాను. చాలామందికి నా పేరు తెలియకపోయినా నన్ను ఎరుగుదురు,పాతికేళ్ళ దగ్గర సమయంలో ఆ వాకర్స్ క్లబ్ స్థాపకుల్లో నేనూ ఒకడిని. కవిని కూడా కదా! :) కర్ర పుచ్చుకు తిరుగుతుంటాను, అందుకు అందరికి ఎరుకే! :) నేనెవరితోనూ మాటాడగా ఎవరూ చూసి ఉండరు ఆ కేంపస్ లో! :)
మామూలు రోజుల్లో ఎక్కడవాళ్ళు అక్కడ, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. వర్షం వస్తే మటుకు అందరూ చాలా పొడుగైన మా వరండాలని ఆక్రమించేస్తారు :) ఈ వరండాలో ఒక యువకుడు యోగా చేస్తాడు, రోజూ, ఎండవానలు వేటిని లెక్క చేయక, మరొకరు కూడా ఆయనతో ఉంటారు, కాని చెప్పలేం. ఇక నేను నా కోటా నడక తరవాత ఈ వరండాలో యువకుని పక్క చేరి ప్రాణాయామం చేస్తాను, ఒక అరగంటపాటు. అలుకు తీర్చుకోడానికి కొంతమంది ఈ వరండా మీద కూచుంటుంటారు, అది అలవాటు.
ఇలా జరుగుతుండగా,నిన్న ఉదయం నా పక్క యోగాసనాలు వేస్తున్న మిత్రుడు నా దగ్గరకొచ్చి,మీరు టెలిఫోన్ లో పని చేశారు కదా! పని చేయకుండా జీతాలు తీసుకున్నారని తిడుతున్నాడని అక్కడే అలుకు తీర్చుకోడానికి కూచున్న యువకుడిని చూపించాడు.
ఒక క్షణం విస్తుపోయా! తేరుకుని మాటాడటం మొదలెట్టా! నేనెప్పుడూ మాటాడగా చూడని చుట్టు పక్కలవారంతా కూడిపోయారు. నిన్న మొన్నలో, మనం స్వాతంత్ర్య అమృతోత్సవం జరుపుకున్నాం కదా! మనకు పెద్దలు సంపాదించి పెట్టిన స్వాతంత్ర్య హక్కుల్లో వాక్స్వాతంత్ర్యం ఒకటి. అతనలా తిట్టుకుంటున్నాడా? కాదనే హక్కు మనకు లేదు,తిట్టుకోమను, అడ్డుపడకు. అతనికో సలహా చెప్పు అతనితో పాటుగా మనల్ని తిట్టడానికి మరో పది మందిని కూలీకి నియమించుకోమను,తిట్టడానికి, మరెక్కడో వద్దు, ఇక్కడే ఎదురుగా తిట్టించమను, మన గ్రవుండ్ లో ఉన్నవాళ్ళందరిని పిలుద్దాం! తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని చెప్పు. ఆ తరవాత మాట, తిట్టిన ప్రతి తిట్టుకు ఒక రూపాయి ఇమ్మను! అంత చెయ్యలేడా పోనీ మొత్తానికి ఒక రూపాయి నా చేతులో పెట్టమను, అదీ చేయలేడా సరే! ఒక నమస్కారం పెడదాం, ఏమంటావు? అని ఊరుకున్నా!
ఇది విన్నవాళ్ళంతా ఒక్క సారి గొల్లు మన్నారు.కార్యక్రమం ఎప్పుడో చెబితే తీరుబడి చేసుకుంటా
టైమయింది వస్తానూ అని తువ్వాలు దులుపుకుని భుజాన వేసుకుని ఎలబారేను :)
ఇదండీ! మన వాక్స్వాతంత్ర్యం సంగతి
ఆ యువకుడు లాంటి పిల్లకాకులదేం ఉంది లెండి. తెలిసీ తెలియని మాటలు.
ReplyDeleteఅతి తెలివి మాటలు. ఏదో విమర్శించడం కోసమే విమర్శించడం. మీరు బ్రహ్మండమైన కార్యక్రమం ప్రతిపాదించారుగా 😁😁. నోటమాట వచ్చుండదు.
వాక్స్వాతంత్ర్యం సాకుతో దేశంలో జరుగుతూ వస్తున్న పరిణామాలు ఏకపక్షంగా ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు మొదటి నుంచీ పక్షపాత వైఖరి అవలింబించారు. అది బెడిసి కొట్టింది. ఇప్పుడు లాక్కోలేరు పీక్కోలేరు … చెయ్యాలని ఉన్నా కూడా (ఆ పొలిటికల్ విల్ ఎలాగూ కనబడడం లేదనుకోండి). మన జీవితకాలంలో అయితే మహత్తరమైన మార్పులేమీ రావు .
Deleteవిన్నకోటవారు,
అనుకోనిద్దురూ :) అంతయు మనమేలునకే :)
కార్యక్రమం ఎప్పుడు పెడతాడో చూడాలి :)
అదంతేలెండి! నేను చూస్తాననుకోను :)బుర్రతో ఆఅలోచించి మాటాడితే బాగుంటుంది, అది నశించింది అంతేకదండి :)
మీ ఊరి కాలేజ్ వారి దొడ్డమనస్సును మెచ్చుకోవాలండి 🙏. తమ కాలేజ్ కాంపౌండ్ లో ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతించడం, రాత్రి ఎనిమిది గంటల వరకు లైట్లు వేసుంచడం వారి వదాన్యతకు తార్కాణం.
ReplyDeleteఈ కాలపు కార్పెరేట్ అహంకారం బాగా వంట పట్టించుకుని, అసలు తమ కాలేజ్ / స్కూల్ కాంపౌండ్ లోకే ప్రవేశించకూడదని అనడం, మాటమర్యాద కూడా లేని ఓ నిర్లక్ష్యపు సెక్యూరిటీ వాడిని అక్కడ కాపలా పెట్టడం చాలా చోట్ల కనిపిస్తోంది. అంతెందుకు, వాన మొదలైతే ప్రక్కనే ఉన్న షాపు తలుపు దగ్గరకో, ఏదన్నా బిల్డింగ్ ఉంటే దాని వరండాలోకి పరుగెత్తడమో ఒకప్పుడు సర్వసాధారణం. ఎవరూ అభ్యంతర పెట్టేవారు కాదు. ఇప్పుడలా కాదు. ఇక్కడ నిలబడితే మా యజమాని ఒప్పుకోడు అని బుకాయించెయ్యడం. తమ కంపెనీ బిల్డింగ్ దగ్గర సిటీబస్సు స్టాప్ పెట్టనివ్వని కార్పొరేట్ దరిద్రులు కూడా ఉన్నారు. పబ్లిక్ రోడ్ మీద కూడా తమ మాటే చెల్లాలని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో మానేజ్ చెయ్యడం. మీ ఊరి కాలేజ్ వారికి వందనం 🙏.
ఫొటోలు బాగున్నాయండి. పైనుంచి రెండో ఫొటోలో ఎర్రచొక్కా మీరేనా?
ఎర్రచొక్కా ముందర నడుస్తున్న లేతాకు పచ్చ చొక్కా ఎవరండీ - రాజకీయ నాయకుడిలాగా రెండు చేతులూ పైకెత్తి మరీ నమస్కారం చేస్తున్నాడు 😁?
మీరు యోగా టీచరేమో కదా, మరి చివరి ఫొటోలో నేర్చుకునేవారి మధ్యలో ఉన్నారేమిటి (ఎర్రచొక్కా గనక మీరే అయితే)?
Deleteవిన్నకోటవారు,
మా కాలేజికి చాలా చరిత్ర ఉందండి. ప్రజలచేత,ప్రజలవలన,ప్రజలకొరకు స్థాపించబడింది, దీనికి చాలా ప్రత్యేకతలున్నాయండి.చిన్న వ్యాఖ్యలో చెప్పడం కష్టం.
మీకెక్కడేనా పెదరాయుడు లుంగీ,తెల్లచొక్కా, కర్ర కనపడితే అది నేనేనండి :)వీళ్ళంతా చాలా సీనియర్లండి, నడక,యోగాలో.నేను యోగా పదిహేడో ఏట వదిలేశాను, మళ్ళా కరోనాలో మొదలెట్టా. నేను యోగా చేస్తానని ఎవరో చెప్పేశారు. ఆ ఒక్క రోజు గౌరవపదవి ఇచ్చారనమాట. :)
నేను ఫోటో లు తీయను, ఫోటో తీస్తున్నది చూసి అభిమానమేనండి,అంతేనండి. వీళ్ళంతా వ్యాపారస్థులు, పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్నవాళ్ళూ,కోటీశ్వరులు.