Thursday, 26 March 2020

చెప్పిన మాట వింటేనా?


చెప్పిన మాట వింటేనా?

దేశం అంతా లాక్ డవున్ లో ఉంది. ఎవరూ బయటికి రాకండోయ్ అత్యవసరం ఉంటే తప్పించీ అని మొత్తుకుంటోంది ప్రభుత్వం. ఆ అత్యవసరం కూడా వైద్యం,ఆహారం తప్పించి మరోటి వద్దూ అంటోంది.

పోలీసులు పల్లెలనుంచి మరో పల్లెకి వెళ్ళే మార్గాలు కూడా మూసేశారు. అబ్బే అలా ఐనా వింటేనా? ఇంకా తిరుగుతూనే ఉన్నారు మోటార్ సైకిళ్ళేసుకుని. ఎందుకో తెలవదు.

నీళ్ళు,పాలవాళ్ళు,కరంటువాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. పోలీసులూ,డాక్టర్లు,నర్సులూ మనుషులేగా. పాపం వాళ్ళూ ఆహారం నిద్ర లేక రాత్రి పగలూ లేక పని చేస్తున్నారు. ఇంటిలో ఉండడి మహాప్రభో అని మొత్తుకుంటుంటే ఎందుకు బయట తిరిగి ముచ్చట్లు పెడుతున్నట్టు? ఇటలీ ప్రభుత్వం ఇక నా వల్ల కాదు, ఏం చేయలేనని చేతులెత్తేసింది. సరే పాకిస్తాన్ మొండికే పడింది. లాకు లేదు డవునూ లేదు, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నవాళ్ళుంటారు,పోయినవాళ్ళు పోతారననట్టు.

అరవై ఏళ్ళకితం మాట అదో పల్లెటూరు, ఊరంతా చక్కహా నిద్దరోతోంది.నేనొక్కణ్ణీ ఆఫీసులో స్విచ్ బోర్డ్ దగ్గర కూచుని ఉద్యోగం చేస్తున్నా! మొదటిలో చాలా ఆనందంగా ఉండేది, ఊరంతా నిద్దరోతోంటే మనం ఒకళ్ళం మెలుకువగా ఉండి ఉద్యోగం చేస్తున్నాం అని గొప్పగా ఉండేది. కాలం గడిచింది. ఇదేమి ఖర్మ? ఊరంతా నిద్దరోతుంటే నేనొక్కణ్ణీ మెలుకువగా ఉండడం అనిపించింది. మానవ మనస్తత్వంకదా! ఇలా రోడ్డున పడి ఉద్యోగం చేస్తున్న పోలీసులకి పెళ్ళాం పిల్లలు లేరూ? వాళ్ళకి హాయిగా ఇంటి దగ్గర కూచోవాలని ఉండదూ? డాక్టర్లు నర్సులకి అలా అనిపించదా?

రోడ్ మీద పని లేక ఊరికే తిరిగేవాళ్ళని చితక తన్నుతున్నారు పోలీస్, ఐనా తిరుగుతూనే ఉన్నారు, ఇదేమో? మనమూ ఇటలీలా ఐపోతామా? ఏమో ఏం రాసిపెట్టి ఉందో ఎవరికెరుక.

6 comments:

 1. “టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ” అని అనునయంగా చెబితే వింటారాండీ? బడితె పూజ చెయ్యాలి, తెలుగు సినిమాల యాసలో చెప్పాలంటే చే..స్తా..నే ఉండాలి.

  ReplyDelete
  Replies
  1. విన్నకోటవారు,
   ఎన్ని చిత్రాలో ఒక యువకుడు పెళ్ళాం పిల్లల్ని తీసుకుని పక్క ఊరిలో బంధువుల్ని చూడ్డానికి బయలుదేరాడు, బండి మీద. పోలీస్ కి దొరికాడు,పోలీస్ ఏమనుకున్నాడోగాని యువకుణ్ణి పక్కనే ఆగి ఉన్న కార్ వెనక్కి తీసుకుపోయి ఉతికి తీసుకొచ్చి బండి మీదున్న యువకుడి పెళ్ళానికి అప్పజెప్పేడు :)
   లేటెస్ట్ ఇలా తిరుగుతున్నవాళ్ళని పట్టుకుని బండి,కారు దింపి పొర్లుదండాలు పెట్టిస్తున్నారు, కొట్టడం మానేశారు. :) ఏంటో మన పిచ్చిగాని వీళ్ళు మారరు, మారరుగాక మారరు.

   ఇతరదేశాల పోలీసులతో పోలిస్తే మనవాళ్ళే చాలా మేలండి, ఈ విషయంలో.

   Delete
 2. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్ళక తప్పేటట్టు లేదు. ఇంకో వారం ఫరవాలేదు. చూడాలి ఏం జరుగుతుందో. ........... మహా

  ReplyDelete
  Replies
  1. బులుసు వారు,
   నమస్కారం. మనలాటి యువకులకి ప్రభుత్వం చాలా ఏర్పాట్లు చేస్తుందండి :)మీకు కావలసిన సామాన్లు డెలివరీ బాయ్ ఇంటికే తెచ్చి అప్పజెప్పగలడు. మా వూళ్ళో, పల్లెటూరిలో కావలసిన సామాన్లన్నీ ఇంటికి తెచ్చి అప్పజెపుతాడు, డబ్బులు పట్టుకుపోతాడు, లిస్ట్ ఫోన్ లో చెపితే చాలు.. ఇది గత ఇరవై ఏళ్ళుగా మా దగ్గర జరుగుతున్నది. డాక్టర్లు,నర్సులు, డెలివరీ బాయ్ లు, పాలవాళ్ళు తిరుగుతూనే ఉన్నారండి. నిజానికి జీవితాలకి తెగించి పని చేస్తున్నారు. వారికి కోటి దండాలు.

   Delete
 3. "ఉన్న పెట్రోల్ అంతా ఇప్పుడే అవ్వగొట్టేస్తే రేపటి రోజున అవసరానికి లేకపోతే పరిస్థితి ఏమిటి" అని కూడా ఆలోచించట్లేదంటే వీళ్ళకి తగలాల్సిన దెబ్బలు రగలట్లేదు అనిపిస్తోంది.

  ReplyDelete
  Replies
  1. సూర్య గారు,
   ఇలా తిరుగుతున్నారని మాదగ్గర ఒక రోజు పెట్రోల్ బంక్ మూసేశారు. పోలిస్ రోజుకో కొత్త పద్ధతుల్లో వాయిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ బైక్ పాడు చేస్తున్నారు,నడుస్తుంది కాని light వగైరా పని చేయకుండా చేస్తున్నారు.పెట్రోల్ ఐపోతే తూర్పుకు తిరిగి....

   Delete